పూటకో మాట.. రోజుకో బాట! | K Ramachandra Murthy Article On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

పూటకో మాట.. రోజుకో బాట!

Published Sun, Jan 20 2019 12:36 AM | Last Updated on Sun, Jan 20 2019 12:36 AM

K Ramachandra Murthy Article On Chandrababu Naidu - Sakshi

‘అసూయాపరులంతా ఒక్కటై రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. గద్దల్లా వాలు తున్నారు. అవినీతి గొంగళిపురుగును కేసీఆర్‌ కౌగలించుకున్నారు.’ ఇవి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నోటినుంచి వెలువడిన మాటలు. ఎవరు అసూయపడుతున్నారు చంద్రబాబు నాయుడిని చూసి? నరేంద్రమోదీనా? కల్వకుంట్ల చంద్రశేఖరరావా (కేసీఆర్‌)? వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డా? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పన్నెండు సంవత్స రాలూ, సువిశాల దేశానికి ప్రధానిగా సుమారు అయిదేళ్ళూ పని చేసిన రాజకీయ నాయకుడు మోదీ. చంద్రబాబును చూసి ఆయన ఎందుకు ఈర్ష్య పడాలి? 2019 ఎన్నికలలో బీజేపీకి ఎన్ని స్థానాలు దక్కుతాయో, మోదీ మళ్ళీ ప్రధానిగా ప్రమాణం చేస్తారో లేదో  తెలియదు. కానీ ఇప్పటికీ దేశంలో అత్యంత ప్రాబల్యం కలిగిన నేత మోదీ అని ఆయన ప్రత్యర్థులు సైతం అంగీకరిస్తారు. తమ కంటే గొప్ప భాషాపరిజ్ఞానం కలిగిన వక్త చంద్రబాబును చూసి మోదీ, కేసీఆర్‌ అసూయ చెందుతున్నారా? ఆయన తమ కంటే సమర్థ పాలకుడనీ, పరిపాలనా దక్షుడనీ మోదీ, కేసీఆర్‌ అసూయతో రగిలిపోతున్నారా? తమ కంటే ఎక్కువ విశ్వనీయత ఉన్నదనీ, ప్రజాదరణ ఉన్నదనీ మోదీ,  కేసీఆర్, జగన్‌మోహన్‌రెడ్డీ ఈర్ష్యతో కుమిలిపోతున్నారా? జీవితంలో పొత్తులు లేకుండా ఒక్కసారి కూడా ఎన్నికలలో పోటీ చేయలేని టీడీపీ అధినేతను చూసి ఒంటరిగా పోరాడి కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ కూటమిపైన ఇటీవలనే ఘనవిజయం సాధించిన  కేసీఆర్‌ ఉడుక్కుంటారా?

ఎవరు గద్దలో, ఎవరు సింహాలో ప్రజలకు తెలి యదా? జగన్‌మోహన్‌రెడ్డిపైన కేసులు ఎవరు పెట్టించారో, కాంగ్రెస్‌ నాయకుడు శంకరరావు వేసిన పిటిషన్‌లో ఎర్రన్నాయుడు ఎట్లా ఇంప్లీడ్‌ అయ్యారో ఎవరికి తెలియదు? అది బహిరంగ రహస్యం కాదా?  సోనియాగాంధీ, చిదంబరంలతో చేతులు కలిపి బూటకపు కేసులు పెట్టించిన సంగతీ, జైలులో పెట్టించి బెయిల్‌ రాకుండా 16 మాసాలు మేనేజ్‌ చేసిన విషయం ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పక్క రలేదు. ఎవరు అవినీతి గొంగళి పురుగు? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 1984 నుంచి 1995 వరకూ ఎన్‌టీఆర్‌ ‘నమ్మిన’ బంటుగా పనిచేసిన చంద్ర బాబుకి అవినీతికి ఒడిగట్టే అవకాశం ఉన్నదా లేక ఒక్కరోజైనా అధికారంలో లేకుండా, తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో హైదరా బాద్‌కు రాకుండా బెంగుళూరులోనే తన మానాన తాను వ్యాపారం చేసుకుంటూ ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి అవకాశం ఉన్నదా? గుజరాత్, కర్ణాటక, రాజస్థా¯Œ , మధ్యప్రదేశ్, తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్‌కి ఆర్థిక సహాయం చేయడానికి బాబుకు అన్ని వందల కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయో ప్రజలు ఊహించు కోలేరా? ఇవన్నీ అసహ్యించుకోవలసిన పనులే కానీ అసూయపడవలసిన ఘన కార్యాలైతే కాదు కదా! సంపద తప్ప ఏమున్నది చంద్రబాబు దగ్గర ఇతరులు ఈర్ష్యపడేందుకు?

స్వవచోవ్యాఘాతాలు
లెక్కలేనన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలూ, స్వవచోవ్యాఘాతాలూ, అస త్యాలూ దేశంలో మరే ఇతర రాజకీయ నాయకుడి నోటి నుంచైనా వచ్చాయా? గతంలో కానీ వర్తమానంలో కానీ ఇన్ని యూ–టర్న్‌లు తీసుకున్న మరో రాజ కీయ నాయకుడు దేశ చరిత్రలో ఉన్నాడా? 1995 ఆగస్టులో వైస్రాయ్‌ డ్రామా జరి గినప్పుడు టీవీలు లేవు. ఉన్న నాలుగు పత్రికలూ చంద్రబాబు చెప్పుచేతలలో ఉండేవి. ఎన్‌టిఆర్‌కు అనుకూలమైన వార్తలు, వ్యాఖ్యలు పత్రికలలో కానీ రేడి యోలో కానీ వచ్చేవి కావు. అందుకనే సింహంలాంటి ఎన్టీఆర్‌ని బోనులో పెట్ట గలిగారు. ఇప్పుడు ఆ ఆట సాగదు. అబద్ధాలు అతకవు. మీడియాలో బహు ళత్వం ఉన్నది. నాణేనికి రెండో పార్శ్వం చూపించే పత్రికలూ, చానళ్ళూ ఉన్నాయి. టీవీలు వచ్చిన తర్వాత నేతలు మాట్లాడిన ప్రతి అక్షరం రికార్డు అవు తుంది. ఆ రికార్డులు న్యూస్‌చానళ్ళ లైబ్రరీలలో భద్రంగా ఉంటాయి. టీవీ తెర మీద ముఖకవళికలను కూడా వీక్షకులకు గమనిస్తారు. ఎవరు నిజం చెబుతు న్నారో, ఎవరు బొంకుతున్నారో ఇట్టే పసిగట్టగలుగుతారు.  చంద్రబాబు ఈ రోజు ఏమి మాట్లాడినా అందుకు విరుద్ధంగా గత నాలుగు సంవత్సరాల ఎని మిది మాసాలలోనే మాట్లాడి ఉంటారు.

టీడీపీలో అధ్యక్షులవారే అందరికంటే  ఎక్కువ మాట్లాడతారు. జన్మభూమి కమిటీల నుంచి ఐక్యరాజ్య సమితి వరకూ అన్ని విషయాలపైనా శ్రీవారే వ్యాఖ్యానిస్తారు. నిర్ణయాలు అప్పటికప్పుడే, అక్క డికక్కడే ప్రకటించేస్తారు. వ్యూహరచన చేస్తారు. ఎత్తుగడలు వేస్తారు. తక్కిన వారంతా ఆయన చెప్పినట్టు చేయవలసిందే. అందుకని ప్రతి పరిణామం పైనా చంద్రబాబు ‘బైట్‌’ ప్రతి టీవీ న్యూస్‌చానల్‌లోనూ ఉంటుంది. యజమానులకు ఇష్టం లేకపోతే చంద్రబాబుకి  ఇబ్బంది కలిగించే సన్నివేశాలు చూపించరు. అది వేరే విషయం. చూపించాలని అనుకున్న చానళ్ళ దగ్గర బోలెడు సామగ్రి ఉంటుంది. తాజాగా చంద్రబాబు నిగ్రహం కోల్పోవడానికి దారి తీసిన పరిణామం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌)కలుసుకొని ఫెడరల్‌ ఫ్రంట్‌ నిర్మాణం గురించి ప్రాథమిక చర్చలు జరపడం. దీనికి చంద్రబాబు వక్రభాష్యాలు చెప్పారు. రాష్ట్ర ద్రోహులు  కుట్ర చేస్తున్నారంటూ నిందించారు. గద్దల్లా వాలుతు న్నారన్నది ఈ సందర్భంలోనే. ఈ విమర్శలకు సమాధానంగా ఆయన చర్యలను గుర్తు చేస్తే చాలు.

నానారాష్ట్ర సందర్శనం
ఆంధ్రప్రదేశ్‌లో కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రత్యేక విమానంలో కోల్‌ కతా, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ వెళ్లి బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ప్రయ త్నాలు చేయడం గుర్తు చేయవచ్చు. ఆ పర్యటనలో చంద్రబాబు పోలవరం నిర్మా ణాన్ని గట్టిగా ప్రతిఘటిస్తున్న ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలుసు కున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదాను వ్యతిరేకిస్తున్న స్టాలిన్‌ నివాసానికి వెళ్ళి చర్చలు జరిపారు. రాహుల్‌గాంధీ నివాసానికి వెళ్ళి ఆయనతో కరచాలనం చేసినప్పుడు రాహుల్‌ని ‘పప్పు’ అంటూ అవహేళన చేయడం, సోనియాను ఇటలీ రాక్షసి అంటూ నిందించడం  చూపించవచ్చు. కేటీఆర్‌–జగన్‌మోహన్‌ రెడ్డిల భేటీని ఆక్షేపించినప్పుడు కేసీఆర్‌ని చంద్రబాబు కౌగలించుకున్న దృశ్యం, తెలంగాణ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానిం చినప్పటి సన్నివేశం, హరికృష్ణ పార్థివదేహం ఉండగానే తెలంగాణ ఎన్నికలలో పొత్తు గురించి కేటీఆర్‌తో ప్రస్తావించిన వైనం సచిత్రంగా గుర్తు చేయవచ్చు. 2009 ఎన్నికలతో టీఆర్‌ఎస్‌తో కలసి మహాకూటమి నిర్మించడం, ఎన్నికలలో ఓడిపోగానే కేసీఆర్‌ని తూలనాడటం గురించి చెప్పవచ్చు.

అంతకు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు అభ్యంతరం లేదంటూ అనుచరుల కమిటీతో చెప్పించి, ఆ మేరకు టీడీపీ పొలిట్‌బ్యూరో చేత తీర్మానం చేయించి, ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖ రాసిన సంగతి దృశ్యసహితంగా చెప్పవచ్చు. పరిటాల సునీత కుమారుడి వివాహానికి కేసీఆర్‌ హాజరైనప్పుడు ఆయనకు స్వాగతం చెప్పిన తెలుగు తమ్ముళ్ళ ఆనందోత్సాహాలను ప్రస్తావిం చవచ్చు. మోదీతో కుమ్మక్కు అయ్యారని విమర్శిస్తే, మోదీకి తిరుపతి లడ్టూల సంచీ అందిస్తూ అతివినయం ప్రదర్శించిన చంద్రబాబు దృశ్యం ఎన్ని విడత లైనా ప్రదర్శించవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా గురించి మాట్లాడితే ప్రతి పక్ష నాయకుడు నాలుగున్నరేళ్ళుగా చేసిన పోరాటాల వివరాలు చెప్పవచ్చు.  ప్రత్యేకప్యాకేజీ ఇచ్చినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి అర్ధరాత్రి మీడియా సమావేశం పెట్టి ధన్యవాదాలు చెప్పడం, ఎన్‌డీఏ ప్రభుత్వానికి ధన్య వాదాలు చెబుతూ అసెంబ్లీతో తీర్మానం చేయించడం, ప్యాకేజీ ఇప్పించినందుకు వెంకయ్యనాయుడినీ, ఇచ్చినందుకు అరుణ్‌జైట్లీని ఘనంగా సన్మానించడం, హోదా సంజీవని కాదంటూ దబాయించడం, హోదా కోసం ఉద్యమిస్తే  జైలుకు పంపిస్తానంటూ యువతను హెచ్చరించడం గుర్తు చేయవచ్చు. సత్తెనపల్లిలో ఎన్‌టీఆర్‌ విగ్రహావిష్కరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడిన మాటలకు సమాధానంగా 1995లో ఎన్‌టీఆర్‌ గురించి చంద్రబాబు ఏమి మాట్లాడారో, ఆయన గురించి ఎన్టీఆర్‌ ఏమన్నారో పత్రికలలో రాయవచ్చు. టీవీలలో చూపించవచ్చు. తప్పించుకోలేరు. ‘బైట్స్‌’ క్షేమంగా ఉన్నాయి.

కోల్‌కతాలో నారావారి భేరీ
శనివారం కోల్‌కతాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన ‘యునైటెడ్‌ ఇండియా’ బహిరంగ సభకు మోదీనీ, బీజేపీనీ వ్యతిరేకించే నేతలలో చాలామంది హాజరైనారు. 2018 మార్చి వరకూ మోదీతో స్నేహం చేసిన చంద్రబాబు కూడా వెళ్ళారు. సమాజ్‌వాదీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్, ఆర్జేడీ అధినేత తేజస్వియాదవ్‌ వంటి యువకులు మోదీని విమర్శిస్తే ఎవ్వరూ తప్పు పట్టరు. వారు మోదీతో అంటకాగలేదు. ప్రధానిగా మోదీ తప్పులు చేయలేదని కాదు. ఆయన ఒప్పులకుప్ప కాదు. కానీ విమర్శించేవారికి విశ్వసనీయత ఉండాలి. మోదీ వంటి అద్భుతమైన ప్రధాని ఈ దేశానికి చారిత్రక అవసరమని చంద్రబాబు అసెంబ్లీలో గంభీరమైన ఉపన్యాసం ఇచ్చిన విషయం ఆయన విస్మరించవచ్చు కానీ ప్రజలు ఎట్లా మరచిపోతారు? అంతగా పొగిడి ఇప్పుడు కేవలం ప్రచారంపైన ఆధారపడిన ప్రధాని అనీ, పని బొత్తిగా చేయడం లేదనీ విమర్శిస్తే నప్పుతుందా? కర్ణాటకలో పార్టీ ఫిరాయింపులను బీజేపీ ప్రోత్సహించడాన్ని ప్రస్తావిస్తూ, ఎంఎల్‌ఏలను పశువులను కొన్నట్టు కొనుగోలు చేస్తున్నారనీ, మోదీ తగిన మూల్యం చెల్లించుకోవాలనీ చంద్రబాబు గర్జించారు.

తన పనుపున తెలంగాణ ఎంఎల్‌ఏ ఎల్విస్‌ స్టీఫెన్సన్‌కు అప్పటి టీడీపీ ఎంఎల్‌ఏ రేవంత్‌రెడ్డి రూ. 50 లక్షల నగదు చెల్లిస్తూ కెమెరాకు చిక్కిన ఉదంతం ఫలితంగా పదేళ్ళు ఉండవలసిన హైదరాబాద్‌  నగరం నుంచి ఆకస్మికంగా నిష్క్రమించి చంద్రబాబు ప్రభుత్వ ఉద్యోగులతో సహా లేని అమరావతికి వెళ్ళవలసి వచ్చింది. అంతకు ముందు  తెలంగాణలో టీడీపీ అభ్యర్థిగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రి అయిన తలసాని శ్రీనివాసయాదవ్‌పైన ధ్వజమెత్తిన సంగతి మరచి పోయారు. అందుకే తలసాని ఇటీవల విజయవాడ, ఏలూరు వెళ్ళినప్పుడు చంద్రబాబుపై రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు. ‘ఓటుకు కోట్లు’ కేసుతో గుణపాఠం నేర్చుకున్నా టీడీపీ అధినేత పరువు కృష్ణాలో కలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని అడ్డగోలుగా, పశువుల కంటే హీనంగా కొనుగోలు చేశారు. రవ్వంత సంకోచం కానీ, పిసరంత బిడియం కానీ లేకుండా పార్టీ ఫిరాయించిన నలుగురికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కి, పంచాయితీలను నిర్వీర్యం చేసి, స్థానిక సంస్థల అధికారాలన్నింటినీ అస్మదీయులతో నిండిన జన్మభూమి కమిటీలకు అక్రమంగా అప్పగించిన చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని రక్షించేం దుకు ఉద్యమించాలంటూ పిలుపునిస్తే ఇదేం బూటకమంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నవ్వుకోరా? ‘నన్ను మించిన నటుడు చంద్రబాబు,’ అంటూ జీవిత చర మాంకంలో గుండె పగిలి ఎన్టీఆర్‌ చేసిన వ్యాఖ్యలను జనం గుర్తు చేసుకోరా?

  పెద్దనోట్లు రద్దు చేయాలని మోదీకి సలహా ఇచ్చింది తానేనంటూ గొప్పగా చెప్పు కున్న ముఖ్యమంత్రే అది ఘోరమైన తప్పిదమంటూ నిందించారు.  ఒక ప్రధాని లేదా ఒక ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టిన సందర్భాలు అనేకం ఉంటాయి. నిజాయితీపరుడైన నాయకుడైనా, విమర్శకుడైనా, సంపాదకుడైనా ఏమి చేయాలి? సదరు చర్య సత్ఫలితాలు ఇస్తుందని తాము కూడా ఆశిం చామనీ,  అందుకే మొదట్లో స్వాగతించామనీ, అమలు క్రమంలో అది ఆర్థిక వ్యవస్థకు హానికరంగా పరిణమించిందనీ చెప్పాలి. తప్పు ఒప్పుకోవాలి. అంతటి నిజాయితీ ఎక్కడుంది? అటువంటి విలువలు ఎక్కడున్నాయి? గుడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ (జీఎస్‌టీ) విషయంలోనూ ఇదే అవకాశవాద ధోరణి. జీఎస్‌టీని ప్రవేశపెట్టినప్పుడు స్వాగతించి ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత అదే పనిగా విమర్శించడం సీనియర్‌ రాజకీయ నాయకుడికి శోభ నిస్తుందా? అక్షరం బలి కోరుతుందని ప్రముఖ కవి అజంతా తరచూ అనేవారు. తన అనుభవానికీ, వయస్సుకీ, హోదాకీ తగినట్టు ఆచితూచి మాట్లాడితే చంద్రబాబు మరింత నవ్వులపాలు కాకుండా మర్యాద కాపాడుకుంటారు.  వైఖరి మార్చుకోవాలో లేక ఇదే విధంగా ముందుకు సాగిపోవాలో నిర్ణయిం చుకోవలసింది ఆయనే.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement