హస్తిన... నాటి రాచరికం నుంచి నేటి ప్రజాస్వామం వరకు పరిపాలన కేంద్రం. ఎందరో పాలకుల కార్యక్షేత్రం. 2004 డిసెంబర్. మోతీలాల్ నెహ్రూ మార్గ్, 9వ నంబర్ ఇల్లు. విశాల ప్రాంగణంలోని పచ్చని చెట్లపై పక్షుల కిలాకిలా రావాలు స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్ద వాతావరణం. ఎప్పుడో ఒకసారి పలకరింపుల కోసం వచ్చే ఆత్మీయులు మినహా ఆ ప్రాంగణమంతా నిర్మానుష్యం. ఆ విశాల ఇంట్లోని హాలులో ఒంటరిగా కుర్చీలో పీవీ నరసింహారావు. ఇంతకీ ఎవరీ పీవీ? భారతమాతకు సరైన సమయంలో ఎదిగివచ్చిన బిడ్డడు. కర్తవ్యాన్ని నిర్వర్తించి, నిష్క్రమించిన కర్మయోగి. పీవీలో మానవీయ, నిస్వార్థ వ్యక్తిత్వం, నిర్మల మనస్సు ఎలా నిర్మితమయ్యాయి? పీవీ జీవన ప్రయాణాన్ని పరిశీలిస్తే ఇందుకు జవాబు దొరుకుతుంది.
ఆరేళ్లు బాలుడిగా ఉన్నప్పుడు పీవీని ఇంటి పక్కనే ఉన్న రంగారావు కుటుంబానికి దత్తత ఇచ్చారు. రెండు కుటుంబాల మధ్య కలహాలు పరిష్కరించేందుకు తనను దత్తత ఇచ్చినట్టుగా తోచింది. హైదరాబాద్ సంస్థానంలో అసమానత, అణచివేత బాలుడైన పీవీని వేదనకు గురిచేసేవి. అమానుషమైన భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడాలనే ఆలోచన కలిగింది. నిరక్షరాస్యత వల్లే అణచివేత రాజ్యమేలుతోందని అర్థమైంది. ప్రపంచ పరిణామాలు, వివిధ సంస్కృతులు అర్థం చేసుకునే క్రమంలో పలు భాషలు, సాహిత్యం నేర్చుకు న్నారు. విమోచన పోరాటంలో స్వామీ రామానంద తీర్థ నాయకత్వంలో పనిచేశారు. నిరంకుశ వ్యవస్థపై బయట నుంచి పోరాడిన పీవీ ప్రజా స్వామ్యంలో వ్యవస్థ లోపల ఉండి సమస్యలు పరిష్కరించాలని ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి 35 ఏళ్ల పాటు సంస్కరణల ప్రస్థానం సాగించారు.
భూమి లేని నిరుపేదల్ని యజమానులుగా మార్చే లక్ష్యంతో ముఖ్యమంత్రిగా పీవీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం భూసంస్కరణలు. ప్రతికూల తలు, బెదిరింపుల్ని లెక్క చేయకుండా అనుకున్నది సాధించారు. ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచిస్తే భూసంస్కరణల ఆలోచనే వచ్చేది కాదు. భూస్వామ్య వ్యవస్థను సమూలంగా కూలదోయా లని, పేదల పక్షాన నిలబడాలనే సంకల్పం బాల్యం నుంచే ఉంది కాబట్టే రాజీపడలేదు. సరళీకృత ఆర్థిక విధానాలంటే పెట్టుబడిదారు లకు అనుకూలమో, ప్రయో జనాలు కల్పించడమో కాదు. పీవీ చూపులు వేల మైళ్ల దూరంలోని గమ్యాన్ని చూశాయి.
స్తబ్ధుగా ఉన్న ఆర్థిక వ్యవస్థను మేల్కొలిపి, పరుగులు పెట్టించారు. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వాల ముఖ్య విధులు. అభివృద్ధి ప్రాజెక్టుల్లో ప్రైవేటుకు భాగస్వామ్యం కల్పిస్తూ ఆదా అయిన ప్రభుత్వ నిధుల్ని సంక్షేమానికి మళ్లిస్తే పేదలకు మేలు జరుగుతుందని సంస్కరణల ఉద్దేశం. 1991 నాటి అత్యంత సంక్షోభ సమయంలో ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది. దాన్ని వ్యవస్థలో సమూల మార్పు తీసుకొచ్చే సదవకాశంగా మలచుకున్నారు. దేశ గతిని మార్చారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు దోషిగా నిందిస్తూ కొందరు, ఘనతగా కీర్తిస్తూ మరికొందరు తమతమ దృక్పథాల్లో పీవీని చూస్తు న్నారు. కానీ ఆనాడు ప్రధానిగా రాజ్యాంగానికి లోబడి తన విధిని నిర్వర్తించారు.
2004 డిసెంబర్ 23. ఢిల్లీ. ఎయిమ్స్ హాస్పిటల్. శరీరం అలసినా మనసు అలసిపోలేదు. మౌనముని నోటి వెంట ఒక్కటే ప్రశ్న. ‘ఇంకెందుకు ఈ శరీరంలో ప్రాణాన్ని కొనసాగించాలని ప్రయత్ని స్తున్నారు? నేను చేయాల్సిన పని పూర్తయిందనే తృప్తి ఉంది. ఇప్పుడింకేం కోరికల్లేవు. ఈ శరీరాన్ని వదిలే సమయమొచ్చింది. దేశాన్ని ప్రజల చేతుల్లో పెట్టాను. ముందుకు నడిపించాల్సింది వాళ్లే. 21వ శతాబ్దం భారతదేశానిదే. నాకేం కీర్తి అవసరం లేదు. మళ్లీ జన్మంటూ ఉంటే సగర్వ భారతీ యుడిగా తిరిగి వస్తా’ అన్నారు. కారణజన్ముడు తన కర్తవ్యాన్ని కర్మయోగిలా నిర్వహించి జన్మను ముగించిన రోజిది. భౌతికంగా దూరమైనా భారతీయులకు నిత్యస్మరణీయుడు.
–పి.వి.ప్రభాకర్ రావు
వ్యాసకర్త పీవీ తనయుడు
నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి
Comments
Please login to add a commentAdd a comment