నీతిలేని రాజకీయం | corrupt politics | Sakshi
Sakshi News home page

నీతిలేని రాజకీయం

Published Sun, Jun 19 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM

నీతిలేని రాజకీయం

నీతిలేని రాజకీయం

త్రికాలమ్

వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్య నాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్యనాయుడు చొరవ తీసుకోవాలి.

 

గమ్యం, మార్గం రెండూ ముఖ్యమేనన్నాడు మహాత్మాగాంధీ. మార్గం ఏదైనా గమ్యం చేరడం ప్రధానమని భావిస్తున్నారు పదవీ రాజకీయాలలో ఆరితేరిన ఈ తరం  రాజకీయ నాయకులు.

సుఖేందర్‌రెడ్డి, తదితర నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులను తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేర్చుకుంటూ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) ఒకానొక రహస్యాన్ని వెల్లడిం చారు. 2014 ఎన్నికలలో తన పార్టీకి 119 స్థానాల అసెంబ్లీలో 63 స్థానాలతో మెజారిటీ వచ్చిన అనంతరం కూడా తనను పదవీ స్వీకారం చేయనీయకుండా అడ్డుకొని రాష్ట్రపతి పాలన విధించేలా చూసేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లు కుట్ర చేశాయనీ, తనకు ఈ విషయం ఎంఐఎం నాయకుడు అస దుద్దీన్ ఒవైసీ సకాలంలో చెప్పి ఆదుకున్నారనీ చెప్పారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పడిపోతుందంటూ ఆ రోజుల్లో  పీసీసీ బాధ్యుడు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించి నట్టు కూడా గుర్తు చేశారు. ఈ కుట్రను ఛేదించే క్రమంలో పార్టీని బలోపేతం చేయడానికి ఇతర పార్టీ శాసనసభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకుంటున్నామంటూ కేసీఆర్ సమర్థించుకున్నారు. పొరుగున  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు సైతం యథాశక్తి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నప్పటికీ చట్ట ఉల్లంఘనను సమర్థించుకునే ప్రయత్నం  చేయలేదు.


పార్టీ ఫిరాయింపులు కొత్తకాదు. ఇది టీడీపీ లేదా టీఆర్‌ఎస్‌లు కనిపెట్టిన కొత్త విద్య  కాదు. ‘ఆయారాం, గయారాం’ సంస్కృతి 1960-70లో కాంగ్రెస్ హయాంలోనే వేళ్ళూనుకుంది. ఈ దుష్ట సంస్కృతిని అంతం చేయడానికి 1985లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం, 2003లో అటల్ బిహారీ వాజపేయి సర్కార్  చేసిన రాజ్యాంగ సవరణలు సరిపోవడం లేదు. 1985 నాటి 52వ రాజ్యాంగ సవరణ చట్టంలోని లోపాలను రాజకీయవాదులు యథేచ్ఛగా వినియోగించు కొని భ్రష్ట రాజకీయాలను అందలం ఎక్కించిన తర్వాత 2003లో  91వ రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది. ఇందులో ఉన్న ప్రధానమైన లోపాన్ని రాజకీయవాదులు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. 

 
కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ సభ్యులను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడాన్ని రాజకీయ పునరేకీకరణగా అభివర్ణిస్తూ, లోగడ 16 మంది టీఆర్‌ఎస్ శాసనసభ్యులలో 10 మందిని కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ రాజశేఖరరెడ్డి చేర్చుకున్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ప్రతిపక్ష నేత జానారెడ్డిని కేసీఆర్ ప్రశ్నించారు. నాడు వైఎస్ చేశారు కనుక, కాంగ్రెస్, టీడీపీలు కుట్ర చేశాయి కనుక ప్రతిపక్షాల నుంచి శాసనసభ్యులను పార్టీ ఫిరాయించేందుకు ప్రోత్సహిస్తే తప్పులేదని కేసీఆర్ అభిప్రాయం. దెబ్బకు దెబ్బ తీయడం, రాజకీయ ప్రతీకారం తీర్చుకోవడం, ప్రతిపక్షం కుట్రను ఛేదించడం కోసం ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘిం చినా పర్వాలేదనే భావన. చట్టాలలోని లొసుగులను ఉపయోగించు కోని రాజకీయ నాయకులు ఈ రోజుల్లో ఎక్కడా కనిపించరు.


ఆపద్ధర్మం
చట్టసభలలో మెజారిటీ లేనప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించకూడదు. కొన్ని పార్టీలు కలసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే మంచిదే. మెజారిటీ లేకపోయినా ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రభుత్వం వెలుపల ఉండే రాజకీయ పక్షాల మద్దతు తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. వీపీ సింగ్, చంద్రశేఖర్, దేవెగౌడ, ఐకె గుజ్రాల్ ప్రధానులుగా ఒక్కొక్కరు సంవత్సరం కూడా పూర్తి చేయకపోవడానికి కారణం సొంతబలం లేకపోవడం, అరువుబలంపైన ఆధారపడటం. ఇటువంటి పరిస్థితులలో ఆపద్ధ ర్మంగా చట్టాన్ని ఉల్లంఘించిన సందర్భం కూడా ఉంది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య తర్వాత పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిసారీ పీవీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. మైనారిటీ ప్రభుత్వాన్ని అయిదేళ్ళపాటూ నడిపించాలనే సంకల్పంతో పీవీ టీడీపీ పార్లమెంటరీ పార్టీని చీల్చారు. జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులనూ సుముఖులను చేసుకున్నారు. నీతిబాహ్యమైన రాజకీయం ఎందుకు చేశారని ప్రశ్నించినప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టాలంటే రాజకీయ సుస్థిరత అత్యవసరమంటూ పీవీ సమర్థించుకున్నారు.

టీఆర్‌ఎస్ శాసనభ్యులను ఎందుకు కాంగ్రెస్‌లో చేర్చుకు న్నారని వైఎస్‌ను అడిగితే తెలంగాణ రాష్ట్ర సాధనే ఎజెండాగా ఉన్న టీఆర్‌ఎస్‌ను బలహీన పరచడానికి ఆ పని చేశానని చెప్పారు. అదే టీఆర్‌ఎస్‌తో అధిష్టానం ఒత్తిడి మేరకు 2004లో పొత్తు పెట్టుకున్న వైఎస్ 2009లో అధిష్టానం ఎంత గట్టిగా చెప్పినా అంగీకరించకుండా టీఆర్‌ఎస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేశారు. అది రిస్కు అని తెలిసినా సమైక్యవాదిగా టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోకూడదని వైఎస్ గట్టిగా భావించారు. అప్పుడు చంద్రబాబునాయుడు నాయకత్వంలోని టీడీపీ టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంది. పీవీ, వైఎస్‌ల నిర్ణయాలు సరైనవని సమర్థించడం ఉద్దేశం కాదు. వారు చేసింది రాజ్యాంగ ఉల్లంఘనే. వారు అనుసరించిన మార్గం అక్రమమైనదే. కానీ పార్టీ ఫిరాయిం పులను ప్రోత్సహించడానికి వారికి మంచో చెడో ఒక లక్ష్యం అంటూ ఉంది. అటువంటి లక్ష్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ముమ్మరమైన ఫిరాయింపుల వెనుక కనిపించదు. ఎన్నికలలో మెజారిటీ సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నవారికి ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలన్న తాపత్రయం ఎందుకు? ప్రతిపక్షం లేకపోవడం అధికారపక్షానికీ నష్టదాయకమే. లాభదా యకం కానేకాదు. విమర్శలను స్వాగతించినప్పుడే విధానాలలోనూ, ఆచరణ లోనూ దొర్లుతున్న పొరపాట్లు తెలుస్తాయి. దిద్దుబాటుకు అవకాశం ఉంటుంది. స్వపక్షంలో భజనపరులు అధికం. మంత్రివర్గ సహచరులు డూడూ బసవన్నలే. మీడియా సంస్థలది  వీరవిధేయత. ప్రతిపక్షాన్ని శత్రుపక్షంగా భావిస్తున్నారు. ఇక నిజానిజాలు తెలుసుకునే అవకాశం పాలకులకు ఎక్కడ? ఫిరాయింపుల విషయంలో నైతికత ఒక అంశమైతే రాజ్యాంగ స్ఫూర్తి మరో అంశం. 

 చంద్రబాబునాయుడు ఫిరాయింపుల వంటి కార్యక్రమం 1995లో ఎన్టీఆర్‌ను గద్దె దించినప్పుడే ప్రారంభించారు. రాజ్యసభ ఎన్నికలలో ప్రతి పక్షాన్ని దెబ్బతీయాలనో, మరో ఉద్దేశంతోనో వందల కోట్లు ఖర్చు చేసి ఇరవై మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలకు కండువా కప్పారు. నియోజకవర్గాలలో పాత నాయకులూ, కొత్త నాయకులూ కొట్టుకుంటున్నారు. ఫిరాయింపుల వల్ల టీడీపీ సాధించింది ఏమిటో అర్థంకాదు. ప్రతిపక్ష సభ్యులను కొంతమందిని పార్టీకి దూరం చేసినంత మాత్రాన ప్రజలలో వ్యతిరేకత సమసిపోతుందా? ఎన్నికల వాగ్దానాలు అమలు చేయకుండా ప్రతిపక్ష ఎంఎల్‌ఏలను ఆకర్షించేందుకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ప్రజలకు ఎటువంటి సంకేతాలు పంపుతుంది? 175 స్థానాల అసెంబ్లీలో వందకుపైగా సీట్లతో మెజారిటీ ఉన్నప్పుడు పరిపాలనపైన దృష్టిపెట్టకుండా, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరించేం దుకు కృషి చేయకుండా, నిరర్థకమైన ఫిరాయింపుల వ్యవహారం నెత్తికెత్తుకోవ డాన్ని ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఫిరాయించిన ఎంఎల్‌ఏల చేత రాజీనామా చేయించి టీడీపీ టికెట్టుపైన గెలిపించి ఉంటే రాజ్యాంగాన్ని గౌరవిం చినట్టు అయ్యేది. ప్రజల ఆమోదం పొందినట్టయ్యేది. ఆ దమ్ము ఫిరాయించిన వారికీ లేదు. వారిని ప్రోత్సహించినవారికీ లేదు.


చారిత్రక స్పృహ
తెలంగాణ రాష్ట్ర  సాధనకు పద్నాలుగు సంవత్సరాలు అలుపెరుగని పోరాటం అహింసాత్మకంగా సాగించిన సారథిగా, కొత్త రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కి చరిత్రలో ఇప్పటికే ప్రత్యేక స్థానం ఉంది. పార్టీ ఫిరాయింపులకు తెగబడకుండా సుస్థిర పాలన అందిస్తూ, ప్రతిపక్షాలను కలుపుకొని సాగుతూ  బంగారు తెలంగాణ స్వప్న సాకారానికి కృషి చేస్తే ఆయన రాజనీతిజ్ఞుడుగా ఎదిగి, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచే అవకాశం ఉండేది. ఎంఎల్‌ఏల సంఖ్య పెరిగినంత మాత్రాన టీఆర్‌ఎస్‌కు వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు.
 

 చట్టంలోని లొసుగులను ఉపయోగించుకోవడంలో ఎవ్వరూ వెనకాడరు కనుక, చట్టాలలోని లోపాలను సవరించుకోవాలి. రాజ్యాంగం పదో షెడ్యూ లులో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏడవ పేరాలో పార్లమెంటు, శాసన సభ, శాసనమండలి  నిర్ణయాలలో న్యాయస్థానం జోక్యం చేసుకోకూడదంటూ  స్పష్టంగా ఉన్నది. చట్టసభల సభ్యులు తమ అధికారాలను న్యాయస్థానాలకు అప్పగించడం ఇష్టం లేనికారణంగా పెట్టిన నిబంధన ఇది. వాస్తవానికి  స్పీకర్‌ది రాజ్యాంగపరమైన పదవి (constitutional office) కాగా, ఇప్పుడు పూర్తిగా రాజకీయ పదవి (political office)గా మారింది. అధినేతల అభీష్టానికి భిన్నంగా సభాపతులు వ్యవహరించే రోజులు ఎప్పుడో పోయాయి. అందుకే స్పీకర్ పదవిలో ఉన్నవారు మంత్రి పదవికోసం అంగలార్చడం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలంటే పార్టీ ఫిరాయించిన సభ్యులపై అనర్హత వేటు వేసే విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని సమీక్షించే అధికారం న్యాయవ్యవస్థకు ఉన్నదంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగపీఠం 2007లో రాజేంద్రసింగ్ రాణా వర్సెస్ స్వామిప్రసాద్ మౌర్య కేసులో స్పష్టం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకుంటే కదా న్యాయవ్యవస్థ సమీక్షించేది.  స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పాలకపక్షానికి సానుకూలంగా వ్యవహరిస్తే న్యాయస్థానాలు చేయగలిగింది ఏమీ లేదు. అందుక నే స్పీకర్లు నిర్ణయం తీసుకోవడం లేదు.
 

 ప్రలోభాలకు ఆశపడి ఎవరు పార్టీ ఫిరాయించినా అది రాజ్యాంగ ఉల్లం ఘనే. కారణాలు ఏమైనా అది ప్రజాస్వామ్య వ్యవస్థపైన ఖడ్గప్రహారమే. ప్రమా దకరమైన ఈ ధోరణిని అరికట్టాలంటే  పార్టీ మారిన ఎంపీలపైనా, ఎంఎల్‌ఏ లపైనా, ఎంఎల్‌సీలపైనా  అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ నుంచి ఎన్ని కల సంఘానికి బదిలీ చేయాలి. ఎన్నికల సంఘం సైతం పారదర్శకంగా, కాలవ్యవధికి లోబడి వ్యవహరించే విధంగా విధివిధానాలు రూపొందించాలి.


వెంకయ్యకో విన్నపం
వెంకయ్యనాయుడు అపారమైన అనుభవం కలిగిన జాతీయ నాయకుడు. తాను రాజకీయాలలో ఎన్నడూ రాజీపడలేదని శుక్రవారంనాడు హైదరాబాద్‌లో జరిగిన ఆత్మీయ సభలో సగర్వంగా ప్రకటించారు. లౌక్యం పక్కన పెట్టి పార్టీ ఫిరాయింపుల పరంపరను నిలిపివేయాలని చంద్రబాబునాయుడికీ, కేసీఆర్‌కీ గట్టిగా హితవు చెప్పగలిగితే వెంకయ్యనాయుడి స్థాయికి తగినట్టు ఉండేది. పార్టీ ఫిరాయించిన క్షణంలోనే పదవి పోవాలంటూ ఆయన చెప్పిన మాటలను చట్టబ ద్ధం చేస్తూ పార్లమెంటు వ్యవహారాల మంత్రి హోదాలో మరో రాజ్యాంగ సవరణ తెచ్చేందుకు నడుం బిగిస్తే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాణదానం చేసిన వారవుతారు. పదవులకోసం, డబ్బు కోసం, కాంట్రాక్టుల కోసం పార్టీ ఫిరా యించే ధోరణి యథేచ్ఛగా కొనసాగుతున్న కారణంగా ప్రతిపక్షాల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు అవుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో వెంటనే స్పందించాలి. వెంకయ్య నాయుడు చొరవ తీసుకోవాలి.

 

 

 

- కె.రామచంద్రమూర్తి

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement