పాక్‌, ఇరాన్‌ దోస్తీ ఎందుకు చెడింది? భారత్‌కు ఏం దక్కింది? | How Pakistan and Iran Relations Deteriorate | Sakshi
Sakshi News home page

Pakistan and Iran Relations: పాక్‌, ఇరాన్‌ దోస్తీ ఎందుకు చెడింది? భారత్‌కు ఏం దక్కింది?

Published Tue, Jan 30 2024 8:02 AM | Last Updated on Tue, Jan 30 2024 10:26 AM

How Pakistan and Iran Relations Deteriorate - Sakshi

పాకిస్తాన్‌, ఇరాన్‌లు స్నేహపూర్వక సంబంధాలు కలిగిన దేశాలు. ఈ రెండూ ముస్లిం దేశాలు కావడంతో ఈ సంబంధం మరింత బలపడింది. 1965, 71లో భారత్‌-పాక్‌ యుద్ధ సమయంలో ఇరాన్‌.. పాకిస్తాన్‌కు పూర్తి సాయం అందించింది. పలు అంతర్జాతీయ ఫోరమ్‌లలో కూడా, ఇరాన్.. భారత్‌ను వ్యతిరేకించి, పాకిస్తాన్‌కు మద్దతునిచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారడానికి కారణం ఏమిటి? పాకిస్తాన్‌పై ఇరాన్ వైమానిక దాడి నేపధ్యంలో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు బలహీనపడటానికి కారణమేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అదే సమయంలో పాకిస్తాన్‌కు మిత్రదేశంగా ఉన్న ఇరాన్.. భారత్‌తో ఎందుకు సన్నిహితంగా మెలగడం ప్రారంభించింది?

1979లో ఇరాన్‌లో ఇస్లామిక్‌ విప్లవం జరిగినప్పుడు పాకిస్తాన్‌, ఇరాన్‌ల మధ్య స్నేహంలో చీలిక ఏర్పడింది. దీని తరువాత ఆఫ్ఘన్ జిహాద్ సమయంలో పాకిస్తాన్ సౌదీ ప్రేరణతో వహాబీ ఇస్లాం వైపు మొగ్గు చూపింది. ఇక్కడి నుంచే ఇరు దేశాల మధ్య అపార్థాలు పెరగడం మొదలైంది. పాకిస్తాన్ జనాభాలో అధికశాతంలో సున్నీ ముస్లింలు ఉన్నారు. ఇరాన్‌లో షియా ముస్లింల సంఖ్య అధికంగా ఉంది. షియా.. సున్నీ గ్రూపులు రెండూ ముస్లిం మతానికే చెందినవైనప్పటికీ వారి నమ్మకాలు, సిద్ధాంతాలలో తేడా ఉంది. సాధారణంగా సున్నీలను ఫండమెంటలిస్టులుగా పరిగణిస్తారు. షియా ముస్లింలను మితవాదులని అంటారు. కొన్ని శతాబ్దాల క్రితం ఇస్లాం స్థాపకుడు ప్రవక్త మహమ్మద్‌ను షియా ముస్లింలు హత్య చేసిన దరిమిలా షియా.. సున్నీ ముస్లింల మధ్య వివాదం మొదలైంది. 

విభజన సమయంలో..
1947 ఆగస్టు 14న భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు, పాకిస్తాన్‌ను ఒక దేశంగా గుర్తించిన మొదటి దేశం ఇరాన్. ఈ రెండు దేశాలు భౌగోళికంగా దగ్గరి అనుసంధానంతో 990 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. 1947 తరువాత ఇరాన్, పాకిస్తాన్ మధ్య పలు స్నేహపూర్వక ఒప్పందాలు కుదిరాయి. ఇరాన్‌లో పాకిస్తాన్‌ తన తొలి రాయబార కార్యాలయాన్ని కూడా ప్రారంభించింది.

భారత్‌- పాక్‌ యుద్ధ సమయంలో..
1965లో భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరాన్‌ అనేక బాంబర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, యుద్ధ సామగ్రిని పాకిస్తాన్‌కు అందించింది. ఈ ఉదంతాన్ని చూస్తే  పాకిస్తాన్‌, ఇరాన్ మధ్య స్నేహాన్ని అంచనా వేయవచ్చు. అదేవిధంగా 1971లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు పూర్తిస్థాయిలో దౌత్య, సైనిక మద్దతు ఇచ్చింది. అంతే కాదు బలూచ్‌లు పాకిస్తాన్‌పై తిరుగుబాటును ప్రారంభించినప్పుడు, బలూచ్‌ల నిరసనను అణచివేయడంలో ఇరాన్.. పాకిస్తాన్‌కు సహాయం చేసింది. ప్రతిఫలంగా పాకిస్తాన్ అణు శాస్త్రవేత్తలు ఇరాన్‌లో అణు కార్యక్రమాలను అభివృద్ధి చేయడంలో సహకరించారు.

షియా, సున్నీల అంతర్గత పోరు
1990వ దశకంలో పాకిస్తాన్‌లో షియా, సున్నీల మధ్య అంతర్గత పోరు ఊపందుకున్నప్పుడు, ఇరాన్ షియాలను రెచ్చగొడుతోందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మొదలైంది. దీనికితోడు లాహోర్‌లో ఇరాన్ దౌత్యవేత్త సాదిక్ గంజి హత్య, 1990లో పాకిస్తాన్-ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ క్యాడెట్‌లను దారుణంగా హతమార్చడం వంటివి ఇరు దేశాల మధ్య శత్రుత్వాన్ని మరింత  పెంచాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో పాకిస్తాన్, ఇరాన్‌ల వైరుధ్య విధానాలు కూడా ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వానికి కారణంగా నిలిచాయి. పాకిస్తాన్ నిరంతరం తాలిబాన్‌కు మద్దతు పలుకుతుంటుంది. ఈ నేపధ్యంలో ఇరాన్‌.. పాకిస్తాన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 2014లో ఐదుగురు ఇరాన్ సైనికులను పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఉల్-అద్ల్ కిడ్నాప్ చేసింది. ఆ తర్వాత ఇరాన్.. పాక్‌పై సైనిక చర్యలు చేపడతామని హెచ్చరించింది. 

ఉద్రిక్తంగా పాక్‌- ఇరాన్‌ సంబంధం
నిపుణుల అభిప్రాయం ప్రకారం 2021 నుండి పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పలు ఒప్పందాలు, సంయుక్త సైనిక విన్యాసాలపై సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యం కూడా పెరగడం ప్రారంభమైంది. దీనికితోడు ఈ రెండు దేశాలు విద్యుత్ పంపిణీ లైన్‌ను ప్రారంభించాయి. 2023లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఇరాన్‌లో పర్యటించారు. దీంతో ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. అయితే పాకిస్తాన్‌ మాత్రం ఉగ్రవాదులపై పట్టు బిగించలేకపోయింది. అయితే ఇటీవల ఇరాన్‌లో జరిగిన ఉగ్రదాడిలో పాక్‌ ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపధ్యంలో పాకిస్తాన్‌పై ఇరాన్ ఆకస్మిక దాడి చేసింది. దీంతో పాకిస్తాన్-ఇరాన్ సంబంధాలు తిరిగి ఉద్రిక్తంగా మారాయి.

బలపడిన భారత్‌- ఇరాన్‌ బంధం
పాకిస్తాన్, ఇరాన్‌ మధ్య సంబంధాలు క్షీణించిన తరువాత, భారత్‌, ఇరాన్ మధ్య సంబంధాలు కొత్త మలుపు తిరిగాయి. 2001లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇరాన్‌లో పర్యటించి, పలు కీలక ఒప్పందాలు చేసుకున్న దరిమిలా భారత్-ఇరాన్ సంబంధాలు మరింత బలపడ్డాయి. అటల్‌ తరహాలోనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా 2016లో ఇరాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో 12కి పైగా కీలక ఒప్పందాలు కుదిరాయి. ఆ తర్వాత 2018లో అప్పటి ఇరాన్‌ అధ్యక్షుడు రౌహానీ భారత్‌కు వచ్చారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలో ధృడత్వం ఏర్పడింది. 2022 సంవత్సరంలో మొదటిసారిగా సమర్‌కండ్‌లో ప్రధాని మోదీ..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కలుసుకున్నప్పుడు భారత్‌-ఇరాన్ సంబంధాల బలోపేతాన్ని అన్ని దేశాలు చూశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement