సాక్షి, న్యూఢిలీ: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి భద్రతను పర్యవేక్షించే ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేసి తన రక్షణ వ్యవస్థకు విఘాతం కలిగించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవీఎంల ద్వారా ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతోందని, ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. మొత్తం 618 కేంద్రాల్లో అడ్జర్న్‌డ్ పోల్ (వివిధ కారణాలతో పోలింగ్‌కు విఘాతం కలిగితే వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తిరిగి ఎన్నిక నిర్వహించడం) చేపట్టాలని కోరారు. చంద్రబాబు శనివారం మధ్యాహ్నం పలువురు మంత్రులు, పార్టీ సహచరులతో కలిసి ఢిల్లీలో కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈసీ) సునీల్ అరోరాతో సుదీర్ఘంగా సమావేశమై 18 పేజీల వినతిపత్రం అందజేశారు. పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహించాలని, ఈవీఎంలను హ్యాకింగ్ చేసిన వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, ఈవీఎంల మొరాయింపుపై విచారణ నిర్వహించాలని, ఫామ్ – 7 దరఖాస్తులకు సంబంధించి ఐపీ చిరునామాను రాష్ట్ర పోలీసులకు అందచేయాలని సీఈసీని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలపై ఇండిపెండెంట్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...
అధికారులను ఎందుకు బదిలీ చేశారు?
‘‘ఈసీ ద్వారా జరిగిన అవకతవకలు, పక్షపాత వైఖరిపై తీవ్ర అసంతృప్తి, నిరసన తెలియజేశా. ఒక పద్ధతి లేకుండా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం మాట వినకుండా, నేరస్తులు ఇష్టానుసారంగా పిటిషన్లు ఇస్తే దానికి అనుగుణంగా అధికారులను బదిలీలు చేయడం, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఐటీ, ఈడీ దాడులు చేసినప్పుడు ఈసీ గమ్మున కూర్చోవడం, ఏపీ ప్రజానీకంపై మూకుమ్మడి దాడి చేయడాన్ని ఖండిస్తూ నిరసన తెలిపా. ఏకే శర్మ పనికి రాడని పంపిస్తే ఆయనను పరిశీలకుడిగా నియమించడం, కడప ఎస్పీని మార్చడం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చడం చేశారు. మార్చి ఎవరిని నియమించారు? జగన్‌మోహన్‌రెడ్డి కేసులో నిందితుడిని వేశారు. ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ ఎక్కడికి పోతున్నారు మీరు..? యంత్రాంగాన్ని డీమోరలైజ్ చేశారు. తొలుత ఈవీఎంలు మొరాయించాయి. అవి ప్రారంభమయ్యే సమయానికి స్పీకర్‌పై, ఎమ్మెల్యేలపై దాడులు చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత అరాచకం ఎన్నడూ లేదు. తొలిసారి జరిగింది. దీనికి కారణం ఎవరు? ఎన్నికల సంఘం బాధ్యత తీసుకుంటుందా? మీ ఇష్టారీతిన బదిలీలు చేసి ఏపీని రావణకాష్టం చేశారు. దుర్మార్గంగా ప్రవర్తించారు. రెచ్చిపోయి రౌడీలంతా రోడ్డు మీదకు చేరారు.
చేతగానితనం వల్ల మీరు పూర్తిగా విఫలమయ్యారు. ఒంటి గంటకు మిషన్లు పెట్టారు. మేం పోలింగ్ వాయిదా వేయాలని అడిగితే వినలేదు. మధ్యాహ్నం 3.30, 4.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. క్యూలో నిలబడిన వాళ్లంతా రాతింబవళ్లూ చంటిపిల్లలను చంకనేసుకుని అవస్థలు పడ్డారు. ఎవరిది బాధ్యత? ఈసీది కాదా? ఓటర్లు బిచ్చగాళ్లా? ఓటర్లను గౌరవంగా చూసే బాధ్యత లేదా? సాయంత్రం 5 గంటలకు ఒక పిలుపునిస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సామాన్య ప్రజానీకం కంకణం కట్టుకుని వచ్చి క్యూలో నిలబడ్డారు. ఈవీఎంలపై సామాన్యులకు సందేహం ఉంది. వీవీ ప్యాట్లపై సందేహం ఉంది. సుప్రీం కోర్టు అడిగితే వీవీప్యాట్ పత్రాలు లెక్కించేందుకు ఆరు రోజులు పడుతుందని చెప్పారు. ఇలా ఇష్టారీతిన ప్రవర్తిస్తే ఎలా? ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, నిష్పాక్షికంగా ఉండాలి. ఈవీఎంల మీద ఎప్పటి నుంచో పోరాడాం. మేం పోరాడితేనే వీవీ ప్యాట్లు వచ్చాయి. వీవీ ప్యాట్లు కూడా సరికాదని ఎప్పుడో చెప్పాం. పేపర్ బ్యాలెట్లే ఈ దేశానికి సరైన నిర్ణయం. పేపర్ బ్యాలెట్లపై అందరికీ ఒక అవగాహన ఉంటుంది. ఎక్కడెక్కడో పట్టుకొచ్చి ఆపరేట్ చేయమంటే ఎలా చేస్తారు? థర్మల్ పేపర్ మీద చాలా అనుమానం ఉంది. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అందుకే వచ్చాం. రాష్ట్రంలో జరిగిన అవకతవకలను దేశానికి చెప్పాలని వచ్చాం. ప్రజాస్వామ్యవాదులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి’’ అని పేర్కొన్నారు.
ఈవీఎంలను ఎవరు మానిప్యులేట్ చేశారు?
ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు హడావుడి చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శించటాన్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా.. ‘ఈవీఎంలు పనిచేయకపోతే ప్రతిపక్షాలు ఎందుకు అడగలేదు? హింస జరిగితే ఎందుకు మాట్లాడలేదు? హింస మీరే చేశారా? రాత్రి మూడు గంటలకు ఎవరు ఓటేశారు? వాళ్లంతా ప్రెస్టీజ్‌గా తీసుకున్నారు. మోదీ, కేసీఆర్, జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని తిరుగుబాటు చేశారు. తెల్లవారుజాము వరకు ఓట్లేశారంటే చరిత్రలో ఎప్పుడు ఇలా జరగలేదు. లేటుగా పోలింగ్ జరిగిన కేంద్రాల్లో అడ్జర్న్‌డ్ పోల్‌గా ప్రకటించాలి. ఫారం– 7ఏపై తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. తొలి గంటలో పోలింగ్ ఎందుకు జరగలేదు? ఎవరు హ్యాకింగ్ చేశారు? ఎవరు మానిప్యులేట్ చేశారు? వీటికి సమాధానం కావాలి. ఇలాంటిది జరగకుండా ఉండాలంటే పేపర్ బ్యాలెట్ రావాలి..’ అని బదులిచ్చారు.
50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించాలి
‘అన్ని రాజకీయ పార్టీలు, మేధావులతో మాట్లాడతా. జాతీయ స్థాయిలో డిబేట్ చేస్తా. వీవీ ప్యాట్ల పత్రాలు లెక్కించేందుకు ఎందుకు ఇబ్బంది పడుతున్నారని ప్రశ్నిస్తున్నా. 50 శాతం వీవీ ప్యాట్ల పత్రాలను లెక్కించాలి..’ అని పేర్కొన్నారు. ‘హింస రెండు వైపులా జరగలేదు. మావాళ్లు త్యాగాలు చేశారు. అవతల రౌడీలు వస్తే పారిపోయారనుకోండి ఏమవుతుంది? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు బలయ్యారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు..’ అని మరో ప్రశ్నకు బదులిచ్చారు.
నేడు ఢిల్లీలో సీఎం, విపక్ష నేతల భేటీ
ఈవీఎంల పనితీరు, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతపై చంద్రబాబు, ఇతర విపక్ష నేతలు ఆదివారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ఈ సమావేశం జరగనుంది. 12.30 గంటలకు నేతలు మీడియాతో మాట్లాడనున్నారు.
ఈవీఎంలపై విచారణ జరపండి
Published Sun, Apr 14 2019 2:03 AM | Last Updated on Sun, Apr 14 2019 11:18 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment