- కామ్రేడ్ల కస్సుబుస్సు.. కాంగ్రెస్ సర్కారుపై సీపీఎం, సీపీఐ అసంతృప్తి!
- ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయనే భావన!
- పార్టీలకిచ్చిన హామీలు నెరవేర్చక పోవడమూ కారణమే?
- ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్న తమ్మినేని
- ఐక్య పోరాటాలు నిర్వహిస్తామంటూ హెచ్చరికలు
- మిత్రపక్షం మిత్రపక్షమే..పోరాటం పోరాటమే అన్న కూనంనేని
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతో కాంగ్రెస్‌ను గెలిపించిన ప్రజలకు ఆ పార్టీ చేసిందేమీలేదు. ఏడాది పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఉచిత బస్సు సౌకర్యం తప్ప వేటినీ అమలు చేయలేదు. దీంతో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విదేశీ పెట్టుబడిదారులకు మూసీ భూములు, ఫార్మా భూముల్ని కట్టబెట్టేందుకు మూసీ సుందరీకరణ జపం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ విధానాలతో ప్రజల కోసం పని చేస్తున్న వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు రాబోయే కాలంలో ఐక్య పోరాటాల్ని నిర్వహించేలా ఊరూరా ఎర్రజెండా ను తీసుకెళ్తాం. ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి స్నేహపూర్వకంగా చెప్పాం.
ఇక నుండి రోడ్ల పైకి వస్తాం. మాకు గెలవడం రాకపోయినా, ఓడించడం వచ్చు..’అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇటీవలచేసిన తీవ్రమైన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రాజేశాయి. మొన్నటి పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఆ పార్టీ ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యమేంటన్న చర్చ జరుగుతోంది. అయితే కాంగ్రెస్ తమకిచ్చిన హామీ నెరవేర్చక పోవడం, రుణమాఫీ, రైతు భరోసా, హైడ్రా, మూసీ సుందరీకరణ తదితర అంశాలకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు.. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని సీపీఎం భావిస్తుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇటీవల గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జి వంటి మరికొన్ని అంశాలను కూడా ఆ పార్టీ గట్టిగా వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వంపై ఒకపక్క సీపీఎం విరుచుకు పడుతుంటే, మరోపక్క సీపీఐ కూడా వివిధ సమస్యలపై తన నిరసన వ్యక్తం చేస్తోంది.
ప్రజలకు దూరమవుతామన్న భావన..
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ పొత్తు పెట్టుకొని ఒక సీటు గెలవగా, సీపీఎం పార్టీ పొత్తు కుదరక ఒంటరిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కాంగ్రెస్‌కు రెండు కమ్యూనిస్టు పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సీపీఐకి ఒక ఎమ్మెల్సీ ఇస్తామని అసెంబ్లీ పొత్తుల సందర్భంగా కాంగ్రెస్ హామీ ఇవ్వగా, పార్లమెంటు ఎన్నికల్లో మద్దతు ప్రకటించినందుకు సీపీఎంకు కూడా ఎమ్మెల్సీ లేదా స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిం
చాలన్న అవగాహన కుదిరినట్లు ప్రచారం జరిగింది.
అయితే ఏడాది కావొస్తున్నా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదన్న అసంతృప్తి కామ్రేడ్లలో ఉందని అంటున్నారు. అలాగే పలు సందర్భాల్లో సమస్యలపై సీఎంకు వినతిపత్రాలు ఇచ్చినా లెక్క చేయడంలేదని వామపక్షాలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఒకవైపు బీఆర్‌ఎస్, మరోవైపు బీజేపీలు దూకుడుగా ప్రభుత్వంపై విరుచుకుపడుతుంటే.. ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే తాము మిన్నకుంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని, వారికి దూరం అయ్యేందుకు అవకాశం ఉందనే ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది. దీని ఫలితమే సీపీఎం, సీపీఐల ప్రతిస్పందనలని అంటున్నారు.
ఇటీవలి పరిణామాలేంటి..?
బెటాలియన్ కానిస్టేబుళ్ల పనిభారాన్ని పెంచే జీవోను రద్దుచేసి, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తమ్మినేని డిమాండ్ చేశారు.
పేదల ఇళ్లను పడగొట్టి ప్రభుత్వం వారిపై అక్రమ కేసులు బనాయిస్తోందని, ఒకవైపు ప్రజాపాలన అంటూనే ప్రజలపై నిర్బంధాన్ని కొనసాగిస్తోందని సీపీఎం విమర్శించింది.
‘మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పోలీసులను, అధికారులను ప్రయోగిస్తోంది. ఇళ్ల కూలి్చవేతకు ఏర్పాట్లు చేస్తోంది. పేద, మధ్యతరగతి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ప్రభుత్వం ఇంత హడావుడిగా నిర్ణయాలు తీసుకుని ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం సరికాదంటూ సీఎం రేవంత్‌రెడ్డికి తమ్మినేని వీరభద్రం లేఖ రాశారు.
‘రైతులకు ప్రకటించిన రు.2 లక్షల రుణమాఫీని అర్హులైనవారందరికీ అమలు చేయాలి. అలాగే పంటకాలం పూర్తవుతున్నప్పటికీ వానాకాలం రైతుభరోసా ఇవ్వలేదు. తక్షణమే రైతు భరోసా చెల్లించాలి..’అని సీపీఎం కోరింది.
గ్రూప్–1 అభ్యర్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండించింది. వారికి న్యాయం చేసేవిధంగా ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకోవాలని, అభ్యర్ధులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది.
వానాకాలం, యాసంగికి రైతుభరోసా, రుణమాఫీలను వెంటనే అమలు చేయాలని సీపీఐకి చెందిన రైతుసంఘం డిమాండ్ చేసింది. ఈ విషయమై జిల్లాల్లో ధర్నాలు చేపట్టింది.
హైడ్రా పేరుతో పేదల జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, మిత్రపక్షం మిత్రపక్షమే.. పోరాటం పోరాటమేనంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment