కె.రామచంద్ర మూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్, సాక్షి
త్రికాలమ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన పర్యవసానంగా సంక్రమించిన సమస్యలను పరిష్కరించుకోలేక తొమ్మిది మాసాలుగా సతమతం అవుతున్నాయి. వివాదాలు అప రిష్కృతంగానే ఉంటే, ప్రజల ఆవేశం రెచ్చగొడుతూ అసలు సమస్యల నుంచీ, అమలు కాని హామీల నుంచీ ప్రజల దృష్టి మరల్చడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణ రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నది.
జలజగడం తాత్కాలికంగానైనా పరిష్కారం కావడం సంతోషదాయకమే. కానీ పరిష్కారమైన పద్ధతి ఎవ్వరికీ గర్వకారణం కాదు. నాగార్జునసాగర్‌కు శంకుస్థాపన చేసిన తొలిప్రధాని నెహ్రూ కానీ, ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసిన ఇందిరాగాంధీ కానీ భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడతాయనీ, రెండు రాష్ట్రాల అధికారులూ, పోలీసులూ నీటికోసం సాగర్ దగ్గరే కుమ్ములాడుకుంటారనీ ఊహించి ఉండరు.
దేశంలో పద్దెనిమిది పెద్ద నదులున్నాయి. వాటిలో పదిహేడు నదులు రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రవహిస్తున్నవే. అంటే పదిహేడు నదుల నీటికోసం రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నాయి. అన్ని వివాదాల కంటే అత్యంత తీవ్రతరమైనది కావేరీ జలవివాదం. సుప్రీంకోర్టు, ప్రధానమంత్రులు జోక్యం చేసుకున్నప్పటికీ కొరుకుడు పడని సమస్య. కొన్ని జలవివాదాలను ట్రిబ్యూ నళ్ళూ, ముఖ్యమంత్రులూ పరిష్కరించలేక న్యాయస్థానాలకు నిర్ణయాధికారం అప్పగించిన రాష్ట్రాలు ఉన్నాయి. కృష్ణా, గోదావరి నదీ జలాలపైన సైతం ఎడతెగని వివాదాలు ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నదీజలాల పంపిణీ బచావత్ ట్రిబ్యూనల్, బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యూనల్ తీర్పుల ప్రకారం జరగ వలసి ఉన్నప్పటికీ వివాదాలు అనివార్యం. ఉత్తర కర్ణాటకలో అల్మట్టి డ్యాం ఎత్తు పెంచ డాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్షేపించినప్పటికీ ట్రిబ్యూనల్ ఆమోదించింది. న్యాయ స్థానాలలో పోరాడటం, ద్వైపాక్షిక సమావేశాలలో వాదులాడు కోవడమే కానీ శుక్ర వారంనాడు నాగార్జునసాగర్‌లో జరిగినట్టు రెండు రాష్ట్రాల పోలీసులు లాఠీలతో కొట్టు కోవడం అన్నది భయం కలిగించే సరికొత్త కోణం.
సాగర్ వద్ద ఫిబ్రవరి 13న కనిపించిన ఉద్రిక్త దృశ్యం
జలయుద్ధాలు మొదలయ్యాయా?
జనాభా పెరుగుదల, వ్యవసాయాభివృద్ధి, పట్టణీకరణ కారణంగా అభివృద్ధి చెందు తున్న దేశాలలో నీటి వినియోగం పెరిగింది. మూడో ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే అది నీటికోసమేనంటూ ప్రవీణులు హెచ్చరిస్తున్నారు. నదీజల వివాదాల గురించి ఐక్యరాజ్య సమితి ఉన్నత కార్యదర్శిగా పనిచేసిన కోఫీ అన్నన్ అనేక సందర్భాలలో భయాందోళనలు వెలిబుచ్చేవారు. ఇంతవరకూ దేశాల మధ్య యుద్ధాలు చమురు కోసమో, భూభాగం ఆక్రమించుకోవడం కోసమో లేదా రాజకీయాధిపత్యం కోసమో జరిగాయనీ ఇక మీదట మాత్రం నీటి కోసమే జరుగుతాయనీ అంటున్నారు. నైలు, గంగ, బ్రహ్మపుత్ర నదులలో ఏదైనా అంతర్జాతీయ వివాదమై యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందంటూ ప్రవీణులు భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నదీజల వివాదాలు ముదిరి పాకాన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరం. లేకపోతే నదీజలాలనూ, శాంతిభద్రతలనూ కేంద్ర ప్రభుత్వమే నిర్వహించ వలసిన పరిస్థితి ఏర్పడి సమాఖ్య స్ఫూర్తికి గండికొడుతుంది.
అపోహలకు తావివ్వరాదు...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విభజన పర్యవసానంగా సంక్రమించిన సమస్యలను పరిష్కరించుకోలేక తొమ్మిది మాసాలుగా సతమతం అవుతున్నాయి. వివాదాలు అప రిష్కృతంగానే ఉంటే, ప్రజల ఆవేశం రెచ్చగొడుతూ అసలు సమస్యల నుంచీ, అమలు కాని హామీల నుంచీ ప్రజల దృష్టి మరల్చడానికి ఇద్దరు ముఖ్యమంత్రులూ ప్రయత్నిస్తు న్నారనే ఆరోపణ రెండు రాష్ట్రాలలోనూ వినిపిస్తున్నది. రాజకీయ ప్రయోజనాల కోసమో, ఆధిక్య సాధన కోసమో ప్రజలను ఇబ్బంది పెట్టడం అన్యాయం. రెండు రాష్ట్రాల వాదనలను జాగ్రత్తగా గమనిస్తే సమస్యను పరిష్కరించుకోవడం కష్టం కాదని ఎవరికైనా తెలిసిపోతుంది. దీనికోసం రెండు రాష్ట్రాల అధికారులూ జలాశయం దగ్గర తోపులాటలకు దిగడం ఎందుకు? అంతటి జటిలమైన సమస్యే కనుక అయితే గవర్నర్ సమక్షంలో సమావేశం కాగానే ఎట్లా పరిష్కారమైంది? సమస్య ఉన్నదంటే ఉంటుంది లేదంటే లేదని అనుకోవాలి. రాజకీయ నాయకులు కావాలనుకుంటే వాదులాడుకో గలరు లేదంటే సామరస్యంగా పరిష్కరించుకోగలరు.
ముందే మేల్కొని ఉంటే...
శనివారం చూపించిన విజ్ఞత గతంలో కూడా రెండు ప్రభుత్వాలూ ప్రదర్శించి ఉంటే చాలా వివాదాలు పరిష్కారమయ్యేవి. విద్యార్థుల ఉపకార వేతనాలు. ఎంసెట్ పరీక్ష నిర్వహణ వంటి చాలా అంశాలు చిక్కుముడి పడటానికి కారణం రెండు రాష్ట్ర ప్రభు త్వాల మధ్య నెలకొన్న అమిత్ర వైఖరి. ఒక చంద్రుడి కంటే మరో చంద్రుడు సమర్థు డనీ, తెలివైనవాడిననీ నిత్యం నిరూపించుకోవలసిన మానసిక అవసరం అన్ని వివా దాల వెనుక ఉన్నట్టు కనిపిస్తున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని తెలంగాణ ప్రభుత్వం వినియోగించి ఎడమ కాలువ ఒడ్డున గల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివాదం చేసిన ప్పుడు కూడా గవర్నర్ జోక్యం చేసుకోవలసి వచ్చింది. జలవనరుల మంత్రి ఉమాభారతి మధ్యవర్తిత్వం నెరపవలసి వచ్చింది. నిజానికి తెలంగాణ పట్ల ఉమాభారతికి సానుభూతి ఉన్నదని అంటారు. విద్యుత్ అవసరాలకోసం శ్రీశైలం జలాశయం మట్టం 834 అడుగుల వరకూ తగ్గేవరకూ (854 అడుగుల కనీస మట్టం ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుపట్టింది) విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చునని పరోక్షంగా ఉమాభారతి సంకేతం ఇచ్చినప్పుడు దాన్ని తెలం గాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు బహిరంగంగా ప్రకటించడంతో ఆమెకు రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. హరీష్‌రావు ప్రకటన వెలువడగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర మంత్రులు అశోక్‌గజపతి రాజుకూ, వెంకయ్యనాయుడికీ పోన్లమీద ఫోన్లు చేసి ఉమాభారతిపైన ఒత్తిడి తెచ్చారు. అప్పటి నుంచి ఆమె తెలంగాణ రాష్ట్రానికి బహిరంగంగా మద్దతు ఇవ్వడానికి జంకు తున్నారు. చెరువుల పునరుద్ధరణ పనికి కూడా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. ఉమా భారతి రావడం కుదరకనే దేవాదుల దగ్గర నిర్మించిన పైలాన్ ఆవిష్కరణ జరగలేదనీ, చెరువుల పునరుద్ధరణ పనులలో జాప్యానికి అది కూడా ఒక కారణమనే ధోరణిలో వార్తలు రావడం కూడా ఆమెకు చిరాకు కలిగించి ఉండవచ్చు. కనుక తాజా వివాదంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా తీర్పు చెప్పే పరిస్థితి లేదు కనుక గవర్నర్ సమక్షంలో రాజీ చేసుకున్నారనే అభిప్రాయం బలంగా ఉంది. వాస్తవానికి సాగర్‌లో ప్రస్తుతం ఉన్న 63 టీఎంసీ నీటిలో తాగునీటి అవసరాలకు 25 టీఎంసీలు పోను తక్కిన 38 టీ ఎంసీలనే కుడి, ఎడమ కాలువలలో వదిలే అవకాశం ఉంది.
ఎదురుచూస్తున్న ఒకటిన్నర లక్షల ఎకరాలు
కృష్ణా డెల్టాలో పంటలు రక్షించుకోవాలంటే నీరు తక్షణం విడుదల చేయడం అవసరం. ఎడమ కాలువ కింద ఖరీఫ్ పంటే ఇంకా ఒకటిన్నర లక్ష ఎకరాలలో నీటికోసం ఆవురా వురని అంటోంది. రబీ పంటకోసం నీరు కావాలి. ఒకటిన్నర లక్షల ఎకరాలలో వరి, అయిదున్నర లక్షల ఎకరాలలో అంతర్ పంటలూ ఉన్నాయి. ట్రిబ్యూనల్ కేటాయింపు లను ఆంధ్రప్రదేశ్ పూర్తిగా వినియోగించుకున్నది. కేటాయించిన మొత్తం కంటే 40 టీఎంసీల నీరు అధికంగానే వాడుకున్నది. అయినా సరే ఇంకా కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టుపడుతోంది. పంటలు రక్షించుకోవాలంటే కృష్ణ నీరు రావాలి. ఎడమ కాలువలో తెలంగాణ ప్రభుత్వం 200 క్యూసెక్కుల నీరు విడుదల చేసిందనీ, దానిలో చాలా భాగం వృధా అయిందనీ ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కి 322.6 టీఎంసీల నీరు కేటాయించగా ఇప్పటి వరకూ 365.75 టీఎంసీ నీరు వినియోగించుకున్నదని తెలంగాణ మంత్రి హరీష్‌రావు అంటున్నారు. తెలంగాణకు కేటాయించిన 239 టీఎంసీలలో 149.4 టీఎంసీలను మాత్రమే వినియోగించుకునదనీ, ఇంకా 89.5 టీఎంసీల తమ వాటా మిగిలే ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.
ట్రిబ్యూనల్ నదీజలాలను ప్రాజెక్టులవారీగా కేటాయిస్తుంది. తెలంగాణలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా, కల్వ కుర్తి వంటి ప్రాజెక్టులు పూర్తయితే కేటాయించిన నీరులో దాదాపు 70 టీఎంసీలు వాడ కం ఆ ప్రాజెక్టుల ద్వారా జరిగేది. మైనర్ ఇరిగేషన్ కింద కొంత వినియోగమ య్యేది. ప్రాజెక్టులు పూర్తి కాలేదు కనుక 200 టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ దగ్గరనే, ఎడమకాలువలోకి వదలడం ద్వారానే వినియోగించుకుంటానంటూ తెలంగాణ ప్రభు త్వం చేస్తున్న వాదన న్యాయసమ్మతం కాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటున్నది. నీటి కేటాయింపులను ట్రిబ్యూనల్ ప్రాజెక్టుల వారీగా చేస్తుంది కనుక వినియోగం కూడా ప్రాజెక్టుల వారీగానే చూపించాలన్న నిబంధన ఉంది.
ఈ సామరస్యమే కావాలి!
మొత్తం మీద ప్రస్తుతం కృష్ణా జలాలు తెలంగాణ ప్రాంతం కంటే ఆంధ్ర ప్రాంతానికి ఎక్కువ అవసరం. రెండు రాష్ట్రాలలో పంట ఎండిపోకూడదని ఇద్దరు ముఖ్య మం త్రులూ, ఇద్దరు ఇరిగేషన్ మంత్రులూ గవర్నర్ నరసింహన్ సమక్షంలో అంగీకరించారు కనుక సమస్య పరిష్కారమైంది. ఒకరకంగా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో నీరు విడుదల చేయడానికి ప్రయత్నించి, ఆ క్రమంలో చిన్నపాటి ఘర్షణ సృష్టించి సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికీ, గవర్నర్ దృష్టికీ తీసుకువెళ్ళడం ద్వారా అదనపు నీటిని సాధించుకున్నదనే చెప్పాలి. ఇదే అంగీకారం ఘర్షణ లేకుండా సామరస్యపూరిత వాతావరణంలో సమాలోచన ద్వారా జరిగితే తెలుగు ప్రజలు ఆనం దించేవారు. దేవినేని ఉమామహేశ్వరరావు, హరీష్‌రావు కలసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇటువంటి సంక్షోభం మరోసారి తలెత్తకుండా చూసుకుంటామనీ, రెండు రాష్ట్రాలలోనూ పంటనష్టం కలగకుండా జాగ్రత్తపడతామనీ ప్రకటించినప్పుడు ఆనందించని తెలుగువారు ఉండరు. ఇదే విధంగా ఘంటా శ్రీనివాసరావూ, కడియం శ్రీహరి సమావేశమై ఎంసెట్ పరీక్షలను ఉమ్మడి నిర్వహించాలని నిర్ణయించుకుంటే, రెండు రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ళ అధ్యక్షులు వేణుగోపాలరెడ్డి, పాపిరెడ్డి కూడా ఇదే రకమైన స్నేహధోరణి ప్రదర్శిస్తే ఎంత బాగుంటుంది? గోటితో పోయే సమస్యలను పట్టుదలకు పోయి గొడ్డలిదాకా తెచ్చుకొని గవర్నర్ దగ్గరికీ, కేంద్ర మం త్రుల దగ్గరికీ పరిష్కారం కోసం పరుగులు తీయడం తెలుగుజాతికి సిగ్గుచేటు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ వివేకంగా వ్యవహ రించి ఉన్నట్లయితే విద్యార్థులకూ, రైతులకూ ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. వారికి ఇంతటి మనోవేదన కలిగేది కాదు.