సాక్షి, న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభ అర్థవంతంగా సజావుగా పని చేసేలా చూడాలని రాజ్యసభలో వివిధ పార్టీల నేతలను చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. సభ సజావుగా సాగడానికి సహకరిస్తామని ఆయా పార్టీల నేతలు తెలిపారు. రాజ్యసభలో వివిధ పార్టీల నాయకులతో చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదివారం తన నివాసంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మొదటి విడత బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15 వరకు నిర్వహించాల్సి ఉండగా సభ్యుల అభ్యర్థన మేరకు స్థాయీ సంఘాలు, మంత్రిత్వశాఖల విభాగాల గ్రాంట్లు, డిమాండ్లు పరిశీలించేందుకు వీలుగా 13న సమావేశం కొనసాగించి అదే రోజు నిరవధిక వాయిదా వేయాలని నిర్ణయించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, బడ్జెట్‌పై చర్చకు మరింత సమయం ఇవ్వాలని పలువురు నేతలు కోరారు. సభలో క్లుప్తంగా మాట్లాడే నేర్పును అందిపుచ్చుకోవాలని, దీనివల్ల సభ్యులకు మరింత సమయం లభిస్తుందని మంత్రులకు వెంకయ్యనాయుడు సూచించారు. సభలో చిన్నపార్టీల సభ్యులకు సమయం కేటాయించే అంశంపైనా ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. సుమారు 20 పార్టీలకు చెందిన నేతలందరూ మాట్లాడడం అన్ని వేళలా సాధ్యం కాకపోవచ్చని వెంకయ్య అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయ సాయిరెడ్డి, టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment