శివ్‌పురి (మధ్యప్రదేశ్): తలపాగా(టర్బన్) ధరించాడని ఎస్సీ వర్గానికి చెందిన ఓ బీఎస్పీ నేతపై గుజ్జర్ యువకులు దాడి చేసి తల చర్మాన్ని ఒలిచారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లాలో చోటు చేసుకుంది. శివ్‌పురిలోని మొహోబా గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ జాదవ్ (45) స్థానిక బీఎస్పీ నేతగా ఉన్నారు.
ఈ నెల 3న సర్దార్ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని అదే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు నిందితుల్లో ఒకరైన సురేంద్ర గుజ్జర్ ఇంటికి పిలిచారు. దీంతో అక్కడకు చేరుకున్న సర్దార్ సింగ్‌ను నిందితులు ఒక్కసారిగా దూషించటం ప్రారంభించారు. అనంతరం నిందితులు సర్దార్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు. సర్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని నర్వార్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ బదం సింగ్ యాదవ్ తెలిపారు.
కేసు దర్యాప్తులో ఉందని, అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌ను గ్వాలియర్‌లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా, టర్బన్ ధరించిన కారణంగానే జాదవ్‌పై గుజ్జర్ యువకులు దాడికి పాల్పడ్డారని జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు దయాశంకర్ గౌతమ్ ఆరోపించారు. జాదవ్ రోజూ నీలం రంగు తలపాగా ధరిస్తాడని, దీనిపై నిందితులు పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment