సాక్షి, ఎలక్షన్ డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో మోదీ హవా కారణంగా 2014 ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీల్లో ఒకటి రెండు సీట్లకే పరిమితమైపోగా.. మరొకటి అసలు ఖాతానే తెరవలేదు. యూపీలోని మొత్తం 80 స్థానాల్లో 42.3 శాతం ఓట్లతో బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్ రెండు సీట్లు గెలుచుకోగా, గాంధీ కుటుంబం కంచుకోట నుంచి కాంగ్రెస్ రెండు స్థానాలు సాధించగలిగింది. అంతటి మోదీ హవా ఎన్నికల తరువాత క్రమేపీ తగ్గినట్లు కనిపించినా 2017 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎస్పీ–కాంగ్రెస్ కూటమితో పాటు, బీఎస్పీని చిత్తుచిత్తుగా ఓడించడం ఇక్కడ చెప్పుకోవాలి.
యూపీ: మొగ్గు బీజేపీ వైపే!
ఈసారి ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ, ఆర్‌ఎల్‌డీ ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడ్డాయి. గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు వేర్వేరుగా 42.7 శాతం ఓట్లు సాధించగా ఈసారి తమ పార్టీల బలమైన యాదవ, జాటవ్, జాట్‌లకు ముస్లిం ఓట్లు కూడా కలుస్తాయని తద్వారా విజయం తమను వరిస్తుందన్న అంచనాలో ఈ కూటమి ఉంది. మరోవైపు గత రెండు ఎన్నికల్లో అగ్రవర్ణాలు, యాదవేతర ఓబీసీలు, జాటవేతర దళితులు మద్దతుగా నిలవడంతో బీజేపీ తన ఓటుబ్యాంకును పటిష్టం చేసుకుంది.
ఈసారి ప్రాంతీయ పార్టీల విజయావకాశాలు మూడు అంశాలపై ఆధారపడి ఉన్నాయి. జాటవేతర దళితులను మాయావతి ఎంత వేగంగా తనవైపు తిప్పకోగలరన్నది మొదటిది కాగా, 2017 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెల్లాచెదురైన యాదవ ఓటు బ్యాంకును అఖిలేష్ ఎంత మేరకు ఒక్కటి చేయగలరన్నది రెండోది. జట్టు కట్టిన మూడు ప్రాంతీయ పార్టీల మద్దతుదారుల ఓట్ల బదలాయింపు ఎంత సమర్థంగా జరుగుతుందన్నది చివరి అంశం.
ఎన్నికల విశ్లేషకుల దృష్టికోణం నుంచి చూస్తే యూపీలో పరిస్థితులు మూడు ప్రాంతీయ పార్టీలకు అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తున్నా.. ఈసారి కూడా మోదీ హవా తన ప్రభావం చూపుతుందా? లేదా? అనేది కీలకం కానుంది. జాతీయవాదం, పాకిస్తాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్ వంటి అంశాలను ప్రచారంలో లేవనెత్తడం ద్వారా బీజేపీ అన్ని వర్గాల వారినీ తనవైపు తిప్పుకునే అవకాశం లేకపోలేదు.
బిహార్: ‘కమల’ వికాసమేనా?
గత లోక్‌సభ ఎన్నికల్లో యూపీయే, ఎన్డీయే, జేడీయూతో ముక్కోణపు పోటీ నెలకొంది. రామ్‌విలాస్ పాశ్వాన్ పార్టీ ఎల్జేపీ, ఉపేంద్ర ఖుష్వహా పార్టీ ఆర్‌ఎస్‌ఎల్‌పీతో జట్టుకట్టిన బీజేపీ మొత్తం 40 స్థానాల్లో 31 గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఎన్సీపీతో కూడిన యూపీయే కూటమికి దక్కింది ఏడు సీట్లు మాత్రమే. ఈ కూటమికి దక్కిన ఓట్లు 32 శాతం కాగా, ఇంకో ఏడు శాతం ఎక్కువ ఓట్లతో ఎన్డీయే విజయఢంకా మోగించింది. పదహారు శాతం ఓట్లతో జేడీయూ రెండు సీట్లు సాధించగలిగింది.
అయితే ఏడాది తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితి తారుమారైంది. జేడీయూ ఆర్జేడీ, కాంగ్రెస్ ఒక్కటి కావడంతో బీజేపీ ఓటమి పాలైంది. ప్రతిపక్షాలు ఒక్కతాటిపై నిలిస్తే అధికార పక్షాన్ని అడ్డుకోవడం కష్టమేమీ కాదన్న సంకేతాన్ని ఈ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. ఇప్పుడు బిహార్‌లో జేడీయూ–ఆర్జేడీ మధ్య చీలిక బీజేపీకి నితీశ్‌కుమార్‌తో జట్టుకట్టే అవకాశం కల్పించింది. ఈసారి ఎన్నికల్లో జేడీయూ, బీజేపీ చెరో 17 సీట్లలో పోటీచేస్తుండగా, ఎల్జేపీ ఆరుచోట్ల బరిలో ఉంది.
గత ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఉమ్మడిగా 50 శాతం ఓట్లు సాధించాయి. కొంత తగ్గుదల ఉంటుందని లెక్కకట్టినా ఈసారి కూడా ఈ కూటమి విజయం సాధిస్తుందనడంలో సందేహం లేదు. మరోవైపు ఆర్జేడీ ఈసారి కాంగ్రెస్, ఆర్‌ఎస్‌ఎల్‌పీ, జితేన్ మాంఝీకి చెందిన హెచ్‌ఏఎంతో జట్టు కట్టింది. మొత్తమ్మీద చూస్తే గత ఏడాది కంటే తక్కువ సీట్లలో పోటీ చేస్తున్నందున ఈసారి బీజేపీకి బిహార్‌లో తక్కువ స్థానాలు వస్తాయి. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు సంఖ్యాపరంగా బలపడతాయి.
ఒడిశా: నవీన్.. విజయపథమేనా?
గత ఎన్నికల్లో దేశం మొత్తమ్మీద హవా వీచినా.. ఆ ప్రభావాన్ని తట్టుకున్న నాలుగు రాష్ట్రాల్లో ఒకటి ఒడిశా. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ పార్టీ ఆ ఎన్నికల్లో 21 లోక్‌సభ స్థానాలకు 20 గెలుచుకుంది. పోలైన ఓట్లలో 45 శాతం బీజేడీకే పడ్డాయి. దాదాపు 22 శాతం ఓట్లతో బీజేపీ ఒక్క స్థానాన్ని దక్కించుకోగలిగింది. తరువాత ఈ రాష్ట్రంలో బీజేపీ క్రమేపీ బలం పుంజుకుంది. 2017లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 297 స్థానాలు గెలుచుకోవడం ఇందుకు నిదర్శనం.
2012 నాటి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి దక్కింది 36 మాత్రమే. బీజేపీ గెలుచుకున్న స్థానాల్లో అత్యధికం రాష్ట్రంలో తిరోగమనంలో ఉన్న కాంగ్రెస్ పార్టీవి కావడం గమనార్హం. బీజేడీ స్థానాల్లో పెద్దగా మార్పుల్లేవు. ఈ పరిణామాలన్నింటి ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై ఉండే అవకాశం ఉంది. దాదాపు రెండు దశాబ్దాల పాలన కారణంగా ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి బీజేడీకి కష్టాలు తప్పవనిపిస్తోంది. ఏతావాతా ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశాలో కాషాయ పార్టీ ప్రభావం ఎక్కువుండే అవకాశాలు కనిపిస్తుండగా.. ఒడిశాలో బీజేడీ ప్రభ తగ్గొచ్చని అంచనా.
బెంగాల్: మమతదే ఆధిపత్యం
మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల్లో 40 శాతం ఓట్లతో పశ్చిమబెంగాల్‌లోని 42 స్థానాల్లో 34 గెలుచుకుంది. కాంగ్రెస్ పది శాతం ఓట్లతో 4 సీట్లు సాధించింది. అయితే సీపీఎం, సీపీఐ, ఏఐఎఫ్‌బీ, ఆర్‌ఎస్పీతో కూడిన వామపక్షాలకు 30 శాతం ఓట్లు దక్కినా.. సాధించిన సీట్లు మాత్రం రెండే. మరోవైపు బీజేపీ 17 శాతం ఓట్లతో రెండు సీట్లు సాధించింది. రెండేళ్ల తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ నెలకొంది.
టీఎంసీకి పోటీగా కాంగ్రెస్–వామపక్షాల కూటమి, బీజేపీ–గూర్ఖా జనముక్తి మోర్చా పోటీపడ్డ ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ గత ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు అంటే 294 స్థానాల్లో 211 గెలుచుకుంది. గత లోక్‌సభ ఎన్నికల కంటే ఐదు శాతం (45) ఎక్కువ ఓట్లు సాధించింది. కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి 38 ఓట్ల శాతంతో 76 స్థానాలు గెలుచుకోగా బీజేపీ –జీజేఎం మూడు సీట్లు సాధించినా.. కూటమిలోని బీజేపీ ఓట్లు ఐదు శాతం తగ్గాయి. అనంతరం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ తన పరిస్థితిని మెరుగుపరుచుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను, ఇద్దరు కీలక నేతలను తమవైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ రాజకీయంగా లాభపడింది. ఈ పరిణామాలతో తృణమూల్ కాంగ్రెస్ కొంత ఆందోళనకు గురైంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చేపట్టదలచుకున్న యాత్రలతో మతఘర్షణలు జరుగుతాయన్న నెపంతో అనుమతి నిరాకరించడం ఆ ఆందోళన ఫలితమే. తాజా ఎన్నికల్లోనూ బెంగాలీల తొలి ప్రాధాన్యం తృణమూల్ కాంగ్రెస్ అనే చెప్పాలి.
మహిళలకు 41 శాతం సీట్లు కేటాయించాలన్న తృణమూల్ నిర్ణయం.. ఐదేళ్ల పాలన వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు ఉపయోగపడుతుంది. మరోవైపు శారద స్కామ్‌ను వాడుకోవడం ద్వారా కనీసం 21 సీట్లు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బీజేపీ పనిచేస్తోంది. రాష్ట్ర జనాభాలో 27 శాతమున్న ముస్లింల ఓట్లు మొత్తం తృణమూల్ వైపు మళ్లకుండా ఉండేందుకు బీజేపీ బంగ్లాదేశీ వలసదారుల అంశాన్ని లేవనెత్తుతోంది. మొత్తమ్మీద బీజేపీ గత ఎన్నికల కంటే కొన్ని సీట్లు ఎక్కువ సాధించగలిగినా.. బెంగాల్ రాజకీయాల్లో మమత ఆధిపత్యం కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలు ఆ పార్టీకే!
Comments
Please login to add a commentAdd a comment