కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం
విశ్లేషణ: డాక్టర్ ఏపీ విఠల్
మరోసారి తృతీయ ప్రత్యామ్నాయం మాట వినవ స్తోంది. దానికి వెన్నెముక కావాల్సిన వామపక్షాలు 2009 ఓటమి నుంచి ఇంకా కోలుకోలేదు. సంకుచితమైన ఎన్నికల ప్రయోజనా లకోసం రాజకీయ ఊసరవెల్లులతో పొత్తులకోసం ఎగబడటం మాని, నిజమైన ప్రజాప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టులు ముందుకు సాగుతారని ఆశించగలమా!
మళ్లీ సార్వత్రిక ఎన్నికలొచ్చాయి. జవహర్‌లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న తొలి దశాబ్ద కాలంలో మన ప్రజాస్వామిక వ్యవస్థకు రాజకీయ, ఆర్థిక, సామాజిక దిశా నిర్దేశన అంటూ ఉండేది. ఆ తదుపరి పరిస్థితి నానాటికీ దిగజారి పోతూ, మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం క్షీణ దశకు చేరింది. పార్లమెంటరీ వ్యవస్థకు మూల స్తంభాలైన రాజకీయ పార్టీలలో విలువలు, విశ్వసనీయత, ప్రజా సంక్షేమంపట్ల నిబద్ధత. లుప్తమైపోయాయి. అవినీతి, అధికార వ్యామోహం, అవకాశవాదం, కుల, మతోన్మాదాలకు అవి ఆలవాలంగా మారాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో...యథావిధిగా ప్రధాన జాతీయ రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు, వాటి కూటములు పరస్పర దూషణల పర్వంలో మునిగిపోయాయి. ఏమైతేనేం ఇరు పక్షాలు ఒకరి గుట్టును మరొకరు రచ్చకెక్కిస్తూ దొందూ దొందేననే సత్యాన్ని విప్పిచెబుతున్నాయి. బీజేపీ నరేంద్రమోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే, కాంగ్రెస్ రాహుల్‌గాంధీ తమ ప్రధాని అభ్యర్థి అని చెప్పకుండానే చెబుతోంది. ఎన్నికలంటే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య పోరన్నట్టున్న నేటి తీరును చూస్తుంటే అధ్యక్ష తరహా పాలన దిశకు సాగుతున్నట్టు అనిపిస్తోంది.
వ్యతిరేకతే ‘ప్రత్యామ్నాయం’?
షరా మామూలే అన్నట్టు యూపీఏ, ఎన్డీఏలకు చెందని పార్టీలతో ‘తృతీయ ప్రత్యామ్నాయం’ రంగ ప్రవేశం చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీల పట్ల వ్యతిరేకతే దాని ప్రధాన లక్ష్యం. ఆ వ్యతిరేకతకు మించి చెప్పుకోదగ్గ మరే ఉమ్మడి కార్యక్రమమూ లేని ఆ కూటమి ఎలాంటి ప్రత్యామ్నాయం? అసలు ఇలాంటి కప్పల తక్కెడ ప్రత్యామ్నాయం ప్రజలను ఎలా ఉద్ధరించగలదు? ప్రజల విశ్వసనీయతను చూరగొనడానికి కావల్సింది ప్రధాన కూటములు రెంటికి భిన్నమైన, విస్పష్ట విధానం. తృతీయ ప్రత్యామ్నాయం అంటున్న కూటమికి లేనిది అదే. సీపీఎం, సీపీఐ తదితర వామపక్షాలే తృతీయ కూటమికి వెన్నెముక. వామపక్షాలు 2009 ఎన్నికల పరాజయం నుంచి ఇంకా కోలుకోలేదు. గత ఎన్నికల్లోలాగా ఏదో ఒక విధంగా తృతీయ ప్రత్యామ్నాయానికి ఊపిరులూది, కనీస కార్యక్రమం ప్రాతిపదికపై బీజేపీ, కాంగ్రెసేతర పక్షాలను ఒక తాటిపైకి తీసుకురాగల శక్తి నేడు వాటికి లేదు. ‘ఉడతకెందుకు ఊళ్లేలే పని’ అని అవి అపహాస్యానికి గురవుతున్నాయి. అయినా, అవి కాక మరే బలమైన ప్రాంతీయ పార్టీ తృతీయ కూటమికి నేతృత్వం వహించగలమని చెప్పుకునే పరిస్థితి లేదు. సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్ (యు) నేత నితీశ్‌కుమార్, బీఎస్పీ నేత్రి మాయావతి, అన్నా డీఎంకే నేత్రి జయలలిత ఎవరికి వారు తామే ప్రధాని పీఠం దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి వీరిలో ఎవరు నేతృత్వం వహిస్తామన్నా కూటమి ఉండనే ఉండదు. పోనీ వాటికి కాంగ్రెస్, బీజేపీలకు భిన్నమైన, పురోగామి, ప్రజానుకూల విధానాలున్నాయా అంటే అవీ లేవు. తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అవి కాంగ్రెస్, బీజేపీలలాగే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను అనుసరిస్తూ, బడా కార్పొరేట్ సంస్థలకు పోటీలుపడి మేలు చేస్తున్నాయి, ఆర్థిక వ్యత్యాసాలను పెంచిపోషిస్తున్నాయి.
ఎక్కడిదాకో ఎందుకు చంద్రబాబు చరిత్రను చూస్తే సరిపోతుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి తిరుగులేని అధినాయకునిగా ఒక్క వెలుగు వెలిగిన ఆయన కేంద్రంలో సైతం చక్రం తిప్పారు. తానే వాజపేయిని ప్రధానిని చేశానని, అబ్దుల్ కలామ్‌ను రాష్ట్రపతిని చేశానని ఆయన ఇప్పటికీ గొప్పలు చెప్పుకుంటూనే ఉంటారు. దేశంలో వాజపేయి హవా నడుస్తున్నప్పుడు ఆయనను ప్రసన్నం చేసుకొని పైకి ఎగబాకాలని ఆరాటపడ్డారు. కమ్యూనిస్టులతో మైత్రికి తిలోదకాలిచ్చి ‘అన్ని ఇజాలు అంతరించాయి, మిగిలింది టూరిజమే’ నని వారి మౌలిక సిద్ధాంతాన్నే హేళన చేశారు, మతతత్వ బీజేపీతో చేయి కలిపారు. 2002లో గుజరాత్ మారణకాండపై నరేంద్రమోడీ ని ఘాటుగా విమర్శించారు.తీరా పార్లమెంటులో ఆ అంశం చర్చకు వచ్చినప్పుడు తమ పార్టీని ఓటింగ్‌లో పాల్గొనకుండా చేసి బీజేపీ ప్రభుత్వాన్ని గట్టెక్కించారు. 2004 ఓటమి తర్వాత అదే చంద్రబాబు... బీజేపీతో పొత్తు చారిత్రక త ప్పిదమని, భవిష్యత్తులో మరెన్నడూ దానితో పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. ఇప్పుడు మోడీ గాలి వీస్తోందని పసిగట్టి మోడీ నామ జపంతో అందలమెక్కాలని చూస్తున్నారు. ఊసరవెల్లి రంగులు మార్చడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే బాబులాంటి రాజకీయ ఊసరవెల్లితో కలిసి వామపక్షాలు 2009లో మహా కూటమిని నిర్మించడమే ఆశ్చర్యం. సైద్ధాంతిక నిబద్ధతగలవిగా పేరున్న కమ్యూనిస్టు పార్టీలు అప్రతిష్ట పాలయ్యాయే తప్ప, వ్రతం చెడిపోయినందుకు ఫలితం దక్కిందా అంటే అదీ లేదు. కమ్యూనిస్టు పార్టీలే ఇలా ఎన్నికల ప్రయోజనాల కోసం ఊసరవెల్లులతో కలుస్తుంటే... మూడో కూటమి పక్షాలంటున్న ప్రాంతీయ పార్టీల గురించి చెప్పేదేముంది? ఎస్‌పీ, బీఎస్‌పీ, తృణమూల్, అన్నా డీఎంకే, డీఎంకే, జేడీయూ, ఆర్జేడీ, ఆర్‌ఎల్డీలు వేసిన, వే స్తున్న కప్పదాట్లు ఎవరికి తెలియనివి?
భ్రమలు వీడాల్సింది కమ్యూనిస్టులే
సీపీఎం లక్ష్యం సోషలిజానికి తొలిమెట్టయిన జనతా ప్రజాస్వామ్య వ్యవస్థ స్థాపన. 1964లో అది ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ నుంచి విడిపోయింది. శాంతియుతంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్య మార్గంలో ఆ లక్ష్యాన్ని సాధిం చడం వీలుకాదనే అస్పష్టమైన అభిప్రాయం అప్పట్లో దానికి ఉండేది. ప్రజాబాహుళ్యంలో ఎన్నికల ద్వారా తమ జీవితాలను మార్చుకోగలమనే భ్రమ ఇంకా ఉంది. కాబట్టి ఎన్నికలు, చట్ట సభల్లో కొంతకాలం పాల్గొనక తప్పదు అని ఆ పార్టీ భావించింది. అనుభవంలో తేలిందేమిటి? ప్రజలలో భ్రమలు తొలగడం కాదు, మార్క్సిస్టు పార్టీలో ఆ భ్రమలు పెరుగుతున్నాయని! ఎన్నికల రాజకీయాలు, పాలకవర్గ పార్టీల పొత్తులతో తమ పార్టీలో కూడా ఆడంబర జీవితం, పదవీ వ్యామోహం, అహంకారం, ధనార్జనాపేక్ష, స్వార్థపరత్వం తరతమ స్థాయిలలో వ్యాపించాయని ఆ పార్టీ తన ‘ఆత్మవిమర్శ’లో పేర్కొంది. ‘ఎవరితో పొత్తులు పెట్టుకున్నా నష్టపోయింది మేమే’నంటూ ప్రస్తుత శాసనసభలోని ఏకైక సీపీఎం సభ్యుడు రంగారెడ్డి చెప్పింది అక్షర సత్యం. ప్రజాఉద్యమాలే కమ్యూనిస్టులకు ప్రాణం. ప్రజా సమస్యలను వెలుగులోకి తేవడం, ప్రజాపోరాటాలకు మద్దతును కూడగట్టడమే చట్ట సభల్లో సైతం వారి ప్రధాన కర్తవ్యం. అంతేగానీ అవకాశవాద పొత్తులతో లక్ష్యాన్ని సాధించలేరు. అలా అని ఇతర పార్టీలతో అసలే కలవొద్దనీ కాదు. ఎలాంటి పొత్తులకైనా ముందు ప్రజాసమస్యలపై కమ్యూనిస్టు పార్టీలు ఐక్య కార్యాచరణను సాగించాలి. ఎన్నికల పట్ల కూడా అదే వైఖరిని అనుసరించాలి. 1983లో సీపీఐ, సీపీఎంలు ముందే ఒక అవగాహనకు వచ్చి, ఎన్‌టీఆర్ తెలుగుదేశంతో చర్చలకు వెళ్లాయి. చర్చలు విఫలమయ్యాక, ఒక్క సీపీఎంతోనే పొత్తుకు సిద్ధమని, వారు కోరిన స్థానాలన్నీ ఇస్తామని ఎన్టీఆర్ రాయబారం పంపారు. నాలుగు సీట్లు గెలుచుకోవడం కంటే వామపక్ష ఐక్యతే తమకు ముఖ్యమంటూ పుచ్చలపల్లి సుందరయ్య తిరస్కరించారు. నేటి కమ్యూనిస్టుల నుంచి అలాంటి వైఖరిని ఆశించగలమా? కార్మికులు, రైతులు, బడుగు వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటానికి కమ్యూనిస్టులు ఎప్పుడూ పెద్ద పీట వెయ్యాలి. ఆ ఐక్య కార్యాచరణపైనే వామపక్ష ఐక్యత పటిష్టమవుతుంది. కనీస ప్రజానుకూల, పురోగామి, ప్రజాస్వామిక ప్రణాళిక ప్రాతిపదికపైనే కమ్యూనిస్టేతరులతో ఐక్యకార్యాచరణగానీ, ఎన్నికల పొత్తులుగానీ ఉండాలి. అంకితభావంతో దీర్ఘకాలంపాటు సాగించాల్సిన ఈ కృషికి తృతీయ కూటమో, చతుర్థ కూటమో ప్రత్యామ్నాయం కావు. అలాంటి సుదీర్ఘ కార్యాచరణతో నిజమైన ప్రజా ప్రత్యామ్నాయాన్ని ఆవిష్కరించే దిశగా కమ్యూనిస్టు పార్టీలు ముందడుగు వేస్తాయని ఆశించగలమా?
(వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు)