బాబోయ్ ధరలు..
న్యూఢిల్లీ: సామాన్యుడి బతుకుబండిని ధరలు అతలాకుతలం చేస్తున్నాయి. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు జూలైలో బెంబేలెత్తించింది. వార్షిక ప్రాతిపదికన ఈ నెలలో ద్రవ్యోల్బణం స్పీడ్ 5.79 శాతంగా నమోదయ్యింది. అంటే గత ఏడాది జూలై నెలతో పోల్చితే 2013 జూలై నెలలో ధరలు టోకుగా 5.79 శాతం పెరిగాయన్నమాట. ఇది ఐదు నెలల గరిష్ట స్థాయి. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 4.86 శాతం. ఉల్లిపాయలు, కూరగాయలు అలాగే ఇంధన ధరలు జూలైలో టోకు ద్రవ్యోల్బణం రేటు స్పీడ్‌ను భారీగా పెంచాయి. 4-5 శాతం శ్రేణిలో ఈ రేటు ఉండాలని ఆర్‌బీఐ భావిస్తుండగా, ఈ లక్ష్యాన్ని మించి ద్రవ్యోల్బణం పైకి దూసుకుపోవడం విశేషం. మే వరకూ వరుసగా నాలుగు నెలలు టోకు ద్రవ్యోల్బణం రేటు తగ్గుతూ వచ్చింది. జూన్ నుంచి తిరిగి పైచూపు చూడడం ప్రారంభించింది. సరఫరాలవైపు సమస్యలను పరిష్కరించి ద్రవ్యోల్బణం అదుపునకు కృషి చేయాలని ఫిక్కీ సహా పలు పారిశ్రామిక సంస్థలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి.
ఆహార ఉత్పత్తుల మంట...
సూచీలోని ప్రధాన మూడు విభాగాల్లో ఒకటైన ఆహార ఉత్పత్తుల ధరల స్పీడ్ (మొత్తం సూచీలో 14.34 శాతం వాటా) అటు వార్షికంగా చూసినా, ఇటు నెలవారీగా చూసినా సామాన్యునికి ఆందోళనకు గురిచేసేదిగా ఉంది. 2012 జూన్‌తో పోల్చితే 2013 జూన్‌లో నిత్యావసరాల ధరలు 9.74 శాతమే పెరిగితే, జూలైలో మాత్రం ఈ ధరల పెరుగుదల రేటు (2012 జూలైతో పోల్చి) భారీగా 11.91 శాతంగా నమోదయ్యింది. జూలైలో వార్షిక ప్రాతిపదికన వేర్వేరుగా చూస్తే- ఉల్లిపాయల ధరలు 145% పెరిగాయి. జూన్‌లో వార్షిక ప్రాతిపదికన ఈ పెరుగుదల రేటు 114%. కూరగాయల ధరలు జూలైలో 46.59 శాతం పెరిగాయి. జూన్‌లో వార్షికంగా ఈ పెరుగుదల రేటు 16.47 శాతమే. అంటే జూన్‌కన్నా జూలైలో ధరలు వార్షిక ప్రాతిపదికన మరింత తీవ్రమయ్యాయి. మిగిలిన నిత్యావసరాల విషయానికి వస్తే- బియ్యం ధరలు 21.15 శాతం దూసుకుపోయాయి. తృణధాన్యాల ధరలు 17.66 శాతం పెరిగాయి. గోధుమల రేట్లు 13.42 శాతం ఎగశాయి. పప్పు దినుసుల రేట్లు మాత్రం 7.39 శాతం తగ్గాయి. వరుసగా మూడు నెలల నుంచీ ఆహార ఉత్పత్తుల రేట్లు పెరుగుతూ వస్తున్నాయి.
మిగిలిన విభాగాలు ఇలా...
ఆహార, ఆహారేతర ఉత్పత్తులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ విభాగం మొత్తం ద్రవ్యోల్బణం రేటు 8.99 శాతంగా నమోదయ్యింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 8.14 శాతం. ఒక్క ఆహారేతర వస్తువుల విభాగాన్ని చూస్తే- ద్రవ్యోల్బణం రేటు 5.51 శాతంగా ఉంది. జూన్ నెలతో పోల్చితే ఈ రేటు (7.57 శాతం) తగ్గింది.
మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ వస్తువుల విభాగం (కోర్) ద్రవ్యోల్బణం రేటు 2.81 శాతం. జూన్ నెలతో పోల్చితే (2.75 శాతం) ఈ రేటు స్వల్పంగా పెరిగింది.
సూచీలో 15 శాతం వాటా కలిగిన ఇంధనం, విద్యుత్ సంబంధిత ద్రవ్యోల్బణం రేటు భారీగా 11.31 శాతానికి చేరింది. జూన్‌లో ఈ పెరుగుదల రేటు 7.12 శాతం మాత్రమే.
రూపాయి క్షీణతే కారణం: మాంటెక్
డాలర్ మారకంలో రూపాయి విలువ క్షీణించడం, దీనితో చమురు-ఇతర దిగుమతి చేసుకునే వస్తువులు భారంగా మారడం, ఈ ప్రభావం నిత్యావసర వస్తువుల మీద చూపడం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణమని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా పేర్కొన్నారు. అయితే తగిన వర్షపాతం నమోదై, దిగుబడులు పెరుగుతాయని, సరఫరాల వైపు సమస్యలు కూడా తొలగిపోయి ద్రవ్యోల్బణం అదుపులోనికి వస్తుందని ఆయన విశ్లేషించారు. ద్రవ్యోల్బణం అప్‌ట్రెండ్ కొనసాగదన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. రూపాయి విలువ స్థిరీకరణకు ప్రభుత్వం, ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తగిన వర్షపాతం, రూపాయి స్థిరీకరణకు ప్రభుత్వ చర్యలు వంటి కారణాల వల్ల ఈ ఏడాది చివరకు ద్రవ్యోల్బణం 5-6 శాతం శ్రేణిలో ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.