గుర్రం ఎగరావచ్చు! | Telangana CM KCR Third Front Formation May Be Possible | Sakshi
Sakshi News home page

గుర్రం ఎగరావచ్చు!

Published Sun, Apr 29 2018 12:09 AM | Last Updated on Wed, Aug 15 2018 8:15 PM

Telangana CM KCR Third Front Formation May Be Possible - Sakshi

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అందరూ కలలు కనాలి. వాటి సాకారం కోసం  శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) ఆవిర్భవించి 17 సంవత్సరాలైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ స్వప్నం గురించి మరోసారి ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాననీ, హైదరాబాద్‌ నుంచే భూకంపం సృష్టిస్తాననీ స్పష్టంగా ప్రకటించారు. భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ఎలుగెత్తి చాటారు. మంచిదే.

ఒక లక్ష్యం సాధించిన విజేత వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం సహజం. అసాధ్యమని చాలామంది భావించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సారథ్యం వహించిన రాజకీయ నేతకు తదుపరి లక్ష్యం దేశ రాజకీయాలపైన ప్రభావం వేయడం కావడంలో ఆశ్చర్యం లేదు. 35 సంవ త్సరాల కిందట నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) సాధించిన ఘనకార్యాన్ని తానూ సాధించగలననే ఆత్మవిశ్వాసం కేసీఆర్‌కి ఉండవచ్చు. కేసీఆర్‌ రాజకీయ చాతుర్యం, ఎత్తుగడల విషయంలో సందేహం లేదు. కానీ కల సాకారం కావడానికి పరిస్థితులు కలిసి రావాలి. అదృష్టం కూడా అవసరం.

ఫ్రాన్స్‌ చక్రవర్తి నెపోలియన్‌ బోనపార్టే మహాసేనాని. సైన్య నిర్మాణంలో, రణతంత్ర రచనలో దిట్ట. ఒకానొక సమయంలో సైన్యంలో కీలకమైన స్థానంలో ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. సలహాదారులు చాలామంది అభ్యర్థులను పరీక్షించి ఒక యోధుడిని ఎంపిక చేశారు. నెపో లియన్‌ ఆమోదం కోరారు. పోరాట పటిమ లేదా మనోబలం లేదా గతంలో అతగాడు సాధించిన విజయాల గురించి నెపోలియన్‌ ప్రశ్నించలేదు. ‘అతనికి అదృష్టం కలసి వస్తుందా (ఐటజ్ఛి luఛిజుy)?,’ అని ప్రశ్నించాడట. యుద్ధాలలో విజయం సాధించాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. అదృష్టం విధిగా ఉండా లని నెపోలియన్‌ అభిప్రాయం. రాజకీయాలలోనూ అంతే. మర్రి చెన్నారెడ్డికి లేని అదృష్టం కేసీఆర్‌కి కలిసి వచ్చింది. 

జయాపజయాలు
జయాపజయాలను యోధులు విశ్లేషించుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అపజయాలకు దారితీసిన కారణాలను తెలుసుకోవడం సులువే. విజయాలను అర్థం చేసుకోవడమే కష్టం. చాలా మంది రాజకీయ నాయకులు గెలుపును అపార్థం చేసుకొని అంతా తమ ఘనతే అనుకొని అహంకారం పెంచుకొని దెబ్బ తింటారు.  తెలంగాణ రాష్ట్ర అవతరణ ను సాధ్యం చేసిన పరిస్థితులనూ, తెలం గాణ రాష్ట్ర పాలనలో కొన్ని సత్ఫలితాలను  సాధించడానికి సహకరించిన అంశాలనూ జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి.  తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్‌ ప్రధాన పాత్రను ఎవ్వరూ ప్రశ్నించలేరు.

ఇతర ఉద్యమ నాయ కుల పాత్ర, ప్రజల ఉద్యమస్ఫూర్తి నిశ్చయంగా తోడైనాయి. ఉద్యమ కాలంలో వివిధ ఘట్టాలలో రకరకాల వ్యక్తులు ఆయనకు సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏ సలహా స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవలసిందీ, దాని మంచిచెడులకు బాధ్యత వహించవలసిందీ నాయకుడే కనుక ఖ్యాతీ, అపఖ్యాతీ సైతం ఆయనకే చెందుతాయి. అంతిమ విజయం సాధించిన నేతగా కేసీఆర్‌కు కీర్తి దక్కింది. అధికారం కూడా ఆయన సొంతమే అయింది. 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు అనేకం జరిగాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన తరంగం. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి తెలంగాణలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలోనూ తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకున్నది. ఆ పార్టీ అదే సంవత్సరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్‌ పార్టీలో విలీనమైపోయింది. తర్వాత రెండు సంవత్సరాలు తిరగ కుండానే ‘జైఆంధ్ర’ ఉద్యమం ఎగిసిపడింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నారు. ఉద్యమ నాయకులతో సమా లోచనలు జరిపి వారి రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చారు.

ముఖ్యమంత్రులకు ఉద్వాసన చెప్పారు. కేసీఆర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీ ర్ఘంగా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్నన్ని పట్టింపులు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన పట్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నాయ కుడు నారా చంద్రబాబునాయుడు ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి లేఖ రాయకపోతే 2009 డిసెంబర్‌ 9న నాటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించేవారు కాదు.

నిర్ణాయక స్థానంలో సోనియాగాంధీ ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ప్రత్యర్థులకు నష్టం, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమెను సలహాదారులు నమ్మించడం, వందలమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్య చేసు కోవడం, చిన్న రాష్ట్రాలపట్ల పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి సాను కూలమైన అభిప్రాయం ఉండటంతో సహా అనేక కారణాలు రాష్ట్ర విభజనకు దారి తీశాయి. ఈ వాస్తవాలన్నిటినీ క్షుణ్ణంగా, వస్తునిష్టంగా అధ్యయనం చేసి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి.  

నేల విడిచి సాము
తెలంగాణలో పరిపాలనపై ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పాలన కంటే మెరుగనేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతున్నారు. కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జరుగుతున్న మంచి పనులన్నిటినీ తన ఖాతాలో వేసుకొని, వెనుకబాటుతనా నికీ, రైతుల ఆత్మహత్యలకూ, నిరుద్యోగ సమస్యకూ బీజేపీనీ, కాంగ్రెస్‌ ప్రభు త్వాలను నిందించడం రాజకీయంగా అవసరం కావచ్చు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వక ముందే దాని ఫలం రైతులు అనుభవిస్తున్నట్టు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే వేల ఎకరాలకు నీరు అంది స్తున్నట్టు భావించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మున్ముందు రైతు ఆత్మహత్యలు ఆగిపోవచ్చునేమో.

కోటి ఎకరాల భూమికి సాగునీరు అందు తుందేమో. ప్రస్తుతానికైతే అవి లక్ష్యాలే. ఆకాంక్షలే. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతే కానీ తెలంగాణ రాష్ట్రంలో చేయవలసింది అంతా చేసేశాం. కనుక ఇక జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడతాం అంటే కుద రదు.  తమ అనుభవానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, పత్రికలు ఏమి రాసినా, టీవీ చానళ్ళు ఏమి చూపించినా ప్రజలు విశ్వసించరు. వారికి స్వీయానుభవం ప్రధానం. నేతలు నేల విడిచి సాము చేయకూడదు.

ప్రస్తుతం కేసీఆర్‌ను నడిపిస్తున్న స్వప్నం ఫెడరల్‌ ఫ్రంట్‌. ఇది మహా జటిలమైనది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవ్యంగా ఉన్నట్లయితే, సుపరిపాలన అందించి, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఉన్నట్లయితే దేశంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో ఆయనే చొరవ తీసుకునేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రికి ఊపిరి సలపనీయడం లేదు. నిద్ర పోనీయడం లేదు. చంద్రబాబు సందర్భశుద్ధీ, సమయజ్ఞతా, నిగ్రహం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్వవచోఘాతం నిత్యకృత్యంగా మారింది. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ప్రజలే తనను రక్షించాలంటూ మాట్లాడు తున్నారు.

అదే సమయంలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ వెలుపల రాజకీయం చేసే శక్తి ఆయనకు లేదు. అది కేసీఆర్‌కి కలసి వచ్చే మొదటి అంశం. దేశంలో నరేంద్ర మోదీ తర్వాత డొక్కశుద్ధి ఉండి, మూడు భాషలలో (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) ధాటిగా ఉపన్యసించే శక్తి, వాగ్దేవికటాక్షం ఉన్న నేత కేసీఆర్‌. తెలంగాణలో తాను కొన్ని రోజులు లేకపోయినా పరిపాలనకు ఢోకా ఉండదు. కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్‌రావు సమర్థులు. తనను సవాలు చేసే నాయకులు ఎవ్వరూ పార్టీలో లేరు. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటూ కథ నడిపిస్తానని కేసీఆర్‌ అంటున్నారు.

ఎందరినో ఊరిస్తున్న ప్రధాని పదవి 
నేడు ఉదయం  కేసీఆర్‌ చెన్నై వెళ్ళి డీఎంకే నేత కరుణానిధితో, ఆయన కుమా రుడు, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌తో సమాలోచనలు జరుపుతారు. ఇటీవల లక్నోలో సమాజ్‌వాదీ నేత అఖిలేశ్‌ యాదవ్‌ని కేటీఆర్‌ కలుసుకున్నారు. అఖిలేశ్‌ కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మే 2న హైదరాబాద్‌ వస్తున్నట్టు సమాచారం. మే మొదటి వారంలోనే భువనేశ్వర్‌ సందర్శించి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీ వేయబోతున్నారు. కాంగ్రెస్‌ లేని భారతదేశం (కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌) అంటూ మోదీ నినదిస్తే, కాంగ్రెస్, బీజేపీ లేని భారతదేశం అన్నది కేసీఆర్‌ నినాదం. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్‌ మినహా అన్ని ప్రతిపక్షాలకూ కలిపి 293 స్థానాలు దక్కినా అవన్నీ ఒకే తాటిపైకి రావడం, సమైక్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడం చాలా కష్టం.

చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌లో డీఎంకే ఉంటే ఏఐఏ డీఎంకే బీజేపీతో ఉంటుంది. కేసీఆర్‌ నిర్మించే ఫ్రంట్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఉంటే సీపీఎం కాంగ్రెస్‌తో ఉంటుంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత మమతా బెనర్జీ మూడు మాసాల కిందటే చైన్నై వెళ్ళి స్టాలిన్‌తో సమాలోచన జరిపారు. అఖిలేశ్‌తోనూ, మాయావతితోనూ మాట్లాడారు. ఢిల్లీలో శరద్‌ పవార్‌నూ, సోనియాగాంధీనీ, ఇతర ప్రతిపక్ష నేతలనూ కలుసుకున్నారు. ఆమెది కాంగ్రెస్‌ సహిత ఫ్రంట్‌. కేసీఆర్‌ది బీజేపీ, కాంగ్రెస్‌ ర హిత ఫ్రంట్‌. ఈ రెండు ఫ్రంట్‌లలో ఏది నిలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. లెక్కలు వేసి చూస్తే మమత ప్రతిపాదించే ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతో కొంత  కనిపిస్తుంది.

ఆమె కలలు ఆమెకు ఉన్నాయి. శరద్‌ పవార్‌ ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ములాయంసింగ్‌ ప్రధాని పదవి కోసమే కొడుకుని లక్నో సింహాసనంపైన 2012లోనే కూర్చోబెట్టారు. జయలలితకి ప్రధాని కావా లనే ఆకాంక్ష బలంగా ఉండేది. అత్యున్నత పదవి తన జన్మహక్కు అని రాహుల్‌గాంధీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల భాగస్వామ్యం లేకుండా, బయటి నుంచి సైతం  వాటి మద్దతు లేకుండా కేవలం ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మరోసారి కేసీఆర్‌కి దక్కుతుంది. అటువంటి ప్రభుత్వానికి సారథి కేసీఆర్‌ అయినా ఆశ్చర్యం లేదు.

రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెరమీదికి వస్తారనీ, ప్రభం జనం సృష్టిస్తారనీ, అట్టహాసంగా అధికారంలోకి వస్తారనీ 2013 సెప్టెంబర్‌ 13వ తేదీకి పూర్వం ఎవరైనా ఊహించారా? మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్‌  వంటి నాయకులందరూ అనూహ్యమైన పరిస్థితులలో ప్రధానులైనవారే. అటువంటప్పుడు కేసీఆర్‌ ఈ దేశం ముఖియా కావడం పట్ల అభ్యంతరం ఎందుకుండాలి? లక్కు ఉంటే లక్షణంగా కావచ్చు. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నది ఫెడరల్‌ ఫ్రంట్‌ భాగస్వాముల ప్రయో జనాలపైనా, నాయకుల అహంభావంపైనా ఆధారపడి ఉంటుంది. దిల్లీ బహుత్‌ దూర్‌ హై!

కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement