రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ మార్క్ పోస్టుమార్టం
టీపీసీసీ నివేదికలను కాదని ముగ్గురు సీనియర్లతో ప్రత్యేక కమిటీ
తెలంగాణ ఫలితాలు ఆశాజనకంగా లేవనే అభిప్రాయంతో హైకమాండ్.. త్వరలోనే తెలంగాణకు రానున్న కమిటీ.. ఓడిన అభ్యర్థులతో మాట్లాడే అవకాశం
ఈ త్రిసభ్య కమిటీ నివేదిక తర్వాత టీపీసీసీ ప్రక్షాళన!
ఎన్నికల్లో పనిచేయని నేతలకు ఝలక్ ఇస్తారంటూ గాంధీభవన్ వర్గాల్లో చర్చ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గాను కనీసం 11–12 చోట్ల గెలుస్తామని.. పరిస్థితి సానుకూలంగా ఉంటే 14 సీట్లు వస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ లెక్కలు వేసుకుంది. తక్కువలో తక్కువగా 10 స్థానాలైనా గెలుస్తామని భావించింది. కానీ ఫలితాలు గతం కంటే మెరుగే అయినా.. 8 స్థానాల్లోనే కాంగ్రెస్ గెలిచింది. అదే సమయంలో బీజేపీ కూడా ఇదే సంఖ్యలో సీట్లు సాధించింది. దీంతో తెలంగాణలో ఆశించిన స్థాయిలో ఫలితాలు ఎందుకు రాలేదని.. రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉండటంతో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశమున్నా ఎందుకిలా జరిగిందని అధిష్టానం పోస్టుమార్టం ప్రారంభించింది.
తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలను సమీక్షించేందుకు రాజ్యసభ మాజీ చైర్మన్ కురియన్, అసోం ఎంపీ రకీబుల్ హసన్, పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్‌లతో కమిటీని ఏర్పాటు చేసింది. నిజానికి లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ నుంచి ఇప్పటికే అధిష్టానానికి నివేదిక వెళ్లింది. ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ కూడా తన నివేదికను అందించారు. కాంగ్రెస్ అధిష్టానం వాటిని కాదని కమిటీని ఏర్పాటు చేయడం గాంధీభవన్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏం చేస్తారు.. ఎక్కడికి వెళ్తారు?
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల పనితీరుపై సమీక్షతోపాటు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం రూపొందించే కార్యాచరణ కోసమే కొత్తగా త్రిసభ్య కమిటీని నియమించారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది. ఆ కమిటీ త్వరలోనే తెలంగాణకు వచ్చి పని ప్రారంభిస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ కమిటీ మూడు అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తుందని అంటున్నారు.
‘అధికారం, అన్ని వనరులు ఉండి కూడా బీజేపీతో అంత గట్టిగా ఎందుకు పోటీపడాల్సి వచ్చింది? తూర్పు, దక్షిణ తెలంగాణల్లో పట్టు నిలుపుకొన్న పార్టీ.. పశ్చిమ, ఉత్తర తెలంగాణల్లో ఎందుకు నిలబడలేకపోయింది? పార్టీ నాయకులందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చారా లేదా?’ అన్న కోణాల్లో పోస్టుమార్టం జరుగుతుందని నేతలు చెప్తున్నారు.
ముఖ్యంగా తక్కువ తేడాతో ఓడిపోయిన మెదక్, సికింద్రాబాద్, మహబూబ్‌నగర్ ఎంపీ స్థానాల విషయంలో ఏం జరిగిందనేది తేల్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఇంకొంచెం కష్టపడి ఉంటే ఈ మూడు చోట్ల గట్టెక్కేవాళ్లమని పేర్కొంటున్నారు. ఈ స్థానాలు దక్కించుకోలేక పోవడానికి ఎలాంటి పరిస్థితులు కారణమనే అంశంపై.. పార్టీ ముఖ్య నేతలతోపాటు ఆయా చోట్ల పోటీచేసి ఓడిన అభ్యర్థులతోనూ మాట్లాడనున్నట్టు తెలిసింది.
ఇక చేవెళ్ల, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్ స్థానాల్లో అభ్యర్థుల మార్పు ఏ మేరకు ఉపయోగపడిందనే కోణంలోనూ త్రిసభ్య కమిటీ నిగ్గు తేలుస్తుందని సమాచారం. అన్ని విషయాల్లో ఓ అంచనాకు వచ్చిన తర్వాత ఈ కమిటీ హైకమాండ్‌కు నివేదిక ఇస్తుందని.. ఆ నివేదిక ఆధారంగా టీపీసీసీ ప్రక్షాళన జరుగుతుందని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సరిగా పనిచేయని నేతలకు ఝలక్ ఇచ్చే అవకాశం ఉందని నేతలు అంటున్నారు.
22న ‘నామినేటెడ్’ ఉత్తర్వులు?
లోక్‌సభ ఎన్నికల కంటే ముందు రాష్ట్రంలో ప్రకటించిన 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఉత్తర్వులు ఈనెల 22వ తేదీన వచ్చే అవకాశముందని తెలిసింది. వాటితోపాటు మరో 17 పోస్టులను కలిపి ఒకేసారి ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం రేవంత్ భావించినా.. ఈ 17 పోస్టులకు సంబంధించిన కసరత్తు ఇంకా పూర్తికాలేదని సమాచారం. వీలునుబట్టి మొత్తం పోస్టులకు, లేదా ఇప్పటికే ప్రకటించిన 37 పోస్టులకు ఉత్తర్వులు వస్తాయని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి.
అయితే, లోక్‌సభ ఎన్నికల్లో నేతల పనితీరు ఆధారంగా నామినేటెడ్ పోస్టుల్లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరిగినా.. ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రుల మధ్య నామినేటెడ్ పందేరంలో తలెత్తిన విభేదాల కారణంగానే జాప్యం జరిగిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడా ఇద్దరు మంత్రుల మధ్య సయోధ్య నెలకొందని, నామినేటెడ్ ఉత్తర్వులకు లైన్ క్లియర్ అయిందని అంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment