రేపు పీవీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు
దేశ గమనాన్ని మలుపుతిప్పినవారు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు. నాటకీయ పరిణామాల మధ్య ప్రధాని పీఠాన్ని అధిష్టించి మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లు నడపడం ఆయన పాలనాదక్షతకు ప్రతీక. అసలు ఆయన ప్రధాని కాకపోతే నేటి సరళీకరణ ఫలాలు మనకు కనిపించేవి కావేమో? దశ (అదృష్టం), దిశ (గమ్యం) రెండూ కొందరి జీవితాల్లో అనూహ్యంగా ట్విస్ట్ అవుతుంటాయి.
దేశ రాజధానిలో మూడు దశాబ్దాల రాజకీయ జీవితానికి స్వస్తి చెప్పి, వానప్రస్థం స్వీకరించాలనుకున్న సీనియర్ కాంగ్రెస్ నేత పాములపర్తి వెంకట నరసింహారావు విషయంలో ఇదే జరిగింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా డిల్లీ నుండి పెట్టే బేడాసర్దుకుని ఇంటిదారి పట్టేపనిలో ఉన్నారు. శ్రీ సిద్దేశ్వరి మఠం (తమిళనాడు)లో శేష జీవితం గడపటానికి వెళ్ళబోతున్నానని తన సన్నిహితులకు చెప్పారు.
ఈ తరుణంలోనే 1991 మే 21 రాత్రి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ మృత్యువాత పడటంతో, దేశ రాజకీయ పరిస్థితి ఒక్క ఉదుటున తారు మారయింది. ఇంకో విడత ఎన్నికలు జరగాల్సి ఉంది; పార్టీ అధ్యక్షుని హఠాన్మరణంతో అగాథంలో పడిన కాంగ్రెస్ నాయకులు మరుసటి రోజు మధ్యాహ్నం వర్కింగ్ కమిటీ మీటింగు ఏర్పాటు చేసి, అధ్యక్షుని స్థానంలో సీనియర్ నేత పీవీ నర్సింహారావును నియమించారు.
కేవలం అరగంట పాటు జరిగిన ఆ సమావేశంలో వర్కింగ్ కమిటీ సభ్యులు, పార్టీ అధ్యక్షుని మరణ రీత్యా సంతాప తీర్మానం చేసి, తర్వాత తాత్కాలిక పార్టీ అధ్యక్షునిగా పీవీని నియమించారు. భర్తను కోల్పోయిన విషాదంలో, సోనియా గాంధీ పార్టీ కార్య కలాపాలకు దూరంగా ఉండాలనుకుంది. జూన్‌లో వెలువడిన 10వ లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ 232 సీట్లు సంపాదించి, అతి పెద్ద పార్టీగా ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది.
గాంధీ కుటుంబీకులు రేసులో లేకపోవటంతో... అర్జున్ సింగ్, మాధవ్ రావ్ సింధియా, రాజేష్ పైలట్, శరద్ పవార్ లాంటి సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత పదవికి బరిలోకి దిగినప్పటికీ ఎన్నికైన అత్యధిక ఎంపీలు, గాంధీ కుటుంబానికి విధేయత, అనుభవం ఉన్న పీవీ వైపే మొగ్గు చూపారు. ‘పార్లమెంటు పార్టీ నేత ప్రధాని పీఠానికి అర్హుడు కాబట్టి, ఈ పదవికి పార్టీ ఎంపీలు తమలోని నాయకుణ్ణి డెమాక్రటిక్ పద్ధతిలోనే ఎన్నుకోవాలని’ పాచిక విసిరారు శరద్ చంద్ర పవార్. రాజకీయ చదరంగం ఆటలో అప్పటికే ఆయన పేరొందిన ఆటగాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఆయన అనునాయిడూ, పూణె ఎంపీ అయిన సురేష్ కల్మాడి (ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ స్క్వాడ్రన్ లీడర్) మహారాష్ట్ర సదన్ నుండి, ఉత్తరాది కాంగ్రెస్ ఎంపీలను పవార్ లాబీ కోసం సమీకరణ చేస్తూ షాం–ఏ–దావతులు ఏర్పాటు చేశారు. ఇటు కేరళ హౌస్ నుండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. కరుణాకరన్, పీవీ కోసం దక్షిణాది కాంగ్రెస్ ఎంపీలను ఏకతాటిపై తేవటానికి ప్రయత్నాలు
జరిపారు.
అక్బర్ రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జూన్ 19 నాడు కాంగ్రెస్ నేతలతో కిక్కిరిసింది. 232 మంది నూతన ఎంపీలను పార్లమెంటరీ పార్టీ నాయకుణ్ణి ఎన్నుకోమని ఒకవేళ ఓటింగ్ నిర్వహిస్తే పవార్ 35 ఓట్లతో వెనుకంజలో ఉంటాడని తెలిసిపోయింది. వీరిని తన వైపు మరల్చుకోవటానికి ఆయనకు ఇట్టే సమయం పట్టదని గ్రహించిన పీవీ, పోటీకి దిగిన శరద్ పవార్‌ను ఆఖరి ప్రయత్నంగా, ఒక వైపు తీసుకెళ్లాడు.
ఏకాంతంలో పవార్‌తో, ఈ మధ్యనే తన గుండెకు శస్త్ర చికిత్స జరిగిందనీ, వయోభారంతో రాజకీయ విధులు నిర్వర్తించటం ఎక్కువ కాలం సాధ్యపడక పోవచ్చని చెబుతూ... మరాఠీలో, ‘మీ హీ జబాబ్దారీ మాఝ్య ఖాంధ్యా వర్ కితీ దివస్ పేల్వూ (నేను ఈ భాధ్యత నా భుజాలపై వేసుకుని ఎన్ని రోజులని మోయగలను) అంటూ, ‘కొన్ని రోజులపాటు తనకు ప్రధానిగా అవకాశం ఇవ్వవలసిందిగా’ నవ్వుతూ కోరాడు పీవీ. పీవీ తాత్విక ధోరణితో మాట్లాడిన మాటలకు చలించి పోయారు పవార్ సాహెబ్.
మరుసటి రోజు ఉదయం (జూన్ 20) పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. హాజరైన ఎంపీలు అంతా హాలులోకి ప్రవేశించిన శరద్ పవార్ వైపే సస్పెన్స్‌తో చూస్తున్నారు. మీటింగు ఆరంభం కావటంతోనే పవార్, జేబులోనుండి తను రాసిన ఒక లెటర్ తీసి సభ్యుల ముందుంచారు. ‘పార్టీ నాయకత్వాన్ని నిర్ణయించడంలో సీపీపీని సమావేశ పరచాలన్న డిమాండ్‌ను కాంగ్రెస్ అధ్యక్షులు (పీవీ) అంగీకరించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. సీపీపీ సభ్యులందరూ శ్రీ పీవీ నరసింహారావుకు మద్దతు ఇవ్వాలనీ, ఈ విషయంలో ఏకగ్రీవ నిర్ణయానికి రావాలనీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను’ అని అందులో కోరారు.
అంతే, మరునాడు (1991 జూన్ 21) రాష్ట్రపతి భవన్‌లో పీవీ నరసింహారావు తొమ్మిదవ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తను ప్రధాని అయ్యాక, శరద్ పవార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షునిగా నియమిస్తానని రావు ప్రామిస్ చేసినట్టు అంటారు. కాని, ఏప్రిల్ 1992 ఏప్రిల్‌లో జరిగిన తిరుపతి కాంగ్రెస్ పార్టీ సదస్సులో, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని తన అనుకూల సభ్యులతో పునర్వ్యవస్థీకరించి, అధ్యక్షునిగా పార్టీ పగ్గాలు సైతం నాటకీయంగా కైవసం చేసుకున్నారు అపర చాణక్యుడు పీవీ నరసింహారావు. (శరద్ పవార్ రాజకీయ ఆత్మకథ ‘లోక్ మాఝే సాంగతి’, రషీద్ కిద్వాయి రాసిన ‘24 అక్బర్ రోడ్’ ఆధారంగా) వ్యాసకర్త విశ్రాంత పీఎఫ్ కమిషనర్ 9819096949.
సందర్భం: - జిల్లా గోవర్ధన్
Comments
Please login to add a commentAdd a comment