సాక్షి, హైదరాబాద్: తనకు జంటనగరాలతో మరచిపోలేని అనుబంధం ఉందని ప్రముఖ ఆర్థికవేత్త, సంస్కరణల రూపశిల్పుల్లో ఒకరైన మాంటెక్ సింగ్ అహ్లూవాలియా గుర్తు చేసుకున్నారు. వర్చువల్‌గా కొనసాగుతున్న హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ 3వ రోజు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ జంట నగరాల్లో ఒకటైన సికింద్రాబాద్‌లో తాను చాలా ఏళ్లపాటు గడిపానన్నారు. సైన్యంలో పనిచేసిన తన తండ్రి ఉద్యోగ రీత్యా.. 1950 నుంచి 1987 మధ్య సికింద్రాబాద్‌లోనే తన బాల్యం గడిచిందన్నారు.
కార్ఖానాలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్‌లో చదువుకున్నానని, తాము నివసించే చోట మసీదులు, ఆలయాలు పక్కపక్కనే ఉన్నట్లే హిందువులు, ముస్లింలు అంతా కలిసి మెలిసి ఉండేవారన్నారు. సికింద్రాబాద్ ఎంతో ఆహ్లాదంగా కాలుష్య రహితంగా ఉండే ప్లెజెంట్ సిటీ అంటూ ఆయన కొనియాడారు. ఆ తర్వాత చాలాసార్లు సికింద్రాబాద్‌కు రావాలనుకున్నానన్నారు. ఏదేమైనా.. ఇలాగైనా ఈ కార్యక్రమానికి హాజరవడం ఆనందంగా ఉందన్నారు.
సగటు వ్యక్తికీ అర్థమయ్యేలా బ్యాక్‌స్టేజ్..
గతేడాది చనిపోయిన తన భార్య.. ప్రతి సాధారణ వ్యక్తి అర్థం చేసుకునేలా ఆర్థికాంశాలతో పుస్తకం రాయమని చెప్పిందన్నారు. ఆమె కోరిక మేరకే కేవలం ఆర్థిక నిపుణులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా అర్థం చేసుకునేలా బ్యాక్ స్టేజ్ పుస్తకం రాశానని ఆయన చెప్పారు. అనంతరం దేశ ఆర్థిక సంస్కరణల రూపకల్పనలో ముఖ్యుడిగా పేరొందిన ఆర్థిక నిపుణుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా, మాజీ రాజకీయ నేత పాలసీ అనలిస్ట్ పరకాల ప్రభాకర్‌తో హెచ్‌ఎల్‌ఎఫ్‌లో సంభాషిస్తూ తన బ్యాక్ స్టేజ్ పుస్తకం విశేషాలను సందర్శకులతో పంచుకున్నారు.
‘న్యాయం’ చెప్పిన ఐరన్‌మ్యాన్..
బ్యాంక్ ఉద్యోగిని, ‘వై ఈజ్ మై హెయిర్ కర్లీ’ అనే పుస్తకం రాసిన లక్ష్మీ అయ్యర్ ఫిలడెల్ఫియా నుంచి స్టోరీ టెల్లింగ్ సెషన్‌లో పాల్గొన్నారు. తన పుస్తకం విశేషాలను ఇదే కార్యక్రమంలో పంచుకున్నారు. రాజకీయ అంశాలు, శాసనాలు, న్యాయవ్యవస్థపై రచనలు సాగించే ఐరన్ మ్యాన్ ట్రైథ్లైట్‌గా పేరున్న ఆకాష్ సింగ్ రాథోడ్ ఈ కార్యక్రమంలో కాంబోడియా నుంచి పాల్గొన్నారు. తాను రాసిన తాజా పుస్తకం ‘బీఆర్ అంబేడ్కర్ ద క్వెస్ట్ ఫర్ జస్టిస్’ విశేషాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సహజ న్యాయ సూత్రాలు, న్యాయ వ్యవస్థలో మార్పు చేర్పులు, రాజకీయ, సామాజిక ప్రభావాలు.. వంటివి ఆయన ప్రస్తావించారు.
అలరించిన సిటీ సంగీతం..
సీరియస్‌గా సాగుతున్న ఈ కార్యక్రమంలో 3వ రోజు నగరానికి చెందిన పలు సంగీత బృందాలు పాల్గొని అలరించాయి. సిటీకి చెందిన హైదరాబాద్ హార్పర్స్ బృంద సభ్యులు తమ మౌత్ ఆర్గాన్ సంగీతంతో ఆహ్లాదం పంచగా.. నగరానికి చెందిన తొలి ఉర్దూ ర్యాప్–హిప్ హాప్ గ్రూప్ థగ్స్ యూనిట్ ఉర్రూతలూగించారు. ఈ గ్రూప్‌నకు చెందిన మ్యుజిషియన్స్ ముదాస్సిర్ అహ్మద్, సయ్యద్ ఇర్షాద్ ద్వయంలో ముదాస్సిర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సందర్శకులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా థగ్స్ యూనిట్ రూపొందించిన ఆల్బమ్స్ ప్రదర్శించారు. గతేడాది మరణించిన సినీనటుడు, రచయిత సౌమిత్రా ఛటర్జీకి నివాళిగా.. సెలబ్రేటింగ్ సౌమిత్ర పేరిట సాగిన కార్యక్రమంలో బెంగాల్ సినీ ప్రముఖుడు అనిక్ దత్తా, నగరానికి చెందిన సినీ విమర్శకురాలు సంఘమిత్ర మాలిక్ పాల్గొన్నారు.
నా జీవితానికి అద్దం.. బ్రాస్ నోట్ బుక్
ఆర్థికాంశాలకు సంబంధించి నిపుణురాలు, మహిళాభ్యుదయ వాది, పద్మభూషణ్ పురస్కార గ్రహీత మైసూర్‌కి చెందిన దేవకి జైన్.. కిన్నెర మూర్తితో తన ఆటోబయోగ్రఫీగా విడుదల చేసిన ‘ది బ్రాస్ నోట్ బుక్’ విశేషాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన జీవితంలోని పలు కోణాలను స్పర్శించారు. బయోగ్రఫీ అంటే తాను ఈ స్కూల్‌కి వెళ్లా, ఆ కాలేజ్‌కి వెళ్లా, ఆ ఉద్యోగం చేశా వంటి విషయాలు కాకుండా అనేక వ్యక్తిగత అంశాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించానని స్పష్టం చేశారు. తాను చదివిన కొన్ని ప్రముఖుల బయోగ్రఫీల్లా ఉండకూడదని రెండేళ్లు ఆలోచించానన్నారు. ఒక సంప్రదాయ అయ్యంగార్ కుటుంబం నుంచి వచ్చిన తాను తన ప్రేమను, అభిరుచులను నెరవేర్చుకుంటూ సాగిన ప్రయాణాన్ని పొందుపర్చాన్నారు.
Comments
Please login to add a commentAdd a comment