దేశానికి సారథ్యం వహిస్తున్న వారంతా కాకలుతీరిన ఆర్థికవేత్తలు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్, కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా... అందరి కందరూ నిపుణులేగానీ రూపాయి మాత్రం తల వేలాడేస్తున్నది. మిగిలిన వారి సంగతలా ఉంచి మన్మోహన్‌సింగ్‌కు 1991లో దేశాన్ని మహా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించిన మాంత్రికుడిగా ఎగువ మధ్యతరగతి, సంపన్నవర్గాల్లో పేరు ప్రఖ్యాతులున్నాయి.
కానీ, ఇప్పుడు అంపశయ్యపై ఉన్న ఆర్ధికవ్యవస్థను నిటారుగా నిలబెట్టడం ఆయనవల్ల కావడంలేదు. వరసబెట్టి చేస్తున్న చిట్కా వైద్యాలన్నీ వికటించి సంక్షోభాన్ని రెట్టింపుచేస్తున్నాయి. తెల్లారేసరికి రూపాయి ఎంతకు దిగజారుతుందో, స్టాక్ మార్కెట్ పతనం ఎక్కడితో ఆగుతుందో తెలియక అందరూ బెంబేలెత్తిపోతున్నారు. అవి ఏ అంచనాలకూ అందటం లేదు. మంగళవారం ఒకే రోజు 200 పైసలు పతనమై డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.24 వద్ద ముగియగా, బుధవారం మార్కెట్‌లు తెరవగానే అది 68.80 పాయింట్లకు పడిపోయింది. ఇది 70 దాటినా దాటవచ్చని లెక్కేస్తున్నారు.
మున్ముందు దానికి మంచిరోజులొస్తాయని, అది మళ్లీ జవసత్వాలు తెచ్చుకుని పైకి లేస్తుందని మన నేతలు చెప్పే కబుర్లన్నీ చిలకజోస్యాలుగా తేలిపోతున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ రూపాయి విలువ 20 శాతం తరిగిపోయింది. రూపాయి పతనం పర్యవసానంగా బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటాయి. స్టాక్ మార్కెట్ సైతం దేశ ఆర్థికవ్యవస్థను వణికిస్తోంది. మంగళవారం సెన్సెక్స్ 590 పాయింట్లు పతనమై 18,000 పాయింట్ల దిగువకు పోయిన స్టాక్ మార్కెట్ బుధవారం మరో 500 పాయింట్లు కిందకుపోయింది. చివరికెలాగో గట్టెక్కింది. కేవలం గత నాలుగురోజుల్లోనే స్టాక్ మార్కెట్ రూ.6,80,000 కోట్లు నష్టపోయింది. ఇంత జరుగుతుంటే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మళ్లీ గట్టెక్కాలన్న దురాశతో హడావుడి పడుతూ ఆహారభద్రత బిల్లు తీసుకొచ్చారు. స్టాక్ మార్కెట్ సంక్షోభానికి అది కూడా కారణమే. ఒకపక్క చైనా ఆర్థికవ్యవస్థ సంక్షోభం చేరువలో ఉన్నదని, ఏ క్షణంలోనైనా అది కుప్పకూలే అవకాశం ఉన్నదని ప్రపంచమంతా అంచనా వేస్తుంటే... అంతకన్నా ముందు నేనున్నానంటూ మన ఆర్థికవ్యవస్థ మూలుగుతున్నది.
ఇంత జరుగుతున్నా మన పాలకులు తమవైపుగా జరిగిన, జరుగుతున్న లోపాలను సరిదిద్దుకోవడానికి సిద్ధంగాలేరు. సరిగదా... ఎప్పటికప్పుడు కొత్త కథలు వినిపిస్తున్నారు. రూపాయి తనంత తానే స్థిరత్వాన్ని సాధిస్తుందని, అందు కోసం ప్రభుత్వపరంగా ఏ ప్రయత్నమూ చేయనవసరం లేదని చిదంబరం చెప్పుకొస్తూనే ఉన్నారు. ఇప్పుడైనా ఆయనలో భేషజం ఏమీ తగ్గలేదు. మన రూపాయి విలువ ఉండాల్సిన దానికన్నా చాలా తక్కువుందని, ఓపిక పడితే అది మళ్లీ సర్దుకోవడం ఖాయమని చెబుతున్నారు. కానీ, ఈ విశ్వాసం ప్రపంచ ఆర్థిక నిపుణులకు లేదు. భారత్ స్థూలదేశీయోత్పత్తి వృద్ధి అంచనాలకు ఫ్రాన్స్ బ్యాంకింగ్ దిగ్గజం బీఎన్‌పీ అడ్డంగా కోతబెట్టింది. రాగలరోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేసింది. ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభానికి మూలాలన్నీ ప్రపంచ పరిణామాల్లో ఉన్నాయని పాలకులు చెబుతున్న మాటల్లో అర్ధసత్యమే ఉంది. అమెరికాలో ఉద్దీపన ప్యాకేజీలను ఉపసంహరించుకోబోతున్నారన్న అంచనాలతో, ఇక అక్కడ పరిస్థితులు చక్కబడవచ్చన్న ఉద్దేశంతో ఇన్వెస్టర్లందరూ తమ పెట్టుబడులను తరలించుకుపోతుండటం నిజమే. అలాగే, సిరియాలో అమెరికా సైనిక జోక్యం చేసుకోబోతున్నదన్న ఊహాగానాల కారణంగా చమురు ధరలు భారీగా పెరిగిన మాటా వాస్తవమే. ఇలాంటి కారణాలవల్ల మన దేశం ఒక్కటే కాదు... చైనా, మలేసియా, ఇండొనేసియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా వంటివన్నీ ఒడిదుడుకులెదుర్కొంటున్నాయి. అన్ని దేశాల కరెన్సీలూ పల్టీలు కొడుతున్నాయి. కానీ, మిగిలిన దేశాలతో పోలిస్తే మన దేశమే అధిక ఒత్తిడికి లోనవుతున్నది. వాటితో పోలిస్తే ఇక్కడి నుంచి భారీయెత్తున పెట్టుబడులు తరలి పోయాయి. ఇందుకు మన కరెంటు అకౌంట్ లోటు, దిగజారుతున్న వృద్ధి రేటు ప్రధాన కారణాలు. మన కరెంటు అకౌంట్ లోటు 2007 నుంచీ పెరుగుతూ పోతున్నది. అప్పట్లో 800 కోట్ల డాలర్లుగా ఉన్న లోటు ఇప్పుడు 9,000 కోట్ల డాలర్లకు చేరుకుంది.
స్థూలదేశీయోత్పత్తి మళ్లీ 8 శాతానికి చేరడం ఖాయమని మన్మోహన్‌సింగ్ చేసిన ప్రకటనలు ఎవరిలోనూ విశ్వాసం కలిగించలేకపోయాయి. కేవలం మాటలు మాత్రమే మదుపుదారులను నమ్మించలేవు. ఖజానాకు లక్షా 80 వేల కోట్ల రూపా యల నష్టం కలిగించిన బొగ్గు కుంభకోణం విద్యుత్, సిమెంట్, ఉక్కు పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ రంగాలన్నిటా ఉత్పత్తి మందగించింది. మౌలిక సదుపాయాల రంగం సంక్షోభంలో పడటంతో దాని ప్రభావం ఇతర రంగాలకు వ్యాపించింది.
పర్యవసానంగా లక్షలమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. విశాల ప్రజానీకం ఉపాధిని, తద్వారా వారి ఆదాయాన్ని దెబ్బతీసి... వారి కొను గోలుశక్తిని ఊడ్చేశాక వృద్ధి ఎలా సాధ్యమవుతుంది? అందువల్లే మన్మోహన్‌సింగ్ ఏమి చెప్పినా ఫలితం లేకుండాపోయింది. సంక్షోభం వచ్చినప్పుడల్లా మరిన్ని సంస్కరణలు తెచ్చేందుకు వాటిని సాకుగా ఉపయోగించుకోవడం తప్ప ఈ ప్రభుత్వం వద్ద వేరే పరిష్కారం ఉన్నట్టు కనబడదు. ఇప్పుడు తాజా పరిణామాల నేపథ్యంలో మళ్లీ చిదంబరం అదే పాట అందుకున్నారు. ఆర్థికవ్యవస్థను మరింత సరళీకరిస్తే, విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిస్తే అంతా సర్దుకుంటుందని నమ్మబలుకుతున్నారు. ఇలాంటి మాటలకు స్వస్తి చెప్పి స్వీయలోపాలను సమీక్షించుకోవాలి. ఉపాధిని, ప్రజల కొనుగోలు శక్తిని పెంచే చర్యలే అంతిమంగా ఆర్థికవ్యవస్థకు శ్రీరామరక్ష అవుతాయని గుర్తుంచుకోవాలి.
సుడిగుండంలో రూపాయి!
Published Thu, Aug 29 2013 1:20 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
Advertisement
Advertisement