స్థానిక కారణాలతోనే జీడీపీ తగ్గింది
దావోస్: స్థానిక కారణాల వల్లే భారత్ వృద్ధి(జీడీపీ) తగ్గిందని ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. వృద్ధి రేటు పెరగకపోవడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను భారత్ సాకుగా చెప్పలేదని వ్యాఖ్యానించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యుఈఎఫ్) సదస్సులో ఆసియా మార్కెట్లపై నిర్వహించిన చర్చలో ఆయన ప్రసంగించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను ప్రభుత్వం ముందుగానే ఊహించి, త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు.
అవరోధాలు తొలగించాలి: ఐఎంఎఫ్ చీఫ్
గపెట్టుబడులకు ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగించి, వాణిజ్య వాతావరణాన్ని మెరుగుపర్చాలని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టిన్ లగార్డే భారత్‌ను కోరారు. డబ్ల్యుఈఎఫ్ సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఆమె శుక్రవారం ఎన్‌డీటీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అవరోధాల తొలగింపునకు ఇండియా ప్రాధాన్యం ఇవ్వాలనీ, ద్రవ్య పటిష్టీకరణపై దృష్టి కేంద్రీకరించాలనీ ఆమె అన్నారు. ద్రవ్యోల్బణం అదుపునకు రిజర్వు బ్యాంకు చేపట్టిన చర్యలతో పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పారు.
వ్యాపారాన్ని విస్తరిస్తాం: వాల్‌మార్ట్
భారత్‌లో వ్యాపార విస్తరణపై ప్రస్తుతం దృష్టి సారిస్తున్నామని అమెరికాకు చెందిన వాల్‌మార్ట్ ప్రెసిడెంట్ డౌగ్ మెక్‌మిలన్ పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మల్లీబ్రాండ్ రిటైల్ బిజినెస్‌లో ప్రవేశానికి సంబంధించిన నిబంధనలపై మరింత స్పష్టత కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
పేదరికాన్ని అధిగమిస్తుంది: కామరూన్
పేదరికాన్ని అధిగమించడానికి తగినన్ని వనరులు భారత్, చైనా వంటి దేశాలకు ఉన్నాయని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామరూన్ అన్నారు. కరువు, యుద్ధాల వంటి సమస్యలతో సతమతమవుతున్న దేశాలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పారు. ఈ కారణంగానే ఇండియా, చైనా వంటి దేశాలకు తమ సహాయ బడ్జెట్లో కేటాయింపులు తొలగించామని డబ్ల్యుఈఎఫ్ సదస్సులో తెలిపారు.