Third Front formation
-
తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!
సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనే ఆనవాయితీకి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలను కూడగట్టడం ద్వారా మూడో కూటమి సన్నాహాలు జోరందుకున్నాయి. మూడో కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్‌కుమార్ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతోపాటు ఒకటి రెండు చిన్నపార్టీలున్నాయి. డీఎంకేలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. ఇండియా జననాయక కట్చి (ఐజేకే) డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చి మూడో కూటమి ఏర్పాటుకు నడుం బిగించింది. తమిళనాడులో పెద్దగా ప్రాచుర్యం లేని ఐజేకే ప్రస్తుతానికి కూటమికి సారథ్యం వహిస్తున్నా తెరవెనుక నుంచి శశికళ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న సమత్తువ మక్కల్ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్ కొద్దిరోజుల క్రితం శశికళతో భేటీ కావడం కలకలం రేపింది. తర్వాత అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకేలో శరత్ చేరారు. పదేళ్లు అన్నాడీఎంకే కూటమితో కలిసి ప్రయాణించానని, సీట్ల కేటాయింపుపై కనీసం తనకు ఆహ్వానం లేకపోవడం వల్లనే వైదొలిగానని శరత్‌కుమార్ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని శరత్‌కుమార్ కూటమిని బలోపేతం చేయడంలో కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను శరత్‌కుమార్ శనివారం కలిసి కూటమిలో చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. డీఎంకే కూటమిలో చేరాలని ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న కమల్‌హాసన్‌కు నిరాశే ఎదురుకాగా ఐజేకే ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉంది. మూడో కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసంక్షేమం కోసం పాటుపడే పార్టీలను సంఘటితం చేసి గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శరత్‌కుమార్ తెలిపారు. కమల్ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని శరత్‌కుమార్ అన్నారు. ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న రెండు కూటముల్లోని ఆశావహులపై కూడా ఐజేకే ఒక కన్నేసింది. మూడో కూటమిలోని ఏదో పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వడం లేదా కూటమి తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించేందుకు ఐజేకే సిద్ధంగా ఉంది. డీఎంకే నేతలు జారిపోకుండా ప్రధాన కార్యదర్శి దురైమురుగన్ మార్చి 2వ తేదీ నుంచి ఆశావహులను ఇంటర్వ్యూ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే తమ సామాజికవర్గమైన వన్నియర్లకు రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెచ్చి సాధించింది. అదే జరగకుంటే పీఎంకే సైతం అన్నాడీఎంకే నుంచి వైదొలిగి డీఎంకే లేదా మూడో కూటమి వైపు మొగ్గి ఉండేది. అన్నాడీఎంకే అగ్రనేతలతో శనివారం జరిగిన చర్చల్లో సామరస్యం కుదరగా 23 సీట్లతో పీఎంకే సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ 60 సీట్లను కోరుతుండగా, 20–25 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనపడడం లేదు. తమిళనాడులోని మొత్తం 234 సీట్లలో పోటీచేసేందుకు బహుజన సమాజ్ పార్టీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మూడో కూటమిలో చేరినా చేరవచ్చు. అదే జరిగితే ఒంటరిపోటీపై బీఎస్పీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నటుడు రజనీకాంత్ స్థాపించదలుకున్న పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి ‘ఇండియా మక్కల్ మున్నేట్ర కట్చి’అనే పార్టీని స్థాపించారు. బీజేపీ నేపథ్యం కలిగిన అర్జున్‌మూర్తికి ‘ఆల్ ది బెస్ట్’అంటూ రజనీకాంత్ ఆశీస్సులు అందజేశారు. మూడో కూటమికి అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం సమకూరకున్నా రెండు కూటముల్లోని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడవచ్చు. తమిళనాడులో రాహుల్, అమిత్‌షా.. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు తమిళనాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం కారైక్కాల్, విల్లుపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. పీఎంకేకు 23 సీట్లు ♦ఏఐఏడీఎంకే అంగీకారం ♦బీజేపీతో కొనసాగుతున్న చర్చలు చెన్నై: తమిళనాడులో ఏప్రిల్ 6వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను సీట్ల పంపకాలు జోరందుకున్నాయి. అధికార ఏఐఏడీఎంకే, ఎస్.రాందాస్ నేతృత్వంలోని పీఎంకే పార్టీ మధ్య సీట్ల పంపిణీపై శనివారం అంగీకారం కుదిరింది. దీని ప్రకారం పీఎంకే రాష్ట్రంలోని 23 సీట్లలో పోటీ చేయనుంది. కాగా, సీట్ల సర్దుబాటుపై ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వీకే సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.మురుగన్‌లు ఏఐఏడీఎంకేకు చెందిన సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వంలతో శనివారం చర్చలు జరిపారు. తాము గెలిచేందుకు అవకాశమున్న 60 స్థానాలను కోరుతున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు. సూత్రధారి చిన్నమ్మ.. మూడో కూటమి ఏర్పాటుకు శశికళ సూత్రధారి అని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఆశించిన స్థాయిలో అగ్రనేతలు శశికళ వైపు రాకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. అందుకే శశికళ అక్క కుమారుడు దినకరన్ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం కూడా మూడో కూటమిలో చేరిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామ్ తమిళర్ కట్చి కన్వీనర్ సీమాన్ కోసం ఐజేకే యత్నిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తయితేగానీ అసంతృప్తవాదులు బయటపడరు. అప్పటి వరకు ఐజేకే వేచిచూడక తప్పదు. మూడో కూటమి ఏర్పాటు ఒక కొలిక్కిరాగానే దాని స్వరూపం మారి శశికళ తెరపైకి రావచ్చని అంచనాలున్నాయి. -
గుర్రం ఎగరావచ్చు!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కలల బేహారి. నిత్య స్వాప్నికుడు. ఇది ముమ్మాటికీ ఆరోగ్యకరమైన లక్షణం. ఏ రంగంలో ఉన్నవారైనా సరే అందరూ కలలు కనాలి. వాటి సాకారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించి 17 సంవత్సరాలైన సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ప్లీనరీలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ స్వప్నం గురించి మరోసారి ఉద్వేగంగా మాట్లాడారు. దేశ రాజకీయాలలో క్రియాశీలమైన పాత్ర పోషిస్తాననీ, హైదరాబాద్ నుంచే భూకంపం సృష్టిస్తాననీ స్పష్టంగా ప్రకటించారు. భారత ఆత్మగౌరవ బావుటా ఎగరేస్తానని ఎలుగెత్తి చాటారు. మంచిదే. ఒక లక్ష్యం సాధించిన విజేత వెంటనే అంతకంటే పెద్ద లక్ష్యం పెట్టుకోవడం సహజం. అసాధ్యమని చాలామంది భావించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, ఆ రాష్ట్రానికి సారథ్యం వహించిన రాజకీయ నేతకు తదుపరి లక్ష్యం దేశ రాజకీయాలపైన ప్రభావం వేయడం కావడంలో ఆశ్చర్యం లేదు. 35 సంవ త్సరాల కిందట నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) సాధించిన ఘనకార్యాన్ని తానూ సాధించగలననే ఆత్మవిశ్వాసం కేసీఆర్‌కి ఉండవచ్చు. కేసీఆర్ రాజకీయ చాతుర్యం, ఎత్తుగడల విషయంలో సందేహం లేదు. కానీ కల సాకారం కావడానికి పరిస్థితులు కలిసి రావాలి. అదృష్టం కూడా అవసరం. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్టే మహాసేనాని. సైన్య నిర్మాణంలో, రణతంత్ర రచనలో దిట్ట. ఒకానొక సమయంలో సైన్యంలో కీలకమైన స్థానంలో ఒక అధికారిని నియమించవలసిన అవసరం ఏర్పడింది. సలహాదారులు చాలామంది అభ్యర్థులను పరీక్షించి ఒక యోధుడిని ఎంపిక చేశారు. నెపో లియన్ ఆమోదం కోరారు. పోరాట పటిమ లేదా మనోబలం లేదా గతంలో అతగాడు సాధించిన విజయాల గురించి నెపోలియన్ ప్రశ్నించలేదు. ‘అతనికి అదృష్టం కలసి వస్తుందా (ఐటజ్ఛి luఛిజుy)?,’ అని ప్రశ్నించాడట. యుద్ధాలలో విజయం సాధించాలంటే పరాక్రమం ఒక్కటే చాలదు. అదృష్టం విధిగా ఉండా లని నెపోలియన్ అభిప్రాయం. రాజకీయాలలోనూ అంతే. మర్రి చెన్నారెడ్డికి లేని అదృష్టం కేసీఆర్‌కి కలిసి వచ్చింది. జయాపజయాలు జయాపజయాలను యోధులు విశ్లేషించుకోవాలి. గుణపాఠాలు నేర్చుకోవాలి. అపజయాలకు దారితీసిన కారణాలను తెలుసుకోవడం సులువే. విజయాలను అర్థం చేసుకోవడమే కష్టం. చాలా మంది రాజకీయ నాయకులు గెలుపును అపార్థం చేసుకొని అంతా తమ ఘనతే అనుకొని అహంకారం పెంచుకొని దెబ్బ తింటారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ ను సాధ్యం చేసిన పరిస్థితులనూ, తెలం గాణ రాష్ట్ర పాలనలో కొన్ని సత్ఫలితాలను సాధించడానికి సహకరించిన అంశాలనూ జాగ్రత్తగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ ప్రధాన పాత్రను ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఇతర ఉద్యమ నాయ కుల పాత్ర, ప్రజల ఉద్యమస్ఫూర్తి నిశ్చయంగా తోడైనాయి. ఉద్యమ కాలంలో వివిధ ఘట్టాలలో రకరకాల వ్యక్తులు ఆయనకు సలహాలు ఇచ్చి ఉండవచ్చు. ఏ సలహా స్వీకరించాలో, దేన్ని తిరస్కరించాలో నిర్ణయించుకోవలసిందీ, దాని మంచిచెడులకు బాధ్యత వహించవలసిందీ నాయకుడే కనుక ఖ్యాతీ, అపఖ్యాతీ సైతం ఆయనకే చెందుతాయి. అంతిమ విజయం సాధించిన నేతగా కేసీఆర్‌కు కీర్తి దక్కింది. అధికారం కూడా ఆయన సొంతమే అయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాలు అనేకం జరిగాయి. 1969లో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమం ఉవ్వెత్తున లేచి పడిన తరంగం. 1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అప్పటి తెలంగాణలోని మొత్తం 14 లోక్‌సభ స్థానాలలోనూ తెలంగాణ ప్రజా సమితి 10 స్థానాలు గెలుచుకున్నది. ఆ పార్టీ అదే సంవత్సరం సెప్టెంబర్‌లో కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. తర్వాత రెండు సంవత్సరాలు తిరగ కుండానే ‘జైఆంధ్ర’ ఉద్యమం ఎగిసిపడింది. అప్పుడు ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ రాష్ట్ర విభజనకు ససేమిరా అన్నారు. ఉద్యమ నాయకులతో సమా లోచనలు జరిపి వారి రాజకీయ ఆకాంక్షలను నెరవేర్చారు. ముఖ్యమంత్రులకు ఉద్వాసన చెప్పారు. కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సుదీ ర్ఘంగా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్నన్ని పట్టింపులు యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేవు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రతిపాదన పట్ల సీమాంధ్ర ప్రజలకు ఏ మాత్రం అభ్యంతరం లేదంటూ అప్పటి ప్రతిపక్ష నాయ కుడు నారా చంద్రబాబునాయుడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లేఖ రాయకపోతే 2009 డిసెంబర్ 9న నాటి హోంమంత్రి చిదంబరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించేవారు కాదు. నిర్ణాయక స్థానంలో సోనియాగాంధీ ఉండటం, ఆంధ్రప్రదేశ్‌ను విభజిస్తే ప్రత్యర్థులకు నష్టం, తన పార్టీకి ప్రయోజనం కలుగుతుందని ఆమెను సలహాదారులు నమ్మించడం, వందలమంది యువకులు తెలంగాణ రాష్ట్ర సాధనకోసం ఆత్మహత్య చేసు కోవడం, చిన్న రాష్ట్రాలపట్ల పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీకి సాను కూలమైన అభిప్రాయం ఉండటంతో సహా అనేక కారణాలు రాష్ట్ర విభజనకు దారి తీశాయి. ఈ వాస్తవాలన్నిటినీ క్షుణ్ణంగా, వస్తునిష్టంగా అధ్యయనం చేసి కార్యకారణ సంబంధం అర్థం చేసుకోవాలి. నేల విడిచి సాము తెలంగాణలో పరిపాలనపై ఎవరి అభిప్రాయం వారికి ఉన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పాలన కంటే మెరుగనేవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. చెప్పినవన్నీ చేయలేకపోతున్నారు. కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. జరుగుతున్న మంచి పనులన్నిటినీ తన ఖాతాలో వేసుకొని, వెనుకబాటుతనా నికీ, రైతుల ఆత్మహత్యలకూ, నిరుద్యోగ సమస్యకూ బీజేపీనీ, కాంగ్రెస్ ప్రభు త్వాలను నిందించడం రాజకీయంగా అవసరం కావచ్చు. ఎకరానికి ఎనిమిది వేల రూపాయలు ఇవ్వక ముందే దాని ఫలం రైతులు అనుభవిస్తున్నట్టు, నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి కాకముందే వేల ఎకరాలకు నీరు అంది స్తున్నట్టు భావించి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఏమిటి? మున్ముందు రైతు ఆత్మహత్యలు ఆగిపోవచ్చునేమో. కోటి ఎకరాల భూమికి సాగునీరు అందు తుందేమో. ప్రస్తుతానికైతే అవి లక్ష్యాలే. ఆకాంక్షలే. వాటిని నెరవేర్చడానికి ప్రయత్నం జరుగుతున్నది. అంతే కానీ తెలంగాణ రాష్ట్రంలో చేయవలసింది అంతా చేసేశాం. కనుక ఇక జాతీయ రాజకీయాలపైన దృష్టి పెడతాం అంటే కుద రదు. తమ అనుభవానికి విరుద్ధంగా ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎన్ని గొప్పలు చెప్పుకున్నా, పత్రికలు ఏమి రాసినా, టీవీ చానళ్ళు ఏమి చూపించినా ప్రజలు విశ్వసించరు. వారికి స్వీయానుభవం ప్రధానం. నేతలు నేల విడిచి సాము చేయకూడదు. ప్రస్తుతం కేసీఆర్‌ను నడిపిస్తున్న స్వప్నం ఫెడరల్ ఫ్రంట్. ఇది మహా జటిలమైనది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సవ్యంగా ఉన్నట్లయితే, సుపరిపాలన అందించి, ఎన్నికల వాగ్దానాలను అమలు చేసి, తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఉన్నట్లయితే దేశంలో మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు విషయంలో ఆయనే చొరవ తీసుకునేవారు. కానీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రికి ఊపిరి సలపనీయడం లేదు. నిద్ర పోనీయడం లేదు. చంద్రబాబు సందర్భశుద్ధీ, సమయజ్ఞతా, నిగ్రహం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. స్వవచోఘాతం నిత్యకృత్యంగా మారింది. ఏమీ లేకపోయినా ఏవేవో ఊహించుకొని ప్రజలే తనను రక్షించాలంటూ మాట్లాడు తున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయి బీజేపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెలుపల రాజకీయం చేసే శక్తి ఆయనకు లేదు. అది కేసీఆర్‌కి కలసి వచ్చే మొదటి అంశం. దేశంలో నరేంద్ర మోదీ తర్వాత డొక్కశుద్ధి ఉండి, మూడు భాషలలో (హిందీ, ఇంగ్లిష్, తెలుగు) ధాటిగా ఉపన్యసించే శక్తి, వాగ్దేవికటాక్షం ఉన్న నేత కేసీఆర్. తెలంగాణలో తాను కొన్ని రోజులు లేకపోయినా పరిపాలనకు ఢోకా ఉండదు. కుమారుడు తారకరామారావు, మేనల్లుడు హరీశ్‌రావు సమర్థులు. తనను సవాలు చేసే నాయకులు ఎవ్వరూ పార్టీలో లేరు. అయినప్పటికీ హైదరాబాద్‌లోనే ఉంటూ కథ నడిపిస్తానని కేసీఆర్ అంటున్నారు. ఎందరినో ఊరిస్తున్న ప్రధాని పదవి నేడు ఉదయం కేసీఆర్ చెన్నై వెళ్ళి డీఎంకే నేత కరుణానిధితో, ఆయన కుమా రుడు, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో సమాలోచనలు జరుపుతారు. ఇటీవల లక్నోలో సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్‌ని కేటీఆర్ కలుసుకున్నారు. అఖిలేశ్ కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు మే 2న హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. మే మొదటి వారంలోనే భువనేశ్వర్ సందర్శించి ఒడిశా ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ వేయబోతున్నారు. కాంగ్రెస్ లేని భారతదేశం (కాంగ్రెస్ ముక్త్ భారత్) అంటూ మోదీ నినదిస్తే, కాంగ్రెస్, బీజేపీ లేని భారతదేశం అన్నది కేసీఆర్ నినాదం. ఒక వేళ బీజేపీ, కాంగ్రెస్ మినహా అన్ని ప్రతిపక్షాలకూ కలిపి 293 స్థానాలు దక్కినా అవన్నీ ఒకే తాటిపైకి రావడం, సమైక్యంగా వ్యవహరించడం, ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడం చాలా కష్టం. చాలా వైరుధ్యాలు ఉన్నాయి. ఫెడరల్ ఫ్రంట్‌లో డీఎంకే ఉంటే ఏఐఏ డీఎంకే బీజేపీతో ఉంటుంది. కేసీఆర్ నిర్మించే ఫ్రంట్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఉంటే సీపీఎం కాంగ్రెస్‌తో ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మూడు మాసాల కిందటే చైన్నై వెళ్ళి స్టాలిన్‌తో సమాలోచన జరిపారు. అఖిలేశ్‌తోనూ, మాయావతితోనూ మాట్లాడారు. ఢిల్లీలో శరద్ పవార్‌నూ, సోనియాగాంధీనీ, ఇతర ప్రతిపక్ష నేతలనూ కలుసుకున్నారు. ఆమెది కాంగ్రెస్ సహిత ఫ్రంట్. కేసీఆర్‌ది బీజేపీ, కాంగ్రెస్ ర హిత ఫ్రంట్. ఈ రెండు ఫ్రంట్లలో ఏది నిలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టం. లెక్కలు వేసి చూస్తే మమత ప్రతిపాదించే ఫ్రంట్ అధికారంలోకి వచ్చే అవకాశం ఎంతో కొంత కనిపిస్తుంది. ఆమె కలలు ఆమెకు ఉన్నాయి. శరద్ పవార్ ఎన్నో సంవత్సరాలుగా ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ములాయంసింగ్ ప్రధాని పదవి కోసమే కొడుకుని లక్నో సింహాసనంపైన 2012లోనే కూర్చోబెట్టారు. జయలలితకి ప్రధాని కావా లనే ఆకాంక్ష బలంగా ఉండేది. అత్యున్నత పదవి తన జన్మహక్కు అని రాహుల్‌గాంధీ అనుకుంటారు. వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ, కాంగ్రెస్‌ల భాగస్వామ్యం లేకుండా, బయటి నుంచి సైతం వాటి మద్దతు లేకుండా కేవలం ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత మరోసారి కేసీఆర్‌కి దక్కుతుంది. అటువంటి ప్రభుత్వానికి సారథి కేసీఆర్ అయినా ఆశ్చర్యం లేదు. రాజకీయాలలో ఏదీ అసాధ్యం కాదు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ తెరమీదికి వస్తారనీ, ప్రభం జనం సృష్టిస్తారనీ, అట్టహాసంగా అధికారంలోకి వస్తారనీ 2013 సెప్టెంబర్ 13వ తేదీకి పూర్వం ఎవరైనా ఊహించారా? మొరార్జీ దేశాయ్, చరణ్‌సింగ్, వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, గుజ్రాల్ వంటి నాయకులందరూ అనూహ్యమైన పరిస్థితులలో ప్రధానులైనవారే. అటువంటప్పుడు కేసీఆర్ ఈ దేశం ముఖియా కావడం పట్ల అభ్యంతరం ఎందుకుండాలి? లక్కు ఉంటే లక్షణంగా కావచ్చు. ఆ పదవిలో ఎంత కాలం ఉంటారన్నది ఫెడరల్ ఫ్రంట్ భాగస్వాముల ప్రయో జనాలపైనా, నాయకుల అహంభావంపైనా ఆధారపడి ఉంటుంది. దిల్లీ బహుత్ దూర్ హై! కె. రామచంద్రమూర్తి -
ఎందుకో..ఏమో..!
భువనేశ్వర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, కల్వకుంట్ల చంద్ర శేఖర రావు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి, బిజూ జనతా దళ్ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్‌తో త్వరలో భేటీ కానున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు మే నెల తొలి వారంలో భేటీ అయ్యేందుకు కార్యక్రమం ఖరారైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్ర పర్యటనకు విచ్చేసే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు తొలుత ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని దర్శించుకుంటారు. అనంతరం ఆయన నవీన్ పట్నాయక్‌తో భేటీ అవుతారు. 2019వ సంవత్సరంలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ప్రాంతీయ పార్టీల వ్యూహాత్మక కార్యాచరణ నేపథ్యంలో వీరిద్దరూ భేటీకి ఉత్సాహం కనబరుస్తున్నారు. ఉభయ బిజూ జనతా దళ్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల నుంచి దూరంగా ఉంటున్నాయి. భావి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెసేతర వర్గాలు కూటమిగా ఆవిర్భవించి పోటీ చేయాలనే యోచనతో దేశంలోని పలు రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల ప్రముఖులు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో తరచూ భేటీ అవుతున్నారు. లోగడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర రావు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో గత నెలలో భేటీ అయ్యారు. 2019వ సంవత్సరపు సార్వత్రిక ఎన్నికల్లో తృతీయ కూటమి ఆవిష్కరణకు ఈ వర్గాలు కృషి చేస్తున్నట్లు సంకేతాలు లభిస్తున్నాయి. తృతీయ కూటమి ఆవిష్కరణ, మైత్రి వగైరా అంశాలపట్ల సకాలంలో స్పందిస్తామని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తరచూ దాట వేస్తున్నారు. -
ఢిల్లీ పీఠంపై దీదీ చూపు
మమతా బెనర్జీ రోజురోజుకీ పెరుగుతున్న ఆకాంక్షలతో కూడిన అలుపెరుగని రాజకీయనేత. బెంగాల్లో సీపీఎం కంచుకోటను బద్దలు చేశాక ఆమెకు తిరుగులేకుండా పోయింది. గత 33 ఏళ్లుగా మమత కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగారు. గత పదేళ్లుగా సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ప్రధాని పదవి మాత్రమే ఆమెను వరించాల్సి ఉంది. పైగా తాను ప్రధాని పదవికి అర్హురాలినేనని ఆమె భావిస్తున్నారు. ఢిల్లీలో ఇప్పుడు నాలుగు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం సాధారణంగా నెలకొని ఉంది. రాహుల్ గాంధీ మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా తన్ను తాను చిత్రించుకుంటున్నారు. 2. బీజేపీ ప్రధానిని కాంగ్రెస్ నేతతో భర్తీ చేయడం మరింత ప్రమాదకరమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఆ ఖాళీలో మమత అడుగు పెట్టారు. 3. ప్రతిపక్షం మొత్తాన్ని ఐక్యపర్చే శక్తిగా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి మమత ముందుకువచ్చారు. 4. సమాజ్‌వాదీ పార్టీతో చేయి కలిపి మాయావతి కాంక్షిస్తున్నారు కానీ ఆమెను అంత సీరియస్‌గా ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటక, మహా రాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శక్తిమంతంగా ఉంది. ఇక్కడ ఇతర ప్రాంతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు బద్ధ విరోధాన్ని ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చకూడదని ఈ రాష్ట్రాల్లోని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంటే తమ ఉనికికి ప్రమాదమని వీటి భయం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పైకి తీసుకురావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించడమే ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రతిపక్ష అధినేతలను ఒకటి చేయడానికి మమతా బెనర్జీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రయోజనం ఉంది. ఢిల్లీలో బీజేపీ స్థానంలో కాంగ్రెస్ రాకూడదన్నదే వాటి అభిమతం. బీజేపీని తామంతా కలసి ఓడించాలని, అదే సమయంలో మోదీ ప్రత్యర్థిగా ప్రధాని పదవికి రాహుల్ ప్రతిపక్షాల ఉమ్మడి నేతగా కాకుండా జాగ్రత్తపడాలని ఆమె ప్రతిపక్ష నేతలతో విస్తృతంగా చర్చించారు. రాహుల్‌ని బహిరంగంగా వ్యతిరేకించకూడదని మమతకు తెలుసు. అదే సమయంలో ఆ పని ఇతరులు చేయాలని ఆమె ప్రయత్నం. మరోవైపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి మమతా వన్ టు వన్ ఫార్ములాను రూపొందించారు. దీని ప్రకారం బీజేపీయేతర పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో దృఢంగా పోరాడేందుకు ఇతర పార్టీలు తమను తాము కుదించుకోవాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మటుమాయం కావాలని దీని అర్థం. కానీ తెలంగాణను వదులుకోవడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఫ్రంట్‌లో కలవాలంటూ మమతా కోరారు తప్పితే దానికి సోనియా, రాహుల్ నేతృత్వం వహించాలని కోరలేదు. ముందుగా బీజేపీని అందరూ కలసి ఓడిస్తే, తర్వాత ప్రాంతీయ పార్టీ అధినేతలు కేజ్రీవాల్, కేసీఆర్, దేవెగౌడ, నవీన్ పట్నాయక్ వంటివారు కాంగ్రెస్ నేతృత్వంలో కలసి పనిచేస్తారని మమతా స్పష్టంగానే చెప్పారు. అంటే రాహుల్ ప్రతిపక్ష నేత కాలేరన్న సందేశం స్పష్టం గానే ఉంది. మమత సోనియాను కలవడం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నది మోదీ కాదు. కాంగ్రెసేతర ప్రతిపక్షం మొత్తంగా రాహుల్‌ని వ్యతిరేకిస్తోంది. మమత ప్రతిపాదనతో సోనియా నివ్వెరపోయారని వార్తలు. సోనియాతో భుజం భుజం కలిపి మమత పనిచేయాలని కాంగ్రెస్ సూచిస్తోం దని ఆ పార్టీ ప్రతినిధి 24 గంటల తర్వాత ప్రకటించారు. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి పదవికి మమత చెక్ పెట్టారు. ప్రత్యర్థిని మీరు ఓడించవలసిన పనిలేదు కానీ అతడిని అడ్డుకోవచ్చు. మోదీని నిందిస్తే, తీవ్రంగా విమర్శిస్తే ప్రతిపక్షం మొత్తంగా తనకు మద్దతిస్తుందని రాహుల్ భావించి పప్పులో కాలేశారు. కానీ కాంగ్రెసేతర ప్రతిపక్షం బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో లేదు. ఇంతవరకు దక్షిణ, ఉత్తర, పశ్చిమ భారత ప్రధానులను భారత్ చూసింది. అయితే భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. దేవెగౌడ ప్రధాని కాగలిగినప్పుడు కె.చంద్రశేఖరరావు ఎందుకు కాకూడదు? తూర్పు ఇండియా ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి మమతా బెనర్జీ ఆ ప్రాంతంనుంచి తొలి ప్రధానిగా ఎందుకు కాకూడదు? రాజకీయాల్లో విజయం సాధించడానికి అదృష్టంతో పాటు ఆకాంక్ష, జిత్తులమారితనం, ధైర్యం, నిర్దాక్షిణ్యంగా అధికారంలోకి రావాలనే తపన కూడా కావాలి. మమతకు ఈ అన్ని లక్షణాలూ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నరేంద్ర మోదీలాగే ఆమెకు కూడా కుటుంబ బలం, కుల సమీకరణాల దన్ను లేదు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు drppullarao@yahoo.co.in -
దేవెగౌడతో భేటీ అయిన కేసీఆర్
సాక్షి, బెంగళూరు : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మాజీ ప్రధానమంత్రి దేవెగౌడతో భేటీ అయ్యారు. దేవెగౌడ నివాసం అమోఘలో జరిగిన ఈ సమావేశంలో సినీనటుడు ప్రకాశ్ రాజ్, ఎంపీ వినోద్, సంతోష్ కుమార్, సుభాష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత రాజకీయాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, లక్ష్యాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై కేసీఆర్ ఈ సందర్భంగా దేవెగౌడతో చర్చించినట్లు తెలుస్తోంది. భేటీ అనంతరం దేవెగౌడ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తో దేశ రాజకీయాలు చర్చించడం సంతోషంగా ఉందన్నారు. కుమారస్వామితో కలిసి దేశ రాజకీయాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. ఇక జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టి.. దేశంలో గుణాత్మక మార్పుల కోసం ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ రావాలంటున్న కేసీఆర్.. ఇటీవలే కోల్‌కతాలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేత హేమంత్ సోరేన్ హైదరాబాద్ వచ్చి కేసీఆర్ సమావేశమయ్యారు. ఇపుడు కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్, దేవెగౌడల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కేసీఆర్ శుక్రవారం ఉదయం 9.45 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. దేవగౌడతో భేటీ అనంతరం ఇవాళ సాయంత్రం సీఎం హైదరాబాద్ చేరుకుంటారు. -
కేసీఆర్ అందర్నీ కలుపుకొని పోలేరు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని పోయే మనస్తత్వం లేదని, రాష్ట్రాల మధ్య ఉన్న అంతరాలను పరిష్కరించడం కేసీఆర్ వల్ల కాదని బీజేపీ జాతీయ నేత ప్రొఫెసర్ శేషగిరి రావు అన్నారు. కేంద్రంలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేయగల సామర్థ్యం కేసీఆర్‌కు లేదని అభిప్రాయపడ్డారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భవన్లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పెంపు అంశం చాలా సున్నితమైందని, ఆషామాషీ వ్యవహారం కాదన్నారు. కేసీఆర్ మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలంటున్నారని, ఇది దేశంలో విపత్కర పరిస్థితులకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాల్లో వైషమ్యాలు, అల్లర్లు, విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా కేంద్రంతో పోరాడాలని.. ఇలా మతం పేరుతో రిజర్వేషన్లంటూ ప్రకటనలు చేయొద్దని కేసీఆర్‌కు సూచించారు. -
కేసీఆర్‌కు సాలిడ్ పంచ్
సాక్షి, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వాల తీరు, ప్రత్యామ్నాయ కూటమి(ఫ్రంట్) ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు చేసిన సంచలన వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న బీజేపీని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని తెలంగాణ బీజేపీ చీఫ్ డాక్టర్ కె. లక్ష్మణ్ మండిపడ్డారు. ‘‘గుణాత్మక మార్పు అంటే ఏంటి? ‘కేసీఆర్ పదేపదే గుణాత్మక మార్పు మాట చెప్పారు. దళితుణ్ని ముఖ్యమంత్రిని చేయకుంటే తల నరుక్కుంటానని, ఆ తర్వాత తానే పీఠమెక్కడం, సంతలో పశువుల్లా ఎమ్మెల్యేలను కొనడం, అన్నంపెట్టే రైతులకు బేడీలు వేయడం, ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలను నిర్బంధించడం, ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం.. ఇదేనా గుణాత్మక మార్పు? ఇంతకుముందు చెప్పిన ఒక్కమాటకైనా కేసీఆర్ కట్టుబడి ఉన్నారా? కేంద్రం నిధులపై చర్చకు సిద్ధమేనా? ఫ్రంట్‌కు టెంట్ కూడా దొరకదు : 70 ఏళ్లుగా సాధ్యంకాని అభివృద్ధిని మోదీ ఈ 4 ఏళ్లలో చేసి చూపారు. అందుకే ప్రజలు బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. కేసీఆర్.. ఓటమి అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న పార్టీలను పోగేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా దేశప్రజలు ఎన్నో ఫ్రంట్లను(కూటములను) చూశారు. సుస్థిరమైన నాయకత్వం కోసమే బీజేపీకి ఓటేసి నరేంద్ర మోదీని ప్రధానిని చేశారు. కేసీఆర్‌లాంటి వాళ్లు పెట్టే ఫ్రంట్లకు టెంట్లు కూడా దొరకవు. మోదీని తిట్టి, తిట్టలేదంటారా? : వాపును చూసి బలుపుగా భ్రమిస్తున్న కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రధాని అనే గౌరవంలేకుండా మోదీని తిట్టారు. కేసీఆర్ పొరపాటున నోరుజారాడని వారి సంతానం కేటీఆర్, కవితలే అంగీకరించారు. ఇప్పటికైనా ఆయన తప్పును ఒప్పుకుంటే హుందాగా ఉంటుంది. గత అసెంబ్లీలో కనీసం ఒక్క స్థానం కూడా లేని బీజేపీ త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయబోతోంది. రేపు కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణలోనూ మాదే విజయం ’’ అని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న లక్ష్మణ్, ఇతర నాయకులు -
కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం
విశ్లేషణ: డాక్టర్ ఏపీ విఠల్ మరోసారి తృతీయ ప్రత్యామ్నాయం మాట వినవ స్తోంది. దానికి వెన్నెముక కావాల్సిన వామపక్షాలు 2009 ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. సంకుచితమైన ఎన్నికల ప్రయోజనా లకోసం రాజకీయ ఊసరవెల్లులతో పొత్తులకోసం ఎగబడటం మాని, నిజమైన ప్రజాప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతారని ఆశించగలమా! మళ్లీ సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. జవహర్లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలి దశాబ్ద కాలంలో మన ప్రజాస్వామిక వ్యవస్థకు రాజకీయ, ఆర్థిక, సామాజిక దిశా నిర్దేశన అంటూ ఉండేది. ఆ తదుపరి పరిస్థితి నానాటికీ దిగజారి పోతూ, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్షీణ దశకు చేరింది. పార్లమెంటరీ వ్యవస్థకు మూల స్తంభాలైన రాజకీయ పార్టీలలో విలువలు, విశ్వసనీయత, ప్రజా సంక్షేమంపట్ల నిబద్ధత. లుప్తమైపోయాయి. అవినీతి, అధికార వ్యామోహం, అవకాశవాదం, కుల, మతోన్మాదాలకు అవి ఆలవాలంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో...యథావిధిగా ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు, వాటి కూటములు పరస్పర దూషణల పర్వంలో మునిగిపోయాయి. ఏమైతేనేం ఇరు పక్షాలు ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కిస్తూ దొందూ దొందేననే సత్యాన్ని విప్పిచెబుతున్నాయి. బీజేపీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ రాహుల్‌గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పకుండానే చెబుతోంది. ఎన్నికలంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పోరన్నట్టున్న నేటి తీరును చూస్తుంటే అధ్యక్ష తరహా పాలన దిశకు సాగుతున్నట్టు అనిపిస్తోంది. వ్యతిరేకతే ‘ప్రత్యామ్నాయం’? షరా మామూలే అన్నట్టు యూపీఏ, ఎన్డీఏలకు చెందని పార్టీలతో ‘తృతీయ ప్రత్యామ్నాయం’ రంగ ప్రవేశం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీల పట్ల వ్యతిరేకతే దాని ప్రధాన లక్ష్యం. ఆ వ్యతిరేకతకు మించి చెప్పుకోదగ్గ మరే ఉమ్మడి కార్యక్రమమూ లేని ఆ కూటమి ఎలాంటి ప్రత్యామ్నాయం? అసలు ఇలాంటి కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం ప్రజలను ఎలా ఉద్ధరించగలదు? ప్రజల విశ్వసనీయతను చూరగొనడానికి కావల్సింది ప్రధాన కూటములు రెంటికి భిన్నమైన, విస్పష్ట విధానం. తృతీయ ప్రత్యామ్నాయం అంటున్న కూటమికి లేనిది అదే. సీపీఎం, సీపీఐ తదితర వామపక్షాలే తృతీయ కూటమికి వెన్నెముక. వామపక్షాలు 2009 ఎన్నికల పరాజయం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఎన్నికల్లోలాగా ఏదో ఒక విధంగా తృతీయ ప్రత్యామ్నాయానికి ఊపిరులూది, కనీస కార్యక్రమం ప్రాతిపదికపై బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఒక తాటిపైకి తీసుకురాగల శక్తి నేడు వాటికి లేదు. ‘ఉడతకెందుకు ఊళ్లేలే పని’ అని అవి అపహాస్యానికి గురవుతున్నాయి. అయినా, అవి కాక మరే బలమైన ప్రాంతీయ పార్టీ తృతీయ కూటమికి నేతృత్వం వహించగలమని చెప్పుకునే పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్ (యు) నేత నితీశ్‌కుమార్, బీఎస్పీ నేత్రి మాయావతి, అన్నా డీఎంకే నేత్రి జయలలిత ఎవరికి వారు తామే ప్రధాని పీఠం దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి వీరిలో ఎవరు నేతృత్వం వహిస్తామన్నా కూటమి ఉండనే ఉండదు. పోనీ వాటికి కాంగ్రెస్, బీజేపీలకు భిన్నమైన, పురోగామి, ప్రజానుకూల విధానాలున్నాయా అంటే అవీ లేవు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి కాంగ్రెస్, బీజేపీలలాగే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరిస్తూ, బడా కార్పొరేట్ సంస్థలకు పోటీలుపడి మేలు చేస్తున్నాయి, ఆర్థిక వ్యత్యాసాలను పెంచిపోషిస్తున్నాయి. ఎక్కడిదాకో ఎందుకు చంద్రబాబు చరిత్రను చూస్తే సరిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని అధినాయకునిగా ఒక్క వెలుగు వెలిగిన ఆయన కేంద్రంలో సైతం చక్రం తిప్పారు. తానే వాజపేయిని ప్రధానిని చేశానని, అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిని చేశానని ఆయన ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశంలో వాజపేయి హవా నడుస్తున్నప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకొని పైకి ఎగబాకాలని ఆరాటపడ్డారు. కమ్యూనిస్టులతో మైత్రికి తిలోదకాలిచ్చి ‘అన్ని ఇజాలు అంతరించాయి, మిగిలింది టూరిజమే’ నని వారి మౌలిక సిద్ధాంతాన్నే హేళన చేశారు, మతతత్వ బీజేపీతో చేయి కలిపారు. 2002లో గుజరాత్ మారణకాండపై నరేంద్రమోడీ ని ఘాటుగా విమర్శించారు.తీరా పార్లమెంటులో ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. 2004 ఓటమి తర్వాత అదే చంద్రబాబు... బీజేపీతో పొత్తు చారిత్రక త ప్పిదమని, భవిష్యత్తులో మరెన్నడూ దానితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. ఇప్పుడు మోడీ గాలి వీస్తోందని పసిగట్టి మోడీ నామ జపంతో అందలమెక్కాలని చూస్తున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే బాబులాంటి రాజకీయ ఊసరవెల్లితో కలిసి వామపక్షాలు 2009లో మహా కూటమిని నిర్మించడమే ఆశ్చర్యం. సైద్ధాంతిక నిబద్ధతగలవిగా పేరున్న కమ్యూనిస్టు పార్టీలు అప్రతిష్ట పాలయ్యాయే తప్ప, వ్రతం చెడిపోయినందుకు ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. కమ్యూనిస్టు పార్టీలే ఇలా ఎన్నికల ప్రయోజనాల కోసం ఊసరవెల్లులతో కలుస్తుంటే... మూడో కూటమి పక్షాలంటున్న ప్రాంతీయ పార్టీల గురించి చెప్పేదేముంది? ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్, అన్నా డీఎంకే, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ, ఆర్ఎల్డీలు వేసిన, వే స్తున్న కప్పదాట్లు ఎవరికి తెలియనివి? భ్రమలు వీడాల్సింది కమ్యూనిస్టులే సీపీఎం లక్ష్యం సోషలిజానికి తొలిమెట్టయిన జనతా ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన. 1964లో అది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయింది. శాంతియుతంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో ఆ లక్ష్యాన్ని సాధిం చడం వీలుకాదనే అస్పష్టమైన అభిప్రాయం అప్పట్లో దానికి ఉండేది. ప్రజాబాహుళ్యంలో ఎన్నికల ద్వారా తమ జీవితాలను మార్చుకోగలమనే భ్రమ ఇంకా ఉంది. కాబట్టి ఎన్నికలు, చట్ట సభల్లో కొంతకాలం పాల్గొనక తప్పదు అని ఆ పార్టీ భావించింది. అనుభవంలో తేలిందేమిటి? ప్రజలలో భ్రమలు తొలగడం కాదు, మార్క్సిస్టు పార్టీలో ఆ భ్రమలు పెరుగుతున్నాయని! ఎన్నికల రాజకీయాలు, పాలకవర్గ పార్టీల పొత్తులతో తమ పార్టీలో కూడా ఆడంబర జీవితం, పదవీ వ్యామోహం, అహంకారం, ధనార్జనాపేక్ష, స్వార్థపరత్వం తరతమ స్థాయిలలో వ్యాపించాయని ఆ పార్టీ తన ‘ఆత్మవిమర్శ’లో పేర్కొంది. ‘ఎవరితో పొత్తులు పెట్టుకున్నా నష్టపోయింది మేమే’నంటూ ప్రస్తుత శాసనసభలోని ఏకైక సీపీఎం సభ్యుడు రంగారెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజాఉద్యమాలే కమ్యూనిస్టులకు ప్రాణం. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రజాపోరాటాలకు మద్దతును కూడగట్టడమే చట్ట సభల్లో సైతం వారి ప్రధాన కర్తవ్యం. అంతేగానీ అవకాశవాద పొత్తులతో లక్ష్యాన్ని సాధించలేరు. అలా అని ఇతర పార్టీలతో అసలే కలవొద్దనీ కాదు. ఎలాంటి పొత్తులకైనా ముందు ప్రజాసమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఐక్య కార్యాచరణను సాగించాలి. ఎన్నికల పట్ల కూడా అదే వైఖరిని అనుసరించాలి. 1983లో సీపీఐ, సీపీఎంలు ముందే ఒక అవగాహనకు వచ్చి, ఎన్టీఆర్ తెలుగుదేశంతో చర్చలకు వెళ్లాయి. చర్చలు విఫలమయ్యాక, ఒక్క సీపీఎంతోనే పొత్తుకు సిద్ధమని, వారు కోరిన స్థానాలన్నీ ఇస్తామని ఎన్టీఆర్ రాయబారం పంపారు. నాలుగు సీట్లు గెలుచుకోవడం కంటే వామపక్ష ఐక్యతే తమకు ముఖ్యమంటూ పుచ్చలపల్లి సుందరయ్య తిరస్కరించారు. నేటి కమ్యూనిస్టుల నుంచి అలాంటి వైఖరిని ఆశించగలమా? కార్మికులు, రైతులు, బడుగు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ పెద్ద పీట వెయ్యాలి. ఆ ఐక్య కార్యాచరణపైనే వామపక్ష ఐక్యత పటిష్టమవుతుంది. కనీస ప్రజానుకూల, పురోగామి, ప్రజాస్వామిక ప్రణాళిక ప్రాతిపదికపైనే కమ్యూనిస్టేతరులతో ఐక్యకార్యాచరణగానీ, ఎన్నికల పొత్తులుగానీ ఉండాలి. అంకితభావంతో దీర్ఘకాలంపాటు సాగించాల్సిన ఈ కృషికి తృతీయ కూటమో, చతుర్థ కూటమో ప్రత్యామ్నాయం కావు. అలాంటి సుదీర్ఘ కార్యాచరణతో నిజమైన ప్రజా ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టు పార్టీలు ముందడుగు వేస్తాయని ఆశించగలమా? (వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు)