నేడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు వర్ధంతి
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315
Comments
Please login to add a commentAdd a comment