కె.రామచంద్రమూర్తి
త్రికాలమ్
ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎందుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయలేకపోతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు రెండు ఎన్‌కౌంటర్లు జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు పదేపదే గుర్తుకొస్తున్నారు. ఒకరు బాలగోపాల్, మరొకరు కన్నబీరన్. మూడు దశాబ్దాల కిందట బాలగోపాల్ భయం పోలీసులకే కాదు, పాలకులకే కాదు, పాత్రికేయులకూ ఉండేది. ఎన్‌కౌంటర్ ఎప్పుడు జరిగినా బాలగోపాల్ నాయకత్వంలో నిజనిర్థారణ బృందం ఘటన జరిగిన స్థలానికి వెళ్లిరావడం, తమ బృందం తెలుసుకున్న నిజాలను మీడియా సమావేశంలో నిర్భయంగా చెప్పడం, వాటిని పొల్లుపోకుండా రాసి ప్రచురించడం అలవాటు. క్షేత్రంలో బాలగోపాల్ పర్యటనలు ఉండేవి. న్యాయస్థానంలో కన్నబీరన్ వాద నలు జరిగేవి. ఎన్‌కౌంటర్ల వార్తలు రాసే పాత్రికేయులకూ, వాటిపై వ్యాఖ్యా నాలు రాసే సంపాదకులకూ, సీనియర్ జర్నలిస్టులకూ మనసులో ఒక మూల భయసందేహాలు ఉండేవి. మనం రాస్తున్న విశ్లేషణను బాలగోపాల్ ఆమోది స్తారా లేదా అవహేళన చేస్తారా అనే సంకోచం పీడిస్తూ ఉండేది. ఇప్పుడా భయం పాత్రికేయులకు లేదు. ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుల పేర్లు ప్రకటిస్తూ వారిపైన హత్యానేరం మోపుతూ కేసు పెట్టాలంటూ బాలగోపాల్ ఉద్యమం చేస్తారనే భయం పోలీసులకూ లేదు. మానవ హక్కులను హరిస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఎండగడతారనే భయం పాలకులకు లేదు. కన్నబీరన్, బాల గోపాల్, చంద్రశేఖర్ (గుంటూరు న్యాయవాది, చుండూరు కేసులో దళితుల తరఫున వాదించిన మానవ హక్కుల నేత), ఇతర పౌరహక్కుల నాయకులూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన పారదర్శక, ప్రజాస్వామ్య వాతావరణం, పోలీసులనూ, పాలకులనూ నిలదీసే సాహసం క్రమంగా హరించుకుపో యింది. బాలగోపాల్ సజీవంగా ఉంటే శేషాచలం అడవుల్లో జరిగిన నరమేధం పట్ల, ఆలేరులో పోలీసు కస్టడీలో ఉన్న ఐదుగురు ముస్లిం నిందితుల హత్య పట్ల ఎట్లా స్పందించేవారో ఊహిస్తే, ఇప్పుడు స్పందన ఎంత పేలవంగా ఉన్నదో గమనిస్తే పౌరసమాజంలో వచ్చిన మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది.
గతంలో కూడా ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపైన కేసులు పెట్టే వారు కాదు. ఎన్‌కౌంటర్ అంటే నిరాయుధులను పోలీసులు కాల్చి చంపడం అనే అర్థం రూఢి అయింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా పోలీ సుల కథనంతో పాటు ప్రత్యక్షసాక్షుల కథనం వచ్చేది. అనంతరం రెండు మూడు రోజులకు నిజనిర్ధారణ బృందం నివేదిక వచ్చేది. ప్రజలకు వాస్తవాలు కొంతవరకైనా తెలిసేవి. ఇప్పుడు పోలీసుల కథనం మాత్రమే వస్తున్నది. ఇతర కథనాలూ, ఇతర కోణాలూ రావడం లేదు. పైగా చనిపోయినవారు నేరస్థులే నంటూ ఊహించి కథనాలు ప్రచురించడం ద్వారా పాలకులకు మద్దతు ఇచ్చే రోజులు వచ్చాయి. పాలకులను ప్రశ్నించడం పోయి, వారి కొమ్ము కాసే కాలం దాపురించింది. ఎన్‌కౌంటర్లు జరిగిన తర్వాత పదిరోజులకైనా హైదరాబాద్‌లో ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించిన పౌరహక్కుల నాయకులకూ, న్యాయస్థానంలో పిటిషన్లు వేసి వాదిస్తున్న న్యాయవాదులకూ అభినందనలు.
నక్సలైట్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎన్‌కౌం టర్లు తరచుగా జరిగేవి. ఎన్‌కౌంటర్ చేసే ముందు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అగ్రశ్రేణి నక్సలైట్ నాయకులను మహారాష్ట్రలో అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి తీసుకొని వచ్చి కాల్చి చంపిన ఘటన అందరికీ తెలిసిందే. శేషాచలం, ఆలేరు ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న పోలీసులకు చట్టభయం బొత్తిగా లేదనీ, తెలివితేటలు తక్కువనీ, సరైన శిక్షణ కూడా లేదనీ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘నా శిక్షణలో తయారైన అధికారులు ఇంత అవివే కంగా ఎన్‌కౌంటర్ చేయరు’ అని అన్నారు. తెలంగాణలో పనిచేసిన పోలీసు అధికారులకు ఎన్‌కౌంటర్ చేసే ముందు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. జరిగింది ఏకపక్షం కాల్పులు కాదనీ, నిజంగా ఎన్‌కౌంటరేననీ నమ్మిం చేందుకు పోలీసు జవాన్లు ప్రాణాపాయం లేకుండా తొడలోనో, కాళ్లమీదో ఎముకకు తగలకుండా కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
శేషాచలం అడవులలో చనిపోయిన ఇరవై మంది కూలీలలో పదకొండు మంది ఆదివాసులని జాతీ య ఎస్టీ కమిషన్ వైస్‌చైర్మన్ రవి ఠాకూర్ శనివా రం నాడు తిరుపతిలో చెప్పారు. ప్రభుత్వం, పోలీ సు అధికారులు వాదిస్తున్నట్టు కూలీలు స్మగ్లర్లు నియమించినవారే కావచ్చు. అర్ధరాత్రి అడవుల్లో చెట్లు నరికే వారు మామూలు కూలీలు కాకపోవ చ్చు. కానీ వారినీ, వారిని నియమించిన దొంగ వ్యాపారులనీ అరెస్టు చేసి న్యాయస్థానంలో బోనె క్కించి నేరం నిరూపిం చడానికి అవసరమైన యంత్రాగాన్ని సమాయ త్తం చేసుకోవాలి కానీ చొక్కాలు కూడా లేని కూలీల ఛాతిమీద కాల్చి చంపడం అమానుషం.
ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలి
ఎన్‌కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేయాలంటూ బిలాల్ నజ్కీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్న కాలంలో ఆయనా, జస్టిస్ రఘురామ్, మరో న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం నిర్ణయించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సాధారణంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెబుతారు. శేషాచలంలో రాళ్లతో తమపైన దాడి చేసిన కారణంగా కూలీలను చంపివేశామని పోలీసులు చెబితే, ఆలేరులో నిందితులలో ఒకరు పోలీసు జవాను చేతిలోని రైఫిల్ లాక్కొని తమపైన కాల్పులు జరపబోతే తిరిగి కాల్చవలసి వచ్చిందని చెబుతున్నారు. రెండువాదనలలో పసలేదని ఇంగితజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలిసి పోతుంది.
ఎర్రచందనం దొంగలు అటవీశాఖ అధికారులనూ, పోలీసు అధికారు లనూ హత్య చేసిన మాట వాస్తవమే. ఎర్రచందనం అపహరణను నిలువరించ వలసిన అవసరం ఉన్న మాటా కాదనలేం. వీరప్పన్‌కూ, ఆతని ముఠాసభ్యు లకూ ఆశ్రయం, సమాచారం ఇచ్చిన వారిపైన తమిళనాడు ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. వీరప్పన్ వారసులు చాలామంది ఎర్రచందనం చెట్లు నరికించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న మాట నిజం. వీరి ఆట కట్టిం చాలంటే తమిళనాడు ప్రభుత్వంతో కలసి సంయుక్తంగా వ్యూహం రచించాలి. దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి కేసులు పెట్టాలి. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించాలి. అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి. నేరం నిరూపించే శక్తియుక్తులు లేక, సహనం లేక నిందితులను న్యాయస్థానంలో విచారించే పని లేకుండా ఎన్‌కౌం టర్ చేయడం చట్టవిరుద్ధం.
రెండు ఎన్‌కౌంటర్లూ బూటకమే
ఆలేరు ఎన్‌కౌంటర్‌లో మరణించిన వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్, సులేమాన్ ఇద్దరూ నేరాలు చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. వికార్ తనను తానే జిహాదీగా పరిగణించుకొని ఫసియుద్దీన్ మాదిరి దోపిడీ చేసిన డబ్బుతో దాడులు నిర్వహించేవాడని పోలీసుల సమాచారం. అహ్మదాబాద్‌లో మకాం పెట్టి ఏకంగా నరేంద్రమోదీపైన దాడి చేయడానికి ప్రయత్నించాడనీ, అక్కడే వినయ్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్‌ని హత్య చేశాడనీ ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఒక కానిస్టేబుల్‌నీ, ఒక హోంగార్డునూ చంపాడని పోలీసుల ఆరోపణ. ఇతనిపై హైదరాబాద్‌లో కానీ అహ్మదాబాద్‌లో కానీ చార్జిషీటు దాఖలు కాలేదు. అండర్‌ట్రయల్‌గా ఉండగానే ఇతను చంచల్ గూడా జైలులో వార్డెన్‌పై చేయి చేసుకుంటే వరంగల్లు జైలుకు తరలించారు. అక్కడి నుంచి ఏప్రిల్ ఏడవ తేదీన నాంపల్లి కోర్టుకు తీసుకువస్తున్న సమ యంలో ఆలేరు దగ్గర బస్సులోనే అతడినీ, నలుగురు సహచరులనీ కాల్చి చంపారు. పద్దెనిమిది మంది సాయుధ పోలీసులు అయిదుగురు అండర్‌ట్ర యల్స్ వెంట ఉన్నారు. ఒక్క పోలీసు ఉద్యోగికీ చిన్న దెబ్బకూడా తగలకుండానే అయిదుగురు నిందితులనూ కాల్చిచంపడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఉగ్రవాదులను ఉపేక్షించాలని ఎవ్వరూ వాదించడం లేదు. ఎర్రచందనం దొంగలను నిరోధించవద్దని ఎవ్వరూ అనడం లేదు. పోలీసులే చట్టాన్ని చేతు లోకి తీసుకొని ఎవరిపైన అనుమానం ఉంటే వారిని కాల్చివేస్తుంటే ఇక చట్టాలెందుకు, న్యాయస్థానాలెందుకు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శేషాచలం ఎన్‌కౌంట ర్‌ని ఖండించిన దాఖలా లేదు. తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాస్తామ న్నారు. మెజిస్ట్రేట్‌తో దర్యాప్తు జరిపిస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వస్తూనే పోలీసులకు కొత్త వాహనాలు ఏర్పాటు చేశారు. వారికి అదనపు సౌకర్యాలు సమకూర్చారు. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే శాంతిభద్రతలు సజావుగా ఉంటాయంటూ అనేక సందర్భాలలో అన్నారు. మొన్న కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ ప్రారంభిస్తూ అన్నిటి కంటే శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యమని నొక్కి చెప్పారు. వికారుద్దీన్ బృందం హత్యని ముఖ్యమంత్రి బహిరంగంగా ఖండించలేదు. వారి మరణంపై దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను నియమిస్తామని ప్రక టించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్‌కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎం దుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయ లేకపోతున్నారు. ‘మీకూ, మావోయిస్టులకూ మధ్యా, మీకూ, ఉగ్రవాదులకూ మధ్య మేము లేకపోతే మీ పని ఖాళీ’ అంటూ పోలీసు అధికారులు న్యాయమూ ర్తులనూ, రాజకీయ నాయకులనూ, ఐఏఎస్ అధికారులనూ హెచ్చరించే పరిస్థి తులున్నాయి. అందువల్ల ఎన్‌కౌంటర్ చేయడం అనవసరమనీ, చట్టబా హ్యమనీ, నేరమనీ స్పష్టంగా తెలిసినప్పటికీ పోలీసు అధికారులను తప్పు పట్టడానికి పాలకులు సిద్ధంగా లేరు. శేషాచలం ఎన్‌కౌంటర్ తీవ్రత దృష్ట్యా దాని దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను హైకోర్టు స్వీకరించింది. రెండు ఎన్‌కౌం టర్లపైనా పదవిలో ఉన్న న్యాయమూర్తుల చేత దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి. చట్టంతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత ఎజెండాతో ఎవరు వ్యవహరిం చినా అప్రజాస్వామికమే. చంద్రబాబునాయుడినీ, చంద్రశేఖరరావునీ ముఖ్య మంత్రులుగా ప్రజలు ఎన్నుకున్నది చంద్రశాసనం అమలు చేయాలని కాదు. చట్టపాలన అమలు చేయాలని. చట్టాలని ఉపయోగించుకొని జనరంజకంగా పాలించాలని. చట్టాలు చాలకపోతే కొత్త చట్టాలు చేసుకోవచ్చును కానీ ఉన్న చట్టాలను ఉల్లంఘించడం, జీవించే హక్కును కాలరాయడం శిక్షార్హమైన నేరం.