Jadhav
-
కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలి: సరితా జాదవ్
బంజారాహిల్స్: మారుతున్న కాలానికి అనుగుణంగా అత్యాధునిక విద్యావిధానాలతో పాఠశాలలను ఎలా సిద్దం చేయాలనే అంశంపై నిర్వాహకులు దృష్టి సారించాలని యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ సూచించారు. ’హైదరాబాద్ సహోదయ స్కూల్స్ కాంప్లెక్స్ (హెచ్ఎస్ఎస్సీ) ఆధ్వర్యంలో ’సమన్వయ 2024’ పేరుతో జాతీయ సదస్సును బంజారాహిల్స్‌లో నిర్వహించారు.తెలంగాణ రాష్ట్రంలోని 281 సీబీఎస్ఈ స్కూళ్లకు చెందిన ప్రిన్స్పల్స్. అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ సదస్సులో సరికొత్త విద్యావిధానాలు, మారుతున్న పరిస్థితులు తదితర అంశాలపై కూలంకశంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెస్కోకు చెందిన నేషనల్ ప్రోగ్రామ్ ఆఫీసర్ సరితా జాదవ్ మాట్లాడుతూ..గ్లోబల్ ఎడ్యుకేషన్ విధానానికి అనుగుణంగా విద్యాబోధనను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసం స్కూళ్లలో ఏర్పాటు చేసుకోవాల్సిన మౌళిక సదుపాయాలు, పరిశోధనలపై దృష్టి పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. భవిష్యత్తులో విద్యావ్యవస్థలో రానున్న మార్పులకు సన్నద్ధం చేయడంలో ఇలాంటి సదస్సులు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ముంబయి ఐఐటీ ప్రొఫెసర్ అజంతా సేన్, ఐఐఎమ్ అహ్మదాబాద్ ప్రొఫెసర్ కాథన్ దుష్యంత్ శుక్లా, హెచ్ఎస్ఎస్ సీ చైర్మన్ అమీర్ ఖాన్, వైస్ చైర్పర్సన్ డా. ఎబెనీజర్, సెక్రెటరీ రోజా పాల్,డా. సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో.. మందుల మహా మాంత్రికుడు!
ప్రపంచ వైద్యశాస్త్ర రంగంలో మందుల మహా మాంత్రికుడని సుస్థిర స్థానాన్ని పొందిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగుజాతి గర్వించదగిన ముద్దుబిడ్డ. ఎన్నో రకాల జాడ్యాలకు దివ్యౌషధాలను కనుగొని మనవాళికి మహోపకారం చేసిన మహోన్నత వైద్య శాస్త్రవేత్త.పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో వెంకమ్మ, జగన్నాథం పుణ్య దంపతులకు 1895 జనవరి 12న ఆయన జన్మించారు. చిన్నతనంలోనే తండ్రి మరణించాడు. తల్లి పెంపకంలో పెరిగారు. పుస్తెలమ్మి సుబ్బారావును చదివించింది తల్లి. రాజమండ్రిలో పాఠశాల విద్య పూర్తిచేసిన సుబ్బారావు పై చదువుల కోసం మద్రాసుకు వెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడే ఆయన సోదరులు కొంత కాల వ్యవధిలో ఒకరి తరువాత ఒకరు ‘స్ప్రూ’ వ్యాధితో మరణించారు. మనోవేదనకు గురైన సుబ్బారావు దానికి మందు కొనుక్కోవాలని నిర్ణయించుకున్నారు. మద్రాస్ వైద్య కళా శాలలో చేరి వైద్య విద్యను పూర్తి చేశాక, పరిశోధన కోసం లండన్ వెళ్లి డాక్టర్ రిచర్డ్ స్ట్రాంగ్ శిష్యరికంలో ఉష్ణ మండల వ్యాధుల చికిత్సలో డిప్లొమా పొందారు. డాక్టర్ స్ట్రాంగ్ సూచన మేరకు అమెరికా వెళ్లి జీవ రసాయన శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సుబ్బారావు తన పరిశోధనల వల్ల ఫోలిక్ ఆమ్లపు నిజ స్వరూపాన్ని గుర్తించారు. ఇది స్ప్రూ వ్యాధికీ, మైక్రోసైటిక్ ఎనీమియా వ్యాధికీ తిరుగులేని ఔషధంగా నిలిచింది. అలాగే బోధకాలు నివారణ కోసం మందు కనుక్కున్నారు. కీమోథెరపీ కోసం వాడే మెథోట్రెక్సేట్‌ను కనుక్కున్నారు. ఎల్లప్పుడూ పరిశో ధనలలో నిమగ్నం కావడం వల్ల సుబ్బారావు ఆరోగ్యం నశించింది. 