పాక్ వాదన వీగిందిలా!
‘‘జాధవ్ మరణశిక్షపై అప్పీలును విచారించే అధికారం అంతర్జాతీయ న్యాయస్థానానికి లేదు’’...‘‘గూఢచర్యం కింద అరెస్టైన వ్యక్తికి తన దేశ రాయబార కార్యాలయ సిబ్బందిని సంప్రదించే హక్కు ఉండదు’’...అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే)లో పాకిస్తాన్ వాదనల్లోని రెండు ప్రధానాంశాలివి. ఈ రెండింటినీ ఐసీజే తోసిపుచ్చింది. వివిధ దేశాల్లో దౌత్య కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందికి హక్కులు, దౌత్యపరమైన రక్షణలు ప్రపంచవ్యాప్తంగా ఏకరీతిన ఉండాలనే ఉద్దేశంతో వియన్నాలో 1963లో అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఏప్రిల్ 24న ఆ ఒడంబడికపై భారత్, పాకిస్తాన్ సహా 48 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమోదంతో 1967 మార్చి 19 నుంచి వియన్నా ఒప్పందం అమలులోకి వచ్చింది.
ఐసీజే పరిధిపై...
‘వియన్నా ఒప్పందాన్ని అమలు చేసే క్రమంలో ఏదైనా వివాదం వస్తే, అది తప్పనిసరిగా ఐసీజే పరిధిలోకే వస్తుంది. ఇరుపార్టీల్లో ఎవరైనా ఐసీజేను ఆశ్రయించవచ్చు’ అనేది ఒప్పందంలోని ఓ నిబంధన. దీని మూలంగానే పాక్ మొదటి వాదన వీగిపోయింది.
వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36 ఏంటంటే...
స్వదేశస్తులకు సంబంధించి దౌత్య సిబ్బంది తమ విధులను నిర్వర్తించడానికి వీలుగా...
⇒ సొంత దేశానికి చెందిన వ్యక్తులను కలుసుకోవడానికి దౌత్య సిబ్బందికి, తమ దేశ దౌత్యవేత్తలను సంప్రదించడానికి ఆ దేశంలోని విదేశీయులకు పూర్తి స్వేచ్ఛ ఉండాలి.
⇒ ఏ దేశంలోనైనా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నా, అరెస్టు చేసినా... సదరు వ్యక్తి కోరుకుంటే తక్షణం ఈ సమాచారాన్ని అతని దేశ రాయబార కార్యాలయానికి చేరవేయాలి.
⇒ అరెస్టయిన వ్యక్తి రాయబార కార్యాలయానికి రాసే లేఖలను వెంటనే పంపాలి. అతినికున్న హక్కుల గురించి స్పష్టంగా చెప్పాలి.
⇒అరెస్టయిన తమ దేశస్తుడిని జైలులో కలుసుకొనే, మాట్లాడే హక్కు దౌత్య సిబ్బందికి ఉంటుంది. అతనితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ న్యాయ సహాయాన్ని కూడా అందించవచ్చు.
ఎవరైనా వ్యక్తి ఫలానా నేరాల కింద అరెస్టయితే... ఆ దేశ దౌత్య సిబ్బందికి పై హక్కులు ఉండవని ఎక్కడా పేర్కొనలేదు. అందుకే గూఢచర్యం కింద అరెస్టయితే దౌత్య సిబ్బందికి హక్కులుండవనే పాక్ రెండో వాదన వీగిపోయింది.
ఎందుకు కలవనివ్వట్లేదు?
జాధవ్‌ను కలవడానికి అనుమతించాలని భారత్ ఎంత గట్టిగా డిమాండ్ చేసినా పాక్ ఎందుకు ససేమిరా అంటోందంటే, అతనిపై విచారణ రహస్యంగా మిలటరీ కోర్టులో జరిగింది. జాధవ్ గూఢచర్యానికి పాల్పడ్డాడని నిరూపించే ఆధారాలను పాక్ చూపడం లేదు. ఆయనతో బలవంతంగా ఒప్పించిన వీడియో మాత్రమే పాక్ వద్ద ఉంది. ఒకవేళ భారత దౌత్య సిబ్బంది జాధవ్‌ను కలిస్తే అసలు జరిగిందేమిటో ఆయన వివరిస్తాడు. పైగా దౌత్య సిబ్బంది అతనితో మాట్లాడితే న్యాయ సహాయమూ అందుతుంది. అందుకనే పాక్ భారత దౌత్య సిబ్బందికి జాదవ్‌ను కలిసే అవకాశమివ్వడం లేదు.