ఎందుకింత రాద్ధాంతం? | K Ramachandra Murthy Article On Chandrababu Naidu Propaganda At EC | Sakshi
Sakshi News home page

ఎందుకింత రాద్ధాంతం?

Published Sun, Apr 14 2019 4:16 AM | Last Updated on Sun, Apr 14 2019 4:16 AM

K Ramachandra Murthy Article On Chandrababu Naidu Propaganda At EC - Sakshi

పోలింగ్‌ ముగిసిన తర్వాత యుద్ధవాతావరణం ముగుస్తుందనీ, శాంతి, సద్భావం వెల్లివిరుస్తాయనీ ఆశించినవారికి దిగ్భ్రాంతి కలిగించే సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షాత్కరిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడు చంద్రబాబునాయుడు శుక్రవారం రెండు గంటల సేపు మీడియాతో మాట్లాడిన తర్వాత అప్రజాస్వామికమైన ఆయన వ్యాఖ్యలపైన స్పందించక తప్పడం లేదు. ప్రతిపక్ష నేతను నేరస్థుడు అంటూ అభివర్ణించడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సహనిందితుడనీ, కోవర్టు అనీ నిందించడం చూసినవారికి ముఖ్యమంత్రి మాన సిక స్థితిపైన అనుమానం కలుగకమానదు. తాను ముఖ్యమంత్రి, ఒక ప్రాంతీయ పార్టీకి అధినేత కనుక ఏమి మాట్లాడినా చెల్లుతుందని భావిస్తున్నట్టున్నారు.  గురువారం ఉదయం పోలింగ్‌ ఆరంభమైన కొద్దిసేపటికే ముప్పయ్‌ శాతం ఎల క్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్స్‌ (ఈవీఎం)లు పని చేయలేదనీ, ఈ సమస్యను ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ కావాలనే సృష్టించినట్టు కనిపిస్తున్నదనీ చంద్రబాబు ధ్వజమెత్తారు. 

మొత్తం 92 వేల పైచిలుకు ఈవీఎంలు ఆంధ్రప్రదేశ్‌లో వినియోగిం చారు. 380 ఈవీఎంలు ఉదయం మొరాయించాయనీ, వాటిలో 330 ఈవీఎం లను మార్చి కొత్తవి ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించి వెంటనే ఉపయోగించామనీ ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వివరించినా ఈ దుష్ప్రచారానికి అడ్డుకట్ట పడలేదు. అంతకుముందు ఎన్నికల ప్రధా నాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేయడం, ఆయననూ, కేంద్ర ఎన్నికల సంఘాన్నీ దుర్భాషలాడటం అసహనం హద్దు మీరిందనడానికి నిదర్శనం. కొన్ని వారాలుగా ముఖ్యమంత్రి విపరీత మానసిక ధోరణిని గమనించినవారికి ఆయనను వైఫల్య భీతి వేధిస్తున్నదని గ్రహించి ఉంటారు. రాజకీయ నాయకులు ఎన్నికలలో విజ యం సాధించి అధికారంలోకి వస్తారు. ఓడిపోతే అధికారం నుంచి తప్పుకుం టారు. ఇది సర్వసాధారణం. అధికారం తమ జన్మహక్కు అనీ, ఇతరులకు దాన్ని ఆశించే హక్కు లేదనే వితండవాదాన్ని చంద్రబాబు తల కెక్కించుకున్నారు.

ఈవీఎంలపై ఇంత అపనమ్మకమా?
వాస్తవానికి ఎన్నికల ఫలితాల కోసం మరి 40 రోజులు నిరీక్షించాలి. అంత వరకూ ఎవరి అంచనాలు వారివి. ఎవరి లెక్కలు వారివి. విజయాన్నీ, పరాజయాన్నీ ఎట్లా స్వీకరించాలో తెలిసినవాడే ప్రజానాయకుడు. అన్ని ప్రజాస్వామ్య వ్యవ స్థలూ పరస్పరం సహకరించుకుంటేనే కథ సజావుగా నడుస్తుంది. ద్వివేదీతో సహ కరించకపోగా ఆయనను శత్రువుల జాబితాలో చేర్చారు చంద్రబాబు. ఎన్నికల ప్రధానాధికారితో సహా ఆయనకు సహకరించే ఉద్యోగులందరూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వారే. ఎన్నికల నిర్వహణకోసం ప్రభుత్వోగులతో పాటు అంగన్‌వాడీ, ఆశావర్కర్లనీ, నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల ఉద్యోగులనూ నియమిం చింది రాష్ట్ర ప్రభుత్వమే. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు చెడిపోతే మరమ్మతు చేయడానికి బిఇఎల్‌ నుంచి వచ్చిన అధికారులు శిక్షణనిచ్చింది స్థానిక మెకాని క్‌లకే. వారి సామర్థ్యాన్ని శంకిస్తూ, ‘మెకానిక్‌లు మరమ్మతు చేస్తున్నారా, మేని ప్యులేట్‌ చేస్తున్నారా, వేర్‌ ఆర్‌ వుయ్‌ గోయింగ్‌?’ అంటూ ముఖ్యమంత్రి ఆవే శపడితే ఏట్లా అర్థం చేసుకోవాలి? తన శత్రువుల జాబితాను చంద్రబాబు రోజు రోజుకీ పెంచుకుంటూ పోతున్నారు.  

మొన్నటి వరకూ జగన్, మోదీ, కేసీఆర్‌ ఆ జాబితాలో ఉండేవారు. ఇప్పుడు ద్వివేదీ, చీఫ్‌ సెక్రటరీగా నియమితుడైన ఎల్‌వి  సుబ్రహ్మణ్యం, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా కూడా ఆ జాబితాలో చేరిపోయారు. తాను ఎవరిని తిడితే వారిని ప్రతిపక్ష నాయకుడు కూడా తిట్టాలని ముఖ్యమంత్రి భావిస్తారు. తిట్టకపోతే వారితో కుమ్మక్కు అయినట్టు నిందిస్తారు. ‘ఎన్నికల ప్రధానాధికారిని జగన్‌ ఒక్క మాటైనా అన్నాడా?’ అన్నది అందు కోసమే. ద్వివేదీని దబాయించడం, సుబ్రహ్మణ్యంని కోవర్టు అనీ, కోఎక్యూజ్డ్‌ అనీ నిందించడం ముఖ్యమంత్రి సంస్కారానికి అద్దం పడుతుంది. నిందితుడికీ, దోషికీ భేదం పాటించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడటం భావ్యమా? కాంగ్రెస్‌ నాయకులతో చేతులు కలిపి తానే సీబీఐతో పెట్టించిన అనేక బూటకపు కేసుల్లో ఒకదానిలో సుబ్రహ్మణ్యం నిర్దోషి అంటూ హైకోర్టు ప్రకటించిన తర్వాత కూడా ‘సహనిందితుడు’ అంటూ అభివర్ణించడం ఏ సంస్కారానికి నిదర్శనం? ఓటుకు కోట్ల కేసులో ‘మనవాళ్ళు బ్రీఫ్డ్‌ మీ...’ అంటూ మాట్లాడిన చంద్రబాబుని ఏమని పిలవాలి? ఢిల్లీలో కూడా అదే ప్రవర. జగన్‌పైన 31 కేసులు ఉన్నాయనీ, తనపైన ఒక్క కేసు కూడా లేదనీ ప్రకటన. జగన్‌పైన ఉన్న కేసులన్నీ చంద్రబాబు పెట్టించినవీ, చంద్రబాబు ప్రభుత్వం పెట్టినవే. 

చంద్రబాబు న్యాయవ్యవస్థలోని పరిస్థితులను వినియోగించుకొని 17 కేసుల్లో స్టే తెచ్చుకున్న సంగతి ఎవరూ మర చిపోలేదు. మూడున్నర దశాబ్దాలుగా ఐఏఎస్‌ అధికారి సుబ్రహ్మణ్యం నడ వడికను దూరం నుంచి గమనిస్తున్న నాబోటి పాత్రి కేయులకు ఆయన ఎంత నిజాయితీపరుడైన అధికారో, ఎంత ముక్కు సూటిగా వ్యవహరిస్తారో తెలుసు. వావిలాల గోపాలకృష్ణయ్య ఆశీస్సులతో పాటు ఆయన విలువలను సైతం గుండె నిండా నింపుకొని ఎన్ని సమస్యలు ఎదురైనా చలించకుండా కర్తవ్య నిర్వహణ చేస్తున్న అధికారిని పట్టుకొని అనరాని మాటలు అనడం ముఖ్యమంత్రి పదవికి శోభనిస్తుందా? ఒక సీఎస్‌ ఒక డీజీపీని కలుసుకుంటే ముఖ్యమంత్రికి అభ్యం తరం ఎందుకు ఉండాలి? ఇది ప్రభుత్వ వ్యవహారాలలో సర్వసాధారణం. 

‘ఎక్క డికి పోతున్నాం మనం? ఇట్‌ ఈజ్‌ మాకరీ ఆఫ్‌ డెమాక్రసీ’ అంటూ తీవ్రంగా ఆక్షేపించడంలో ఏమైనా అర్థం ఉన్నదా? చంద్రబాబుకు నిజాయితీపరులైన ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులంటే పడనట్టు కనిపిస్తున్నది. చీఫ్‌ సెక్రటరీలుగా పని చేసిన ఐవైఆర్‌ కృష్ణారావు, అజేయకల్లం అంటే పడదు. ప్రస్తుత చీఫ్‌ సెక్రటరీ అంటే వైరిభావం. తనకు విధేయంగా ఉంటూ, తాను చెప్పినట్టు చేసినందుకు మాజీ చీఫ్‌ సెక్రటరీ అనీల్‌చంద్రపునేఠా, ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు మూల్యం చెల్లించడం చూశాం. డీజీపీ ఠాకూర్‌ ఢిల్లీ వెళ్ళి ఎన్నికల కమిషన్‌ సభ్యు లను రెండు విడతల కలుసుకొని తిరిగి వచ్చారు.

పరాజయం అంగీకరిస్తున్నట్లేనా?
ఎన్నికల సమయంలో అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించడం కొత్త  కాదు. ద్రోణంరాజు సత్యనారాయణ మృతి కారణంగా 2006లో విశాఖ సౌత్‌ నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఒక రిటర్నింగ్‌ ఆఫీసర్‌ని జిల్లా కలెక్టర్‌ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల సంఘానికి చెప్పకుండా మార్చి వేశారు. మార్చిన తర్వాత చెప్పారు. ఫలితంగా ప్రవీణ్‌ను ఎన్నికలకు దూరంగా పెట్టి కలె క్టర్‌గా అనీల్‌ కుమార్‌సింఘాల్‌ని నియమించారు. అదే ప్రవీణ్‌ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్నప్పుడు వికారాబాద్‌ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. లోగడ చేసిన తప్పిదం కారణంగా ఆయనను ఆ ఎన్నికలలో కూడా బదిలీ చేశారు. ప్రతిపక్ష నేత హోదాలో చంద్రబాబు ఫిర్యాదు మేరకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించి ఆయన స్థానంలో ఏకే మహంతిని డీజీపీగా నియమించినప్పుడు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఎన్నికల సంఘాన్ని కానీ, ప్రతిపక్ష నాయకుడిని కానీ పల్లెత్తు మాట అనలేదు. 

కానీ ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను కొనేశారంటూ బాబు అడ్డగోలుగా వ్యాఖ్యానించడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ఇలా అమ్ముడుపోతారని నిందించడం విజ్ఞుల లక్షణమేనా? ఈ పరుష పదజాలం బాబు దుగ్ధకు నిదర్శనం. ఆయనకు తెలియకుండానే మనసులో ఉన్నమాట బయటపడుతు న్నది. ‘అయిదేళ్ళు లోట స్‌పాండ్‌ నుంచి పరిపాలిస్తాడు’ అంటే వైఎస్‌ఆర్‌సీపీ గెలుస్తుందనీ, జగన్‌ ముఖ్య మంత్రి అవుతారనీ ఒప్పుకున్నట్టే కదా! అపోజిషన్‌లో ఉన్నవాడికి అంత డబ్బు ఎక్కడినుంచి వచ్చింది? అంటే అధికారంలో ఉన్న తనకు డబ్బు వచ్చినట్టే కదా! ఓటమి భయం, ఆక్రోశం అనాలోచితంగా, అతిగా మాట్లాడిస్తుంది. కొన్ని భయాలూ, కొన్ని నిజాలూ, కొన్ని అర్థంపర్థంలేని మాటలూ దొర్లుతాయి. ఈవీఎంలో చిప్‌ తయారు చేసినవాడు తనకు అపకారం చేస్తాడని అనుకుంటారు. తనను ఓడించేందుకే ఎన్నికలు మొదటి దశలో పెట్టారంటూ ఎన్నికల కమిషన్‌ని తప్పుపడుతున్నారు. ‘నా ఓటు నాకే పడిందో లేదో నాకు తెలియదు’ అన్నారు. అమరావతిలో ఓటు చేసిన బాబు ఓటు ఆయనకు పడదు. ఆయన కొడుకు, మంగళగిరి నియోజక వర్గంలో టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్‌కు పడి ఉంటుంది. 

చిత్రం ఏమిటంటే అధికారంలో ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిలాగా రెచ్చిపోతున్నారు. ప్రతిపక్ష నాయకుడు నిబ్బరంగా ఉన్నారు. పోలింగ్‌ రోజున కొన్ని చోట్ల టీడీపీ, ౖవైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరిగాయి. గతంతో పోల్చితే ఈసారి హింస కొంతమేర తగ్గిందంటూ ముఖ్యమంత్రికి ఇష్టుడైన డీజీపీ ఠాకూర్‌ వ్యాఖ్యానించారు. చనిపోయిన ఇద్దరిలో ఒకరు వైసీపీకీ, ఇంకొకరు టీడీపీకీ చెందినవారు. వాస్తవాలు ఇట్లా ఉంటే, జగన్‌నీ, వైసీపీ నాయకులనూ నిష్కారణంగా దూషిస్తూ హింసాకాండ యావత్తూ వైసీపీ ఒక పథకం ప్రకారం చేయించిందని చెప్పడం అదరగండపు ధోరణి. నేరం చేసి ఎదుటివారిపైన నిందవేయడం, అధికారంలో ఉంటూ ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం చంద్ర బాబుకి బాగా తెలిసిన విద్య.

పరాకాష్టకు చేరిన ప్రభుత్వ వ్యతిరేకత
ఎన్నికలలో గెలిచేందుకు చంద్రబాబు అన్ని రకాల ఎత్తుగడలూ అమలు పరి చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం కోసం కాంగ్రెస్, జనసేనలు విడివిడిగా పోటీ చేసే విధంగా వ్యూహరచన చే శారు. జనసేనతో సర్దుబాట్లు చేసుకున్నారు.  కేఏ పాల్‌ అనే ఒక విచిత్రవీరుడిని రంగంలో ప్రవేశపెట్టి అతడి పార్టీకి వైఎస్‌ ఆర్‌సీపీ ఎన్నికల చిహ్నమైన ఫ్యాన్‌ను పోలిన ఫ్యాన్‌సహిత హెలికాప్టర్‌ చిహ్నం సంపాదించిపెట్టారు. ఆయన అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు వేసుకునే డిజైన్‌ కండువాలనే వేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. వైసీపీ అభ్యర్థుల పేర్లు గల అనామకులకు టిక్కెట్లు ఇప్పించారు. ఎన్నికలు పది రోజులు ఉన్నాయనగా డ్వాక్రా మహిళలకు రెండు చెక్కులు ఇచ్చారు. అన్నదాతా సుఖీభవ పథకం కింద రెండు వాయిదాలు ఇస్తానని చెప్పి ఒక వాయిదా సొమ్ము వారి ఖాతాలలో వేశారు. ఇన్ని చేసినా పరాజయభీతి పీడిస్తున్నదంటే ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. 

పరాజయం అనివార్యమని ఆయనకు నెల రోజుల కిందటే తెలిసిపోయింది. పోలింగ్‌ రోజున ఓటర్లు అత్యధిక సంఖ్యలో హాజరు కావడంతో తన అనుమానం రూఢి అయింది. అందుకే అందరిపైనా ఒంటికాలు మీద లేవడం. ఉదయం పది గంటలలోపే 30 శాతం ఈవిఎం మెషీన్లు పనిచేయడం లేదంటూ గగ్గోలు పెట్టడం కూడా ఓటమికి సాకు వెతుక్కునే ప్రయత్నమే. మొత్తం 92వేల పైచిలుకు ఈవిఎంలు ఉంటే వాటిలో 30 శాతం అంటే ఎన్నో లెక్క కట్టే మాట్లాడారా? కేవలం 380 ఈవీఎంలు మొరా యించాయనీ, వాటిలో చాలావరకూ కొత్త ఈవీఎంలు ఏర్పాటు చేశామనీ, తక్కినవాటిని బాగు చేయించామనీ ద్వివేదీ చెప్పారు. అయినా బాబు ధోరణి మారలేదు. ఢిల్లీలోనూ అదే పాట. ద్వివేదీ ఓటు వేయలేకపోయారని సీఎం ప్రచారం చేశారు. ఆయన గురువారం నాలుగు గంటలకు ఓటు వేసినట్టు వీడియో సాక్ష్యం విడుదల చేశారు. అయినా సరే అబద్ధాలు ఆగడం లేదు. 

ఆగడాలకు అంతులేదు. పోలింగ్‌ పూర్తియిన తర్వాత కూడా గ్రామాలలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపైన టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తున్నారంటే వారు తమ అధినేతను అనుసరిస్తున్నారని భావించాలి. సహనిందితుడూ, కోవర్టు అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రహ్మణ్యంని నిందించడం, ఈసీని తూర్పారబట్టడం రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగం 324 అధికరణ కింద ఎన్ని కల సంఘానికి దఖలు పరచిన అధికారాలను వినియోగించుకొని ప్రజా ప్రాతినిధ్య చట్టం (రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌) కిందా, భారత శిక్షాస్మృతి (ఇండియన్‌ పీనల్‌ కోడ్‌) కిందా చంద్రబాబుlపైన కేసులు పెట్టవచ్చు. సుబ్ర హ్మణ్యంపైన విమర్శలు చేసిన తీరు ఎన్నికల సంఘానికి పరువునష్టం కలి గించినట్టే. ఎన్నికల సంఘాన్ని ధిక్క రించినట్టే. ఇలా ధిక్కరించే అధికారం సీఎంకి కాదు కదా ప్రధానికిSసైతం లేదు. 

ఈ ఎన్నికలలో టీడీపీ ఓడిపోతుందో లేదో మే 23న మాత్రమే వెల్లడి అవుతుంది. ఈ లోగా ఓటమిని ఎట్లా స్వీకరించాలో చంద్రబాబు నేర్చుకున్నా, ఆయనకు హితైషులు నచ్చజెప్పినా ఆయనకు మంచిది. 2014లో పోటాపోటీగా జరిగిన ఎన్నికలలో ఓడిపోయినప్పుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అత్యంత హుందాగా ఫలితాన్ని ఆమోదించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహ రిస్తామని చెప్పారు. 42 ఏళ్ళ యువకుడు అయిదేళ్ళ కిందట ఎంత సంయమ నంతో, రాజ్యాంగంపట్ల, ఎన్నికల ప్రక్రియపట్ల గౌరవంతో వినమ్రంగా ఓటమిని అంగీకరించారు. ఇప్పుడు ఓడిపోతామనే అనుమానంతోనే 68 ఏళ్ళ చంద్రబాబు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. పరిణతి లేని నేతగా వ్యవహరిస్తున్నారు. మే 23న ఆయన అనుమానం నిజమైతే ఏమి చేస్తారోనని ఆందోళనగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి


-కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement