ఐఎంఎఫ్ వృద్ధి లెక్కలు పట్టించుకోం: భారత్
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.75 శాతంగానే ఉంటుందంటూ అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఇచ్చిన అంచనాలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ తోసిపుచ్చారు. తయారీ రంగం, దేశీయంగా డిమాండ్, ఎగుమతులు అన్నీ మెరుగుపడుతున్న నేపథ్యంలో వృద్ధి రేటు కచ్చితంగా 5 శాతం మించగలదని ఒక ప్రకటనలో ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు, ప్రణాళిక శాఖ మంత్రి రాజీవ్ శుక్లా కూడా దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను బట్టి చూస్తే భారత్ సహా పలు వర్ధమాన దేశాలు మళ్లీ 8 శాతం పైగా వృద్ధి సాధించలేకపోవచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) డిప్యుటీ చీఫ్ రూప దత్తగుప్తా తెలిపారు. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ ద్రవ్య లోటు స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 8.5 శాతానికి ఎగియవచ్చని కూడా ఐఎంఎఫ్ తాజాగా అంచనా వేసింది.