1948 ఆగస్టు 8న అమెరికాలో కన్నుమూశారు. ఆయన సేవలు అందించిన అమెరికాకు చెందిన లీడర్లీ సంస్థ సుబ్బారావు మీద గౌరవంతో సుబ్బారోమెసెస్ ఔషధాన్ని ప్రవేశపెట్టింది. కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించింది. ప్రపంచ మానవాళికి తన జీవితాన్ని అంకితం చేసిన డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు తెలుగువాడు కావడం మన తెలుగు వారందరి అదృష్టం. – జాధవ్ పుండలిక్ రావు పాటిల్, 94413 33315 -
ఎమ్మెల్సీ కవితను కలిసిన జాన్సన్‌నాయక్
ఖానాపూర్: బీఆర్ఎస్ ఖానాపూర్ అభ్యర్థిగా ఎంపిక అనంతరం బుక్యా జాన్సన్‌నాయక్ ఇప్పటికే జిల్లా మంత్రి ఐకేరెడ్డితో పాటు జి ల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, అభ్యర్థులను రా ష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవితను ఆమె నివాసంలో కలిసి పు ష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తె లిపారు. తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికె ట్ను కేటాయించిన సీఎం కేసీఆర్‌తో పా టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు జాన్సన్ నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన అనిల్ జాదవ్ నిర్మల్‌టౌన్: జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని బోథ్ ని యోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ జాదవ్ మర్యాదపూర్వకంగా కలిశా రు. ఈ సందర్భంగా మంత్రిని శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. -
తలపై చర్మాన్ని ఒలిచారు
శివ్‌పురి (మధ్యప్రదేశ్): తలపాగా(టర్బన్) ధరించాడని ఎస్సీ వర్గానికి చెందిన ఓ బీఎస్పీ నేతపై గుజ్జర్ యువకులు దాడి చేసి తల చర్మాన్ని ఒలిచారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో చోటు చేసుకుంది. శివ్‌పురిలోని మొహోబా గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ జాదవ్ (45) స్థానిక బీఎస్పీ నేతగా ఉన్నారు. ఈ నెల 3న సర్దార్ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి పిలిచారు. దీంతో అక్కడకు చేరుకున్న సర్దార్ సింగ్‌ను నిందితులు ఒక్కసారిగా దూషించటం ప్రారంభించారు. అనంతరం నిందితులు సర్దార్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. సర్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నర్వార్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ బదం సింగ్ యాదవ్ తెలిపారు. కేసు దర్యాప్తులో ఉందని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌ను గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, టర్బన్ ధరించిన కారణంగానే జాదవ్‌పై గుజ్జర్ యువకులు దాడికి పాల్పడ్డారని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్ గౌతమ్ ఆరోపించారు. జాదవ్ రోజూ నీలం రంగు తలపాగా ధరిస్తాడని, దీనిపై నిందితులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడించారు. -
జాదవ్.. ఓ గ్రీన్ చాలెంజ్
గ్రీన్ చాలెంజ్..ఈ మధ్య దీనికి బాగా క్రేజ్ పెరిగింది.. మూడు మొక్కలు నాటడం.. సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేయడం.. అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ కూడా గ్రీన్ చాలెంజ్ స్వీకరించాడు.. మొక్కలు నాటాడు. కానీ సెల్ఫీ తీద్దామంటేనే ఫోన్లో రావడం లేదు.. ఇందుకోసం హెలికాప్టర్‌నే తేవాల్సి వచ్చింది.. ఎందుకో తెలుసా? అతడు నాటింది మొక్కలను కాదు.. ఏకంగా ఓ అడవిని.. 1979.. అస్సాంలోని మాజులీ ద్వీపం.. బ్రహ్మపుత్ర నది వరుస వరదల వల్ల తరచూ భూమి కోతకు గురయ్యేది. దీనికితోడు అడపాదడపా కరువు కూడా.. తాను పుట్టిన నేలను కాపాడుకోవాలని 16 ఏళ్ల జాదవ్ అప్పుడే నిర్ణయించుకున్నాడు. ప్రకృతి విసిరిన సవాలును స్వీకరించాడు.. పచ్చదనమంటూ లేని ప్రాంతంలో రోజుకొక మొక్క నాటాడు. అలాఅలా.. మొక్కంటూ మొలవని నేలపై ఓ అడవి ఆవిష్కృతమైంది. 1,360 ఎకరాల్లో విస్తరించింది. పులులు, ఏనుగులు వంటి ఎన్నో రకాల వన్యప్రాణులకు నివాస కేంద్రమైంది. 2007 వరకూ.. మీకో విషయం తెలుసా? జాదవ్ ఓ వనాన్నే సృష్టించాడన్న విషయం 2007 వరకు బయటి ప్రపంచానికి తెలియదు.. ఓ రోజున ఫొటోజర్నలిస్ట్ జీతూ కలితా అనుకోకుండా ఈ ప్రాంతానికి రావడంతో ఈ విషయం బయటపడింది. వాళ్లు కలవడమే చాలా చిత్రంగా జరిగిందట. ‘‘పక్షుల ఫొటోలు తీయడానికి ఓ బోటు తీసుకుని.. బ్రహ్మపుత్ర నదిలో వెళ్తున్నా. మాజులీ ద్వీపం వద్దకు రాగానే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.. మొక్క మొలకెత్తడానికే సందేహించే ఈ నేలపై పచ్చని అడవి’అని జీతూ నాటి సంఘటనను గుర్తు చేస్తున్నారు. ఇక జాదవ్ అయితే.. ఎవరూ రాని ఆ ప్రదేశానికి జీతూ రావడంతో వన్యప్రాణుల వేటగాడు అని అనుకున్నాడట. ఈ సందర్భంగా జాదవ్ భగీరథ యత్నం గురించి తెలుసుకున్న జీతూకు నోట మాట రాలేదు. కొన్ని రోజులు అక్కడే ఉన్నారు. జాదవ్ గొప్పతనాన్ని తన కథనం ద్వారా ప్రపంచానికి పరిచయం చేశారు. ఒక్క వ్యక్తి తలుచుకుంటే ఏం చేయగలడన్న దానికి ఉదాహరణ జాదవేనని చెబుతారు. తొలి మొక్క ఇప్పటికీ జ్ఞాపకమే.. జాదవ్‌కు తాను మొదటిసారి నాటిన మొక్క ఎక్కడుందో కూడా తెలుసు.. ఓ మహారణ్యానికి బీజం వేసిన ఆ వృక్షం వద్దకు రోజుకు ఒక్కసారైనా వెళ్లి.. సేదతీరుతాడు.. నీవు లేనిదే నేను లేను అంటాడు.. ఉదయం 3 గంటలకు నిద్రలేవగానే.. తన వనం వద్దకు వెళ్తాడు. మొక్కలు నాటే పనిలో మునిగిపోతాడు. సమీప గ్రామాల్లో పాలు అమ్మి.. జీవనం కొనసాగించే జాదవ్ నిజంగా హరిత సంపన్నుడే. ఇతడి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. సమీప వనాల నుంచి ఏనుగులు, పులులు వంటివి జాదవ్ సృష్టించిన అడవికి వస్తూ పోతుంటాయట. అంతేకాదు.. జాదవ్‌కు అప్పుడప్పుడు వన్యప్రాణి వేటగాళ్లు, కలప అక్రమ రవాణాదారుల నుంచి బెదిరింపులు కూడా వస్తుంటాయి.. అయినా.. మనోడు వెనకడుగు వేయడు. తన చివరి శ్వాస వరకూ మొక్కలు నాటుతునే ఉంటానని.. వాటిని అనుక్షణం కాపాడుతునే ఉంటానని చెబుతాడు.. ఓ అడవినే సృష్టించానని అతడు అక్కడితో ఆగిపోలేదు.. మరో గ్రీన్ చాలెంజ్‌కు సిద్ధమయ్యాడు.. ఆ అడవిని 5 వేల ఎకరాలకు విస్తరిస్తాడట.. అదిగో బయలుదేరాడు జాదవ్.. మరో మహాకార్యానికి బీజం వేయడానికి.. మరో మహారణ్యమై మొలకెత్తడానికి.. 1979లో తాను తొలిసారిగా నాటిన మొక్క వద్ద జాదవ్. (ఇన్సెట్లో) ఇలాంటి భూముల్నే జాదవ్ అడవిలా మార్చాడు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
అవిశ్రాంత పోరాటయోధుడు జాదవ్
హైదరాబాద్: ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ అవిశ్రాంత పోరాటయోధుడని, ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం ఇక్కడ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆధ్వ ర్యంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన జాదవ్ సంస్మరణసభలో నాయిని మాట్లాడుతూ కేశవరావు జాదవ్ నిజమైన సోషలిస్టు నేత అని అన్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు 18 నెలలపాటు జైలు పాలయ్యారని, నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన నైజమన్నారు. జాదవ్ పేరిట ఫౌండేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నించాలని, అందుకు తనవంతు సహాయ సహకారం అందిస్తానని, నగరంలో ఆయన విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. రాజ్యసభసభ్యుడు కె. కేశవరావు మాట్లాడుతూ నక్సలైట్ల సమస్య పరిష్కారానికి చర్చలు జరపాలని కోరుకోవడంతోపాటు ప్రభుత్వంతో చర్చలక్రమంలో ముందు నిలిచారని గుర్తుచేశారు. ఆయన మానవ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారన్నారు. తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో కేశవరావు జాదవ్ పాత్ర ఎనలేనిదని అన్నారు. సోషలిజం ఎప్పటికీ అంతం కాదని, నిర్బంధం సమస్యలకు పరిష్కారం కాదని చెబుతుండేవారన్నారు. కార్యక్రమం లో జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, రచయిత వసంతా కన్నాభిరాన్, విరసం సభ్యురాలు రత్నమాల, నదీజలాల కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు ఎం.వేదకుమార్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, తెలంగాణ ప్రజాఫ్రంట్ నేత చిక్కుడు ప్రభాకర్, ప్రముఖ పాత్రికేయులు పాశం యాదగిరి, సీనియర్ న్యాయవాది జయవింధ్యాల, పీవోడబ్ల్యూ నాయకురాలు వి.సంధ్య, ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి అనురాధ, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, హనుమాండ్లుతోపాటు జాదవ్ సతీమణి ఇందిరా, కుమార్తెలు నివేదిత, నీలు, చెల్లెలు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభ పాల్గొన్నారు. -
క్షమాభిక్షపై తేలేవరకూ ఉరి తీయం
జాధవ్ వ్యవహారంపై పాక్ ఇస్లామాబాద్: భారత నావికా దళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్‌ను ఉరి తీస్తున్నారన్న వార్తలపై పాకిస్తాన్ స్పందించింది. జాధవ్ క్షమాభిక్ష అభ్యర్థనలపై నిర్ణయం తీసుకొనే వరకూ అతడిని ఉరితీసేది లేదని పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకీరియా గురువారం స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ అండతో అక్కడి మీడియా... అంతర్జాతీయ కోర్టులో కేసు గెలిచే లక్ష్యంతో పాక్‌పై దుష్ప్రచారం చేస్తోందన్నారు. అతడి క్షమాభిక్ష అభ్యర్థనలు ప్రస్తుతం పాక్ అధ్యక్షుడు, ఆర్మీ స్టాఫ్ చీఫ్ వద్ద పరిశీలనకు ఉన్నాయ న్నారు. వీటిపై నిర్ణయం తీసుకొనేవరకూ జాధవ్ జీవించే ఉంటాడన్నారు. దీనిపై అవగాహన లేకుండా ఇరుదేశాల ప్రజల ను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. -
పాక్ వాదన వీగిందిలా!
-
పాక్ వాదన వీగిందిలా!
‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఏప్రిల్ 24న ఆ ఒడంబడికపై భారత్, పాకిస్తాన్ సహా 48 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం అమలులోకి వచ్చింది. ఐసీజే పరిధిపై... ‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే... స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా... ⇒ సొంత దేశానికి చెందిన వ్యక్తులను కలుసుకోవడానికి దౌత్య సిబ్బందికి, తమ దేశ దౌత్యవేత్తలను సంప్రదించడానికి ఆ దేశంలోని విదేశీయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి. ⇒ ఏ దేశంలోనైనా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా... సదరు వ్యక్తి కోరుకుంటే తక్షణం ఈ సమాచారాన్ని అతని దేశ రాయబార కార్యాలయానికి చేరవేయాలి. ⇒ అరెస్టయిన వ్యక్తి రాయబార కార్యాలయానికి రాసే లేఖలను వెంటనే పంపాలి. అతినికున్న హక్కుల గురించి స్పష్టంగా చెప్పాలి. ⇒అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు. ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్ రెండో వాదన వీగిపోయింది. ఎందుకు కలవనివ్వట్లేదు? జాధవ్‌ను కలవడానికి అనుమతించాలని భారత్ ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పాక్ ఎందుకు ససేమిరా అంటోందంటే, అతనిపై విచారణ రహస్యంగా మిలటరీ కోర్టులో జరిగింది. జాధవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను పాక్ చూపడం లేదు. ఆయనతో బలవంతంగా ఒప్పించిన వీడియో మాత్రమే పాక్ వద్ద ఉంది. ఒకవేళ భారత దౌత్య సిబ్బంది జాధవ్‌ను కలిస్తే అసలు జరిగిందేమిటో ఆయన వివరిస్తాడు. పైగా దౌత్య సిబ్బంది అతనితో మాట్లాడితే న్యాయ సహాయమూ అందుతుంది. అందుకనే పాక్ భారత దౌత్య సిబ్బందికి జాదవ్‌ను కలిసే అవకాశమివ్వడం లేదు. -
శివసైనికుడి దారుణ హత్య
సాక్షి, ముంబై: మలాడ్‌లోని డోంగ్రీ పరిసరాల్లో మంగళవారం రాత్రి శివసేన గట్ ప్రముఖుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల కథనం ప్రకారం డోంగ్రీ ప్రాంతానికి చెందిన మహిళను ఈవ్‌టిజింగ్ చేసిన కొందరు ఆకతాయిలను నిలదీసేందుకు గట్ ప్రముఖుడు రమేశ్ జాదవ్ సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో వెళ్లాడు. అక్కడ ఆ యువకులు, జాదవ్ మధ్య వాగ్వాదం జరిగింది. కాగా, రాత్రి 10.30 గంటల ప్రాంతంలో సదరు యువకులు జాదవ్ ఇంటికి వచ్చి మళ్లీ గొడవ పడి పదునైన కత్తులతో దాడిచేయడంవల్ల ఆయన అక్కడే మరణించారు. ఈ విషయం తెలుసుకున్న వందలాది శివసైనికులు స్థానిక దిండోషి పోలీసు స్టేషన్‌కు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి, శివసేన ఎమ్మెల్యే సునీల్ ప్రభు తదితరులు సైతం అక్కడికి వచ్చి హంతకులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితులు అదుపుతప్పక ముందే నగర పోలీసు కమిషనర్ రాకేశ్ మారియా అక్కడికి చేరుకుని హంతకులను పట్టుకుంటామని సర్దిజెప్పడంతో ఆందోళనకారులు వెనుదిరిగారు. రంగంలోకి దిగిన పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా బుధవారం స్థానిక వ్యాపారులు బంద్ నిర్వహించారు. -
జాదవ్, ఖడీవాలే సెంచరీలు
జింఖానా, న్యూస్‌లైన్: హైదరాబాద్ బౌలర్లు పేలవ ప్రదర్శనతో తొలి రోజే ప్రత్యర్థికి దాసోహమన్నారు. ఫలితంగా మహారాష్ట్ర బ్యాట్స్‌మెన్ కేదార్ జాదవ్ (231 బంతుల్లో 175 బ్యాటింగ్; 24 ఫోర్లు, 1 సిక్స్), హర్షద్ ఖడీవాలే (194 బంతుల్లో 107; 15 ఫోర్లు, 1 సిక్స్) శతకాలతో చెలరేగారు. దాంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఒక దశలో 32 పరుగులకే మహారాష్ట్ర 2 వికెట్లు కోల్పోగా...జాదవ్, ఖడీవాలే మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. జాదవ్‌తో పాటు మొత్వాని (15 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నాడు. రవికిరణ్, షిండే చెరో 2 వికెట్లు పడగొట్టారు. టాస్ గెలిచిన మహారాష్ట్ర ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. రవికిరణ్ చక్కటి బౌలింగ్‌తో వరుసగా తన రెండు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టి హైదరాబాద్‌ను ఆనందంలో ముంచెత్తాడు. ఖురానా (19) ఎల్బీగా వెనుదిరగ్గా...ఫామ్‌లో ఉన్న విజయ్ జోల్ (4) ఖాద్రీకి క్యాచ్ ఇచ్చాడు. అయితే ఇక్కడి నుంచి మహారాష్ట్ర పుంజుకుంది. హైదరాబాద్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా జాదవ్, ఖడీవాలే ధాటిగా బ్యాటింగ్ చేశారు. చక్కటి షాట్లతో స్కోరుబోర్డును పరుగెత్తించారు. ఎనిమిది మంది హైదరాబాద్ బౌలర్లు ప్రయత్నించినా ఈ జోడి జోరును ఆపలేకపోయారు.