
న్యూఢిల్లీ: పార్లమెంట్ ప్రత్యేక సెషన్‌లో లోక్‌సభ, రాజ్యసభలు షెడ్యూల్ సమయానికి మించి పనిచేశాయి. 17వ లోక్‌సభ సెషన్లలో ఎటువంటి వాయిదాలు లేకుండా పూర్తి సమయంపాటు కార్యకలాపాలు కొనసాగించిన ఏకైక సెషన్ కూడా ఇదే. ఈ విషయాలను పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ తెలిపింది. గురువారంతో ముగిసిన ఈ ప్రత్యేక సెషన్‌లో 75 ఏళ్ల పార్లమెంట్ ప్రస్థానం, చంద్రయాన్–3 మిషన్ విజయవంతంపై చర్చ జరిగింది. ఒకే ఒక్క మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి.
స్పెషల్ సెషన్‌లో లోక్‌సభ షెడ్యూల్ సమయం 22 గంటల 45 నిమిషాలు కాగా ఎనిమిదిగంటల కంటే ఎక్కువగా మొత్తం 31 గంటలపాటు పనిచేయడం విశేషం. దీంతో, లోక్‌సభ 137 శాతం ఎక్కువ సమయం పనిచేసింది. అదే విధంగా, రాజ్యసభ షెడ్యూల్ సమయం 21 గంటల 45 నిమిషాలు కాగా, 27 గంటల 44 నిమిషాల సేపు కార్యకలాపాలు సాగాయి. దీంతో, రాజ్యసభ 128 శాతం ఎక్కువ సమయం పనిచేసినట్లయిందని పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ వివరించింది.