కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి
త్రికాలమ్
ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ విద్యావంతుల వేదిక వంటి ఒక బలమైన సంస్థ అవసరం.
అధికారంలో ఉన్నవారిని సహజంగానే అంధకారం ఆవరిస్తుంది. బధిరత్వం ఆవహిస్తుంది. అప్రియమైనవి కనిపించవు. వినిపించవు. స్వీయానురాగం శ్రుతిమించు తుంది. రాచరికమైనా, నియంతృత్వమైనా, ప్రజాస్వా మ్యమైనా ఈ ప్రమాదం అనివార్యం. అధికారం లక్షణం అది. తెలివైన పాలకులు ఈ ప్రమాదంలో పడకుండా తమను తాము కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తారు. క్షేత్రవాస్తవికతను తెలుసుకునేందుకు రాజులు మారు వేషాలలో సంచరించేవారు. ఆధునిక యుగంలో పాలకులు వేగులమీదనో, పార్టీ కార్యకర్తలమీదనో, మీడియామీదనో ఆధారపడ తారు. నిజాలు చేదుగా ఉన్నప్పటికీ సహిస్తారు. తెలివిలేనివారు వాస్తవాలు తెలుసుకోవడానికి నిరాకరిస్తూ ఊహాలోకంలోనే విహరించాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి ఎన్నికలలో గెలుపొంది అధికారంలోకి వచ్చిన పార్టీకీ, పార్టీ అధినేతకూ తిరిగి ఎన్నికలు జరిగే వరకూ అపరిమితమైన స్వేచ్ఛ. రాజ్యాంగం నిర్దేశిస్తున్నది కనుక మంత్రివర్గం నిర్మించాలి. శాసనసభ సమావేశాలు నిర్వహించాలి. మంత్రివర్గంలోనూ, శాసనసభలోనూ తమ మాటకు ఎదురు లేకుండా నయానో భయానో చేసుకోగలిగితే పాలకుల పని నల్లేరుమీద బండి చందమే.
తెలంగాణ విద్యావంతుల వేదిక (తెవివే) ఐదవ మహాసభలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శనరెడ్డి చెప్పినట్టు రాజ్యాంగం ఏ ప్రభుత్వానికీ అధికారాలు ఇవ్వలేదు. అధికారాలు ప్రజలకు ఇచ్చింది. ప్రభుత్వాలకు కేవలం బాధ్యతలు అప్పగించింది. ప్రశ్నించే హక్కు ప్రతిపౌరుడికీ ఇచ్చింది. అభివృద్ధి చెందడానికి ఎటువంటి నమూనాను అనుసరించాలో, జాతీయ వనరులను ఏ విధంగా వినియోగించుకోవాలో కూడా రాజ్యాంగం స్పష్టం చేసింది. ఈ వాస్తవం సాధారణ ప్రజలకు పెద్దగా తెలియదు కనుక వారి తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించవలసిన బాధ్యతను మేధావులు నిర్వహించాలి.
ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకే పదేళ్ళ కిందట ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విద్యావంతుల వేదికను నెలకొల్పారు. ముందు తెలంగాణ మేధావుల వేదిక అని పేరు పెట్టాలని కొందరు అన్నప్పుడు మేధావులు అనడంలో స్వాతిశయం ధ్వనిస్తుందంటూ విద్యావంతుల వేదికగా జయశంకర్ మార్పించారు. తెలంగాణ ఉద్యమానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఉద్యమం అహింసాత్మకంగా జరగడానికీ, ఉద్యమలక్ష్యాల గురించి ప్రజలలో అవగాహన పెంపొందించడానికీ ఆయన అహరహం కృషి చేశారు. ఇటువంటి వేదిక ఇన్ని సంవత్సరాలు ప్రయోజనకరమైన పాత్ర పోషించడం విశేషమని మహాసభను ప్రారంభించిన స్వామి అగ్నివేశ్ ప్రశంసించారు. ఇటువంటి సంస్థలు అన్ని రాష్ట్రాలలోనూ నెలకొల్పాలని ప్రతిపాదించారు.
జయశంకర్ అనంతరం ఈ వేదికకు అధ్యక్షులుగా పని చేసిన ప్రొఫెసర్ కోదండరాం, మల్లెపల్లి లక్ష్మయ్య ప్రజాస్వామ్య సంప్రదాయాలనూ, ఉద్యమ స్ఫూర్తినీ, నైతిక విలువలనూ కొనసాగించి తెలంగాణ సమాజానికి మార్గదర్శనం సమర్థంగా చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి సంకోచించబోమనీ, ప్రజల పక్షానే కొనసాగుతామనీ, ప్రజలతోనే కలసి నడుస్తామనీ ఈ సందర్భంగా తెవివే నాయకత్వం పునరుద్ఘాటించింది. ప్రత్యేక రాష్ట్రంకోసం పుష్కరంపాటు ఉద్యమం చేసి లక్ష్యం సాధించిన తర్వాత ఎన్నికలలోనూ విజయం సాధించి 29వ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేపట్టిన మంచి పనులను ప్రోత్సహించాలనీ, ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకించాలనీ నిర్ణయం. చెరువుల పునరుద్ధరణ, అన్ని గ్రామాలకూ తాగు నీరు సరఫరాకు వాటర్‌గ్రిడ్ వ్యవస్థ నిర్మాణం, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్ ప్లాన్ చట్టం అమలు చేయాలన్న సంకల్పం, దళితులకు మూడెకరాలకు తగ్గకుండా వ్యవసాయ భూమి ఇవ్వాలన్న నిర్ణయం, రెండు పడగ్గదులున్న ఇళ్ళను పేదవారికి కట్టించి ఇవ్వాలన్న ఆలోచన స్వాగతించదగినవే. వాటిని అమలు చేసే క్రమంలో తెవివే సంపూర్ణ సహకారం అదించాలి. ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఫిలింసిటీ నిర్మించడం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయా అంటూ అగ్నివేశ్ ప్రశ్నించడం ఈ ధోరణిలోనే.
నవ తెలంగాణలో తెవివే కీలకపాత్ర
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో తెవివే ముఖ్యమైన పాత్ర పోషించింది. తెవివే నాయకత్వం, టీజాక్ నాయకత్వం దాదాపుగా ఒక్కటే. రెండు నాయకత్వాలకు స్ఫూర్తి ప్రొఫెసర్ జయశంకర్‌దే. ఇటువంటి పౌరసంస్థ ఆవశ్యకత ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత మరింత పెరిగింది. నవతెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి నమూనాను జాగ్రత్తగా పరిశీలించి ఆమోదించ వలసిన అవసరం ఉంది. కీలకమైన ఈ పాత్ర పోషించడానికి తెవివే నాయకత్వం సమాయత్తం కావాలి. ప్రజల పక్షాన నిలిచి పాలకులతో కరచాలనానికీ, అవసరమైతే పాలకులపై కరవాలచాలనానికీ సిద్ధం కావాలి. కరచాలనమా, కరవాలచాలనమా అన్నది ప్రజల ప్రయోజనాలపైనా, వాటి పట్ల ప్రభుత్వ వైఖరిపైనా ఆధారపడి ఉండాలి. వ్యక్తుల ప్రయోజనాలపైన కాదు.
దేశంలోని తక్కిన రాష్ట్రాలలో కూడా ఇటువంటి వ్యవస్థను నెలకొల్పడం అవసరమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం అత్యవసరం. రాష్ట్ర మంత్రివర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎదురు చెప్పేవారు ఎవ్వరూ లేరు. రాజధాని నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాలను మంత్రివర్గం వివరంగా చర్చించిన దాఖలా లేదు. శాసనసభలోనూ చర్చ జరగడం లేదు. పైగా ‘ప్రతిపక్షమే లేదు మనమే జాగ్రత్తగా చూసుకోవాలి’ అంటూ తెలుగుదేశం పార్టీ బాధ్యులకు ముఖ్యమంత్రి ఉద్బోధిస్తున్నారు. అంటే ప్రతిపక్షం మాట వినే పనిలేదు. స్వపక్షంలో ఎదురు చెప్పే వారు లేరు. ముఖ్యమంత్రికి ఎంతటి తెలివితేటలు ఉన్నా చర్చ లేకుండా తమ నిర్ణయాలను అమలు చేసినప్పుడు పొరబాట్లు జరిగే అవకాశం ఉంటుంది. పొరబాటు జరిగినట్టు గ్రహించేందుకు మార్గం ఏదైనా ఉండాలి. లేకపోతే తప్పుదారిలోనే ప్రయాణం సాగుతుంది. రాజధాని నిర్మాణంకోసం వేల ఎకరాల భూమిని సేకరించి, దానిలో కొంతభాగం సింగపూర్ ప్రభుత్వానికో, ఆ ప్రభుత్వం నియమించిన కొర్పొరేట్ సంస్థలకో అప్పగించి, రాజధానికి అవసరమైన భవనాలనూ, ఇతర సదుపాయాలనూ నిర్మించాలన్నది ముఖ్యమంత్రి వ్యూహంలాగా కనిపిస్తున్నది. ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. కేంద్ర ప్రభుత్వం 50 వేల ఎకరాల భూమి కొనుగోలుకు అవసరమైన సొమ్ము ఇవ్వజాలదు. అందుకని ఉత్తరోత్తరా అభివృద్ధి చేసిన భూములు ఇస్తామనీ, ఎకరానికి మూడు కోట్లు వచ్చేవిధంగా చేస్తామనీ చెప్పి రైతులను నమ్మించి భూములు సమీకరించేందుకు ప్రయత్నం జరుగుతోంది. అధికారం ఉన్నది కాబట్టి భూసేకరణలో విజయం సాధించినప్పటికీ రాజధాని నిర్మాణం సింగపూర్ ప్రభుత్వానికి అప్పగించడంలో ఔచిత్యం ఏమిటో, ఇందుకు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసిన ఆవశ్యకత ఏమిటో. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్‌షిప్(పీపీపీ) పేరుమీద మన దేశంలో ఉన్న కార్పొరేట్ సంస్థలను కాదని విదేశాలలోని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం వెనుక వ్యూహం ఏమిటో కృష్ణా, గుంటూరు జిల్లా ప్రజలకు తెలియదు.
తుళ్లూరు గ్రామం (ఫైల్ ఫొటో)
రాయలసీమ మౌనంగా ఉంటుందా?
‘అభివృద్ధి’ అంతా తుళ్ళూరు చుట్టుపక్కలే కేంద్రీకృతం అవుతే రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల ప్రజల మనోభావాలు ఎట్లా ఉంటాయో అంచనా వేసే ప్రయత్నం జరగడం లేదు. ఉపముఖ్యమంత్రి కే ఇ కృష్ణమూర్తి మౌనంగా ఉన్నంత మాత్రాన రాయలసీమ అంతా మౌనంగా ఉంటుందని అనుకోవడం పొరబాటు. విశాఖపట్టణం అభివృద్ధి ఉత్తరాంధ్రకు ఊరట కలిగిస్తుందేమో కానీ అటువంటి అవకాశం రాయలసీమకు లేదు. అభివృద్ధిని వికేంద్రీకరించాలంటూ శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫార్సులను తుంగలో తొక్కి తనకు తోచిన విధంగా, తన స్వప్న సాకారం కోసం, గొప్ప రాజధాని నిర్మించారనే ఖ్యాతి గడించడంకోసం ఇంత హంగామా చేయాలా? స్వీయ, సన్నిహితుల ప్రయోజనాల గురించి ప్రస్తావించడం లేదు. రాజధాని నిర్మాణం కానీ, బాక్సైట్ ఖనిజం తవ్వకాలు కానీ, ఇతర ‘అభివృద్ధి’ కార్యక్రమాలు కానీ చర్చ లేకుండా, సమీక్ష లేకుండా అమలు జరిగితే అందమైన, ఖరీదైన రాజధాని నిర్మాణం జరగవచ్చు, ఆర్థికాభివృద్ధి కూడా సాధ్యం కావచ్చు. కానీ ఈ క్రమంలో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ప్రభుత్వం ఆడుతున్న జూదం ప్రజల జీవితాలను ఛిద్రం చేసే ప్రమాదం ఉన్నది. ఈ హెచ్చరిక చేయడానికీ, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలలోని లోపాలను ఎత్తి చూపించడానికీ, ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికీ, నిలదీయడానికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెవివే వంటి ఒక బలమైన సంస్థ అవసరం. రాష్ట్రంలో విద్యావంతులకు కొదవ లేదు. బ్రిటిష్ పాలన కారణంగా స్వాతంత్య సిద్ధికి పూర్వమే అనేక తరాల విద్యావంతులు ఉన్న ప్రాంతం అది. త్యాగ నిరతికి కొదవ లేదు. తెలివితేటలు అపారం. వారిని ఒక వేదికపైకి తెచ్చి సామూహిక శక్తిని ఆవిష్కరించే ప్రయత్నం ఇంతవరకూ ఏ కారణంగానో జరగలేదు. ఆంధ్ర మేధావుల వేదిక పేరుతో వెలసిన సంస్థలకు తెవివేకి ఉన్నటువంటి విస్తృత ప్రజామోదం లేదు. పోరాట స్వభావం లేదు. ఇఎఎస్ శర్మ, రాణిశర్మ, కృష్ణ వంటి సామాజిక ఉద్యమకారులు పర్యావరణ పరిరక్షణకూ, హానికరమైన అభివృద్ధి నమూనాలను వ్యతిరేకించేందుకూ అంకిత భావంతో చాలా గొప్ప కృషి చేస్తున్నారు. వారి వ్యాప్తి పరిమితమైనది. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి ప్రతినిధులను ఒకే తాటిమీదికి తీసుకొని వచ్చి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం ఎట్లా జరగాలో సమాలోచన జరపవలసిన అవసరం ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడానికి ముందే కొత్త రాష్ట్రం వివిధ రంగాలలో ప్రగతి సాధించాలంటే ఎటువంటి విధానాలు అమలు చేయాలో సూచించేందుకు తెవివే నాగార్జునసాగర్‌లో రెండు రోజుల మేధోమథనం నిర్వహించింది. పుస్తకం ప్రచురించింది. అటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యావంతులు చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రభుత్వానికి అడ్డుపడటంకోసం కాదు ప్రభుత్వానికి వాస్తవాలు తెలియజెప్పడానికీ, ప్రజల ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇటువంటి వేదిక ఒకటి ఆంధ్రప్రదేశ్‌లో తక్షణావసరం.
murthykondubhatla@gmail.com