స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి! | Sakshi Guest Column On India Independence Benefits | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర ఫలాలను కాపాడుకోవాలి!

Published Sun, Dec 29 2024 4:15 AM | Last Updated on Sun, Dec 29 2024 4:15 AM

Sakshi Guest Column On India Independence Benefits

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం మనది. ఇప్పుడిక భూమ్మీద అత్యధిక జనాభా గల దేశంగానూ అవతరించనుంది. భారతావని 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటోంది. ఈ సమ యంలో మనందరిపై ప్రత్యేక బాధ్యత ఉంది. స్వాతంత్య్రం మనకు ప్రసాదించిన స్వేచ్ఛలను పరిరక్షించుకుంటూ ప్రపంచస్థాయి ప్రమాణాలతో వాటిని బలోపేతం చేసుకునేందుకు నడుం బిగించాలి. ఎంతో ఉన్నతంగా రెపరెపలాడే జాతీయ జెండాకు సగర్వంగా సెల్యూట్‌ చేసే ప్రతి భారతీయుడూ ఆ జెండాలోని మూడు రంగుల అంత రార్థాన్ని గ్రహించాలి. 

దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని, దేశ సమైక్యతను ప్రతిఫలించే ఆ మువ్వన్నెలే మన ప్రజాస్వామ్యాన్ని అవని మీదే ఉన్నతమైందిగా రూపొందించాయి. భారత ప్రజల ఈ సమైక్యతను దెబ్బతీసే విద్వేష ప్రచారాలను అడ్డు కోవాలి. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అహంకార పూరితమైన నిరంకుశ అధికారం ఎప్పటికీ కబళించకుండా కాపాడుకోవాలి. ఈ చారిత్రక సందర్భంగా ఇలా చేస్తామని మనమందరం ప్రతిన పూనాలి. ఇదే జాతీయ పతాకానికి మనం అర్పించగల ఘన నివాళి. 

సమైక్యత మన సంపద 
వలస పాలన మృత్యు కౌగిలి నుంచి విముక్తమైన భారత్‌ నాడు తక్షణం జాతి సమైక్యతకు నడుం బిగించింది. చెల్లా చెదురుగా ఉన్న బ్రిటిష్‌ పాలిత  ప్రాంతాలను, సంస్థానాలను విలీనపరచి ఒక సమైక్య జాతిగా అవతరించింది. ఈ సమైక్యత రాత్రికి రాత్రే మంత్రం వేసినట్లు వచ్చింది కాదు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ నేతృత్వంలో సాగిన స్వాతంత్య్రోద్యమం, విదేశీ పాలనకు చరమగీతం పాడేందుకు భారతీయులందర్నీ ఏకం చేసింది. భాష, కులం, మతం, స్త్రీపురుష భేదం, సామాజిక అంతరాలు... వీటన్నిటికీ అతీతంగా భారతీయులను ఈ ఉద్యమం సమైక్యం చేసింది. ఈ సమైక్యత భారత్‌కు అమూల్య సంపద. కుల మత విభేదాలు, భాషా దురహంకారాలతో ఇది నాశనం కాకూడదు.

ఇలాంటి కుట్రలతో భారతీయులను భారతీయుల మీదే ఉసిగొల్పి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలను పొందితే పొందవచ్చు. కానీ, ఒక గొప్ప జాతిగా ఈ దేశం ప్రయాణం సాగించే ప్రగతి బాట మీద ఇవి అగాథాలను సృష్టిస్తాయి. వలస పాలకులు మనల్ని నిలువునా దోచారు. వారి నుంచి స్వాతంత్య్రం సాధించుకున్న మనం ఒక బీదదేశంగా కొత్త జీవితం ప్రారంభించాం. ఆ స్థాయి నుంచి నేడు ప్రపంచ అగ్రస్థాయి ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదగగలిగాం. 

1991లో చేపట్టిన ఆర్థిక సరళీకరణ విధానం మన ఆర్థిక ప్రగతికి ఊతం ఇచ్చింది. పేదరికం తగ్గింపు, ఆర్థిక అసమానతల తొలగింపు ప్రభుత్వ విధానానికి దిశానిర్దేశం అయ్యాయి. అందరి ఆర్థిక ప్రయోజనమే మనకు పరమావధి అయ్యింది. ఒకవైపు ఆర్థిక అంతరాలు పెరుగుతూ, మరోవైపు ఎంపిక చేసిన కొద్ది మంది వ్యాపార దిగ్గజాలే సంపద ప్రయోజనాలను పొందడాన్ని మనం అనుమ తించకూడదు.

వేర్పాటు రాజకీయాలు కూడదు! 
ఉపాధి లేని వృద్ధి ఏ ఆర్థిక వ్యవస్థకూ క్షేమం కాదు. సామాజిక అసంతృప్తికి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించే రాజకీయాలకు నిరుద్యోగ సమస్య దారితీస్తుంది. జనాభాలో చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్న యువజనులకు విద్య, నైపుణ్యం, తగు ఉపాధి కల్పించాలి. ఔత్సాహిక యువ పారిశ్రామిక వేత్తలకు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వాలి. తద్వారా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ధ్యేయంగా రానున్న 25 సంవత్సరాలకు బాటలు వేసుకోవాలి. 

ఇది సుసాధ్యం కావాలంటే విద్య, ఉపాధి అవకాశాల కోసం ప్రజలు దేశం నలు మూలలకు స్వేచ్ఛగా వెళ్లగలగాలి. మతం, భాష వంటివి ఈ స్వేచ్ఛా గమనానికి అడ్డంకులు కాకూడదు. దేశ పారిశ్రామిక సారథులు అవరోధాల ప్రమాదాన్ని గుర్తించి జాతీయ సమైక్యతకు గళం విప్పాలి. విచ్ఛిన్న రాజకీయాలు ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంటే వారు మౌన ప్రేక్షుల్లా ఉండిపోకూడదు. 

శాస్త్రీయ సంప్రదాయం నిలబెట్టాలి! 
స్వాతంత్య్రం తొలినాళ్ల నుంచీ దేశం శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చింది. ప్రగతి సాధనకు దాన్ని మార్గం చేసుకుంది. పురోగమన దృక్పథంతో నేషనల్‌ సైన్స్‌ పాలసీ రూపుదిద్దుకుంది. విజ్ఞానం, బోధన, పరిశోధనలకు గొప్ప గొప్ప సంస్థలు ఏర్పాటయ్యాయి. అనేక భారతీయ సాంకేతిక సంస్థలు ప్రపంచ గుర్తింపు పొందాయి. వాటిలో చదివిన పలువురు విద్యావంతులు నేడు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు సారథ్యం వహిస్తున్నారు. అంతరిక్ష, సాగర, అణుశక్తి కార్య క్రమాలు మనల్ని అంతటి సామర్థ్యం ఉన్న అతి కొద్ది దేశాల సరసన నిలిపాయి. 

శాస్త్రీయంగా, సాంకేతికంగా ప్రపంచ గుర్తింపు పొందిన మన వైజ్ఞానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల సారథ్య బాధ్యతల్లో సాంస్కృతిక పునరుజ్జీవనం పేరిట తక్కువ ప్రతిభావంతులకు చోటు కల్పిస్తే అంతకు మించిన దురదృష్టం ఉండదు. ప్రాచీనకాలం నుంచీ మనకు గర్వించదగిన సాంప్రదాయిక విజ్ఞానం ఉంది. అయితే అది ఆధునిక విజ్ఞానాన్ని మసకబరచి మేటి శాస్త్రవేత్త లకు అపఖ్యాతి తేకూడదు.

స్పష్టమైన విదేశీ విధానాలు
రెండు అధికార కూటములు ప్రపంచంపై పట్టు సాధించడానికి పోటీపడుతున్న సమయంలో... దేశాల మధ్య శాంతి సామరస్యాలు మెరుగుపరచడానికి మనం అవలంబించిన విలువలు, విధానాలు, మన అలీన ఉద్యమ నాయకత్వం భారత్‌కు ఎనలేని గౌరవం తెచ్చి పెట్టాయి. మన పొరుగున ఉన్న అత్యధిక దేశాలతో మనకు సహృద్భావ సంబంధాలు ఉండేవి. 

కొన్నిటితో ఘర్షణలు ఉన్నప్పటికీ శాంతి యుత సహజీవనానికి వీలుకల్పించేలా వాటితో అవగాహనా వార ధులను నిర్మించుకునే ప్రయత్నం చేశాం. ప్రపంచ దేశాలు మనల్ని నమ్మదగిన గౌరవప్రదమైన మిత్రదేశంగా పరిగణించే స్థితి ఉండాలి. ముఖ్యంగా దక్షిణ ఆసియాలో ఈ విశ్వాసం పొందాలి. కేవలం కెమెరాల మందు ఆప్యాయతా ప్రదర్శనలకు పరిమితమైతే మన విదేశాంగ విధానం బలహీనం అవుతుంది. సమర్థులయిన దౌత్యవేత్తల సహకారంతో విజ్ఞులైన నాయకులు సుస్పష్టమైన చర్యలు చేపట్టాలి. 

యువత శ్రేయస్సు ముఖ్యం 
యువజనుల ఆరోగ్యం, విద్య, నైపుణ్యం మీద తప్పనిసరిగా దృష్టి సారించాలి. మన చిన్నారుల్లో ఎదుగుదల లోపం, బిడ్డల్ని కనే మహిళల్లో పోషణ లేమి, రక్తహీనత అధికంగా ఉన్నాయని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌ –5) తేల్చి చెప్పింది. కాబట్టి పౌష్టికాహార కార్యక్రమాలను అమలు చేయాల్సిన అవ సరం ఉంది. అలాగే, మంచినీరు, పారి శుద్ధ్య రంగాల్లో కూడా సరైన చర్యలు, విధానాలు అమలు చేయాలి. మన ఆరోగ్య వ్యవస్థలో ఉన్న అనేక బలహీనతలను కోవిడ్‌ – 19 బట్టబయలు చేసింది. వ్యాధులపై నిఘా పెంచాలి. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వెయ్యాలి. 

వైద్య సేవల రంగాన్ని విస్తరించాలి. ఈ దిశగా పరిశీలిస్తే ఆ యా రాష్ట్రాల మధ్య ఆరోగ్య వ్యవస్థల పనితీరు, వాటి విస్తరణల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయి. రాష్ట్రాలు ఆరోగ్యం మీద మరిన్ని నిధులను వెచ్చించాలి. కేంద్ర ప్రాయోజిత పథకాల లక్ష్య సాధన కోసం రాష్ట్రాలకు ఇతోధికంగా మద్దతు అందించాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు అందించడం సార్వత్రిక ఆరోగ్య సేవల కల్పన విధానాల లక్ష్యం కావాలి. దేశవ్యాప్తంగా సమరీతిలో ఈ లక్ష్యాన్ని సాధించాలి. 

పౌరుల బాధ్యత
అప్పట్లో నేను పధ్నాలుగేళ్ల కుర్రవాడిని. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఆనంద పారవశ్యంతో మునిగిపోయాను. అదే సమయంలో దేశ విభజన అంతులేని విషాదం మిగిల్చింది. అలాంటి దుఃస్థితి తిరిగి ఎప్పటికీ రాని దృఢమైన దేశంగా భారత్‌ ఎదగాలని ఆశించాను. ఇండియా ఇన్నేళ్లల్లో సాధించింది చూసి నేనిప్పుడు గర్విస్తున్నాను. ఈ గొప్ప దేశం భవిష్యత్తు పట్ల నాకు ఎన్నో ఆశలున్నాయి. సమాజంలో çసుహృద్భావ వాతావరణాన్ని కలుషితం చేస్తూ, ప్రజల్ని విభజిస్తున్న వేర్పాటు నినాదాలు, మత విద్వేషాలు చూసి నేను ఆందోళన కూడా చెందుతున్నాను. 

మరో వంక, ప్రజాస్వామ్య స్వేచ్ఛలను పరిరక్షించి తీరాల్సిన, సుపరిపాలన నియమ నిబంధనలను నిలబెట్టాల్సిన, ఎన్నికలకు ధనబలం, ప్రభుత్వ ఏజెన్సీల నుంచి రక్షణగా ఉండాల్సిన వ్యవస్థలు బలహీనమవటం కూడా జరుగుతోంది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను పరిరక్షించుకోవలసింది భారత పౌరులే! సగర్వంగా తల ఎత్తి మన జెండాకు వందనం చేసేటప్పుడు మనలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవలసిన గురుతర బాధ్యత ఇది!

డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ 
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా 2022 ఆగస్ట్‌ 15న మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాసిన వ్యాసం ఇది. ‘ది హిందూ’ సౌజన్యంతో.)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement