మమతా బెనర్జీ రోజురోజుకీ పెరుగుతున్న ఆకాంక్షలతో కూడిన అలుపెరుగని రాజకీయనేత. బెంగాల్‌లో సీపీఎం కంచుకోటను బద్దలు చేశాక ఆమెకు తిరుగులేకుండా పోయింది. గత 33 ఏళ్లుగా మమత కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగారు. గత పదేళ్లుగా సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ప్రధాని పదవి మాత్రమే ఆమెను వరించాల్సి ఉంది. పైగా తాను ప్రధాని పదవికి అర్హురాలినేనని ఆమె భావిస్తున్నారు.
ఢిల్లీలో ఇప్పుడు నాలుగు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం సాధారణంగా నెలకొని ఉంది. రాహుల్ గాంధీ మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా తన్ను తాను చిత్రించుకుంటున్నారు. 2. బీజేపీ ప్రధానిని కాంగ్రెస్ నేతతో భర్తీ చేయడం మరింత ప్రమాదకరమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఆ ఖాళీలో మమత అడుగు పెట్టారు. 3. ప్రతిపక్షం మొత్తాన్ని ఐక్యపర్చే శక్తిగా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి మమత ముందుకువచ్చారు. 4. సమాజ్‌వాదీ పార్టీతో చేయి కలిపి మాయావతి కాంక్షిస్తున్నారు కానీ ఆమెను అంత సీరియస్‌గా ఎవరూ పట్టించుకోలేదు.
బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటక, మహా రాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శక్తిమంతంగా ఉంది. ఇక్కడ ఇతర ప్రాంతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు బద్ధ విరోధాన్ని ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చకూడదని ఈ రాష్ట్రాల్లోని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంటే తమ ఉనికికి ప్రమాదమని వీటి భయం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పైకి తీసుకురావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించడమే ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక.
ఈ నేపథ్యంలోనే ఇతర ప్రతిపక్ష అధినేతలను ఒకటి చేయడానికి మమతా బెనర్జీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రయోజనం ఉంది. ఢిల్లీలో బీజేపీ స్థానంలో కాంగ్రెస్ రాకూడదన్నదే వాటి అభిమతం. బీజేపీని తామంతా కలసి ఓడించాలని, అదే సమయంలో మోదీ ప్రత్యర్థిగా ప్రధాని పదవికి రాహుల్ ప్రతిపక్షాల ఉమ్మడి నేతగా కాకుండా జాగ్రత్తపడాలని ఆమె ప్రతిపక్ష నేతలతో విస్తృతంగా చర్చించారు.
రాహుల్‌ని బహిరంగంగా వ్యతిరేకించకూడదని మమతకు తెలుసు. అదే సమయంలో ఆ పని ఇతరులు చేయాలని ఆమె ప్రయత్నం. మరోవైపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి మమతా వన్ టు వన్ ఫార్ములాను రూపొందించారు. దీని ప్రకారం బీజేపీయేతర పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో దృఢంగా పోరాడేందుకు ఇతర పార్టీలు తమను తాము కుదించుకోవాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మటుమాయం కావాలని దీని అర్థం. కానీ తెలంగాణను వదులుకోవడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా?
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఫ్రంట్‌లో కలవాలంటూ మమతా కోరారు తప్పితే దానికి సోనియా, రాహుల్ నేతృత్వం వహించాలని కోరలేదు. ముందుగా బీజేపీని అందరూ కలసి ఓడిస్తే, తర్వాత ప్రాంతీయ పార్టీ అధినేతలు కేజ్రీవాల్, కేసీఆర్, దేవెగౌడ, నవీన్ పట్నాయక్ వంటివారు కాంగ్రెస్ నేతృత్వంలో కలసి పనిచేస్తారని మమతా స్పష్టంగానే చెప్పారు. అంటే రాహుల్ ప్రతిపక్ష నేత కాలేరన్న సందేశం స్పష్టం గానే ఉంది. మమత సోనియాను కలవడం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నది మోదీ కాదు. కాంగ్రెసేతర ప్రతిపక్షం మొత్తంగా రాహుల్‌ని వ్యతిరేకిస్తోంది. మమత ప్రతిపాదనతో సోనియా నివ్వెరపోయారని వార్తలు. సోనియాతో భుజం భుజం కలిపి మమత పనిచేయాలని కాంగ్రెస్ సూచిస్తోం దని ఆ పార్టీ ప్రతినిధి 24 గంటల తర్వాత ప్రకటించారు.
మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి పదవికి మమత చెక్ పెట్టారు. ప్రత్యర్థిని మీరు ఓడించవలసిన పనిలేదు కానీ అతడిని అడ్డుకోవచ్చు. మోదీని నిందిస్తే, తీవ్రంగా విమర్శిస్తే ప్రతిపక్షం మొత్తంగా తనకు మద్దతిస్తుందని రాహుల్ భావించి పప్పులో కాలేశారు. కానీ కాంగ్రెసేతర ప్రతిపక్షం బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో లేదు. ఇంతవరకు దక్షిణ, ఉత్తర, పశ్చిమ భారత ప్రధానులను భారత్ చూసింది. అయితే భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. దేవెగౌడ ప్రధాని కాగలిగినప్పుడు కె.చంద్రశేఖరరావు ఎందుకు కాకూడదు? తూర్పు ఇండియా ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి మమతా బెనర్జీ ఆ ప్రాంతంనుంచి తొలి ప్రధానిగా ఎందుకు కాకూడదు?
రాజకీయాల్లో విజయం సాధించడానికి అదృష్టంతో పాటు ఆకాంక్ష, జిత్తులమారితనం, ధైర్యం, నిర్దాక్షిణ్యంగా అధికారంలోకి రావాలనే తపన కూడా కావాలి. మమతకు ఈ అన్ని లక్షణాలూ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నరేంద్ర మోదీలాగే ఆమెకు కూడా కుటుంబ బలం, కుల సమీకరణాల దన్ను లేదు.
పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు
drppullarao@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment