ఎటు చూస్తే అటు స్వర్గం! | K Ramachandra Murthy Article On 2018 Telangana Elections | Sakshi
Sakshi News home page

Published Sun, Oct 21 2018 12:18 AM | Last Updated on Sun, Oct 21 2018 12:18 AM

K Ramachandra Murthy Article On 2018 Telangana Elections - Sakshi

ప్రజాస్వామ్య ప్రక్రియ వికృతంగా మారి ప్రాణవాయువును క్రమంగా హరి స్తోంది. ఢిల్లీ పర్యావరణం లాగానే దేశమంతటా ప్రజాస్వామ్య వ్యవస్థ ఊపిరాడక కొట్టుమిట్టాడుతోంది. కొంతకాలంగా సంభవిస్తున్న విపరిణామాలు గమనిస్తున్నవారిని భవిష్యత్తు ప్రశ్నార్థకంగా కనిపించి కలవరపెడుతున్నది. ఎన్నికలు జూదంగా మారినప్పుడు, అర్థబలం, అంగబలం ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగల పరిస్థితులు దాపురించినప్పుడు, వ్యాపారులే రాజకీయవాదులూ, రాజకీయవాదులే వ్యాపారులూ అయినప్పుడు అంబేడ్కర్‌ ఆశించిన రాజ్యాంగబద్ధమైన పరిపాలన, స్వాతంత్య్ర సమరయోధులు అభిలషించిన స్వేచ్ఛాస్వాతంత్య్రాలు లుప్తమైనప్పుడు ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతుంది. 

కీలకమైన ఎన్నికలు
తెలంగాణతోపాటు నాలుగు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్‌ మాసాలలో ఎన్నికలు జరగబోతున్నాయి. మరి ఆరు మాసాలలో లోక్‌సభకూ, ఆంధ్రప్రదేశ్‌తో సహా మరికొన్ని రాష్ట్రాల శాసనసభలకూ ప్రజాప్రతినిధులను ఎన్నుకోబోతున్నాం. పోటీ చేసే అభ్యర్థులలో కొంతమంది మొదటిసారి బరిలో దిగబోతున్నవారు. అనుభవజ్ఞులు మరికొందరు. శాసనసభ్యుల విధులూ, విధానాలు ఏమిటో చాలా తక్కువమంది అభ్యర్థులకు తెలుసు. భారత రిపబ్లిక్‌ ఏర్పడి 1952లో తొలిసారి ఎన్నికలు జరిగిన దరిమిలా తొలి రెండు తరాల ప్రజాప్రతినిధులకు తమ విధ్యుక్తధర్మం ఏమిటో తెలిసేది. ఆ తర్వాత రాజకీయాలు క్రమంగా మేధావులనూ, సామాజిక సేవకులనూ, నిజాయితీపరులనూ పక్కన పెట్టి వ్యాపారులకూ, పారిశ్రామికవేత్తలకూ, నేరచరితులకూ, అక్రమార్కులకూ పెద్దపీట వేశాయి. ప్రజలకు చట్టసభలలో ప్రాతినిధ్యం వహించవలసిన ఎంఎల్‌ఏలు చట్టాలు చేయడంలో, పరిపాలనపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో భాగస్వాములు కాకపోతే వారు కర్తవ్య నిర్వహణలో విఫలమైనట్టే.

ప్రజలు కూడా తమ కష్టాలకీ, సమస్యలకూ ప్రభుత్వాలు కారణమని నిరసన వెలిబుచ్చుతారు కానీ తమకు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యుడిని ప్రశ్నించరు. తెలంగాణవాదానికి మద్దతు ప్రకటించవలసిందిగా అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులపైనా ఉద్యమకారులు ఒత్తిడి తెచ్చిన ఫలితంగా ఆందోళన ఊపందుకున్నది. కేశవరావు, నాగం జనార్దనరెడ్డి, మధుయాష్కీ వంటి నాయకులపైన ఉద్యమకారులు తీవ్రమైన విమర్శల వర్షం కురిపించారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రజాప్రతినిధుల రాజీనామాని ఒక అస్త్రంగా వినియోగించింది. ఇతర పార్టీలు సైతం ఉద్యమబాట పట్టవలసి వచ్చింది. ప్రజాప్రతినిధుల పాత్ర అద్వితీయమైనది. వారిని ఎన్నుకునే ప్రక్రియ పవిత్రమైనది. దాన్ని భ్రష్టుపట్టకుండా చూసుకోవలసిన గురుతర బాధ్యత ప్రజలది. 

అలవికాని వాగ్దానాలు
శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తెలంగాణలో పార్టీ ఎన్నికల ప్రచారం ఆరంభించారు. భైంసా, కామారెడ్డి, హైదరాబాద్‌ సభలలో తనదైన ధోరణిలో మాట్లాడారు. ప్రతి రైతు కుటుంబానికీ రెండులక్షల రూపాయల రుణం మాఫ్‌ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3000 నెలసరి భత్యం చెల్లిస్తామనీ వాగ్దానం చేశారు. టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) సైతం ఇదే తరహా వాగ్దానాలు నాలుగు రోజుల కిందట పాక్షిక ఎన్నికల ప్రణాళిక పేరుతో చేశారు. ప్రతి రైతు కుటుంబానికీ లక్ష రూపాయల రుణం మాఫ్‌ చేస్తామనీ, ప్రతి నిరుద్యోగికీ రూ. 3016లు నెలనెలా చెల్లిస్తామనీ హామీ ఇచ్చారు. ఆసరా పింఛన్లు రెట్టింపు చేస్తామనీ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ళు కట్టించి ఇస్తామనీ, రాష్ట్ర ఆదాయం పెంచుతూ, దాన్ని ప్రజలకు పంచుతూ పోతామనీ వాగ్దానం చేశారు. రైతుల కోసం ప్రవేశపెట్టే 15 పథకాలలో 72 లక్షల మంది రైతులకు కనీసం మూడు పథకాల ద్వారా లబ్ధి చేకూరుతుందని కేసీఆర్‌ చెప్పారు. పకడ్బందీగా లెక్కలు వేసిన తర్వాతే వాగ్దానాలు చేస్తున్నామంటూ నాయకులు చెప్పినా ప్రజలకు వారి అనుభవం నుంచి పుట్టిన అనుమానాలు ఉంటాయి. అమలు అసాధ్యమని తెలిసినా శక్తికి మించిన వాగ్దానాలు చేస్తున్నారనే విషయం గ్రహిస్తారు.

భారత ప్రజాస్వామ్య చరిత్రలో అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలు బొత్తిగా అమలు చేయని పార్టీలు ఉన్నాయి. పాక్షికంగా అమలు చేసిన పార్టీలూ ఉన్నాయి. కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న వాగ్దానాలు అమలు చేయాలంటే దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్లు అన్నీ కలిపినా నిధులు సరిపోవని ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) వ్యాఖ్యానించారు. ఆ తర్వాతనే కేసీఆర్‌ నిరుద్యోగభృతి వాగ్దానం చేశారు. కేసీఆర్‌ 2014 నుంచి నాలుగు వాయిదాలలో రైతు రుణమాఫీ చేశారనీ, అట్లా  కాకుండా కాంగ్రెస్‌ని గెలిపిస్తే మొత్తం రుణమాఫీ ఒకే విడతలో చేస్తావ«ుని రాహుల్‌గాంధీ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని వాగ్దానం చేసి 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం నాలుగున్నర సంవత్సరాలు నయాపైసా చెల్లించకుండా ఇప్పుడు నెలకు రూ. 1,000 చొప్పున ఇస్తానని చెబుతున్నది. దానిలో కూడా అనేక మినహాయింపులతో లబ్ధిదారుల సంఖ్యను కుదించవలసి వస్తున్నది. ఇది బూటకపు వాగ్దానంగానే మిగి లిపోతున్నది. రైతు రుణమాఫీ వాగ్దానం సరేసరి. ఏ పార్టీ అయినా చేస్తున్న వాగ్దానాలు అమలుకు యోగ్యమైనవా, కావా అని నిర్ణయించవలసిన బాధ్యత ఎన్నికల సంఘం స్వీకరించాలి.

ప్రజల హృదయాలను ఏదో ఒక విధంగా గెలుచుకోవాలనే ఆరాటంలో అలవికాని వాగ్దానాలు పార్టీలు చేస్తాయి. వాగ్దానాలు అమలు చేయని పార్టీలను అయిదేళ్ళ తర్వాత ప్రజలు శిక్షించవలసిందే కానీ వాగ్దానాలను అమలు చేయించే వ్యవస్థ లేదు. ఆర్థిక నిపుణులతో, సామాజికవేత్తలతో ఉన్నతస్థాయి సంఘాన్ని నియమించి, వివిధ పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమో కాదో నిర్ణయించవలసిందిగా ఎన్నికల కమిషన్‌ ఆదేశించాలి. అమలు సాధ్యం కానివి ఎన్నికల ప్రణాళిక నుంచి తొలగించాలని పార్టీలను కట్టడి చేయాలి. వాగ్దానాలు సంపూర్ణంగా అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఆ రాష్ట్ర బడ్జెట్‌ ఎంత? ఉద్యోగుల జీతభత్యాలూ, ఇతర ప్రభుత్వ ఖర్చులకు ఎంత కేటాయించాలి? మిగిలిన మొత్తంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎంత ఖర్చు చేయాలి? అభివృద్ధి వ్యయానికీ, సంక్షేమ వ్యయానికీ మధ్య సమతౌల్యం పాటిస్తూ  సంక్షేమంకోసం ఎంత ఖర్చు చేయవచ్చు? సంక్షేమం కోసం కేటాయించిన మొత్తంలో పార్టీలు చేస్తున్న వాగ్దానాల అమలు సాధ్యమేనా? వైద్య, విద్యా రంగాల నుంచి ప్రభుత్వాలు పూర్తిగా నిష్క్రమించి, ప్రత్యామ్నాయ సంక్షేమ పథకాలు అమలు చేయడం మంచిదా లేక ప్రభుత్వ ఆసుపత్రులనూ, విద్యాలయాలనూ పటిష్టం చేయడం ఉత్తమమా అనే అంశం కూడా ఎన్నికల ప్రచారంలో చర్చకు పెట్టాలి.

పన్నులు పెంచుతూ, ఆదాయాన్ని సంక్షేమం పేరు మీద పంచుతూ పోతే అభివృద్ధి ఎట్లా సాధ్యం? తమ జేబులో నుంచి తీసి రైతులకూ, నిరుద్యోగులకూ ఇస్తామన్నట్టు మాట్లాడుతున్న నేతలు అభివృద్ధి కార్యక్రమాల గురించి పెద్దగా వివరించడం లేదు. రాష్ట్రాల వనరులు ఏమిటో, వాటిని వినియోగించి అభివృద్ధికి సోపానాలు ఏట్లా వేయాలని పార్టీలు ఆలోచిస్తున్నాయో తెలియదు. పౌరులు తమ కాళ్ళపైన తాము నిలబడే విధంగా ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులు కల్పించగలదో తెలియజేయడం లేదు. విదేశాలలో దాచిన నల్లధనం తెచ్చి ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రెండున్నర లక్షలు డిపాజిట్‌ చేస్తానంటూ బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ వాగ్దానం చేసి అభాసుపాలు కాలేదా?  గెలుపు ముఖ్యం. అందుకోసం అరచేతిలో వైకుంఠం చూపిద్దాం. గెలిచిన తర్వాత చూసుకుందాం అనే ధీమా  పార్టీల చేత చాంతాడంత వాగ్దానాలు చేయిస్తున్నది. 

ఫిరాయింపుల నిరోధం
మరో అత్యంత ప్రమాదకరమైన అంశం ఫిరాయింపు. ఫిరాయింపుల నిరోధం కోసం రాజీవ్‌గాంధీ, వాజపేయి ఎంత కృషి చేసినా చట్టం చట్టుబండలై ఫిరాయింపుల వ్యాపారం నిస్సిగ్గుగా సాగిపోతోంది. రాజ్యాంగాన్ని కొందరు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తుంటే రాజ్యాంగబద్ధమైన ఉన్నత పదవులలో ఉన్నవారు ఆక్షేపించడం కూడా మానివేశారు. కొన్ని సందర్భాలలో ఉన్నత పదవులలో ఉన్నవారే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. ఏకంగా మంత్రివర్గాలే ఫిరాయిం చడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో చెప్పుకోదగిన విశేషం. ఈ ఆత్మహననం నిర్నిరోధంగా కొనసాగుతోంది. 

ఉదాహరణకు గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ అనారోగ్యం కారణంగా అక్కడ కొత్త ముఖ్యమంత్రికి పగ్గాలు అందించాలి. అందుకు అవసరమైన మెజారిటీ అధికార బీజేపీకి లేదు. అందుకని ఒక రోజు ఇద్దరు కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏలను ఢిల్లీకి విమానంలో రప్పించుకొని కేంద్ర విద్యుచ్ఛక్తి మంత్రి పీయూష్‌గోయెల్‌ బీజేపీ కండువాలు దర్జాగా కప్పేశారు. ఆ విధంగా మెజారిటీ లేమి సమస్యను అధిగమించారు. ఆ క్రమంలో రాజ్యాంగాన్ని మరోసారి కుళ్ళబొడిచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి తన ఎంఎల్‌ఏలను ‘కొనుగోలు’ చేస్తుంటే కాంగ్రెస్‌ కూడా గట్టిగా ప్రశ్నించకపోవడం, ఇది సర్వసాధారణమైనట్టు మీడియా సైతం మిన్నకుండటం దేశంలో ప్రజాస్వామ్యం  మనుగడ పెద్ద ప్రశ్నార్థకంగా మారిందనడానికి ప్రబల నిదర్శనం.

ప్రజాస్వామ్య రక్షణకు తక్షణ చర్యలు
ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే కొన్ని నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం అత్యవసరం. 1. ఎన్నికలలో ధన ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. ఎన్నికలకు ఇంకా నెలన్నర సమయం ఉండగానే తెలంగాణలో రూ. 59 లక్షల నగదుతో వెళ్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. మహారాష్ట్ర నుంచి కరా>్ణటకకు కారులో తీసుకొని వెడుతున్న రూ. 2 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడకపోతే ఇది బహుశా రాయలసీమకు వెళ్ళి ఉండేది.  పోలీసులు పట్టుకోలేనివి ఇంతకు అనేక రెట్లు ఉంటాయి. అసలు ఇంత నల్లధనం ఎట్లా ఉత్పత్తి అవుతున్నదో తెలుసుకోవాలి. ఒక ప్రాంతీయ పార్టీ ఇతర రాష్ట్రాలలో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడి పార్టీలకు నిధులు ఎట్లా సమకూర్చుతున్నదో తెలుసుకోవాలి.  2. నల్లధనం వనరులలో ముఖ్యమైనవి నీటిపారుదల ప్రాజెక్టులూ, రోడ్ల నిర్మాణం, విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్మాణవ్యయాన్ని పెంచడం పారదర్శకంగా జరిగే విధంగా చూసేందుకు రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఏర్పాటు కావాలి.

దానికి సమాంతరంగా పౌరసమాజం తరఫున కూడా ఒక నిఘావ్యవస్థ నిర్మాణం జరగాలి. ఇరిగేషన్, రోడ్డు నిర్మాణం వంటి పనుల కాంట్రాక్ట్‌ ఏ రకంగా ఇస్తున్నారో పరిశీలించాలి. టెండర్లు పిలుస్తున్నారా లేక నామినేషన్‌ పద్ధతిలో అస్మదీయులకు కట్టపెడుతున్నారో గమనించాలి. ఇది కేవలం అధికారపార్టీకి వదిలివేయవలసిన అంశం కాదు. ప్రాజెక్టుల పేరు మీద అప్పులు చేస్తున్నారు. అవి ఏ రకంగా ఖర్చు అవుతున్నాయో ప్రజలు తెలుసుకోవాలి. 4. సమాచార హక్కు చట్టాన్ని అమలు చేయడమే కాకుండా అడగకుండానే వివరాలు ఇచ్చే పద్ధతి (డ్యూటీ టు రిపోర్ట్‌) ప్రవేశపెట్టాలి. 5. గ్రామపంచాయతీలకూ, స్థానిక సంస్థలకు క్రమం తప్పకుండా ఎన్నికలు విధిగా జరిపించాలి. స్థానిక సంస్థలకు విధులూ, నిధులూ వికేంద్రీకరించాలి. జన్మభూమి కమిటీల వంటి సమాంతర పక్షపాత వ్యవస్థను రద్దు చేయాలి. ఇలాంటి కమిటీలు ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధం.  6. ఫిరాయింపుల నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి. 2003లో ఆ చట్టానికి చేసిన సవరణలు సరిపోవని తేలిపోయింది. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతుల నుంచి తొలగించాలి. ఒక వేళ దాన్ని మార్చకూడదనుకుంటే ఫలానా గడువులోగా నిర్ణయం తీసుకోవాలనే నిబంధన పెట్టాలి.

స్పీకర్‌  నిర్ణయాన్ని పరిశీలించి తిరస్కరించే లేదా ఆమోదించే అధికారం హైకోర్టుకు ఉండాలి. గడువులోగా సభాపతి నిర్ణయం తీసుకోకపోతే ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలి. ముఖ్యమంత్రుల దగ్గర ‘జోహుకుం’ అనే స్పీకర్లకు నిర్ణయాధికారాలు ఇవ్వడం, ఈ విషయంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదంటూ ఆంక్ష విధించడంతో ఫిరాయింపులు పగ్గాలు తెంచుకొని జోరుగా సాగుతున్నాయి. నైతిక విలువలు లుప్తమైన పార్టీలు అధికారంలో ఉండటంతో అవి నీతి రాజకీయానికి హద్దూపద్దూ లేకుండా పోతున్నది. ఈ విశృంఖలత్వాన్ని అరి కట్టకపోతే దేశంలో ప్రజాస్వామ్యం నేతిబీరకాయలో నేతిచందం అవుతుంది.


కె. రామచంద్రమూర్తి
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement