ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు? | k Ramachandra Murthy Article On Five State Assembly Elections Results | Sakshi
Sakshi News home page

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేదెవరు?

Published Sun, Dec 9 2018 1:14 AM | Last Updated on Sun, Dec 9 2018 8:03 AM

k Ramachandra Murthy Article On Five State Assembly Elections Results - Sakshi

శుక్రవారం పోలింగ్‌తో అయిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ప్రక్రియ చరమాంకంలోకి వచ్చింది. ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తే కార్యక్రమం పూర్తవుతుంది. పోలింగ్‌ రోజు సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలను చూస్తే సంబరాలు జరుపుకునే స్థితిలో ఏ పార్టీ ఉండబోదని అనిపిస్తున్నది. రాజస్థాన్‌లో బీజేపీ ఓడిపోతుందనీ, కాంగ్రెస్‌ సునాయాసంగా గెలుస్తుందనీ సర్వే చేసిన సంస్థలన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరాటం జరిగింది. ఫలితాలలో సైతం పెద్దగా వ్యత్యాసం ఉండదు. మిజోరంలో మిజోనేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) 18 స్థానాలు గెలుచుకొని, ఇండిపెండెంట్ల సహకారంతో కాంగ్రెస్‌ను గద్దె దింపి ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) మెజారిటీ స్థానాలు గెలుచుకొని అధికారంలో కొనసాగుతుందని అత్యధికుల అంచనా. 

ఒకే పార్టీ, ఒకే ముఖ్యమంత్రి మూడు విడతలు ఎన్నికై పదిహేనేళ్ళు పరిపాలించిన తర్వాత వారి పట్ల ప్రజలలో విముఖత ఏర్పడితే ఆశ్చర్యం లేదు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్, ఛత్తీస్‌గఢ్‌ ముఖియా రమణ్‌సింగ్‌ ఎంత ప్రజారంజకంగా పరిపాలించినా సుదీర్ఘకాలం అధికారంలో ఉండటం వల్ల వారంటే ప్రజలకు  మొహం మొత్తుతుంది.  230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో బీజేపీ 110 సీట్లు, కాంగ్రెస్‌ 109 సీట్లు గెలిచే అవకాశం ఉన్నదనీ, బీఎస్‌పీకి రెండు స్థానాలు లభించవచ్చుననీ ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాల సగటు సూచిస్తున్నది. మూడు విడతలు గెలిచిన పార్టీని నాలుగోసారి సైతం ఖాయంగా ఓడిస్తామని ఘంటాపథంగా చెప్పలేని అసమర్థత కాంగ్రెస్‌దీ, దాన్ని పట్టిపల్లార్చుతున్న బహునాయకత్వానిదీ. ఛత్తీస్‌గఢ్‌లో హంగ్‌ రావచ్చునని సర్వేక్షకులు అంటున్నారు.

వాజపేయి హయాంలో ఉత్తరాఖండ్, జార్ఖండ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఆ రాష్ట్రాన్ని  కాంగ్రెస్‌ తరఫున తొలి ముఖ్యమంత్రిగా మూడేళ్ళు పరిపాలించిన అజిత్‌జోగీ పార్టీ అధిష్ఠానంపైన అలిగి ఛత్తీస్‌గఢ్‌ జనతా కాంగ్రెస్‌ (సీజేసీ) పేరుతో సొంత కుంపటి పెట్టు కున్నారు. సీజేసీ, బీఎస్‌పీ (బహుజన సమాజ్‌ పార్టీ), సీపీఐ కలిసి ఒక కూట మిగా ఏర్పడినాయి. ఎగ్జిట్‌పోల్స్‌ సరాసరి చూసినట్లయితే 90 స్థానాలు కలిగిన ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీలో బీజేపీకి 41, కాంగ్రెస్‌కి 42 స్థానాలు లభిస్తాయి. జోగీ కూటమికి నాలుగు స్థానాలు వస్తాయని అంచనా. 46 మంది ఎంఎల్‌ఏలు ఏ పక్షంతో ఉంటే దానిదే అధికారం. కాంగ్రెస్, జోగీ కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. జోగీ కాంగ్రెస్‌వైపు మొగ్గుతారో, బీజేపీనే నయం అనుకుంటారో తెలియదు. ముగ్గురు ఇండిపెండెంట్లు ఎవరిని బలపరుస్తారో చూడాలి. మొత్తం మీద జోగీ కింగ్‌ కానీ, కింగ్‌ మేకర్‌ కానీ కావచ్చు. 

రాజస్థాన్‌లో 1993 నుంచి ఇంతవరకూ అయిదు సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రతిసారీ ప్రజలు అధికారపార్టీని ఓడించి ప్రతిపక్షానికి అధికారం అప్పగించారు. కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఈ రాష్ట్రంలో ప్రధానంగా పోటీ. 200 స్థానాలు కలిగిన రాజస్థాన్‌ అసెంబ్లీలో ఈసారి బీజేపీకి 78 స్థానాలు మాత్రమే దక్కుతాయనీ, కాంగ్రెస్‌ 110 స్థానాలు గెలుచుకుంటుందనీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి. ఏ మాత్రం సందేహం లేకుండా కాంగ్రెస్‌ ఆధిక్యం సాధిస్తుందని చెప్పగలుగుతున్న ఒకే ఒక రాష్ట్రం రాజస్థాన్‌.

ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎగ్జిట్‌పోల్స్‌  నిర్వహించిన పదకొండు సంస్థల ఫలితాల సగటు పరిశీలిస్తే టీఆర్‌ఎస్‌కు 67 సీట్లు వస్తాయని తేలుతోంది. ప్రజా కూటమికి 39, బీజేపీకీ 5 రావచ్చునంటున్నారు. 119 మంది సభ్యులు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో 61 మంది ఎంఎల్‌ఏలు ఉన్న పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇక్కడ రీపోలింగ్‌ అవసరం రాకుండా, హింసకు ఆస్కారం లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు దోహదపడిన డీజీపీ మహేందర్‌ రెడ్డిని, పోలీసు యంత్రాంగాన్ని అభినందించాలి.

టీఆర్‌ఎస్‌కే పట్టం
తెలంగాణ అతి పిన్న రాష్ట్రం. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ పట్ల, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల ప్రజలలో ఆరాధనాభావం ఉన్నది. ఆగ్రహం సైతం ఉన్నది. కేసీఆర్‌ను గద్దె దింపేందుకు కాంగ్రెస్‌ విశేష ప్రయత్నం చేసింది. ప్రొఫెసర్‌ కోదండరామ్‌ నాయకత్వంలోని తెలంగాణ జన సమితి (టీజెఎస్‌)నీ, సీపీఐనీ కలుపుకొని ప్రజా కూటమిని ఏర్పాటు చేయడంతో పాటు ఆజన్మ విరోధి అయిన తెలుగు దేశం పార్టీ (టీడీపీ)ని కూటమిలోకి ఆహ్వానించింది. వ్రతం చెడినా ఫలం దక్కక పోవచ్చునని ఎగ్జిట్‌పోల్స్‌ సూచిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఖమ్మంలో జరిగిన బహిరంగసభలో వేదిక పంచు కున్నారు. గతం గతః అనుకున్నామనీ, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న గతాన్ని విస్మరించి దేశంలో ప్రజాస్వామ్యాన్నీ, ప్రజాస్వామ్య సంస్థలనీ కాపాడేందుకు కలసికట్టుగా పోరాడాలని తీర్మానించుకున్నట్టు ఇద్దరూ చెప్పారు. కాంగ్రెస్‌ను పాతరేసేందుకే ఆవిర్భవించిన టీడీపీతో కాంగ్రెస్‌ ఎన్నికల పొత్తు ఏమిటనే ప్రశ్న సహజంగానే తెరపైకి వచ్చింది. కాంగ్రెస్‌–టీజేఎస్‌–సీపీఐ కూటమి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇస్తుందని భావించిన టీఆర్‌ఎస్‌ నేతలకు చంద్రబాబుతో కాంగ్రెస్‌ దోస్తీ ఒక వరప్రసాదంగా కలసివచ్చింది. ఎన్నికలు వస్తాయి, పోతాయి. ఒక పార్టీ గెలుస్తుంది. మరో పార్టీ ఓడిపోతుంది. ఇప్పుడు ఓడిపోయిన పార్టీ మరోసారి గెలుపొందుతుంది. బిల్లీ గ్రాహం వంటి మతప్రచారకులూ, వుడ్రో విల్సన్‌ వంటి రాజకీయనాయకులూ చెప్పిన హితవాక్యం ఏమంటే, ‘ధనం పోతే నష్టం లేదు. ఆరోగ్యం పోతే కొంత నష్టం. శీలం (క్యారెక్టర్‌) కోల్పోతే సర్వస్వం కోల్పోయినట్టే’. ఇది వ్యక్తిత్వవికాసంలో ముఖ్యమైన అంశం. 

ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలే నిజమైతే తెలంగాణ ఎన్నికలలో ముగ్గురు నాయకులు నష్టబోతారు. జాతీయ స్థాయిలో మోదీ–అమిత్‌ షాల రాజ్యానికి ప్రత్యామ్నాయం నిర్మించాలనే ప్రయత్నానికి తెలంగాణలో రాహుల్‌గాంధీ, చంద్రబాబు నాందీప్రస్థావన చేశారు. తెలంగాణలో ప్రజాకూటమి లగడపాటి చెప్పినట్టు విజయం సాధిస్తే రాహుల్‌గాంధీకీ, చంద్రబాబుకూ గొప్ప ప్రయోజనం కలుగుతుంది. జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటుచేసే ప్రయత్నాలకు మంచి ఊపు లభిస్తుంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో పాటు తెలంగాణలో కూడా విజయం సాధిస్తే రాహుల్‌గాంధీని పట్టుకోవడానికి పగ్గాలు ఉండవు. మోదీకి ప్రత్యామ్నాయంగా జాతీయ యవనికపైన రాహుల్‌ అవతరించినట్టే.

మహాకూటమిలోకి మాయావతిని తీసుకొని రాగలిగితే, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, కాంగ్రెస్, అజిత్‌సింగ్‌ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) కలసి పోటీ చేస్తే బీజేపీ కోలుకోలేని దెబ్బతింటుంది. యూపీలోని మొత్తం 80 లోక్‌సభ స్థానాలలోనూ ఈ కూటమికి 65 వరకూ వచ్చినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు భావిస్తున్నారు. ఇటువంటి స్నేహమే మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ వంటి రాష్ట్రాలలో కూడా వెల్లివెరిస్తే బీజేపీకి కష్టాలు తప్పవు. మోదీ వ్యతిరేక శక్తుల ఐక్యతకు కొత్త శక్తి అబ్బుతుంది. రాహుల్‌గాంధీకి స్ఫూర్తిప్రదాతగా, ప్రత్యామ్నాయ కూటమి నిర్మాణంలో సూత్రధారిగా మరోసారి ఢిల్లీలో చక్రం తిప్పడానికి చంద్రబాబుకు అవకాశం వస్తుంది. పాదయాత్రలో ప్రజలను అసాధారణ స్థాయిలో ఆకర్షిస్తూ వారి హృదయాలను గెలుచుకుంటున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని వచ్చే సంవత్సరం జరగబోయే ఎన్నికలలో ఎదుర్కోగలనని అందరినీ నమ్మించే ప్రయత్నం చేస్తారు. ప్రొఫెసర్‌ కోదడరామ్‌ ఆబోరు కొంతమేరకు దక్కుతుంది. గడ్డం ఉంచుకున్నా గీయించుకున్నా టీపీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ ఉత్తమకుమార్‌రెడ్డిని గబ్బర్‌ సింగ్‌గా ఆపద్ధర్మ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్‌) అంగీకరించక తప్పదు. 

శీలం ప్రధానం
ఎగ్జిట్‌పోల్‌ నిర్వహించిన సంస్థలలో అత్యధిక సంస్థలు చెప్పినట్టు ప్రజాకూటమి వీగిపోయి టీఆర్‌ఎస్‌కే మెజారిటీ లభిస్తే ఎన్‌డీఏ ప్రత్యామ్నాయ కూటమి నిర్మించాలనే సంకల్పం బలహీనపడుతుంది. రాహుల్‌గాంధీ ప్రతిష్ట దెబ్బతింటుంది. జాతీయ స్థాయిలో చంద్రబాబు చలామణి తగ్గిపోతుంది. బీజేపీ, కాంగ్రెస్‌లు లేకుండా ప్రాంతీయ పార్టీలను కలిపి ఫెడరల్‌ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రతి పాదనతో కేసీఆర్‌ తిరిగి ఢిల్లీ వెళ్ళి నేతలతో సంప్రదింపులు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు మరింత బలహీనపడతారు. మూడున్నర దశాబ్దాలు అడుగడుగునా కాంగ్రెస్‌ను ప్రతిఘటించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా రాహుల్‌గాంధీ ఏమి  నిరూపించారు? గెలుపే ప్రధానమనీ, విజయం కోసం ఏ పనైనా చేస్తాననీ చాటి చెప్పారు. శీలం ప్రధానం కాదనీ, అవకాశవాదం పట్ల అభ్యంతరం లేదనీ తేల్చారు. ఎన్నికలలో గెలుపుకోసం ఎవరితోనైనా భుజం కలపవచ్చునని చెప్పకనే చెప్పారు. దశాబ్దాల తరబడి స్థానిక టీడీపీ నేతలతో ఘర్షణ పడి, కోర్టు కేసులు పెట్టుకొని, తరతరాలుగా వైరం కొనసాగిస్తున్న కాంగ్రెస్‌ నాయకులకు ఇది మింగుడు పడని విధానం. ఇదే విధంగా టీడీపీ నాయకులు సైతం భావించి ఉంటారు. పదవే పరమావధిగా భావించే నాయకులకు ఎటువంటి అపవిత్ర కలయికల పట్లా అభ్యంతరం ఉండదు కానీ నికార్సయిన కార్యకర్తలకూ, మండల స్థాయి నాయకులకూ ప్రత్యర్థులతో రాజీపడటం సుతరామూ ఇష్టం ఉండదు. లగడపాటి జోస్యం నిజం కాకపోతే ఉత్తమ కుమార్‌రెడ్డి కల చెదిరిపోతుంది. తెలంగాణలో పార్టీ అధ్యక్షుడుగా ఉత్తమ్‌ నిర్విరామంగా కృషి చేశారు. చంద్రబాబుతో స్నేహం చేటు చేసిందని మనసులో బాధపడవలసిందే.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అందరి కంటే అధికంగా నష్టపోయిన వ్యక్తి ప్రొఫెసర్‌ కోదండరామ్‌. 2009 డిసెంబర్‌లో తెలంగాణ సంయుక్త కార్యాచరణ సంఘం (తెలంగాణ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ–టీజాక్‌) ఆవిర్భవించినప్పటి నుంచీ దానికి నాయకత్వం వహిస్తూ ఉద్యమాన్ని కొనసాగించడంలో ముఖ్యమైన భూమిక పోషించిన కోదండరామ్‌కు తెలంగాణ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నది. రాజకీయ అంశాలపైన పోరాడాలంటే రాజకీయ పార్టీ పెట్టాలనీ, లేదంటే ఏదైనా రాజకీయ పార్టీలో చేరాలనీ వాదించినవారిలో ఈ రచయితా ఒకడు. పార్టీ పెట్టిన తర్వాత సమర్థులైన సహచరులు లభించకపోవడం, పార్టీ నిర్మాణానికి సమయం లేకపోవడం, ఎన్నికలు తరుముకుంటూ రావడం, కాకలు తీరిన కాంగ్రెస్‌ నాయకులతో వ్యవహారం చేయవలసి రావడంతో కోదండరామ్‌ గందరగోళానికి గురి అయినట్టు కనిపించారు. ఎప్పుడైతే టీడీపీతో పొత్తు పెట్టు కోవడానికి కాంగ్రెస్‌ సిద్ధపడిందో అప్పుడే ఆ కూటమి నుంచి టీజేఎస్‌ వైదొలగ వలసింది. చంద్రబాబును కోదండరామ్‌ నవ్వుతూ పలకరించడం, గద్దర్‌ ఆలింగనం చేసుకోవడం తెలంగాణ ఉద్యమంతో మమేకమైనవారికి నచ్చదు.

ఆ ఇద్దరి సహకారం
కేసీఆర్‌ సైతం తెలంగాణ ఉద్యమ స్వభావానికి భిన్నంగా వ్యవహరించిన సందర్భాలు ఉన్నాయి. టీడీపీ టిక్కెట్టుపైన పోటీ చేసి గెలిచినవారినీ, ఓడిన వారినీ మంత్రివర్గంలోకి తీసుకోవడం, తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారిని సైతం ఆదరించడాన్ని జనం ఆమోదించలేదు. తప్పనిసరిగా ఓడిపోతారని తెలిసి కూడా చాలామంది ఎంఎల్‌ఏలకు మళ్ళీ టిక్కెట్లు ఇచ్చారు. ఇన్ని పనులు చేసినా టీఆర్‌ఎస్‌ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయంటే అందుకు కేసీఆర్‌ అమలు చేస్తున్న సంక్షేమకార్యక్రమాలు కారణం. ఆయన విజయం సాధిస్తే ఇద్దరు ప్రముఖులకు విధిగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఒకరు మోదీ. మరొకరు చంద్రబాబు. మోదీ మూడు సభలలో పాల్గొని సమర్థంగా ప్రచారం చేయడమే కాకుండా అమిత్‌షానూ, డజను మందికిపైగా కేంద్ర మంత్రులనూ తెలంగాణలో ప్రచారానికి దించారు.

బీజేపీకి సీట్లు పెద్దగా పెరగక పోయినా ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుందని సర్వేలు సూచిస్తున్నాయి. అంటే, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు అధికభాగం ప్రజాకూటమికి పోకుండా బీజేపీ అడ్డుకొని టీఆర్‌ఎస్‌ను ఆదుకున్నదని అర్థం. ప్రజాకూటమి తరఫున విడుదల చేసిన ప్రచార సామగ్రిలో చంద్రబాబు ప్రముఖంగా కనిపించి, నాలుగైదు రోజులు ఖమ్మంలోనూ, హైదరాబాద్‌లోనూ విస్తృతంగా ప్రచారం చేసి కేసీఆర్‌కు గొప్ప మేలు చేశారు. ‘నిర్ణయాలు హైదరాబాద్‌లో జరగాలా, అమరావతిలో జరగాలా?’ ‘నేను కావాలా, చంద్రబాబు కావాలా?’ ‘రెండు రాష్ట్రాలనూ తిరిగి కలిపేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు తెలంగాణకు అవసరమా?’ అంటూ ఎన్నికల సభలలో ప్రజలను ప్రశ్నించి సమాధానం చెప్పించే వీలు కేసీఆర్‌కు దొరికింది. చంద్రబాబు రంగంలో దిగకపోతే ఆయనను ఒక ఆయుధంగా వినియోగించుకునే అవకాశం కేసీఆర్‌కు ఉండేది కాదు.


- కె. రామచంద్రమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement