‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో! | K rama Chandra Murthy Article On No Confidence Motion In Sakshi | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 22 2018 12:24 AM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

K rama Chandra Murthy Article On No Confidence Motion In Sakshi

శుక్రవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్‌ రిహార్సల్స్‌. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్‌డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్‌ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్‌ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్‌డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్‌డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్‌ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్‌డీఏ సర్కార్‌ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. 
అమిత్‌ షా నోట ‘జుమ్లా’ 
‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్‌ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్‌ స్ట్రయిక్స్‌ను కూడా జుమ్లా స్ట్రయిక్స్‌ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్‌ నంబర్‌ ఏక్, జుమ్లా స్ట్రయిక్‌ నంబర్‌ దో...’ అంటూ రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్‌కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్‌ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్‌నాయుడు హిందీలో, ఇంగ్లిష్‌లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్‌ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు.

ఎన్‌డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్‌ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే  కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్‌గోల్‌ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్‌ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్‌ సభ సాక్షిగా చెప్పారు.

టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్‌ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన  మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన  సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్‌ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్‌ఆర్‌సీపీ పట్ల తన వైఖరిని  ప్రధాని దాచుకోలేదు.

ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్‌ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్‌సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్‌ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్‌సభ స్పీకర్‌ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్‌ఆర్‌సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్‌) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు.

అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్‌నాథ్‌సింగ్‌కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. 
జయదేవ్‌ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది?
అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్‌ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్‌లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్‌ లోక్‌సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్‌ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్‌ సభ్యుడు రాసిన లేఖను జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్‌ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్‌డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్‌ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు.

అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్‌ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్‌ మోహన్‌రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్‌డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి.

ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్‌లలో పాల్గొన్న వైఎస్‌ఆర్‌సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్‌ భవన్‌కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్‌ జగన్‌ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్‌ పాటించాలని పిలుపు ఇచ్చారు. 
టీడీపీ ఏమి చేసింది? 
అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్‌ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్‌ఎస్‌లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు.

కె. రామచంద్రమూర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement