ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు

Published Tue, May 7 2024 6:27 AM

Confusion in Postal Ballot Polling

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రాల వద్ద ప్రలోభాల వల 

నరసరావుపేటలో ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి నిరసన 

వైఎస్సార్‌సీపీ శ్రేణులపై టీడీపీ రాళ్లదాడి.. పలువురికి గాయాలు

నరసరావుపేట రూరల్‌/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/పెనమలూరు: పోలింగ్‌తేదీ సమీపిస్తున్న కొద్దీ ఓటమి తథ్యమనే విషయం తెలుస్తుండటంతో టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్లను కొల్లగొట్టాలని అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిబంధనల్ని ఉల్ల­ంఘించి ప్రలోభాల వలలు విసురుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల సోమవారం కూడా నగదు ఎర వేస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ, బెదిరిస్తూ.. ఏదో ఒకరకంగా ఓట్లు వేయించుకోవాలని బరితెగించి వ్యవహరించారు. ప్రశ్నించినవారిపై దాడిచేసి కిడ్నాప్‌ చేస్తున్నారు. అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ వారిపై రాళ్లదాడులకు దిగుతున్నారు. 

నరసరావుపేటలో ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి కిడ్నాప్‌ 
నరసరావుపేటలో ఎస్‌ఎస్‌ అండ్‌ ఎన్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్ట్‌ల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం వద్ద  టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఓటర్లకు నగదు ఎర చూపారు. దీన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన ఆర్మీ రిటైర్డ్‌ ఉద్యోగి సత్యనారాయణరెడ్డి అక్కడున్న పోలీసు అధికారులకు చూపించారు. పోలీసులు.. టీడీపీ నాయకుల ప్రచారానికి అభ్యంతరం తెలిపి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో టీడీపీ వారు సత్యనారాయణరెడ్డిపై దాడిచేసి కొట్టి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

 విషయం తెలిసి ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. అక్కడున్న టీడీపీ వారిని పోలీసులకు అప్పగించి కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో అక్కడ నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులపై తెలుగుదేశం వర్గీయులు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో పలువురు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి.  కాగా, తనపై దాడిచేసి బలవంతంగా కారులో ఎక్కించి  తీసుకెళ్లారని రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి మధిర సత్యనారాయణరెడ్డి చెప్పారు. టీడీపీ నాయకులకు చెందిన ఈ విద్యాసంస్థలో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంపై వైఎస్సార్‌సీపీ వర్గీయులు కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నిస్పాక్షికంగా ఉన్న ఉద్యోగులే లక్ష్యం 
విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ హై సూ్కల్‌కు ఎదురుగా ఉన్న పోలింగ్‌ కేంద్రం సమీపంలో టీడీపీ నాయకులు పోతన్నరెడ్డి, కాళ్ల శంకర్, బొట్ట రమణ నిస్పాక్షికంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే లక్ష్యంగా హడావుడి చేశారు. ఓటర్ల వివరాలు నమోదు చేసుకున్న కార్యకర్తలు తర్వాత ఫోన్‌ పే, గుగూల్‌ పే వంటి వాటిని ఉపయోగించినట్లు తెలిసింది.

ఉద్యోగి ఓటు వేసిన మరో వ్యక్తి
కృష్ణాజిల్లా పెనమలూరులో ఏర్పాటు చేసిన 141 పోలింగ్‌ కేంద్రంలో పెనమలూరు సచివాలయం–1లో డిజిటల్‌ అసిస్టెంట్‌ మట్ట కిషోర్‌బాబు ఓటును గుర్తుతెలియని వారు వేశారు. సోమవారం ఓటేసేందుకు వచ్చిన కిషోర్‌బాబు తన ఓటు అప్పటికే వేసి ఉండటంతో అభ్యంతరం తెలిపారు. వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు కూడా నిరసన తెలిపి కిషోర్‌కు ఓటు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కిషోర్‌బాబుకు మంగళవారం 140వ బూత్‌లో ఓటు కల్పిస్తామని ఏఆర్‌వో వెంకటేశ్వరరావు హామీ ఇచ్చారు. పోలింగ్‌ కేంద్రం హెల్ప్‌డెసు్కలో విధుల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎల్‌.గోవిందరాజులు టీడీపీకి ఓటేయాలని తమకు సూచించారని ఉయ్యూరు ఏజీ ఆండ్‌ ఎస్‌జీ కాలేజీ ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు చెప్పారు. దీనిపై వైఎస్సార్‌సీపీ ఏజెంట్లు ఏఆర్‌వోకి ఫిర్యాదు చేశారు. దీంతో గోవిందరాజులును ఎన్నికల విధుల నుంచి తప్పించారు.

Advertisement
 
Advertisement