mamatha benarji
-
‘నిందితుల్లో భయం పుట్టాలి’.. ఆర్జీ కార్ దారుణంపై మోదీ కామెంట్స్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీకార్ ఆస్పత్రి మెడికల్ కాలేజీలో జరిగి దారుణంపై ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై తాను ఆగ్రహం వ్యక్తం చేస్తున్నానని, రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ..‘వైమానిక దళం, సైన్యం, నౌకాదళం, అంతరిక్షం ఇలా అనేక రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. కానీ వారిపై జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ రోజు ఎర్రకోట నుండి నా బాధను వ్యక్తం చేస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు. #WATCH | PM Narendra Modi says, "...I would like to express my pain once again, from the Red Fort today. As a society, we will have to think seriously about the atrocities against women that are happening - there is outrage against this in the country. I can feel this outrage.… pic.twitter.com/2gQ53VrsGk— ANI (@ANI) August 15, 2024‘మా తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను సైతం అదే విధమైన ఆగ్రహంతో ఉన్నా. మన రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని సీరియస్‌గా తీసుకోవాలి. మహిళలపై జరిగిన నేరాల పట్ల వీలైనంత త్వరగా విచారణ జరగాలి. నిందితుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’అని మోదీ అన్నారు. అనంతరం మహిళలపై అఘాయిత్యాలు జరిగినప్పుడు మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందన్నారు. కానీ నిందితులకు శిక్షలు పడినప్పుడు వాటికి ప్రాధాన్యత తక్కువ ఇస్తున్నారు. నేరస్థుల్ని బయపెట్టారు. వారు భయపడేలా శిక్షల గురించి చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ సూచించారు. -
ఒట్టి చేతులతో వచ్చారేంటి..! సీఎస్‌పై గవర్నర్ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మరోసారి ప్రభుత్వ ఉన్నతాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది ఇదే శాంతి భద్రతల విషయంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, గవర్నర్ జగదీప్ ధన్ఖర్ మధ్య వివాదం తలెత్తగా.. ఈసారి గవర్నర్‌పై ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు సర్వత్రా చర్చాంశానీయంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతలను సమీక్షించేందుకు శనివారం గవర్నర్ జగ్దీప్ ధన్ఖర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అల్పన్ బందోపాధ్యాయ, డీజీపీ వీరేంద్ర రాజ్ భవన్‌కు పిలిపించుకున్నారు. అయితే గవర్నర్‌తో భేటీ అయ్యేందుకు రాజ్‌భవన్‌కు వచ్చిన ఉన్నతాధికారులు ఎలాంటి రిపోర్ట్ లేకుండా రావడంపై జగదీప్ ధన్ఖర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘తాజా పరిస్థితులపై ఓ రిపోర్ట్ తీసుకొని వచ్చి ఉంటే బాగుండేంది. కానీ ఒట్టి చేతులతో వచ్చారు. ఆలస్యం చేయకుండా నివేదిక తయారు చేసుకొని తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశాం’ అని సీఎస్, డీజీపీ భేటీ తర్వాత గవర్నర్ ట్వీట్ చేశారు. అంతేకాదు ఎన్నికల అనంతరం జరిగిన పరిణామాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయని వివరించడంలో ఉన్నతాధికారులు విఫలమయ్యారని గవర్నర్ ఆరోపించారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగానికి విరుద్దంగా ఉండడం దురదృష్టకరమని, హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వకపోవడం దారుణమని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. Chief Secretary @MamataOfficial and DGP @WBPolice called on me at Raj Bhawan at 6 PM today. Unfortunately both came without any paper or reports sought. Directed them to send the same without delay. In a sense disgusted with such stance. Hope there is appropriate response now. pic.twitter.com/RJUnCZp1VY — Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 8, 2021 కాగా గతేడాది సైతం రాష్ట్రంలో శాంతి భద్రతలపై నివేదిక అందించాలని గవర్నర్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల్ని సీఎం పేషీ అధికారులు భేఖాతర్ చేశారు. దీంతో అసహనం వ్యక్తం చేసిన ఆయన.. 'గవర్నర్‌ను పోస్టాఫీస్‌లో రబ్బర్ స్టాంప్‌గా చూడాలని సీఎం కోరుకుంటున్నారు. అందుకే నన్ను రాజ్ భవన్‌కు పరిమితం చేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలంగా మారింది. చదవండి: టీఎంసీలోకి ముకుల్ రాయ్.. క్లారిటీ ఇచ్చిన బీజేపీ నేత -
భారత సమాఖ్య వ్యవస్థపై బీజేపీ ‘సర్జికల్ స్ట్రైక్’: దీదీ ఫైర్
న్యూఢిల్లీ : భారత సమాఖ్య వ్యవస్ధ పైన ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు "సర్జికల్ స్ట్రైక్" చేయడానికి కేంద్రం గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (జీఎన్సీటీడీ) సవరణ బిల్లును తీసుకువచ్చిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీవాల్‌కు తాను మద్దతుగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. బుధవారంతృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో, బీజేపీ యేతర ముఖ్యమంత్రులు, బీజేపీని వ్యతిరేకిస్తున్న రాజకీయ పార్టీలందరికీ తమ మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ బిల్లుపై ఎందుకంత రగడ ఢిల్లీ అసెంబ్లీ చేసే ప్రతీ చట్టానికి సంబంధించి ‘ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్ట్‌నెంట్ గవర్నర్’ అనే అర్థాన్ని ఈ బిల్లు నిర్వచిస్తుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఎలాంటి కార్యనిర్వాహక నిర్ణయంపై అయినా ముందుగా ఎల్జీ అభిప్రాయం తీసుకోవడం తప్పని సరి అని ఆ బిల్లులో పొందుపర్చారు. రాజధానిలో ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వాన్ని బలహీనపరిచి, ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాను తగ్గిస్తూ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు సబార్డినేట్‌గా మార్చాలని కేంద్రం ఇలాంటి బిల్లులను ప్రవేశపెట్టిందంటూ మమతా మండిపడ్డారు. అలాగే 2018 లో ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఈ బిల్లు ఉల్లంఘిస్తోందన్నారు. ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న చట్టబద్ధమైన అధికారాలను తొలగించి, లెఫ్టినెంట్ గవర్నర్‌కు ద్వారా ముఖ్యమంత్రిని లొంగదీసుకునే చర్య అని విమర్శించారు .ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యతిరేక చర్యగా ఆమె అభివర్ణించారు. "పశ్చిమ బెంగాల్‌తో సహా పలు రాష్ట్రాల్లో, గవర్నర్లు బీజేపీ కార్యాలయ అధికారుల వలె పనిచేస్తున్నారు తప్ప తటస్థ రాజ్యాంగ అధికారుల వలె కాదు" ఎద్దేవా చేశారు. "2014, 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ అద్మీ పార్టీ చేతిలో బిజెపి ఎదుర్కొన్న అవమానకరమైన ఓటమిని ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ జీర్ణించుకోలేక ఎలాగైనా ఢిల్లీని పాలించే ఉద్దేశ్యంతోనే, జీఎన్‌సిటిడి చట్టానికి ప్రతిపాదిత సవరణల నిజమైన ఉద్దేశ్యమని చెప్పారు. కాగా 2021 లోని గవర్న్మెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లును కేంద్ర హోంమంత్రి కిషన్ రెడ్డి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ( చదవండి : కాళ్లపై పడేందుకైనా సిద్ధం..: కేజ్రీవాల్) -
యూపీలో అను''కులం''... బువా–భతీజాకే!
సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో మోదీ హవా కారణంగా 2014 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటి రెండు సీట్లకే పరిమితమైపోగా.. మరొకటి అసలు ఖాతానే తెరవలేదు. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 42.3 శాతం ఓట్లతో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్ రెండు సీట్లు గెలుచుకోగా, గాంధీ కుటుంబం కంచుకోట నుంచి కాంగ్రెస్ రెండు స్థానాలు సాధించగలిగింది. అంతటి మోదీ హవా ఎన్నికల తరువాత క్రమేపీ తగ్గినట్లు కనిపించినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీ–కాంగ్రెస్ కూటమితో పాటు, బీఎస్పీని చిత్తుచిత్తుగా ఓడించడం ఇక్కడ చెప్పుకోవాలి. యూపీ: మొగ్గు బీజేపీ వైపే! ఈసారి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగా 42.7 శాతం ఓట్లు సాధించగా ఈసారి తమ పార్టీల బలమైన యాదవ, జాటవ్, జాట్లకు ముస్లిం ఓట్లు కూడా కలుస్తాయని తద్వారా విజయం తమను వరిస్తుందన్న అంచనాలో ఈ కూటమి ఉంది. మరోవైపు గత రెండు ఎన్నికల్లో అగ్రవర్ణాలు, యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు మద్దతుగా నిలవడంతో బీజేపీ తన ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుంది. ఈసారి ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయి. జాటవేతర దళితులను మాయావతి ఎంత వేగంగా తనవైపు తిప్పకోగలరన్నది మొదటిది కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెల్లాచెదురైన యాదవ ఓటు బ్యాంకును అఖిలేష్ ఎంత మేరకు ఒక్కటి చేయగలరన్నది రెండోది. జట్టు కట్టిన మూడు ప్రాంతీయ పార్టీల మద్దతుదారుల ఓట్ల బదలాయింపు ఎంత సమర్థంగా జరుగుతుందన్నది చివరి అంశం. ఎన్నికల విశ్లేషకుల దృష్టికోణం నుంచి చూస్తే యూపీలో పరిస్థితులు మూడు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నా.. ఈసారి కూడా మోదీ హవా తన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది కీలకం కానుంది. జాతీయవాదం, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ వంటి అంశాలను ప్రచారంలో లేవనెత్తడం ద్వారా బీజేపీ అన్ని వర్గాల వారినీ తనవైపు తిప్పుకునే అవకాశం లేకపోలేదు. బిహార్: ‘కమల’ వికాసమేనా? గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీయే, ఎన్డీయే, జేడీయూతో ముక్కోణపు పోటీ నెలకొంది. రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ, ఉపేంద్ర ఖుష్వహా పార్టీ ఆర్ఎస్ఎల్పీతో జట్టుకట్టిన బీజేపీ మొత్తం 40 స్థానాల్లో 31 గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీయే కూటమికి దక్కింది ఏడు సీట్లు మాత్రమే. ఈ కూటమికి దక్కిన ఓట్లు 32 శాతం కాగా, ఇంకో ఏడు శాతం ఎక్కువ ఓట్లతో ఎన్డీయే విజయఢంకా మోగించింది. పదహారు శాతం ఓట్లతో జేడీయూ రెండు సీట్లు సాధించగలిగింది. అయితే ఏడాది తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. జేడీయూ ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక్కటి కావడంతో బీజేపీ ఓటమి పాలైంది. ప్రతిపక్షాలు ఒక్కతాటిపై నిలిస్తే అధికార పక్షాన్ని అడ్డుకోవడం కష్టమేమీ కాదన్న సంకేతాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు బిహార్‌లో జేడీయూ–ఆర్జేడీ మధ్య చీలిక బీజేపీకి నితీశ్‌కుమార్‌తో జట్టుకట్టే అవకాశం కల్పించింది. ఈసారి ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ చెరో 17 సీట్లలో పోటీచేస్తుండగా, ఎల్జేపీ ఆరుచోట్ల బరిలో ఉంది. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా 50 శాతం ఓట్లు సాధించాయి. కొంత తగ్గుదల ఉంటుందని లెక్కకట్టినా ఈసారి కూడా ఈ కూటమి విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఆర్జేడీ ఈసారి కాంగ్రెస్, ఆర్ఎస్ఎల్పీ, జితేన్ మాంఝీకి చెందిన హెచ్ఏఎంతో జట్టు కట్టింది. మొత్తమ్మీద చూస్తే గత ఏడాది కంటే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నందున ఈసారి బీజేపీకి బిహార్‌లో తక్కువ స్థానాలు వస్తాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సంఖ్యాపరంగా బలపడతాయి. ఒడిశా: నవీన్.. విజయపథమేనా? గత ఎన్నికల్లో దేశం మొత్తమ్మీద హవా వీచినా.. ఆ ప్రభావాన్ని తట్టుకున్న నాలుగు రాష్ట్రాల్లో ఒకటి ఒడిశా. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ పార్టీ ఆ ఎన్నికల్లో 21 లోక్‌సభ స్థానాలకు 20 గెలుచుకుంది. పోలైన ఓట్లలో 45 శాతం బీజేడీకే పడ్డాయి. దాదాపు 22 శాతం ఓట్లతో బీజేపీ ఒక్క స్థానాన్ని దక్కించుకోగలిగింది. తరువాత ఈ రాష్ట్రంలో బీజేపీ క్రమేపీ బలం పుంజుకుంది. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 297 స్థానాలు గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం. 2012 నాటి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి దక్కింది 36 మాత్రమే. బీజేపీ గెలుచుకున్న స్థానాల్లో అత్యధికం రాష్ట్రంలో తిరోగమనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీవి కావడం గమనార్హం. బీజేడీ స్థానాల్లో పెద్దగా మార్పుల్లేవు. ఈ పరిణామాలన్నింటి ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాలన కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి బీజేడీకి కష్టాలు తప్పవనిపిస్తోంది. ఏతావాతా ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశాలో కాషాయ పార్టీ ప్రభావం ఎక్కువుండే అవకాశాలు కనిపిస్తుండగా.. ఒడిశాలో బీజేడీ ప్రభ తగ్గొచ్చని అంచనా. బెంగాల్: మమతదే ఆధిపత్యం మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో పశ్చిమబెంగాల్లోని 42 స్థానాల్లో 34 గెలుచుకుంది. కాంగ్రెస్ పది శాతం ఓట్లతో 4 సీట్లు సాధించింది. అయితే సీపీఎం, సీపీఐ, ఏఐఎఫ్బీ, ఆర్ఎస్పీతో కూడిన వామపక్షాలకు 30 శాతం ఓట్లు దక్కినా.. సాధించిన సీట్లు మాత్రం రెండే. మరోవైపు బీజేపీ 17 శాతం ఓట్లతో రెండు సీట్లు సాధించింది. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది. టీఎంసీకి పోటీగా కాంగ్రెస్–వామపక్షాల కూటమి, బీజేపీ–గూర్ఖా జనముక్తి మోర్చా పోటీపడ్డ ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు అంటే 294 స్థానాల్లో 211 గెలుచుకుంది. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఐదు శాతం (45) ఎక్కువ ఓట్లు సాధించింది. కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి 38 ఓట్ల శాతంతో 76 స్థానాలు గెలుచుకోగా బీజేపీ –జీజేఎం మూడు సీట్లు సాధించినా.. కూటమిలోని బీజేపీ ఓట్లు ఐదు శాతం తగ్గాయి. అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన పరిస్థితిని మెరుగుపరుచుకుంది. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను, ఇద్దరు కీలక నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ రాజకీయంగా లాభపడింది. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ కొంత ఆందోళనకు గురైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టదలచుకున్న యాత్రలతో మతఘర్షణలు జరుగుతాయన్న నెపంతో అనుమతి నిరాకరించడం ఆ ఆందోళన ఫలితమే. తాజా ఎన్నికల్లోనూ బెంగాలీల తొలి ప్రాధాన్యం తృణమూల్ కాంగ్రెస్ అనే చెప్పాలి. మహిళలకు 41 శాతం సీట్లు కేటాయించాలన్న తృణమూల్ నిర్ణయం.. ఐదేళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు శారద స్కామ్‌ను వాడుకోవడం ద్వారా కనీసం 21 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో 27 శాతమున్న ముస్లింల ఓట్లు మొత్తం తృణమూల్ వైపు మళ్లకుండా ఉండేందుకు బీజేపీ బంగ్లాదేశీ వలసదారుల అంశాన్ని లేవనెత్తుతోంది. మొత్తమ్మీద బీజేపీ గత ఎన్నికల కంటే కొన్ని సీట్లు ఎక్కువ సాధించగలిగినా.. బెంగాల్ రాజకీయాల్లో మమత ఆధిపత్యం కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఆ పార్టీకే! -
‘కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నాం’
ఢిల్లీ: ఎన్నికల తర్వాతే మా కూటమి నాయకుడు ఎవరనేది నిర్ణయిస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. గురువారం ఢిల్లీలో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాను మమతా బెనర్జీ సందర్శించారు. అనంతరం మమత మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రస్థాయిలో పొత్తులు ఎలా ఉన్నా జాతీయస్థాయిలో మాత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కూటమి కడతామని స్పష్టం చేశారు. అయితే ఎన్నికల ముందు జాతీయస్థాయిలో ప్రీపోల్ అలయెన్స్ ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించారు. రాజకీయ కారణాల వల్ల కొన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు పొత్తుకు రావడం లేదని తెలిపారు. కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ తయారీ జరుగుతోందని వెల్లడించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో తాము టచ్‌లో ఉన్నామని మమత చెప్పారు. దానిపై చర్చించిన తర్వాత ప్రకటిస్తామని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను ఇంటికి పంపడమే మా లక్ష్యమని ఉద్ఘాటించారు. -
కేసీఆర్‌కు మమతాబెనర్జీ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతాలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిర్వహించే ఈ ర్యాలీకి రావాలని తెలంగాణ ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావును ఆమె ఆహ్వానించారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ర్యాలీకి హాజరవుతుండటంతో ఆయనతో వేదిక పంచుకోవడం సరికాదని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో కోల్‌కతా ర్యాలీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. -
ఒకే ముఖ్య మహిళ
ఇరవై తొమ్మిది రాష్ట్రాలు! పద్నాలుగు మంది ముఖ్య మహిళలు ఉండాలి.ఇది ‘ఆకాశంలో సగం’ కౌంట్.పోనీ...తొమ్మిది మంది ముఖ్య మహిళలు ఉండాలి. ఇది పార్లమెంట్లో ఇంకా నోచుకోని కౌంట్.కానీ ప్రస్తుతం మిగిలింది..ఒకే ఒక్క ముఖ్య మహిళ. ఇది ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతి కౌంట్.అవును. మమతాబెనర్జీ ఒక్కరే ఇప్పుడు మనకు మిగిలిన మహిళా ముఖ్యమంత్రి! ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ఇప్పుడు మమతాబెనర్జీ ఒక్కరే ఏకైక మహిళా సి.ఎం.గా మిగిలారు! దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో మూడు రోజుల క్రితం వరకు ఇద్దరు మహిళా సి.ఎం.లు ఉండేవారు. రాజస్తాన్‌కు వసుంధరారాజే. పశ్చిమబెంగాల్‌కు మమతాబెనర్జీ. ఈ ఎన్నికల్లో రాజే పార్టీ బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో మరోసారి ఆమె సి.ఎం. కాలేకపోయారు. ఇక మిగిలింది మమతాబెనర్జీ. మమత 2011 నుంచి సి.ఎం.గా ఉన్నారు. పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికలు 2016లో జరిగాయి కనుక మమత 2021 వరకు సి.ఎం.గా ఉంటారు. రెండేళ్లకు ముందు నలుగురు మహిళా సి.ఎం.లు ఉండేవారు. మమత, రాజే, మొహబూబా ముఫ్తీ (జమ్మూకశ్మీర్), ఆనందిబెన్ (గుజరాత్). 2014లో మోదీ ప్రధాని కావడంతో గుజరాత్ సి.ఎం. పోస్టు ఖాళీ అయి, ఆ స్థానంలోకి ముఖ్యమంత్రిగా వచ్చిన ఆనందిబెన్, 2016లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ‘ఈ ఏడాదితో నాకు డెబ్బై ఐదేళ్లు వస్తున్నాయి. ఇక ఈ వయసులో నేను చురుగ్గా పనిచేయలేను కనుక రాజీనామా చేస్తున్నాను’ అని ఆనందిబెన్ బహిరంగంగానే ప్రకటించారు. ప్రస్తుతం ఆమె మధ్యప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 23న ఆనందిబెన్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్నటి వరకు మధ్యప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ స్థానంలోకి కాంగ్రెస్ నాయకుడు కమల్‌నాథ్ వస్తున్నారు కాబట్టి ఆయన్ని కట్టడి చెయ్యడానికి మరింత క్రియాశీలంగా ఉండే గవర్నర్‌ను ఆ రాష్ట్రానికి నియమించాలని కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుకుంటే కనుక ఆనందిబెన్ స్థానంలోకి మరొకరు రావచ్చు.ఆనందిబెన్ తనకు తానుగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటే, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా మెహబూబా ముఫ్తీ ఈ ఏడాది జూన్‌లో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బీజేపీ తన మద్దతును ఉపసంహరించుకోవడంతో తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అక్కడ గవర్నర్ పాలన కొనసాగుతోంది. మెహబూబా ముఫ్తీ దేశంలో రెండవ ముస్లిం మహిళా సి.ఎం. కాగా, 1980–81 మధ్య అస్సాంలో అధికారంలో ఉన్న సయేదా అన్వరా తైమూర్.. తొలి ముస్లిం మహిళా ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. వసుంధరా రాజే, మెహబూబా, ఆనందిబెన్లకు ముందు ఉమాభారతి (మధ్యప్రదేశ్), షీలాదీక్షిత్ (ఢిల్లీ), సుష్మా స్వరాజ్ (ఢిల్లీ), రబ్రీదేవి (బిహార్), రాజేందర్ కౌల్ భత్తల్ (పంజాబ్), మాయావతి (ఉత్తర ప్రదేశ్); వీరికి ముందు జయలలిత (తమిళనాడు), జానకీ రామచంద్రన్ (తమిళనాడు), సయేదా అన్వరా తైమూర్ (అస్సాం), శశికళా కకోద్కర్ (గోవా), నందిని సత్పతి (ఒరిస్సా), సుచేతా కృపలానీ (ఉత్తర ప్రదేశ్) ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మమతా బెనర్జీతో కలుపుకుని మొత్తం 16 మంది మహిళలు స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు. ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఇప్పటి వరకు 13 రాష్ట్రాలకు (ఉత్తర ప్రదేశ్, ఒరిస్సా, గోవా, అస్సాం, తమిళనాడు, పంజాబ్, బిహార్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, జమ్మూకశ్మీర్) మహిళలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన రికార్డు ఉండగా.. తక్కిన 16 రాష్ట్రాలకు ఇంకా ఆ ఘనత దక్కవలసి ఉంది. పై పదమూడు రాష్ట్రాలలో మళ్లీ.. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తర ప్రదేశ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ రాష్ట్రాలు ఇద్దరు మహిళా సి.ఎం.లను చూశాయి. ఢిల్లీకి సుష్మా స్వరాజ్, షీలాదీక్షిత్; తమిళనాడుకు జానకీ రామచంద్రన్, జయలలిత, ఉత్తర ప్రదేశ్‌కు సుచేతా కృపలానీ, మాయావతి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బయ్ ఏళ్లు దాటినా రాజకీయాలలో మహిళలకు ప్రాధాన్యం లేదని చెప్పలేం కానీ, తగినంత ప్రాధాన్యం లేదని మాత్రం సంఖ్యలు, శాతాలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఉన్న రాష్ట్రాల్లో ఇంకా సగం పైగానే ఏనాడూ మహిళా ముఖ్యమంత్రుల పాలనలో లేవు. పార్లమెంట్ సభ్యత్వంలో కూడా మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. ప్రస్తుతం నడుస్తున్నది 16వ లోక్‌సభ. అది కూడా ముగింపునకు వచ్చేసింది. మొత్తం 543 లోక్‌సభ ఎంపీలలో (ఇద్దరు నామినేటెడ్ సభ్యుల్ని మినహాయిస్తే) 65 మంది మాత్రమే మహిళా ఎంపీలు ఉన్నారు. అంటే కేవలం 12 శాతం! రాజ్యసభలో 244 మంది సభ్యులుంటే వారిలో మహిళా ఎంపీలు 24 మందే. అంటే 11.5 శాతం. వచ్చే ఎన్నికల్లో ఈ శాతం పెరగడంతో పాటు, ఇప్పటికింకా మహిళా ముఖ్యమంత్రుల పాలన లోకి రాని రాష్ట్రాలు మహిళను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే అది రికార్డే అవుతుంది. రికార్డు మాట అటుంచి రాజకీయాల్లో మెరుగైన పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. మహిళా సి.ఎం.లు భారతదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపలానీ మొదట స్వాతంత్య్ర సంగ్రామ యోధురాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు 1947 ఆగస్టు 14న నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టీనీ’ ప్రసంగానికి కొన్ని నిముషాల ముందు వందే మాతర గీతాన్ని కృపలానీనే ఆలపించారు. నందిని సత్పతి ఎం.ఎ చదివారు. కాలేజ్‌లో కమ్యూనిస్టు. తర్వాత కాంగ్రెస్‌లో చేరి, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్లి, రాజీవ్ గాంధీ కోరడంతో తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చారు. అంతకు ముందు ఇందిరాగాంధీ మంత్రివర్గ సభ్యురాలిగా ఉన్నారు. శశికళా కకోద్కర్ని ‘తాయి’ అనేవారు. అంటే పెద్దక్క అని. పీజీ చేశాక శశికళ సామాజిక సేవలో ఉండిపోయారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు.మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీలో ముఖ్య నాయకురాలు. సయేదా అన్వారా తైమూర్ అలిఘర్ ముస్లిం యూనివర్సిటీలో చదివారు. జొర్హత్లోని దేవీచరణ్ బారువా గర్ల్స్ కాలేజీలో ఎకనమిక్స్ లెక్చరర్‌గా పనిచేశారు. తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జానకి.. ఎం.జి.రామచంద్రన్ భార్య. ఎం.జి.ఆర్. చనిపోయాక పార్టీలోని ఒక వర్గం జానకిని సి.ఎం.గా ఉండమని కోరింది. అయితే 24 రోజులు మాత్రమే ఆమె ఆ పదవిలో ఉండగలిగారు. తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది. ఇక జయలలిత.. చనిపోయే నాటికి తమిళనాడు సి.ఎం.గా ఉన్నారు. ముఖ్యమంత్రులుగా పని చేసిన మహిళల్లో మిగతావారైన మాయావతి, రబ్రీదేవి, సుష్మాస్వరాజ్, షీలాదీక్షిత్, ఉమాభారతి, వసుంధరా రాజే, మెహబూబా మఫ్తీ నేటికింకా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం తన 74వ వయసులో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న రాజీందర్ కౌర్ భత్తాల్ నాటికీ, నేటికీ పంజాబ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రే. ఆమె తర్వాత ఇంకో మహిళ ఆ స్థానంలోకి రాలేదు. -
ఢిల్లీ పీఠంపై దీదీ చూపు
మమతా బెనర్జీ రోజురోజుకీ పెరుగుతున్న ఆకాంక్షలతో కూడిన అలుపెరుగని రాజకీయనేత. బెంగాల్లో సీపీఎం కంచుకోటను బద్దలు చేశాక ఆమెకు తిరుగులేకుండా పోయింది. గత 33 ఏళ్లుగా మమత కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా కొనసాగారు. గత పదేళ్లుగా సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ప్రధాని పదవి మాత్రమే ఆమెను వరించాల్సి ఉంది. పైగా తాను ప్రధాని పదవికి అర్హురాలినేనని ఆమె భావిస్తున్నారు. ఢిల్లీలో ఇప్పుడు నాలుగు అంశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. 2019 ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న అభిప్రాయం సాధారణంగా నెలకొని ఉంది. రాహుల్ గాంధీ మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా తన్ను తాను చిత్రించుకుంటున్నారు. 2. బీజేపీ ప్రధానిని కాంగ్రెస్ నేతతో భర్తీ చేయడం మరింత ప్రమాదకరమని ప్రాంతీయ పార్టీలు భావిస్తున్న నేపథ్యంలో ఆ ఖాళీలో మమత అడుగు పెట్టారు. 3. ప్రతిపక్షం మొత్తాన్ని ఐక్యపర్చే శక్తిగా కాంగ్రెస్‌ను పక్కకు నెట్టి మమత ముందుకువచ్చారు. 4. సమాజ్‌వాదీ పార్టీతో చేయి కలిపి మాయావతి కాంక్షిస్తున్నారు కానీ ఆమెను అంత సీరియస్‌గా ఎవరూ పట్టించుకోలేదు. బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కర్ణాటక, మహా రాష్ట్ర, రాజస్తాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ శక్తిమంతంగా ఉంది. ఇక్కడ ఇతర ప్రాంతీయ పార్టీలకు పెద్దగా స్థానం లేదు. కానీ ప్రాంతీయ పార్టీలు ప్రధాన పోటీదారులుగా ఉన్న రాష్ట్రాల్లోనే కాంగ్రెస్‌కు చిక్కులు ఏర్పడుతున్నాయి. బెంగాల్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాంతీయ పార్టీలు బద్ధ విరోధాన్ని ప్రదర్శిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కేంద్రప్రభుత్వాన్ని ఏర్పర్చకూడదని ఈ రాష్ట్రాల్లోని పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉంటే తమ ఉనికికి ప్రమాదమని వీటి భయం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా పైకి తీసుకురావడాన్ని బహిరంగంగా వ్యతిరేకించడమే ఫెడరల్ ఫ్రంట్ ప్రాతిపదిక. ఈ నేపథ్యంలోనే ఇతర ప్రతిపక్ష అధినేతలను ఒకటి చేయడానికి మమతా బెనర్జీ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రాంతీయ పార్టీలన్నింటికీ ఒకే ఉమ్మడి ప్రయోజనం ఉంది. ఢిల్లీలో బీజేపీ స్థానంలో కాంగ్రెస్ రాకూడదన్నదే వాటి అభిమతం. బీజేపీని తామంతా కలసి ఓడించాలని, అదే సమయంలో మోదీ ప్రత్యర్థిగా ప్రధాని పదవికి రాహుల్ ప్రతిపక్షాల ఉమ్మడి నేతగా కాకుండా జాగ్రత్తపడాలని ఆమె ప్రతిపక్ష నేతలతో విస్తృతంగా చర్చించారు. రాహుల్‌ని బహిరంగంగా వ్యతిరేకించకూడదని మమతకు తెలుసు. అదే సమయంలో ఆ పని ఇతరులు చేయాలని ఆమె ప్రయత్నం. మరోవైపున బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి మమతా వన్ టు వన్ ఫార్ములాను రూపొందించారు. దీని ప్రకారం బీజేపీయేతర పార్టీ బలంగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీ బీజేపీతో దృఢంగా పోరాడేందుకు ఇతర పార్టీలు తమను తాము కుదించుకోవాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ, బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, ఏపీ, కేరళ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మటుమాయం కావాలని దీని అర్థం. కానీ తెలంగాణను వదులుకోవడానికి కాంగ్రెస్ అంగీకరిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష ఫ్రంట్‌లో కలవాలంటూ మమతా కోరారు తప్పితే దానికి సోనియా, రాహుల్ నేతృత్వం వహించాలని కోరలేదు. ముందుగా బీజేపీని అందరూ కలసి ఓడిస్తే, తర్వాత ప్రాంతీయ పార్టీ అధినేతలు కేజ్రీవాల్, కేసీఆర్, దేవెగౌడ, నవీన్ పట్నాయక్ వంటివారు కాంగ్రెస్ నేతృత్వంలో కలసి పనిచేస్తారని మమతా స్పష్టంగానే చెప్పారు. అంటే రాహుల్ ప్రతిపక్ష నేత కాలేరన్న సందేశం స్పష్టం గానే ఉంది. మమత సోనియాను కలవడం కాంగ్రెస్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాహుల్‌ని ప్రధాని అభ్యర్థిగా వ్యతిరేకిస్తున్నది మోదీ కాదు. కాంగ్రెసేతర ప్రతిపక్షం మొత్తంగా రాహుల్‌ని వ్యతిరేకిస్తోంది. మమత ప్రతిపాదనతో సోనియా నివ్వెరపోయారని వార్తలు. సోనియాతో భుజం భుజం కలిపి మమత పనిచేయాలని కాంగ్రెస్ సూచిస్తోం దని ఆ పార్టీ ప్రతినిధి 24 గంటల తర్వాత ప్రకటించారు. మొత్తానికి రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థి పదవికి మమత చెక్ పెట్టారు. ప్రత్యర్థిని మీరు ఓడించవలసిన పనిలేదు కానీ అతడిని అడ్డుకోవచ్చు. మోదీని నిందిస్తే, తీవ్రంగా విమర్శిస్తే ప్రతిపక్షం మొత్తంగా తనకు మద్దతిస్తుందని రాహుల్ భావించి పప్పులో కాలేశారు. కానీ కాంగ్రెసేతర ప్రతిపక్షం బీజేపీ స్థానంలోకి కాంగ్రెస్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో లేదు. ఇంతవరకు దక్షిణ, ఉత్తర, పశ్చిమ భారత ప్రధానులను భారత్ చూసింది. అయితే భవిష్యత్తును ఎవరూ ఊహించలేరు. దేవెగౌడ ప్రధాని కాగలిగినప్పుడు కె.చంద్రశేఖరరావు ఎందుకు కాకూడదు? తూర్పు ఇండియా ఒక్కటే మిగిలిపోయింది కాబట్టి మమతా బెనర్జీ ఆ ప్రాంతంనుంచి తొలి ప్రధానిగా ఎందుకు కాకూడదు? రాజకీయాల్లో విజయం సాధించడానికి అదృష్టంతో పాటు ఆకాంక్ష, జిత్తులమారితనం, ధైర్యం, నిర్దాక్షిణ్యంగా అధికారంలోకి రావాలనే తపన కూడా కావాలి. మమతకు ఈ అన్ని లక్షణాలూ కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నరేంద్ర మోదీలాగే ఆమెకు కూడా కుటుంబ బలం, కుల సమీకరణాల దన్ను లేదు. పెంటపాటి పుల్లారావు వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు drppullarao@yahoo.co.in -
బీజేపీ అసమ్మతి నేతలతో మమత మంతనాలు
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడు పెంచారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని కూల్చడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ఆమె తాజాగా బీజేపీ అసమ్మతి నేతలతో భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారంబీజేపీ అసమ్మతి నేతలు యశ్వంత్ సింగ్, శత్రుఘ్నసిన్హా, అరుణ్ శౌరీలతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మూడో ఫ్రంట్ అవసరాన్ని, బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను వారితో చర్చించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే శరద్‌పవార్, శివసేన పార్టీ నాయకులు, టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయిన మమతా నేడు బీజేపీ తిరుగుబాటు నాయకులతో భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తృతీయ కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ఆమె దానికోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
టీడీపీ నిర్ణయాన్ని స్వాగతించిన మమత
కోల్కత్తా: దేశాన్నిబీజేపీ విపత్తు నుంచి కాపాడాలని తృణముల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పిలుపునిచ్చారు. ఎన్డీయే కూటమి నుంచి టీడీపీ బయటకు రావటాన్ని ఆమె స్వాగతించారు. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావాలన్న టీడీపీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని మమతా బెనర్జీ శుక్రవారం ట్విట్ చేశారు. దేశంలో ఉన్న దుర్మార్గపు పాలనకు, ఆర్ధిక సంక్షోభానికి, రాజకీయ అస్థిరతకి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీయే వ్యతిరేక శక్తులన్ని ఏకం కావాలని మమత పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలని కోరారు. I welcome the TDP's decision to leave the NDA. The current situation warrants such action to save the country from disaster — Mamata Banerjee (@MamataOfficial) 16 March 2018 I appeal to all political parties in the Opposition to work closely together against atrocities, economic calamity and political instability — Mamata Banerjee (@MamataOfficial) 16 March 2018 -
రాజ్యాంగ ధర్మాసనానికి ‘ఆధార్’
న్యూఢిల్లీ: వివిధ సేవలు పొందేందుకు, సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై దాఖలైన పిటిషన్లను నవంబర్ చివరి వారంలో రాజ్యాంగ ధర్మాసనం విచారిస్తుందని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెల్లడించింది. ప్రస్తుతం ఆధార్ ఉన్నవారికి కూడా అనుసంధానం గడువును డిసెంబర్ 31 తర్వాత పొడిగించేందుకు కేంద్రం నిరాకరించిన నేపథ్యంలో కోర్టు ఈ నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో వాదనలు విన్పించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, కేంద్రం వాదనను వినకుండా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ విజ్ఞప్తి చేయడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల ధర్మాసనం కేసును రాజ్యాంగ ధర్మాసనానికి సిఫార్సు చేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది గోపాల్ సుబ్రమణియమ్ వాదిస్తూ.. ‘ఆధార్ పూర్తిగా స్వచ్ఛంద ప్రక్రియ.. ప్రభుత్వ పథకాల లబ్ధికి తప్పనిసరిగా కార్డు కలిగి ఉండాలన్న ఒత్తిడి ప్రజలపై ఉండకూడదు’ అని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుందరం వాదిస్తూ.. ఈ అంశంపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అందరి వాదనలు విన్న ధర్మాసనం.. ఈ అంశాన్ని విచారించేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఆధార్ ఉంటే అనుసంధానం తప్పనిసరి ఆధార్ అనుసంధానం గడువు పెంపుపై అక్టోబర్ 25న సుప్రీంకోర్టుకు కేంద్రం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. ‘ప్రభుత్వ పథకాల లబ్ధికి ఆధార్ అనుసంధానం గడువును ఆధార్ లేనివారి కోసం మార్చి 31, 2018కి పెంచుతున్నాం. ఆధార్ లేనివారిని ఇబ్బంది పెట్టం. మార్చి 31 వరకూ వారికి సంక్షేమ పథకాల లబ్ధిని నిరాకరించం. ఇప్పటికే ఆధార్ ఉన్నవారు మాత్రం ఆ నంబర్‌ను సిమ్ కార్డు, బ్యాంకు ఖాతా, పాన్ కార్డు, ఇతర పథకాలకు అనుసంధానం చేసుకోవాలి. అందుకోసం సెక్షన్ 7 నోటిఫికేషన్లు జారీ చేశాం’ అని అటార్నీ జనరల్ సుప్రీం కోర్టుకు తెలిపారు. కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రం ప్రశ్నిస్తుందా? సంక్షేమ పథకాల లబ్ధికి ఆధార్ అనుసంధానం తప్పనిసరి అన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనను సుప్రీం కోర్టులో సవాలు చేసిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేయగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘ఒక రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పిటిషన్ ఎలా దాఖలు చేస్తుంది? సమాఖ్య వ్యవస్థలో పార్లమెంట్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ రాష్ట్రం పిటిషన్ ఎలా దాఖలు చేయగలదు?’ అని జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ అశోక్ భూషణ్‌ల ధర్మాసనం బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మిక శాఖ.. తాను ఇస్తున్న సబ్సిడీలకు సంబంధించి పిటిషన్‌ను దాఖలు చేసిందని కోర్టుకు వివరించారు. ఇంతలో కోర్టు జోక్యం చేసుకుని.. ‘ఆధార్ అనుసంధానం సవాలు పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని మాకు తెలు సు. అయితే ఒక రాష్ట్రం ఎలా సవాలు చేయవచ్చన్న అంశంపై మాకు సంతృప్తికర సమాధానం చెప్పండి. కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాలు చేయొచ్చు.. అంతేగానీ రాష్ట్రాలు కాదు. మమతా బెనర్జీని వ్యక్తిగతంగా పిల్ దాఖలు చేయమనండి. వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేస్తే అప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటాం’ అని సుప్రీం వెల్లడించింది. సుప్రీం ఆదేశాల్ని పాటిస్తా: సుప్రీం ఆదేశాల్ని తాను పాటిస్తానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ‘వారి తీర్పును వారు ఇచ్చారు. మనం దానిని పాటించాలి. ఏదో సమస్యగా భావించడం లేదు. మనం తీర్పును అభినందించాలి’ అని పేర్కొన్నారు. -
దీదీకి జై.. అమ్మకు నై?
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడి - బెంగాల్లో మళ్లీ టీఎంసీకే పట్టం - తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమి.. - జయలలితకు భంగపాటు.. - కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్కే పీఠం - అస్సాంలో ఎగరనున్న బీజేపీ జెండా - బెంగాల్ మినహా మిగతా చోట్ల అధికార మార్పు అమ్మకు తమిళనాడు ఓటర్లు బైబై చెప్పి.. సూర్యోదయానికి (డీఎంకే పార్టీ గుర్తు)కు స్వాగతం పలకనున్నారు. తమిళగడ్డపై ‘అధికారాన్ని మార్చే’ సంప్రదాయాన్ని ఈసారీ కొనసాగించనున్నారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. పుదుచ్చేరిలోనూ డీఎంకే-కాంగ్రెస్ కూటమికే మెజారిటీ సీట్లు దక్కనున్నాయి. బీజేపీ తొలిసారి అస్సాంలో అధికారంలోకి రానుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మమతకే బెంగాలీలు మద్దతుగా నిలిచారు. కేరళలో వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఈసారి పగ్గాలు అందుకోనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడైంది. న్యూఢిల్లీ: ప్రచారంలో నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్ మినహా మిగిలిన చోట్ల అధికార మార్పిడి జరుగుతుందని ఎగ్జిట్‌పోల్ సర్వేలు వెల్లడించాయి. సోమవారం విడుదలైన ఈ సర్వేల ప్రకారం తమిళనాట జయలలితకు ఓటమి తప్పదని, డీఎంకే-కాంగ్రెస్ కూటమి స్పష్టమైన మెజారిటీని సంపాదిస్తుందని తేలింది. చాలా కాలంగా ఈశాన్య రాష్ట్రాలపై పట్టు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న బీజేపీ తొలి సారిగా అస్సాంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలుండగా.. పశ్చిమబెంగాల్లో రెండోసారీ మమతకే ప్రజలు పట్టంగట్టనున్నారు. కేరళలో వామపక్ష కూటమి ఎల్డీఎఫ్ అధికారంలోకి రానుందని వెల్లడైంది. కరుణవైపే మొగ్గు ప్రభుత్వాలను ప్రతి ఐదేళ్లకోసారి మార్చే సంప్రదాయానికే తమిళ ఓటర్లు మరోసారి జై కొట్టారు. తమిళనాడులో (మొత్తం సీట్లు-234) అధికారం చేపట్టేందుకు అవసరమైన సీట్లు 118. అయితే.. అధికార అన్నాడీఎంకే 90-100 సీట్ల లోపలే వస్తాయని ఏబీపీ-నీల్సన్, ఇండియాటుడే-యాక్సిస్ సర్వేలు వెల్లడించాయి. ఈ రెండు సర్వేలు డీఎంకే-కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన మెజారిటీ (132-140) వస్తుందని వెల్లడించాయి. అయితే.. సీ-వోటర్ సర్వే మాత్రం అమ్మ 138 సీట్లు గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇక్కడ బీజేపీ మూడు సీట్లు మించి గెలవటం కష్టమని తేలింది. కెప్టెన్ విజయ్‌కాంత్ నేతృత్వంలోని సంకీర్ణ కూటమి.. జయలలిత ఓట్లను చీల్చి ఉండొచ్చని విశ్లేషకుల అంచనా. ప్రభావం చూపిన అంశాలు: చెన్నై వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. సహాయ కార్యక్రమాలకు కూడా అమ్మ బ్రాండ్ వేసుకోవటంపై బాధితులు బహిరంగంగానే విమర్శలు చేశారు. దీనికి తోడు అక్రమాస్తుల కేసులో జయలలితపై విమర్శలు, పాలనాపరమైన సమస్యలతో రాష్ట్ర ఆర్థిక ప్రగతి కుంటుపడుతోందన్న నిపుణుల ఆరోపణలు తీవ్రమైన ప్రభావం చూపాయి. బీజేపీ ఖాతాలోకి అస్సాం ఈశాన్యరాష్ట్రాల్లో పాగా వేయాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్న బీజేపీ.. తొలిసారిగా అస్సాంలో జెండా ఎగరవేయనుందని సర్వేలు చెబుతున్నాయి. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)పై తీవ్రమైన వ్యతిరేకత బీజేపీకి అనుకూలంగా మారినట్లు తెలుస్తోంది. ‘అభివృద్ధి మంత్ర’తో ప్రచారం చేసిన బీజేపీ తమ కూటమి సభ్యలైన అసోం గణపరిషత్, బోడో పార్టీలతో కలిసి స్పష్టమైన మెజారిటీ గెలుచుకుంటుందని అన్ని సర్వేలు చెబుతున్నాయి. అస్సాంలో (మొత్తం సీట్లు-126) అధికారానికి 64 సీట్లు అవసరం కాగా, బీజేపీ 80 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ 30-35 సీట్లకే పరిమితం కానుంది. గత ఎన్నికల్లో కీలకంగా మారిన ఏఐయూడీఎఫ్ పార్టీ 8-10 సీట్లలో మాత్రమే గెలవనుంది. ప్రభావం చూపిన అంశాలు: వరుసగా 15 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై అసంతృప్తి సహజమే. దీనికి తోడు బంగ్లాదేశ్‌నుంచి చొరబాట్లను అడ్డుకోవటంలో గొగోయ్ విఫలం చెందటం వల్లే స్థానికులకు అన్యాయం జరుగుతోందని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. దీనికి తోడు అభివృద్ధి కుంటుపడుతున్నా పట్టించుకోలేదనే ఆరోపణలూ ప్రభావం చూపాయి. మమతపైనే అనురాగం మూడుదశాబ్దాల కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలుకొట్టి గత ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన మమతకే మరోసారి అవకాశం ఇవ్వాలని బెంగాల్ ఓటర్లు నిర్ణయించినట్లు సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వం పనితీరుపై ఎన్ని ఆరోపణలొచ్చినా ప్రజలు మాత్రం స్పష్టమైన తీర్పును ఇచ్చారు. అధికారానికి(మొత్తం సీట్లు-294) 148 సీట్లు అవసరమైన బెంగాల్లో మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మరోసారి స్పష్టమైన మెజారిటీతో(160-220 స్థానాలొస్తాయని అంచనా) గెలవనుంది. గత ఎన్నికల్లో మమతతో జట్టుకట్టిన కాంగ్రెస్.. ఈసారి లెఫ్ట్ పంచన చేరినా వారు గెలిచేసీట్లలో పెద్దగా మార్పుండకపోవచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్-లెఫ్ట్ 120 సీట్ల వరకు గెలవొచ్చని తెలుస్తోంది. చాణక్య, యాక్సిస్ సర్వేలు మాత్రం ఈ కూటమి 60-70 స్థానాలకే పరిమితం కావొచ్చన్నాయి. బీజేపీ నాలుగైదు స్థానాలు గెలవొచ్చని అంచనా. ప్రభావం చూపిన అంశాలు: శారద స్కాం, నారద స్టింగ్ ఆపరేషన్లలో టీఎంసీ నేతలు అవినీతికి పాల్పడినట్లు తేలింది. బంగ్లా సరిహద్దు ద్వారా మనుషుల అక్రమరవాణా, మతఘర్షణలు ఎన్ని జరిగినా.. లెఫ్ట్, కాంగ్రెస్ కూటమిపై నమ్మకం లేకే.. మమతకు పట్టం గట్టినట్లు తెలుస్తోంది. కేరళలో ఈసారి లెఫ్ట్ గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో అధికారానికి దూరమైన వామపక్ష ఎల్డీఎఫ్.. ఈసారి స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 140 సీట్లున్న కేరళలో అధికారానికి 71 సీట్లు అవసరం ఉండగా.. ఎల్డీఎఫ్ 75-78 స్థానాలు గెలుచుకోనున్నట్లు సర్వేలు అంచనా వేశాయి. ప్రభుత్వ వ్యతిరేకత, కుంభకోణాలతో తల బొప్పికట్టిన సీఎం ఊమెన్‌చాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ 58 సీట్లకు పరిమితం కానుంది. అయితే తొలిసారి బీజేపీ కేరళ అసెంబ్లీలో కాలుపెట్టనుందని తెలుస్తోంది. చాణక్య సర్వే గరిష్టంగా బీజేపీకి 8 సీట్లు రావొచ్చని అంచనా వేయగా ఇతర సర్వేలు మాత్రం 2-4 స్థానాల్లో కమలం గెలవొచ్చంటున్నాయి. ప్రభావం చూపిన అంశాలు: కేరళలోని యూడీఎఫ్ సర్కారుపై భారీగా అవినీతి ఆరోపణలొచ్చాయి. సీఎం ఊమెన్ చాందీపైనా సోలార్ స్కాం ఆరోపణలు రావటం.. దీనికి తోడు శాంతిభద్రతల పరిరక్షణలో విఫలం చెందటం అధికార కాంగ్రెస్ కూటమి ఓటమికి కారణాలయ్యాయి. దీనికి తోడు కాంగ్రెస్ బహిరంగంగానే రెండు గ్రూపులుగా విడిపోవడం కూడా ఎల్డీఎఫ్కు కలిసొచ్చింది. పుదుచ్చేరిలోనూ డీఎంకేనే! కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో డీఎంకే-కాంగ్రెస్ కూటమి అధికారం చేపట్టవచ్చని తెలుస్తోంది. అధికార ఏఐఎన్నార్సీ 8 సీట్లు గెలుస్తుందని అంచనా. 30 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే కూటమి 15-21 సీట్లు, ఏఐఏడీఎంకే 4-5 సీట్లు గెలుస్తుందని సర్వేల్లో తేలింది. సీఎం రంగస్వామి నాయకత్వంలోని అధికార ఏఐఎన్నార్సీపై పెద్దగా వ్యతిరేకత లేకపోయినా.. చిన్న చిన్న ఆరోపణలతోనే ప్రభుత్వమార్పు జరగనుందని విశ్లేషకుల అంచనా. అయితే తమిళనాడు ప్రభావం ఇక్కడ కూడా ఉండటం కూడా అధికార పార్టీ ఓటమికి కారణం కానుంది. -
బెంగాల్‌ను ఆదుకోండి: మమత
న్యూఢిల్లీ: ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పశ్చిమబెంగాల్‌ను ఆదుకోవాలని ప్రధానిమోదీకి ఆ రాష్ట్ర సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. బెంగాల్ రుణ భారాన్ని తగ్గించాలని కోరారు. సోమవారం ఆమె పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోదీతో భేటీ అయ్యారు. తృణమూల్, బీజేపీ సంబంధాలు ఉప్పు నిప్పులా ఉన్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని దీదీ చాలా సార్లు విమర్శించారు కూడా. అయితే సోమవారం మమత పార్లమెంటులో మోదీని కలిశారు. అనంతరం ఆ పార్టీకి చెందిన ఎంపీల బృందంతో కలసి వెళ్లి సమావేశమయ్యారు. రుణాల ఊబిలో కూరుకుపోయిన బెంగాల్‌ను ఆదుకునేందుకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. పలు పథకాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీనిపై స్పందించిన మోదీ.. బెంగాల్ రాష్ట్రాన్ని వీలైనంతగా ఆదుకుంటామని, అవసరమైన ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బెంగాల్ అప్పులు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగుందని పేర్కొన్నారు. అయితే రుణ భారాన్ని తగ్గించడంపై ప్రధాని ఎలాంటీ హామీ ఇవ్వలేదు. భేటీ అనంతరం మమత విలేకరులతో మాట్లాడారు. ‘వీలైనంత మేర సహాయం అందించేందుకు ప్రయత్నిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు’ అని తెలిపారు.