సామాన్యుడికి మళ్లీ ధరాఘాతం..
- ఎగబాకిన టోకు ధరలు...
- మే నెలలో 6.01% పెరుగుదల
- నిత్యావసరాలు ప్రియం
- ఆహార ద్రవ్యోల్బణం 9.5 శాతానికి...
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 2014 మే నెలలో 6.01 శాతంగా నమోదయ్యింది. అంటే 2013 మే నెలతో పోల్చితే 2014 మేనెలలో ఈ ధరలు 6.01 శాతం పెరిగాయన్నమాట. అంతకుముందు అంటే ఏప్రిల్ నెలలో ఈ పెరుగుదల రేటు 5.20 శాతం. నెలలో ఈ రేటు పెరుగుదల 86 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు 1 శాతం) నిత్యావసర ఉత్పత్తుల ధరల పెరుగుదల మొత్తం టోకు ధరల రేటుపై ప్రభావం చూపిందని నిపుణులు పేర్కొంటున్నారు. సోమవారం ఈ గణాంకాలు విడుదలయ్యాయి.
నిత్యావసరాల ధరల తీరు...
టోకు ధరల సూచీలోని మొత్తం మూడు విభాగాల్లో ఒకటైన ఆహార ధరల రేటు (సూచీ మొత్తంలో వెయిటేజ్ దాదాపు 14 శాతం) మే నెలలో 9.5 శాతానికి పెరిగిపోయింది. ఇది ఏప్రిల్‌లో 8.64 శాతం. వార్షికంగా వేర్వేరుగా చూస్తే కూరగాయల ధరలు 2013 మే నెలతో పోల్చితే 2014 మేలో స్వల్పంగా 0.97 శాతం తగ్గాయి. ఉల్లిపాయల ధరలు కూడా 2.83 శాతం తగ్గాయి. వీటిని మినహాయిస్తే, ఆలూ ధరలు 31.44 శాతం, పండ్ల ధరలు 19.40 శాతం, బియ్యం ధరలు 12.75 శాతం, గుడ్లు, మాంసం, చేపల ధరలు 12.47శాతం, పాల ధరలు 9.57శాతం, తృణధాన్యాల ధరలు 7.67 శాతం, గోధుమల ధరలు 3.64 శాతం, పప్పు దినుసుల ధరలు 0.78 శాతం పెరిగాయి.
3 విభాగాల విషయంలో...
మొత్తం మూడు విభాగాల్లో ఆహార, ఆహారేతర వస్తువులతో కూడిన ప్రైమరీ ఆర్టికల్స్ కేటగిరీలో ధరల పెరుగుదల రేటు మొత్తంగా 8.58 శాతంగా ఉంది. ఇందులో ఆహార ద్రవ్యోల్బణం 9.5 శాతంకాగా (పైన వివరించిన విధంగా), ఆహారేతర వస్తువుల రేటు 4.94 శాతంగా ఉంది.
ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం రేటు 10.53 శాతంగా ఉంది.కీలక విభాగంగా మొత్తం సూచీలో దాదాపు 65 శాతం వాటా కలిగిన తయారీ రంగం ద్రవ్యోల్బణం 3.55 శాతంగా ఉంది.
2012 మే నెలతో పోల్చి 2013 మే నెలలో ఉన్న ధరల పెరుగుదల రేటు (శాతం) కన్నా, 2013 మే నెలతో పోల్చి 2014 మే నెలలో అన్ని విభాగాల ద్రవ్యోల్బణం పెరుగుదల రేట్లు అధికంగా ఉన్నాయి.
అధిక ద్రవ్యోల్బణానికి అక్రమ నిల్వలూ కారణమే: జైట్లీ
న్యూఢిల్లీ: ఆహారోత్పత్తులు మార్కెట్లోకి రాకుండా వ్యాపారస్థులు అక్రమంగా నిల్వ చేస్తుండటమూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. అయితే, ఈ సరఫరా తరఫు సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పెక్యులేషన్‌ని కట్టడి చేసే దిశగా అక్రమ నిల్వలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వర్షపాతం తక్కువగా ఉండొచ్చన్న ఆందోళనల వల్ల కూడా ఆహార వస్తువులను మార్కెట్లోకి రాకుండా దాచిపెట్టడం జరుగుతోందని జైట్లీ పేర్కొన్నారు.
ఇలాంటి వాటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గొచ్చని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రూపాయి మారకం విలువ క్షీణతపై స్పందిస్తూ.. ప్రభుత్వం దేశీ కరెన్సీ కదలికలను నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఇరాక్ పరిణామాలు, అంతర్జాతీయంగా చమురు ధరల పెరుగుదల తదితర అంశాలు రూపాయి స్వల్ప అనిశ్చితి కారణమని జైట్లీ పేర్కొన్నారు.
ఆహార ధరలు మరింత పైకి: పరిశ్రమలు
ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే ఆహార ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భారత పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆహార, ఇంధన ధరలు తగ్గకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉండదన్న ఆందోళనను పారిశ్రామిక ప్రతినిధులు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే... ధరలు పెరుగుదల రేటు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ బిర్లా పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం పెరగడం ఆందోళనకరమైన అంశమని సీఐఐ డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. కాగా. తగిన వర్షపాతం నమోదుకాని పక్షంలో ఉత్పన్నమైన ప్రతికూలతలను అధిగమించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.