శనివారం అహ్లూవాలియాతో సమావేశమైన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలకు అవసరమైన నిధుల సమీకరణ, అలాగే ప్రజలపై భారం పడకుండా ఏవిధంగా ఆర్థిక వనరులు పెంచుకోవాలన్న అంశంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేస్తున్నామని, అందులో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచిన విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు.
గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఛిన్నాభిన్నం చేసిందని, మిగులు నిధులు ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పుల్లోకి నెట్టిందని అహ్లూవాలియాకు వివరించారు. ఈ నేపథ్యంలో ఆయన సలహాలు, సూచనలు కావాలని కోరా రు. ప్రజలపై ఎలాంటి భారం పడకుండా.. పన్నుల వసూళ్ల గురించి అహ్లూవాలియా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, డిప్యూటీ సీఎం విక్రమార్కకు వివరించారని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయన నుంచి సూచనలు తీసుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment