తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..! | Situation Conducive For Third Front In Tamil Nadu | Sakshi
Sakshi News home page

తమిళనాట మూడో కూటమి.. సూత్రధారి చిన్నమ్మ..!

Published Sun, Feb 28 2021 1:42 AM | Last Updated on Sun, Feb 28 2021 12:47 PM

Situation Conducive For Third Front In Tamil Nadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు ఎన్నికలంటే అన్నాడీఎంకే, డీఎంకే కూటముల మధ్యనే ప్రధాన పోటీ అనే ఆనవాయితీకి చెక్‌పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండు కూటముల్లోని అసంతృప్త పార్టీలను కూడగట్టడం ద్వారా మూడో కూటమి సన్నాహాలు జోరందుకున్నాయి. మూడో కూటమి ఏర్పాట్లలో తెరవెనుక శశికళ, తెరముందు శరత్‌కుమార్‌ సారథ్యం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ, పీఎంకే, డీఎండీకేతోపాటు ఒకటి రెండు చిన్నపార్టీలున్నాయి. డీఎంకేలో కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీలున్నాయి. ఇండియా జననాయక కట్చి (ఐజేకే) డీఎంకే కూటమి నుంచి బయటకొచ్చి మూడో కూటమి ఏర్పాటుకు నడుం బిగించింది. తమిళనాడులో పెద్దగా ప్రాచుర్యం లేని ఐజేకే ప్రస్తుతానికి కూటమికి సారథ్యం వహిస్తున్నా తెరవెనుక నుంచి శశికళ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో ఉన్న సమత్తువ మక్కల్‌ కట్చి అధ్యక్షుడు, నటుడు శరత్‌కుమార్‌ కొద్దిరోజుల క్రితం శశికళతో భేటీ కావడం కలకలం రేపింది.  

తర్వాత అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకేలో శరత్‌ చేరారు. పదేళ్లు అన్నాడీఎంకే కూటమితో కలిసి ప్రయాణించానని, సీట్ల కేటాయింపుపై కనీసం తనకు ఆహ్వానం లేకపోవడం వల్లనే వైదొలిగానని శరత్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని శరత్‌కుమార్‌ కూటమిని బలోపేతం చేయడంలో కూడా ప్రధానపాత్ర పోషిస్తున్నారు. మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ను శరత్‌కుమార్‌ శనివారం కలిసి కూటమిలో చేర్చే ప్రయత్నాలు ప్రారంభించారు. డీఎంకే కూటమిలో చేరాలని ఎన్నో నెలలుగా వేచి చూస్తున్న కమల్‌హాసన్‌కు నిరాశే ఎదురుకాగా ఐజేకే ఆహ్వానాన్ని మన్నించే అవకాశం ఉంది. మూడో కూటమి నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అనేది ముఖ్యం కాదు, సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసంక్షేమం కోసం పాటుపడే పార్టీలను సంఘటితం చేసి గెలుపొందడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు శరత్‌కుమార్‌ తెలిపారు. కమల్‌ మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్మకం ఉందని శరత్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల్లో పోటీకి తహతహలాడుతున్న రెండు కూటముల్లోని ఆశావహులపై కూడా ఐజేకే ఒక కన్నేసింది.

మూడో కూటమిలోని ఏదో పార్టీలో చేర్చుకుని టికెట్‌ ఇవ్వడం లేదా కూటమి తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించేందుకు ఐజేకే సిద్ధంగా ఉంది. డీఎంకే నేతలు జారిపోకుండా ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌ మార్చి 2వ తేదీ నుంచి ఆశావహులను ఇంటర్వ్యూ చేయనున్నారు. అన్నాడీఎంకే కూటమిలోని పీఎంకే తమ సామాజికవర్గమైన వన్నియర్లకు రిజర్వేషన్ల డిమాండ్‌ను తెరపైకి తెచ్చి సాధించింది. అదే జరగకుంటే పీఎంకే సైతం అన్నాడీఎంకే నుంచి వైదొలిగి డీఎంకే లేదా మూడో కూటమి వైపు మొగ్గి ఉండేది. అన్నాడీఎంకే అగ్రనేతలతో శనివారం జరిగిన చర్చల్లో సామరస్యం కుదరగా 23 సీట్లతో పీఎంకే సరిపెట్టుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని బీజేపీ 60 సీట్లను కోరుతుండగా, 20–25 సీట్లకు మించి దక్కే పరిస్థితి కనపడడం లేదు.

తమిళనాడులోని మొత్తం 234 సీట్లలో పోటీచేసేందుకు బహుజన సమాజ్‌ పార్టీ సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మూడో కూటమిలో చేరినా చేరవచ్చు. అదే జరిగితే ఒంటరిపోటీపై బీఎస్‌పీ తన నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. నటుడు రజనీకాంత్‌ స్థాపించదలుకున్న పార్టీకి ప్రధాన సమన్వయకర్తగా నియమితులైన అర్జున్‌మూర్తి ‘ఇండియా మక్కల్‌ మున్నేట్ర కట్చి’అనే పార్టీని స్థాపించారు. బీజేపీ నేపథ్యం కలిగిన అర్జున్‌మూర్తికి ‘ఆల్‌ ది బెస్ట్‌’అంటూ రజనీకాంత్‌ ఆశీస్సులు అందజేశారు. మూడో కూటమికి అధికారంలోకి వచ్చేంత సంఖ్యా బలం సమకూరకున్నా రెండు కూటముల్లోని అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీసే పరిస్థితి ఏర్పడవచ్చు. 

తమిళనాడులో రాహుల్, అమిత్‌షా..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మూడు రోజులపాటు తమిళనాడులో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆదివారం కారైక్కాల్, విల్లుపురం జిల్లాలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

పీఎంకేకు 23 సీట్లు
♦ఏఐఏడీఎంకే అంగీకారం
♦బీజేపీతో కొనసాగుతున్న చర్చలు
చెన్నై: తమిళనాడులో ఏప్రిల్‌ 6వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను సీట్ల పంపకాలు జోరందుకున్నాయి. అధికార ఏఐఏడీఎంకే, ఎస్‌.రాందాస్‌ నేతృత్వంలోని పీఎంకే పార్టీ మధ్య సీట్ల పంపిణీపై శనివారం అంగీకారం కుదిరింది. దీని ప్రకారం పీఎంకే రాష్ట్రంలోని 23 సీట్లలో పోటీ చేయనుంది. కాగా, సీట్ల సర్దుబాటుపై ఏఐఏడీఎంకే, బీజేపీల మధ్య చర్చలు తుదిదశకు చేరుకున్నట్లు సమాచారం. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, వీకే సింగ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.మురుగన్‌లు ఏఐఏడీఎంకేకు చెందిన సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌ సెల్వంలతో శనివారం చర్చలు జరిపారు. తాము గెలిచేందుకు అవకాశమున్న 60 స్థానాలను కోరుతున్నట్లు బీజేపీ నేతలు అంటున్నారు.

సూత్రధారి చిన్నమ్మ..
మూడో కూటమి ఏర్పాటుకు శశికళ సూత్రధారి అని ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే నుంచి ఆశించిన స్థాయిలో అగ్రనేతలు శశికళ వైపు రాకపోవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యపరుస్తోంది. అందుకే శశికళ అక్క కుమారుడు దినకరన్‌ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం కూడా మూడో కూటమిలో చేరిపోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌  కోసం ఐజేకే యత్నిస్తోంది. అన్నాడీఎంకే, డీఎంకే కూటముల్లో సీట్ల సర్దుబాటు పూర్తయితేగానీ అసంతృప్తవాదులు బయటపడరు. అప్పటి వరకు ఐజేకే వేచిచూడక తప్పదు. మూడో కూటమి ఏర్పాటు ఒక కొలిక్కిరాగానే దాని స్వరూపం మారి శశికళ తెరపైకి రావచ్చని అంచనాలున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement