తెలంగాణలో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య అంతుచిక్కని అంతరం
అసెంబ్లీ ఎన్నికల నుంచే కొనసాగుతున్న గందరగోళం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ‘ఇండియాకూటమి’ మధ్య పొత్తు చర్చలు జరుగుతున్నా, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, వామపక్షాల మధ్య ఇంకా అంతరం కొనసాగుతోంది. కూటమిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ కీలకంగా ఉన్నా, రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీల మధ్య సఖ్యత కనిపించడం లేదు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడినా..పొత్తులపై ఇప్పటికీ ఆ పార్టీల మధ్య అవగాహన కుదరలేదు. ఒకవైపు బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని కాంగ్రెస్, వామపక్షాలు చెబుతున్నా, ఐక్యత మాత్రం ప్రదర్శించలేకపోతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి కూడా గణనీయమైన ఎంపీ స్థానాలు వస్తాయనే అంచనాలున్న నేపథ్యంలో ఎంతోకొంత ప్రభావం చూపగలిగే వామపక్షాలను కాంగ్రెస్ పార్టీ పరిగణనలోకి తీసుకోవడం లేదని, గత అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచీ కాంగ్రెస్ వైఖరి ఇలాగే ఉందని లెఫ్ట్ నేతలు వాపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల వరకు నానబెట్టి చివరకు సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. కాంగ్రెస్ సీపీఎం రెండూ రాజీకి రాలేకపోయాయి.
ఎన్నికల వేళ మాటల యుద్ధం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. అభ్యర్థులను ప్రకటించుకుంటూపోతోంది. ఈ నేపథ్యంలో తమతో చర్చలు జరపకపోవడంపై వామపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు వివిధ సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి ప్రయత్నాలు చేస్తున్నా, సమయం ఇవ్వడం లేదని వామపక్ష నేతలు మండిపడుతున్నారు. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేరళ వెళ్లి అక్కడి సీపీఎం సీఎం పినరయి విజయన్‌ను విమర్శించడాన్ని కూడా కామ్రేడ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బహిరంగంగానే విమర్శించారు. మరోవైపు సీపీఐ నేతలు కూడా కాంగ్రెస్ వైఖరిని తూర్పారబడుతున్నారు. పార్టీలు మారిన వారికి పెద్దపీట వేస్తూ, తమకు ఒక ఎంపీ సీటు ఇవ్వడానికి వెనుకాడుతున్నారని సీపీఐ విమర్శిస్తోంది. తమిళనాడు రాష్ట్రాన్ని చూసైనా నేర్చుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్‌కు సూచించారు.
అభ్యర్థిని ప్రకటించిన సీపీఎం పొత్తులపై స్పష్టత రాకపోవడంతో సీపీఎం
ఇటీవల భువనగిరి లోక్‌సభ సెగ్మెంట్‌కు జహంగీర్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇతర చోట్ల ఎవరికి మద్దతు ఇవ్వాలన్న దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల్లో కలిసి పనిచేసే విషయంలో బీఆర్‌ఎస్ నుంచి తమకు ప్రతిపాదన వస్తే ఏం చేయాలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎస్.వీరయ్య చెప్పడం గమనార్హం. ఇక సీపీఐ కూడా కాంగ్రెస్ తీరుపై గరంగరంగా ఉంది. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఒక స్థానంలో గెలవడంతో దూకుడుగా వెళ్లడానికి సీపీఐ కాస్తంతా వెనుకాముందు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
నాలుగైదు రోజుల్లో చర్చలుంటాయా?
కాంగ్రెస్ పార్టీ నాలుగైదు రోజుల్లో తమతో చర్చలు జరుపుతుందని అంటున్నారని వామపక్ష నేత ఒకరు పేర్కొన్నారు. ఏదిఏమైనా ఈ చర్చల్లో చెరో సీటు అడగాలని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఒకవేళ ఎంపీ సీట్లు ఇవ్వకుండా మద్దతు కాంగ్రెస్ కోరితే కనీసం చెరో ఎమ్మెల్సీ అడిగే ఆలోచనలో వామపక్షాలు ఉన్నట్టు సమాచారం. మరోవైపు చెరో ఎంపీ స్థానంలో తమ అభ్యర్థిని స్నేహపూర్వకపోటీ పెట్టడం ద్వారా బరిలో నిలపాలని కూడా లెఫ్ట్ వర్గాలు భావిస్తున్నట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment