క్షీణ సంస్కృతికి ఆనవాళ్లు! | Ramachandra Murthy Article On Chandrababu Cash For Vote Case | Sakshi
Sakshi News home page

క్షీణ సంస్కృతికి ఆనవాళ్లు!

Published Sun, Sep 30 2018 12:30 AM | Last Updated on Sun, Sep 30 2018 12:30 AM

Ramachandra Murthy Article On Chandrababu Cash For Vote Case - Sakshi

మన వైఖరి మనం ఎక్కడున్నామనే అంశంపైన ఆధార పడి ఉంటుందని దక్షిణాఫ్రికా స్వాతంత్య్ర సమరయోధుడు నెల్సన్‌ మండేలా అనేవారు.'Where you stand depends on where you sit.' కొంతకాలంగా రాజకీయా లను పరిశీలిస్తున్నవారికి మండేలా మాటలు అక్షరసత్యా లుగా అగుపిస్తాయి. ప్రధాని నరేంద్రమోదీ గురించి ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్‌డీఏ భాగ స్వామిగా ఉండగా ఏమని అన్నారో, ఎన్‌డీఏ నుంచి నిష్క్రమించిన తర్వాత ఏమంటున్నారో గమనిస్తే మండేలా ఆంతర్యం సులభంగా అర్థం అవుతుంది. ఎన్‌డీఏ భాగస్వా మిగా ఇద్దరు టీడీపీ మంత్రులు కేంద్ర ప్రభుత్వంలో, ఇద్దరు బీజేపీ మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నంత కాలం మోదీ సమర్థుడైన నేత. తెగతెంపులు చేసుకున్నట్టు ప్రపంచాన్ని నమ్మించాలి కనుక ఇప్పుడు మోదీ ఆంధ్రులకు ఎనలేని ద్రోహం చేసిన పరమదుర్మార్గుడు. కేంద్రస్థాయిలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవిఎల్‌ నరసింహారావు, రాష్ట్ర స్థాయిలో బీజేపీ నేతలు కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు ప్రభృతులు చంద్రబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలుసుకున్నట్టు విమర్శలు గుప్పిస్తున్నారు. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంలో ‘మోదీ దొంగ’ అంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అభివర్ణిస్తే ‘రాహుల్‌ అబద్ధాలకోరు’ అంటూ మోదీ జవాబు చెప్పారు. దిగజారిన  రాజకీయ సంస్కృతి అన్ని రాష్ట్రాలలో మాదిరే తెలుగు రాష్ట్రాలలోనూ కనిపిస్తున్నది. కంపరం కలిగి స్తున్నది.  

ఇప్పుడు వార్తలలోని వ్యక్తి రేవంత్‌రెడ్డి ఎవరు? ఒక మాజీ శాసనసభ్యుడు. టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత విశ్వాసపాత్రుడు. రేవంత్‌రెడ్డి పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మార్మోగడానికి ఆయన చేసిన ఘన కార్యం ఏమిటి? ‘ఓటుకు కోట్లు’ కేసులో టీఆర్‌ఎస్‌ శాసన సభ్యుడు ఎల్విస్‌ స్టీఫెన్సన్‌కు రూ. 50 లక్షల నగదు లంచంగా ఇస్తూ కెమేరాకు దొరికిపోయారు. కుమార్తె వివా హానికి ముహూర్తం పెట్టుకున్న తరుణంలో ఈ అనైతిక వ్యవహారంలో ఇరుక్కొని జైలుకు వెళ్ళవలసి వచ్చింది. శాసనమండలి ఎన్నికలలో వేం నరేంద్రరెడ్డి అనే టీడీపీ అభ్యర్థిని గెలిపించుకునే వ్యూహంలో భాగంగా మొత్తం అయిదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి బయానాగా రూ. 50 లక్షలు చెల్లించిన సందర్భం. ఈ వ్యవహారంలో వ్యూహకర్త, సూత్రధారి చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం. ఏసీబీ ద్వారా రేవంత్‌ని పట్టించింది, స్టీఫె న్సన్‌తో ‘మా వాళ్ళు బ్రీఫ్డ్‌ మీ’ అంటూ చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడిన మాటలను రికార్డు చేయించిందీ తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) అనే విషయంలో సైతం ఎవ్వరికీ అనుమానాలు లేవు. ఇద్దరు చంద్రుల మధ్య జరిగిన ఆధిపత్యపోరులో కేసీఆర్‌ విజయం సాధించారు.

చంద్రబాబు హైదరాబాద్‌ నుంచి పలాయనం చిత్తగించారు. టేపులో గొంతు తనది కాదని చెప్పలేదు (ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ కూడా అది చంద్రబాబు స్వర మేనంటూ ధ్రువీకరించింది). ‘మీకు పోలీసులు ఉంటే మాకూ పోలీసులు ఉన్నారు. మీకు ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఉంటే మాకూ ఉన్నది’ అంటూ ‘ఓటుకు కోట్లు’ వ్యవహా రాన్ని రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మార్చి దబాయిం చడానికి ప్రయత్నించారు. రేవంత్‌రెడ్డిపైన తెలంగాణ ఏసీబీ అభియోగపత్రం దాఖలు చేసింది. అందులో చంద్ర బాబు పేరు అనేక విడతలు రాశారు. తన ఫోన్‌ సంభాష ణను ట్యాప్‌ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపైన చంద్రబాబు కేసు పెట్టారు. ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్‌ ఏసీబీని ఆదేశించారు. రేవంత్‌ కుమార్తె వివాహానికి సకుటుంబ సమేతంగా హాజరై తన శిష్యుడికి పూర్తి మద్దతు ప్రకటించారు. రేవంత్‌కి సీబీఐ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బెయిల్‌ రద్దు చేయవలసిందిగా తెలంగాణ ఏసీబీ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన తర్వాత రేవంత్‌ విజయోత్సవ సభ నిర్వహించారు. కేసీఆర్‌పైన తీవ్రపదజాలంతో దాడి చేశారు. ఆయన మళ్ళీ వెనక్కు తిరిగి చూడలేదు. 

పని చేయని చట్టం
నిగూఢమైన కారణాలు వల్ల ‘ఓటుకు కోట్లు కేసు’ ఒక దశలో ఆగిపోయింది. ఎవరో పెద్దలు చంద్రబాబుకీS, కేసీఆ ర్‌కీ మధ్య రాజీ కుదిర్చారని వదంతులు వినిపించాయి. యదార్థంగా ఏమి జరిగిందో తెలియదు. చట్టం తన  పని తాను చేసుకొనిపోవడం లేదని మాత్రం తెలుసు. లేకపోతే స్పష్టమైన దృశ్యశ్రవణ ఆధారాలు ఉన్న ఈ కేసులో రేవంత్‌ రెడ్డికీ, మరికొందరికీ శిక్షలు పడేవి. చంద్రబాబు అభిశం సన అనివార్యమయ్యేది. కథ అంత దూరం వెళ్ళలేదు. ఈ లోగా టీడీపీ టిక్కెట్టుపైన తెలంగాణ శాసనసభకు గెలిచిన వారిలో చాలామంది టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం కాంగ్రెస్‌లోకి అట్టహాసంగా ప్రవేశిం చారు. ఒక కేసులో ప్రథమ నిందితుడిగా ఉన్న రాజకీయ నాయకుడికి కాంగ్రెస్‌ ఎర్రతివాచీ పరిచి ఎందుకు ఘన స్వాగతం చెప్పింది? ఆ పార్టీకి విలువల పట్ల గౌరవం లేదు. కనీసం గౌరవం ఉన్నట్టు నటించాలన్న స్పృహసైతం లేదు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ప్రభుత్వానికి దూరంగా ఉన్న మేధావులూ, వివిధ వృత్తు లలో పని చేసినవారూ, రాజకీయాలలో ఆసక్తి ఉన్నవారూ చాలా మంది ఉన్నారు. వారిలో ఒక్కరిని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కాంగ్రెస్‌ నేతలు చేయలేదు. యువ తీయువకులకు పార్టీలోకి స్వాగతం చెప్పి వారికి ప్రాధా న్యం ఇవ్వాలన్న ఆలోచన కూడా లేదు. పదేళ్ళు కాంగ్రెస్‌ పాలనలో వివిధ పదవులు అనుభవించి, అందినంత సంపాదించుకున్నవారు గత నాలుగున్నర సంవత్సరాలుగా పార్టీని బలోపేతం చేసేందుకు ఒక్క రూపాయి ఖర్చు చేయ డానికి ముందుకు రాలేదు. చంద్రబాబుకి కాంగ్రెస్‌తో రహస్యానుబంధం తొలి నుంచీ కొనసాగుతూనే ఉన్నది.

రాహుల్‌గాంధీకి సలహాదారులుగానో, సన్నిహితులుగానో చెలామణి అవుతున్నవారితో మాట్లాడి దేనికైనా ఒప్పించ గల సౌలభ్యం ఉంది. చంద్రబాబుతో కలసి పని చేయాలని కోరుకునే కాంగ్రెస్‌ నాయకులు ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలం గాణలో ఎక్కువ ఉన్నారు. వారికి సహచరులపైన విశ్వాసం లేదు. ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా అంగీకరించడానికి మరొకరు ఇష్టపడరు. అందుకు తాము మాత్రమే సమర్థుల మంటూ త్రికరణశుద్ధిగా భావిస్తున్నవారు కనీసం అరడ జను మంది ఉన్నారు. రేవంత్‌ను పార్టీలోకి ఆహ్వానించడం అంటే చంద్రబాబు అండదండలు అందుకోవడమే అన్న అవగాహన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఉంది. టీఆర్‌ఎ స్‌ను ఎదుర్కోవడంలో నిధుల కొరతతో బెంగటిల్లుతున్న తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు చంద్రబాబుతో స్నేహం కొండంత బలం. ఆయన అన్ని విధాలా ఆదుకుంటారన్న ఆశ. తమ పార్టీని భూస్థాపితం చేయడమే లక్ష్యంగా ఆవి ర్భవించిన టీడీపీతో ఎన్నికల పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెస్‌ నాయకులు సంకోచించలేదు. తమ అధినేత సోనియాగాంధీని అనరాని మాటలు అంటూ కాంగ్రెస్‌ను ముక్కలు ముక్కలుగా నరకాలంటూ టీడీపీ శ్రేణులను ప్రేరేపించిన చంద్రబాబు పరిష్వంగం వారికి అభ్యంతర కంగా తోచలేదు. ఎట్లాగైనా టీఆర్‌ఎస్‌ను ఓడించి అధి కారం హస్తగతం చేసుకోవాలి. అందుకోసం అడ్డదారులు తొక్కినా పర్వాలేదు. ఇదే సూత్రాన్ని రాహుల్‌తో చెప్పి ఒప్పించి ఉంటారు. అందుకే రేవంత్‌రెడ్డిని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ఆ విధంగా చంద్ర బాబుకి ‘మహాకూటమి’లో నిర్ణాయక పాత్ర ఇచ్చారు. 

సుమన్‌ ధ్వజం
సీట్ల సర్దుబాట్లు చేసుకొని, ఎన్నికల ప్రణాళిక రూపొందిం చుకొని సమరశంఖం పూరించేందుకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో గురువారంనాడు రేవంత్‌రెడ్డి నివాసంపైనా, ఆయన బంధువుల ఇళ్ళపైనా, వ్యాపార సంస్థలపైనా ఆదా యంపన్ను శాఖ అధికారులు దాడులు ఆరంభించారు. శనివారం సాయంత్రం వరకూ సోదాలు సాగాయి. అధికా రులు ఎటువంటి ప్రకటన చేయకపోయినా రకరకాల కథ నాలు మీడియాలో వస్తున్నాయి. సోదాలలో లభించే నిధులు చంద్రబాబువేన నీ, రేవంత్‌ టీడీపీ అధినేత బినామీ అనీ వ్యాఖ్యలు వినిపించాయి. ప్రధానినీ, ముఖ్యమంత్రినీ, మీడియానూ దుయ్యపడుతూ రేవంత్‌ చెలరేగిపోయారు. అంతే కటువుగా, అంతకంటే మొరటుగా టీఆర్‌ఎస్‌ లోక్‌ సభ సభ్యుడు బాల్క సుమన్‌ స్పందించారు. ఎంత రెచ్చ గొట్టినా కేసీఆర్‌ రేవంత్‌తో ముఖాముఖికి దిగరు. అది తన స్థాయి కాదని ఆయన అభిప్రాయం. అందుకని సుమన్‌ను ప్రయోగించారు. ఆదాయంపన్ను అధికారులు దాడులు చేయడాన్ని కాంగ్రెస్‌ నాయకులు ఖండించారు. ఇది మోదీ, కేసీఆర్‌ కలిసి కుట్రపన్ని చేసిన పని అంటూ దుయ్య పట్టారు. ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఇదే విధంగా చేస్తున్నా రనీ, ఉత్తరప్రదేశ్‌లో, తమిళనాడులో, కర్ణాటకలో ఇదే మాదిరి దాడులు జరిపించారనీ చంద్రబాబు మోదీని నిందిస్తూ రేవంత్‌రెడ్డికి తన మద్దతు మరోసారి స్పష్టంగా ప్రకటించారు.

‘ఓటుకు కోటు’ కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కొంతకాలం విజ్ఞప్తి చేసిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ఆ కేసులో పాత్రధారికి పార్టీలో పెద్దపీట వేసి సూత్రధారితో గొంతుకలుపుతున్నారు. మండేలా చెప్పి నట్టు కాంగ్రెస్, టీడీపీలు దగ్గరైన నేపథ్యంలో ‘ఓటుకు కోట్లు’ కేసులో నిందితులు కాంగ్రెస్‌కు మిత్రులైనారు. ఈ  దాడులకు మరోకోణం ఉంది. గుజరాత్, కర్ణాటక శాసన సభ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌కి నిధులు సమకూర్చినట్టు మోదీకి సమాచారం ఉందట. ఆ నిధులను రేవంత్‌ సంబంధీకుల ద్వారా చేరవేసినట్టు తెలు సుకున్నారట. ఈ నిధుల ప్రవాహానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశం తోనే దాడులు జరిగాయంటూ ఒక కథనం ప్రచారంలో ఉంది. అంతులేని నిధులు చంద్రబాబు చేతుల్లోకి ఎట్లా వచ్చాయో తెలుసుకోవాలన్న అభిలాష మోదీకి ఉన్నట్టు లేదు. బీజేపీ సైతం ఎన్నికలలో అపారమైన నిధులు ఖర్చు చేసింది. చేయబోతోంది. అంతలేసి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో ఊహించడం కష్టం కాదు. ఎన్నికల వేళ తమని విమర్శించినా ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్ర బాబు సహకారం అవసరం కావచ్చుననే ముందు చూపుతో మోదీ, అమిత్‌షాలు వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. రియల్‌పొలిటిక్‌ (అధికార రాజకీయం)లో అందెవేసిన చెయ్యి కనుక ఇప్పుడు విమర్శిస్తున్న బీజేపీతో ఎన్నికల తర్వాత మళ్ళీ స్నేహం చేసేందుకు చంద్రబాబుకి ఎటు వంటి అభ్యంతరం, సంకోచం ఉండబోవని బీజేపీ అధిష్ఠా నానికి తెలుసు.  

క్షీణ సంస్కృతి
చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రకాశం జిల్లాలోని దర్శి అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడానికి పెద్దఎత్తున అధికార దుర్వినియోగం చేసి, భారీ ఖర్చు చేసి ఎన్నికలలో ధనప్రభావం విపరీ తంగా పెరగడానికి కారకులైనారు. డబ్బు ఉన్నవారికే టిక్కెట్టు. ఎన్నికైన చట్టసభ సభ్యులు ఎన్నికలలో ఖర్చు చేసిన మొత్తాన్నీ, రాబోయే ఎన్నికలలో ఖర్చు చేయవలసిన మొత్తాన్నీ సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కడం రివాజుగా మారింది. పార్టీలూ, నాయకులూ ఎవరైనా దాదాపుగా అదే సంస్కృతి దేశం అంతటా కొనసాగు తోంది. ఈ సంస్కృతికి ప్రతినిధి రేవంత్‌రెడ్డి. యువకుడూ, ఉత్సాహవంతుడూ, ధైర్యవంతుడూ, ధాటిగా మాట్లాడే శక్తి కలిగినవాడూ అయిన రేవంత్‌ ఈ కాలపు రాజకీయ ప్రతి నిధి. కండబలం, ధనబలం, కులబలం ఉంటేనే రాజకీయా లలో మనుగడ సాధ్యమని విశ్వసించే రాజకీయులకు ప్రతీక.

రేవంత్‌పైన ఆదాయంపన్ను శాఖ దాడులను ఖండించిన చంద్రబాబు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపైన కాంగ్రెస్‌ నేతలతో షరీకై బూటకపు కేసులు బనాయింప జేశారు. అప్పుడు చట్టం తన పని తాను చేసుకొనిపోతుం దంటూ గడుసుగా వ్యాఖ్యానించిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు రేవంత్‌ని చూసి విలవిలలాడుతున్నారు. చంద్ర బాబుని మెప్పించేందుకు రేవంత్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఎంత దారుణంగా మాట్లాడారో అందరికీ తెలుసు. పరిస్థితులు మారినప్పుడు వైఖరులూ మారుతాయి. తనను అరెస్టు చేస్తారంటూ చంద్రబాబు బేలగా మాట్లా డటం కూడా ఆయన మానసిక స్థితికి అద్దం పడుతుంది. తాను చేసిన అక్రమాలు ఏమిటో ఆయన అంతరాత్మకు తెలుసు. చట్టం నిజంగానే తన పని తాను చేస్తుందనే భయం చంద్రబాబుని అప్పుడప్పుడు అశాంతికి గురి చేస్తున్నది. రేవంత్‌కి శిక్ష పడితే తన పరిస్థితి ఏమిటనే ప్రశ్న నిరంతరం వేధిస్తున్నది కాబోలు.

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement