
న్యూఢిల్లీ: ఎన్నికైన చట్ట సభల సభ్యులు సొంత పార్టీ నుంచి వేరే పార్టీకి ఫిరాయించే అనైతిక చర్యలను నిరోధించేలా ఒక పరిష్కారం చూపాలని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రభుత్వాన్ని కోరారు. రాజ్యసభలో గురువారం జీరోఅవర్ సందర్భంగా వెంకయ్యనాయుడు పై సూచన చేశారు. ‘దురదృష్టవశాత్తూ వారు అంటున్నారు ఇది ఫిరాయింపు(డిఫెక్షన్) కాదు.. అభిమానం(అఫెక్షన్) అని. వారు ఆ ఫిరాయింపును ఫర్‌ఫెక్షన్‌తో చేస్తున్నారు. దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద సమస్య ఇది’ అని ఫిరాయింపు నేతలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఈ అనైతిక చర్యకు ముగింపు పలికేందుకు అన్ని రాజకీయ పార్టీలు సూచనలు చేయాలని కోరారు.