విజయోత్సవంలో అపశ్రుతులేల? | K Ramachandra Murthy Article on Party Defections | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 23 2018 12:59 AM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

K Ramachandra Murthy Article on Party Defections - Sakshi

చర్విత చర్వణమే అయినప్పటికీ తప్పు జరుగుతున్నప్పుడు ఉపేక్షించడం క్షంతవ్యం కాదు. బధిరశంఖారావమైనా కళ్ళ ఎదుట జరుగుతున్న ఘోరాన్ని ఎత్తిచూపకపోవడం నేరం. అంచనాలకు మించిన విజయం సాధించిన తర్వాత పార్టీ ఫిరాయింపులను తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ప్రోత్సహించరనే ఆశ అడియాసై వెక్కిరిస్తున్నది. పార్టీ ఫిరాయించిన వారు సిగ్గుపడకుండా సగర్వంగా తిరుగాడుతున్నారు. ఎన్నికల తతంగం ముగిసి రెండు వారాలు కాలేదు. శాసనసభ్యులుగా ప్రమాణం చేయలేదు. అప్పుడే ఇద్దరు ఇండిపెండెంట్లు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)లో చేరి పోయారు. జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌ ర హిత ఫెడరల్‌ ఫ్రంట్‌ను నిర్మిం చేందుకు నడుం బిగించిన కేసీఆర్‌ను చూసి గర్వించాలో లేక విందు ఆరగించిన వెంటనే చిరుతిండ్లకు ఆశపడుతున్నందుకు నిందించాలో తెలియని పరిస్థితి తెలంగాణ ప్రజలది. మొత్తం 119 స్థానాలలో సొంతంగా 88 స్థానాలు గెలుచుకు న్నారు. మిత్రుడిగా చెప్పుకునే అసదుద్దీన్‌ నాయకత్వంలోని ఎంఐఎం ఏడు స్థానాలు కైవసం చేసుకున్నది. గతంలో తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర జరుగుతున్నదనే అనుమానంతో ఎడాపెడా ఫిరాయింపులకు తెరలేపినప్పుడు అనేకులం ఆక్షేపించాం. అయినా బాధ్యులెవరూ పట్టించుకోలేదు.

శాసనమండలిలో కాంగ్రెస్‌ సభ్యులు కూచుకుళ్ళ దామోదర్‌ రెడ్డి, ఎంఎస్‌ ప్రభాకర్‌లు పార్టీ ఫిరాయించి అధికార టీఆర్‌ఎస్‌లో చేరినప్పుడే వారిపై అనర్హత వేటు వేయాలని అభ్యర్థిస్తూ కాంగ్రెస్‌ నాయకులు అధ్యక్షుడు స్వామిగౌడ్‌కు మహజరు సమర్పించుకొని ఏడాదిన్నర గడిచిపోయింది. స్వామిగౌడ్‌ స్పందించ లేదు. ఆకుల లలిత కాంగ్రెస్‌ శాసనసభ్యుల మద్దతుతో మండలి సభ్యురాలుగా గెలుపొందారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఆమెకు టిక్కెట్టు ఇచ్చి అభ్యర్థిగా నిలబెట్టి గౌరవిస్తే ఓడిపోయిన పది రోజులకే అధికార పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఏ రాజనీతి కిందికి వస్తుంది? లలిత, సంతోష్‌కుమార్‌లు టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకొని, లోగడ ఎప్పుడో ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి అనుబంధ సభ్యులుగా వ్యవహరిస్తున్న దామోదర్‌రెడ్డి, ప్రభాకర్‌లను కలుపుకొని కాంగ్రెస్‌ లెజిస్టేచర్‌ పార్టీ నిర్వహించుకున్నామనీ, పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని నిర్ణయించామనీ తెలియజేస్తూ లేఖ సమర్పించిన క్షణాలలో సభా ధ్యక్షుడు స్వామిగౌడ్‌ స్పందించడం, కాంగ్రెస్‌ పక్షం టీఆర్‌ఎస్‌లో విలీనమైనట్టు ప్రకటించడం, శనివారంనాడు గెజెట్‌నోటిఫికేషన్‌ విడుదల చేయడం దిగ్భ్రాంతి కలిగిస్తున్న పరిణామాలు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పోరాడిన స్వామిగౌ డ్‌కు ఇది శోభాయమానమైన పరిణామం కాదు. తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ అదే సభాధ్యక్షుడిని కలుసుకొని ఫిరాయించిన సభ్యులపైన వేటు వేయాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం, దాన్ని స్వామిగౌడ్‌ స్వీకరించడం ప్రజా స్వామ్య వ్యవస్థ ఎంత లోపభూయిష్టంగా తయారైనదో, ఎంత హాస్యాస్పదంగా మారిందో, ఎంత కపటంగా దిగజారిందో సూచిస్తున్నది. పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది పార్టీని చీల్చాలని తీర్మానిస్తే వారి సభ్యత్వం గల్లంతు కాకుండా ప్రత్యేక గ్రూపుగా పరిగణించవచ్చు. కానీ పార్టీ విలీనం కావా లంటే మరికొన్ని అదనపు ప్రక్రియలు అవసరం. మనకున్నది ఒకటే రాజ్యాంగం. పార్టీ ఫిరాయించినవారిపైన సభాపతులు అనర్హత వేటు వేయాలని చెబుతున్నది అదే రాజ్యాంగం. 1985లో రాజీవ్‌గాంధీ, 2003లో అటల్‌బిహారీ వాజపేయి చొరవ తీసుకొని తెచ్చిన ఫిరాయింపుల నిరోధక చట్టం, దాని సవరణ ఫిరాయిం పుల నిరోధానికి ఉద్దేశించినవి. ఏ రాజ్యాంగం నిర్దేశించిన ఎన్నికల  ప్రక్రియను అనుసరించి మన నేతలు అధికారంలోకి వచ్చారో అదే రాజ్యాంగంలో ఉన్న ఫిరా యింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.

అధికారానికి గులాములు
ఖమ్మం జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) టిక్కెట్టుపైన గెలిచిన సండ్ర వెంకట వీరయ్య, మెచ్చానాగేశ్వర రావు సైతం కారెక్కడానికి సిద్ధంగా ఉన్నట్టు వస్తున్న వార్తలు ప్రజాస్వామ్య ప్రియులకు బాధ కలిగిస్తాయి. ‘ఓటుకు కోట్లు’ కేసులో నగదు అందజేస్తూ కెమేరాకు చిక్కిన రేవంత్‌రెడ్డిని చేర్చుకొని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవితో గౌరవించిన కాంగ్రెస్‌ పార్టీనీ ఎద్దేవా చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులు అదే కేసులో నిందితుడైన సండ్రను తమ పార్టీలోకి ఎట్లా ఆహ్వా నిస్తారో చూడాలి. ఈ సారి టీడీపీతో కూటమి కట్టి వ్రతం చెడినా ఫలం దక్కని కాంగ్రెస్‌ పార్టీకి చిక్కినవి కేవలం 19 స్థానాలు. అప్పుడే  కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలు టీఆర్‌ఎస్‌ నేతలతో సమాలోచనలు జరుపుతున్నారనీ, దూకడానికి సిద్ధంగా ఉన్నారనీ సమాచారం. తొమ్మిదిమంది ఎంఎల్‌ఏలను కొనుగోలు చేయగలిగితే శాసనసభలో కాంగ్రెస్‌ బలం పదికి పడిపోతుంది. ప్రతిపక్ష హోదా సైతం దక్కదు. ఆ విధంగా కాంగ్రెస్‌ను ‘బొంద పెట్టాల’ని కేసీఆర్‌ నిర్ణయించుకున్న ట్టున్నారు. ఎందుకంటే సోనియాగాంధీ హాజరైన ఎన్నికల సభలో ఉత్తమకుమా ర్‌రెడ్డి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ని ‘బొంద పెట్ట’వలసిందిగా ప్రజలకు పిలుపు ఇచ్చారు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారో అందరికీ తెలుసు. అదే ప్రజల నిర్ణ యాన్ని వమ్ము చేస్తూ పార్టీలు మారుతున్న శాసనసభ్యులను ఎంత అవహేళన చేసినా, ఎంత నిందించినా తక్కువే. కొనుగోలు చేయడం అంటే కేవలం రొక్కం ఇచ్చి కొనడం కానవసరం లేదు. పదవి ఆశతోనో, మరే ఇతర ప్రలోభాలతోనో పార్టీ ఫిరాయించినవారు అమ్ముడు పోయినట్టే లెక్క. రోషం ఉన్న వారైతే చీటికీ మాటికీ పార్టీలు మారరు. విలువలకు పాతరేసి కేవలం అధికారానికి గులాము లుగా వ్యవహరించేవారిని ప్రజాప్రతినిధులంటూ గౌరవించడం పొరపాటు. కొత్త శాసనసభ నిర్మాణం జరగడానికి ముందే దొంగ చూపులు చూసే వారినీ, అడ్డదారులూ తొక్కేవారినీ ఏమని నిందించినా తప్పులేదు.  

నైతికత ఎవరికుంది?
ప్రశంసార్హమైన సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందుకూ, సుస్థిరమైన పరి పాలనను అందజేస్తున్నందుకూ, శాంతిభద్రతలనూ పరిరక్షిస్తున్నందుకూ అభి నందనలు అందుకుంటూ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపైన ప్రభావం వేసేందుకు జైత్రయాత్ర ప్రారంభిస్తున్న సందర్భంలో చట్టసభలలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్న పంతంతో రాజ్యాంగాన్ని ఉల్లం ఘించడం వంటి అపస్వరం అవసరమా? ఇదంతా రాబోయే లోక్‌సభ ఎన్ని కలలో అనుకున్నది సాధించేందుకే అంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలలో కోలుకోలేని దెబ్బ తినిన కాంగ్రెస్‌ను చావగొట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రతిపక్షం లేకపోతే అది చట్టసభ అనిపించుకుంటుందా? దౌర్భాగ్యం ఏమంటే ఏ పార్టీ సభ్యులు ఫిరాయించినా వారిని మందలించే నైతిక అధికారం ఎవ్వరికీ లేదు. ఉదాహరణకు పార్టీ ఫిరాయింపులను దేశవ్యాప్తంగా అడ్డగోలుగా సాగించిన కాంగ్రెస్‌ పార్టీకి లలితను కానీ, సంతోష్‌కుమార్‌ను కానీ తప్పు పట్టే నైతిక హక్కు ఉండదు. రేపు ఇద్దరు టీడీపీ ఎంఎల్‌ఏలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయి టీడీపీఎల్పీని రద్దు చేస్తే ఆక్షేపించే అధికారం టీడీపీ అధ్యక్షుడు చంద్ర బాబునాయుడికి ఉండదు.

తలసాని శ్రీనివాసయాదవ్‌ 2014లో టీడీపీ టిక్కెట్టు పైన గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరి మంత్రిగా ప్రమాణస్వీకారం చేసినందుకు హైదరాబాద్‌ వచ్చి హుంకరించిన చంద్రబాబు స్వయంగా 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసిన తర్వాత పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎంఎల్‌ ఏలను కానీ, ఎంఎల్‌సీలను కానీ మందలించే నైతిక స్థాయి కోల్పోయారు. జాతీయ స్థాయిలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలను ప్రశ్నించే నాధులు లేరు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ విషయంలో అడపాదడపా ఖేదం వెలి బుచ్చుతూ ఉంటారు కానీ చట్టంలో ఉన్న లోపాన్ని సవరించాలని ప్రధాన మంత్రికి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ మనస్తాపం వెలిబుచ్చుతున్న ఏకైక జాతీయ నాయకుడిగా ఆయనను చెప్పు కోవాలి. అంతవరకూ మెచ్చుకోవాలి. ప్రధాని నరేంద్రమోదీ సైతం ఈ విష యంలో నిరపరాధి కారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారీకర్‌ అనారోగ్యం కారణంగా పదవీబాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారు.  కొత్త ముఖ్యమంత్రిని నియమించే సాహసం బీజేపీ జాతీయ నాయకత్వం చేయలేకపోతోంది. ఎందు కైనా మంచిదని ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను కొనుగోలు చేసి వారిని విమా నంలో ఢిల్లీకి రప్పించుకొని కాషాయ కండువాలతో సత్కరించారు.

అటువంటి పార్టీ నాయకులకు ఇతర పార్టీలకు చెందినవారిని ఆక్షేపించే అర్హత ఏముంటుంది? జాతీయ స్థాయి మీడియా సంస్థలు కూడా ఫిరాయింపులను ప్రశ్నించడం మానుకున్నాయి. టీఆర్‌పీ రేటింగులు రావనో, అధికారంలో ఉన్న పార్టీని దుయ్యపట్టడం ఎందుకనో తెలియదు. ఎన్‌డీటీవీ, ఇండియా టుడే వంటి చానళ్ళు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో యధేచ్ఛగా సాగిన ఫిరాయింపులను ఆక్షేపించలేదు. ఢిల్లీలో చిన్న ఘటన జరిగినా, కేజ్రీవాల్‌ తుమ్మినా, దగ్గినా రోజంతా కథనాలు నడిపే చానళ్లు రెండు రాష్ట్రాలలో కలిపి దాదాపు 50 మంది ఎంఎల్‌ఏలు ఫిరాయించినా, ఆంధ్రప్రదేశ్‌లో నలుగురు ఫిరాయింపుదారులకు మంత్రిపదవులు కట్టబెట్టినా అదేమని అడిగిన పాపాన పోలేదు. న్యాయస్థానాలు ఫిరాయింపుల చట్టాన్ని అక్షరాలా పాటిస్తున్నారే కానీ అందులోని స్ఫూర్తిని పట్టిం చుకోవడం లేదు. సభాపతి నిర్ణయమే ఖరారనీ, అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదనీ 91 రాజ్యాంగ సవరణ స్పష్టం చేసింది. సభాపతులపైన అటువంటి గురుతరమైన బాధ్యత పెట్టడం, అంతటి విశ్వాసం వారిపైన ఉంచడం నాటి పార్లమెంటు చేసిన పొరబాటు. దాన్ని సవరించుకోవాలనే సదు ద్దేశం ఎన్‌డీఏ నాయకత్వానికి ఉంటే అవసరమైన మెజారిటీ ఉన్నది. ఆ ఉద్దేశమే లేదు. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ద్రోహం చేసి నట్టే భావించాలి. 

తడబాటు లోగుట్టు
ఇది ఇలా ఉంటే, చంద్రబాబునాయుడు తనకు తోచిన విధంగా ముందుకు పోతున్నారు. 2004లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దేవాదుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నట్టే ఇప్పుడు ఎన్నికలు నాలుగు మాసాలు కూడా లేని తరుణంలో కడప ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తారట. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయమట. ఉత్తరాంధ్ర రైల్వే జోన్‌కోసం తన పార్టీ ఎంపీలు పోరాడుతున్నారంటూ శ్రీకాకుళం ‘ధర్మపోరాటం’ సభలో ఊదరగొట్టారు. నాలుగేళ్ళు బీజేపీ పరిష్వంగంలో మైమరచి ప్రత్యేక హోదా అడగలేదు. ప్యాకేజీకి ఒప్పుకున్నారు. ప్యాకేజీ కాదంటే జైళ్ళలో కుక్కుతానంటూ ప్రతిపక్ష సభ్యులనూ, నిరసనకారులనూ బెదిరించారు. పోలవరం ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. సింగపూరును కలవరించి అమరావతిని డిజైన్‌ స్థాయి దాటకుండా గ్రాఫిక్స్‌తో ప్రజలను అలరిస్తున్నారు. సింగపూరు సినిమా చూపిం చడానికి ఒక థియేటర్‌ సైతం ప్రభుత్వ ఖర్చుతో నిర్మించాలని ప్రయత్ని స్తున్నారు. బయోస్కోప్‌ చూపించి మరోసారి ఎన్నికలలో ప్రజలను మభ్యపెట్టే ప్రణాళికలు రచిస్తున్నారు. తెలంగాణలో వ్యూహం బెడిసి పరువు మూసీలో కలి సినా హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌ విజయం వెనుక తన కృషి ఉన్నదని చాటుకుంటున్నారు. చంద్రబాబు కాంగ్రెస్‌కి చేసిన మేలు ఏమిటంటే ఆ మూడు రాష్ట్రాలలో అడుగుపెట్టకపోవడం. తెలంగాణలో ప్రవేశించకుండా ఉంటే కాంగ్రెస్‌ పార్టీకి మరో పది స్థానాలైనా దక్కేవని పరి శీలకుల అభిప్రాయం. తన మనుషులపైన కేంద్ర సంస్థలతో దాడులు చేయి స్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీని ‘కోడికత్తి’ పార్టీ అంటూ వెకిలిగా మాట్లాడటం ఆపలేదు. ఆయన మానసిక స్థితికి ఇది నిదర్శనం. తెలం గాణ దెబ్బతో మనోవ్యాధి మరింత ముదిరింది.

చంద్రబాబు ధోరణికి భిన్నంగా కేసీఆర్‌ ఆగమేఘాల మీద దూసుకుపోతున్నారు. తెలంగాణలో సాధించిన అఖండ విజయం ఆయనకు కొత్త కాంతి ప్రసాదించింది. ఉరవడి పెరిగింది. కుమారుడికి పార్టీ పెత్తనం అప్పగించారు. మంత్రి వర్గ నిర్మాణం పూర్తి కాకుండానే ఫెడరల్‌ యాత్ర ఆరంభిస్తున్నారు. పెరిగిన ప్రతి ష్ఠతో ప్రాంతీయ పార్టీల నాయకులను కలుసుకోబోతున్నారు. ఎన్నికలకు ముందు జరిపిన యాత్రకీ, ఈ రోజు ప్రారంభం కానున్న యాత్రకూ తేడా ఉన్నది. అప్పటి కంటే ఇప్పుడు హెచ్చిన ఉత్సాహంతో అడుగు ముందుకు పడు తోంది. కాంగ్రెస్‌ నాయకత్వంలోని కూటమి ఎంత బలహీనమైతే కేసీఆర్‌ నిర్మి స్తున్న ఫ్రంట్‌కు అంత బలం పెరుగుతుంది. ఎన్‌డీఏ కాకుండా రెండు కూట ముల నిర్మాతలూ తెలుగు నాయకులు కావడం, వారిలో ఒకరు ఇటీవల ఘన విజయం సాధించడం, మరొకరు పరాజయం చవిచూడటం విశేషం. ఇద్దరు చంద్రులలో ఒక్కరే ప్రకాశిస్తారు. ఇద్దరూ ప్రకాశించడానికి అవకాశం లేదు. ఒకరు క్షీణచంద్రుడైతే మరొకరు పూర్ణచంద్రుడు అవుతారు. ప్రస్తుతానికి తెలం గాణ చంద్రుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో స్పష్ట మైన పరాజయ సంకేతాలూ, అటు జాతీయ స్థాయిలో పరాభవ సూచనలూ చంద్రబాబును వేధిస్తున్నాయి. అందుకే మాటపైన అదుపు తప్పుతోంది.


కె. రామచంద్రమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement