ప్రతిపక్షం లేకపోతే ప్రశాంతమా? ప్రహసనమా? | AP Assembly without Opposition | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షం లేకపోతే ప్రశాంతమా? ప్రహసనమా?

Published Sun, Mar 22 2015 2:01 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM

కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్ - Sakshi

కె.రామచంద్రమూర్తి, ఎడిటోరియల్ డైరెక్టర్

 త్రికాలమ్
భారత్, పాకిస్థాన్‌లు రెండు పక్షాలుగా ద్విజాతి సిద్ధాంతం (భారత దేశాన్ని విభజించింది ఈ సిద్ధాంతం ప్రాతిపదికగానే) అమలులో ఉంటే కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు లేదా స్వాతంత్య్రం ఇస్తామంటూ ఆశ పెట్టి మూడు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించవద్దంటూ వాజపేయి నెహ్రూను గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత మూడు వారాలకే,  మే 27న, నెహ్రూ గుండెపోటుతో మరణించారు. పార్లమెంటులో
 సంతాప తీర్మానంపైన వాజపేయి భావోద్వేగంతో మాట్లాడారు. నెహ్రూను భరతమాత కంఠాభరణంగా, ప్రపంచశాంతి దూతగా, పేదలకోసం పాటుపడిన మహానేతగా అభివర్ణించారు.

 
 ‘ప్రతిపక్షం లేకపోతే ప్రశాంతంగా ఉంది’. శాసనసభకు మొదటిసారి ఎన్నికై మంత్రివర్గంలో స్థానం పొందిన వ్యక్తి చేసిన ఈ వ్యాఖ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎంతగా అడుగంటిందో స్పష్టం చేస్తున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థపైన, సంప్రదాయాలపైన కనీస అవగాహనలేని వ్యక్తులు మంత్రులు కావడం, వారే అధికార పార్టీ ప్రధాన వ్యాఖ్యాతలు కావడం క్షీణదశకు నిదర్శనం. ఉగాది పర్వదినం సందర్భంగా విజయవాడలో హంస పురస్కార ప్రదాన సభలో సైతం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిపక్షాన్ని నిందించకుండా నిగ్రహిం చుకోలేకపోయారంటే రాజకీయాలలో అమిత్ర వైఖరి, అనారోగ్య ధోరణి ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.
 రాజధాని నిర్మాణానికి సంబంధించిన అంశాలపైన ప్రశ్నిస్తే అక్కడ రాజధాని నిర్మాణం ప్రతిపక్షానికి ఇష్టం లేదంటూ మాట్లాడటం, పోలవరం కాకుండా పట్టినాడును పట్టుకొని ముందుకు పోవడం ఎందుకని అడిగితే, టెంటర్ల వ్యవహారం గురించి ప్రస్తావిస్తే పట్టినాడు నిర్మించి రాయలసీమకు నీరు అందించడాన్ని ప్రతిపక్షం సహించలేకపోతోందంటూ నిందమోపడం అసహనానికి పరాకాష్ఠ. పోలవరం జాతీయ ప్రాజెక్టు అంటూ నిర్ణయించిన కేంద్రం నిధులు కేటాయించలేదు. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వవలసిన ఎన్‌డీఏ సర్కార్ బాధ్యత నెరవేర్చడం లేదు. కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావడానికీ, నిధులు ఎక్కువ రాబట్టటానికీ విస్తృత సమావేశం నిర్వహించి అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లాలన్న ప్రయత్నమే లేదు. శాసనసభలో ప్రతిపక్షం ఉనికిని గుర్తించి గౌరవించడానికి నిరాకరించడం, శాసనసభ వెలుపల ఉన్న ప్రతిపక్షాలను కలుపుకొని పోవాలన్న స్పృహ లేకపోవడం శోచనీయం. పైగా ఎవరు అడ్డువచ్చినా సరే చేసి తీరుతాం, కట్టితీరుతాం అంటూ సభలో గర్జించడం సభామర్యాద కాదు. ప్రజాస్వామ్య సంస్కృతీ కాదు.

 పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు పుట్టినిల్లయిన బ్రిటన్‌లో ప్రతిపక్షాన్ని హిజ్ (హర్) మెజెస్టీస్ లాయల్ అపోజిషన్ అంటారు. బ్రిటన్‌లో రెండు పార్టీలే ప్రధానమైనవి కనుక ప్రతిపక్ష నాయకుడిని భావి ప్రధానిగా సంభావించి మర్యాదగా సంబోధిస్తారు. ప్రతిపక్ష నాయకుడు సైతం ప్రధానితో ఎంతగా విభేదించినా మాట తూలిన సందర్భాలు అరుదు. ప్రతిపక్ష సభ్యులను ప్రజాద్రోహులంటూ నిందించే ప్రయత్నం ప్రజా స్వామ్య వ్యవస్థ వేళ్లూనుకున్న దేశాలలో జరగదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆదర్శమైన సింగపూర్‌లో సైతం అధికార పార్టీ పీపుల్స్ యాక్షన్ పార్టీ (సీఏపీ) నాయకుడు, ప్రధాని లీ సీన్ లూంగ్‌కీ, వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్, ప్రతిపక్ష నాయకుడు లో థియూ ఖియాంగ్‌కీ మధ్య తరచు జరిగే వాదనలు వింటే సభానాయకుడూ, ప్రతిపక్ష నాయకుడు విధానాలపైన విభేదిస్తూనే ఎంత సంస్కారవంతంగా మాట్లాడవచ్చునో, ప్రత్యామ్నాయ విధానాలపైన క్షుణ్ణంగా చర్చించి సరైన నిర్ణయాలు ఎట్లా తీసుకోవచ్చునో అర్థం అవుతుంది.

 ఎన్టీఆర్ భవన్‌కీ, శాసనసభకీ తేడా ఏమిటి?
 ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నవి మూడే పక్షాలు. అందులో రెండు పక్షాలు అధికారం పంచుకుంటున్నాయి. ఒకేఒక ప్రతిపక్షం. ఆ ప్రతిపక్షం సభలో లేకపోతే, అధికార పక్ష సభ్యులకు ప్రభుత్వ నిర్ణయాలతో విభేదించి స్వతంత్రంగా ఆలోచించి నిస్సంకోచంగా మాట్లాడే వాతావరణం లేకపోతే సభలో జరిగేది అర్థవంతమైన చర్చ అవుతుందా? ప్రతిపక్ష నాయకుడు సభకో నమస్కారం పెట్టి సహచరులతో సహా నిష్ర్కమించిన రోజు ఒక్కటే బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకు మిగిలింది. ఆ రోజు సభలో ఉండవలసిన నలుగురు భారతీయ జనతా పార్టీ సభ్యులూ రాష్ట్రంలో కరవు పరిస్థితులను పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు వివరించేందుకు ఢిల్లీ వెళ్లారు. అంత ముఖ్యమైన అంశంపైన చర్చ ఉన్న రోజున వారు ఢిల్లీ ప్రయాణం పెట్టుకోవలసింది కాదు. ఇక సభలో మిగిలింది తెలుగుదేశం పార్టీ సభ్యులు మాత్రమే. అప్పుడు శాసనసభకీ, తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌కీ తేడా ఏముంటుంది? ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి లోటస్‌పాండ్‌లోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో మీడియా గోష్ఠిలో చేసిన ప్రసంగాన్నీ, అసెంబ్లీలో సాగిన ఉపన్యాసాలనూ కలిపి చూసినవారికి మాత్రమే విషయం అరకొరగానైనా అర్థమై ఉంటుంది.

 సభను సజావుగా నిర్వహించవలసిన బాధ్యత ప్రధానంగా సభాపతిది. ఆ తర్వాత సభానాయకుడిది. సభ్యుల హక్కులనూ, ప్రతిపత్తినీ రక్షించవలసింది సభాపతే. అప్పుడే ఆయనకు సభ్యులందరినీ ఏకతాటి మీద నడిపించి సభలో ప్రజాసమస్యలపైన, ప్రభుత్వ విధానాలపైన ప్రయోజనకరమైన చర్చ నిర్వహించే అవకాశం ఉంటుంది. విభజన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సభ్యుల సంఖ్య 175కు తగ్గింది కనుక బడ్జెట్ సమావేశాలను ఇదివరకటిలాగా 29 పనిదినాలు కాకుండా 17 రోజులకు తగ్గించారు. బడ్జెట్ ప్రతిపాదనలపైన చర్చకు ఆరురోజులకు బదులు, నాలుగు రోజులు కేటాయిస్తే అందులో మూడు రోజులు పట్టిసీమపైన వాదోపవాదాలకే చెల్లు. మిగిలిన ఒక్కరోజులో ప్రతిపక్షానికి గంట, ప్రభుత్వానికి గంటన్నర కేటాయించాలన్న సభాపతి నిర్ణయం సైతం సరైనది కాదు. బడ్జెట్‌తో ముడిపడిన అనేక అంశాలపైన చర్చ జరపడానికి ఆ సమయం సరిపోదు. ఇందుకు తగ్గట్టు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే మంత్రులూ, అధికారపక్ష సభ్యులూ పదే పదే అడ్డు తగలడం, అమర్యాదగా మాట్లాడటం ప్రజలకు కనపడుతున్న, వినబడుతున్న వాస్తవం. శాసనసభలో చిత్రించిన కొన్ని దృశ్యాలను ఎడిట్ చేసి ప్రతిపక్షాన్ని అపఖ్యాతిపాలు చేసే విధంగా ఎడిట్ చేసి టీవీ చానళ్లకు విడుదల చేయడం, ఆ చానళ్లు అదేపనిగా ఆ ఏకపక్ష దృశ్యాలను చూపించడం మరే ఇతర రాష్ట్రంలోనూ జరగని అఘాయిత్యం. టీవీ చానళ్లలో కనిపించిన దృశ్యాలలో ప్రతిపక్ష సభ్యురాలు రోజా హావభావాలు అభ్యంతరకరమైనవే. కానీ ఆమెను అధికారపక్షం నుంచి కవ్విస్తున్న దృశ్యాలు చూపించకుండా ఆమె వైపు దృశ్యాలు మాత్రమే చూపించడంలోనే దురుద్దేశం ఉన్నది. రెండు వైపులా దృశ్యాలు చూపించి ఉంటే ఎవరి తప్పిదం ఏమిటో ప్రజలు నిర్ణయించుకునే అవకాశం ఉండేది. ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణేతలు ప్రజలే. కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎవరు నిర్ణేతలో తెలియని పరిస్థితి కనిపిస్తున్నది. పోడియం దగ్గర ప్రతిపక్ష సభ్యులున్న దృశ్యాలను తాను విడుదల చేయలేదంటూ శాసనసభ తాత్కాలిక కార్యదర్శి సత్యనారాయణ లిఖితపూర్వకంగా స్పష్టం చేశారు. మరి ఎవరు విడుదల చేసినట్టు? స్పీకర్ అనుమతితోనే ఈ దృశ్యాలను విడుదల చేశారా? స్పీకర్ అనుమతి లేకపోతే స్పీకర్ ఏ చర్య తీసుకున్నారు లేదా తీసుకోబోతున్నారు? ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారు? ఇది అంత తేలికగా తీసుకోవలసిన అంశమా? ఇది ఎవరి అరాచకమో నిగ్గుతేల్చవద్దా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే హక్కు ప్రజలకున్నది. తెలియజేయవలసిన బాధ్యత సభాపతికి ఉన్నది.

 రెండు శాసనసభలు, రెండు వైఖరులు
 ఇదే రకమైన దృశ్యం తెలంగాణ శాసనసభలోనూ కనిపించింది. రెండు కొత్త రాష్ట్రాల శాసనసభ సమావేశాలు ఒకే రోజు ప్రారంభమైనాయి. గవర్నర్ ఉభయసభలనూ ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు గొడవ చేశారు. వారితో అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు తలబడి కలబడినట్టు కనిపించింది. జాతీయగీతం ఆలపించిన సమయంలోనూ తెలుగుదేశం పార్టీ సభ్యులు బల్లల మీద నిలబడి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ దృశ్యాలను టీవీ చానళ్లకు విడుదల చేయరాదని తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి భావించారు. మొత్తం దృశ్యాలను అన్ని పార్టీల ప్రతినిధులూ స్పీకర్‌తో కలసి చూసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఒక సందర్భంలో టేపును ఎడిట్ చేసి చూపిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి అభ్యంతరం చెప్పారు. రెండోసారి మొత్తం టేపులన్నీ చూడటానికి అభ్యంతరం లేదంటూ అధికారపక్షం సంసిద్ధత వెలిబుచ్చింది. మొత్తంమీద అన్ని దృశ్యాలనూ చూసిన తర్వాత వాటిని చానళ్లకు విడుదల చేయకుండా సభాగౌరవాన్ని కాపాడాలని తెలంగాణ శాసనసభాపతి నిర్ణయించారు. అందుకే ఆ అభ్యంతరకర దృశ్యాలు టీవీ చానళ్లకు అందలేదు.

 తెలంగాణ స్పీకర్ ప్రదర్శించిన సమయజ్ఞతనూ, చొరవనూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కూడా చూపించి ఉన్నట్లయితే ఏకపక్షంగా ఎడిట్ చేసిన విజువల్స్ టీవీ చానళ్లకు దొరికేవి కావు.. చట్టసభలలో తెలంగాణ స్పీకర్ కంటే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ శివప్రసాద్ అనుభవం చాలా ఎక్కువ. ఆయనంటే వ్యక్తిగతంగా నాకు గౌరవం ఉంది. ఎందుచేతనో చాలా సందర్భాలలో ఆయన నిర్దిష్టమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఉదాహరణకు సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదనేది నియమం. స్పీకర్ హోదాలో యనమల రామకృష్ణుడు, ప్రతిభాభారతి, సురేష్ రెడ్డి, తదితరలు అనేక సందర్భాలలో సభలో లేని వ్యక్తులపైన వ్యాఖ్యలు చేయరాదంటూ రూలింగ్ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపైన అభాండాలు వేయకుండా, తీవ్రమైన ఆరోపణలు చేయకుండా నవ్యాంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశం ఒక్క రోజైనా జరగలేదంటే అతిశయోక్తి కాదు. జగన్మోహన్‌రెడ్డిని లక్ష కోట్లు అక్రమంగా సంపాదించావంటూ నిందించని రోజు లేదు. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతుంటే సభానాయకుడు జోక్యం చేసుకోవచ్చు. కానీ అరడజను మంది మంత్రులు లేచి చర్చనీయాంశానికి సంబంధం లేని విషయాలు మాట్లాడి వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ తర్జని చూపుతూ స్వరం పెంచి కేకలు వేస్తూ విద్వేషం ప్రదర్శించడాన్ని సభలోఎట్లా అనుమతిస్తారు? అవినీతిపరులనీ, జైలుకు పోతారనీ, దొంగలనీ, ఫోర్ ట్వంటీలనీ, డాన్సర్లనీ చట్టసభలలో అనుమతించరాని పదజాలం యధేచ్ఛగా వాడుతుంటే నివారించవలసిన బాధ్యత సభాపతికి లేదా? తోటి సభ్యుడిని ఉద్దేశించి ‘రేయ్ పాతేస్తా’ అంటూ బెదిరించిన విజయవాడ శాసనసభ్యుడు బోండా ఉమ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు కూడా స్పీకర్ ప్రకటించలేదు. సభ వాయిదా పడిన తర్వాత ఆదేశాలు జారీ చేశారేమో తెలియదు కానీ మర్నాడు ఎనిమిది మంది ప్రతిపక్ష శాసనసభ్యులను సస్పెండు చేశారు. అధికార పక్షాన్ని అదుపు చేస్తూ ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చి ప్రోత్సహించినప్పుడే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ ఆదేశాలను శిరసావహిస్తారు. స్పీకర్‌పైన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేవరకూ వ్యవహారం వె ళ్లిందంటే సభ జరుగుతున్న తీరును ఒకసారి సమీక్షించుకోవలసి ఉంటుంది.

 నెహ్రూ, వాజపేయి రాజనీతిజ్ఞత
 1977లో ఇందిరాగాంధీనీ, ఆమె నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీనీ చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ మొరార్జీదేశాయ్ ప్రధానిగా మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్ బిహారీ వాజపేయి సౌత్‌బ్లాక్‌లో తన కార్యాలయంలో అడుగుపెడుతూనే గోడమీద ఇదివరకు ఉన్న ఒక ఫోటో కనిపించలేదు. ఖాళీగా ఉన్న ప్రదేశం తన కార్యదర్శికి చూపించి ‘అక్కడ పండిట్‌జీ ఫొటో ఉండేది. ఎవరో తీసివేశారు. వెంటనే ఆ ఫొటోను తిరిగి అక్కడ పెట్టించండి’ అని ఆదేశించారట. పండిట్ నెహ్రూ ప్రధానిగా పనిచేసిన పదిహేడు సంవత్సరాలూ విదేశ వ్యవహారాల శాఖను స్వయంగా నిర్వహించారు. నెహ్రూ, వాజపేయి ప్రాణస్నేహితులు కారు. పైగా వాజపేయిని పెంచి పోషించిన జనసంఘ్‌కి నెహ్రూ అంటే ఏ మాత్రం పొసగదు. ఆయన సాంస్కృతిక మూర్తిమత్వం పట్ల జనసంఘ్‌కు అనుమానం. ఆయనపైన పాశ్చాత్య నాగరికత ప్రభావం ఎక్కువని అభిప్రాయం. కాంగ్రెస్ రాజకీయాలంటే వ్యతిరేకం. ఆర్థిక విధానాలకు పూర్తిగా ప్రతికూలం. 1964లో నెహ్రూ అస్తమించడానికి కొన్ని రోజుల ముందే (మే మొదటివారంలో) కశ్మీర్ విషయంలో వాజపేయి లోక్‌సభలో నెహ్రూను నిశితంగా విమర్శించారు. ద్విజాతీయ సిద్ధాంతానికి జనసంఘ్ వ్యతిరేకం అంటూ ఇప్పుడు మీరు త్రిజాతి సిద్ధాంతానికి ఊపిరి పోస్తున్నారంటూ దుయ్యపట్టారు. నేపథ్యం ఏమంటే, కొన్ని సంవత్సరాలుగా గృహనిర్బంధంలో ఉన్న కశ్మీర్ సింహం షేక్ అబ్దుల్లాను విడుదల చేయడమే కాకుండా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాకిస్థాన్ అధ్యక్షుడు జనరల్ అయూబ్ ఖాన్‌తో సమాలోచనలు జరపమంటూ ఆదేశం పంపించారు నెహ్రూ. ఈ చర్యను జనసంఘ్ గట్టిగా వ్యతిరేకించింది. ఇప్పటికీ భారత్, పాకిస్థాన్‌లు రెండు పక్షాలుగా ద్విజాతి సిద్ధాంతం (భారత దేశాన్ని విభజించింది ఈ సిద్ధాంతం ప్రాతిపదికగానే) అమలులో ఉంటే కశ్మీర్ ప్రజలకు ప్రత్యేక హక్కులు లేదా స్వాతంత్య్రం ఇస్తామంటూ ఆశ పెట్టి మూడు జాతుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించవద్దంటూ వాజపేయి నెహ్రూను గట్టిగా హెచ్చరించారు. ఆ తర్వాత మూడు వారాలకే, మే 27న, నెహ్రూ గుండెపోటుతో మరణించారు. పార్లమెంటులో సంతాప తీర్మానంపైన వాజపేయి భావోద్వేగంతో మాట్లాడారు. నెహ్రూను భరతమాత కంఠాభరణంగా, ప్రపంచశాంతి దూతగా, పేదలకోసం పాటుపడిన మహానేతగా అభివర్ణించారు. ఇందులో నెహ్రూ ఔన్నత్యం కంటే వాజపేయి గొప్పదనం గుర్తించాలి. చరిత్ర పుటలలో నుంచి నెహ్రూను తొల గించడానికి నరేంద్రమోదీ ప్రయత్నించినా, రాజశేఖరరెడ్డిని మరణం తర్వాత కూడా అపఖ్యాతిపాలు చేయాలని చంద్రబాబునాయుడు ప్రయత్నించినా ప్రజల దృష్టిలో పలచనై కురచగా కనిపించేది వీరే కానీ వారికేమీ కాదు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement