గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి | trikalam guest column | Sakshi
Sakshi News home page

గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి

Published Sun, Aug 21 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM

గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి

గొప్ప సంస్కరణకు గండి కొట్టకండి

త్రికాలమ్‌:  ‘మీకు అక్కడ భూములు ఉన్నాయా? మీ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదా?’
‘లేదు. పిటిషనర్లు రైతులు కాదు. జర్నలిస్టులు’  ‘మరి మీకేం సంబంధం?’
‘రాష్ట్ర ప్రభుత్వం నేరుగా విదేశీ ప్రభుత్వాలతో, విదేశాలలోని ప్రైవేటు కంపెనీలతో సంబంధాలు పెట్టుకుంటున్నది. భారీ ఎత్తున అప్పులు చేస్తున్నది.  కేంద్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చు కుంటున్నది. ఇది రాజ్యాంగ విరుద్ధం’
‘ఆ విషయం కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది.’
‘(ఆంధ్రప్రదేశ్‌) రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో  సారవంత మైన భూములను రైతుల నుంచి సేకరిస్తున్నది. కేంద్రం నియమించిన శివరామ కష్ణన్‌ కమిటీ నివేదికను బుట్టదాఖలు చేసింది.’
‘మీరు మెట్టభూములు చూపించకపోయారా? రాజధాని నిర్మించడం మీకు ఇష్టం లేదా? భూములు కోల్పోయిన రైతులు వచ్చినప్పుడు చూద్దాం. మీ పిటి షన్లో పస లేదు. అందువల్ల కొట్టేస్తున్నాం’.

ప్రముఖ సంపాదకుడు ఏబికే ప్రసాద్, ‘లీడర్‌’ పత్రిక సంపాదకుడు రమణ మూర్తి, జర్నలిస్టు–న్యాయవాది శ్రవణ్‌కుమార్‌లు దాఖలు చేసిన పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ (పీఐఎల్‌–జనహితవ్యాజ్యం)ను పరిశీలించకుండానే కొట్టివేసే ముందు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకుర్‌కూ, పిటిషనర్ల తరఫు న్యాయ వాదులకూ మధ్య జరిగిన సంభాషణ స్థూలంగా ఇది.

పీఐఎల్‌ ఒక బెడదా?
ప్రధాన న్యాయమూర్తితో పాటు జస్టిస్‌ డివై చంద్రచూడ్, జస్టిస్‌ ఖన్వీల్కర్‌ కూడా పీఠంపై ఉన్నారు. డివై చంద్రచూడ్‌ తండ్రి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్‌ జనహితవ్యాజ్యాలను విశేషంగా ప్రోత్సహిం చిన న్యాయకోవిదుడు. జస్టిస్‌ ఠాకుర్‌కు పీఐఎల్‌ వేస్తున్నవారి పట్ల కొంత అసహనం ఉన్నమాట బహిరంగ రహస్యం. కుప్పలుతెప్పలుగా పేరుకుపో తున్న  కేసులు ప్రధాన న్యాయమూర్తిని కలవరపెడుతున్నాయి. న్యాయమూ ర్తుల సంఖ్య పెరగడం లేదు. పీఐఎల్‌ వేస్తున్నవారిలో కొందరు ప్రజాప్రయో జనం కాకుండా నిగూఢమైన స్వార్థ ప్రయోజనాలు ఆశించేవారున్నారు. వారిని నిరోధించే మార్గం సూచించవలసిందిగా సుప్రీంకోర్టు కేంద్ర న్యాయశాఖను కోరింది. న్యాయశాఖ ఆ పనిపైన దష్టి పెట్టింది. ఐపీఎల్‌ను వ్యవస్థీకతం చేసిన న్యాయకోవిదులలో ప్రథముడు జస్టిస్‌ పీఎన్‌ భగవతి ఈ విషయంలో న్యాయ శాఖతో సహకరిస్తున్నారు. మరో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఆర్‌ కష్ణ య్యర్‌ 2014 డిసెంబర్‌ 4న నిర్యాణం చెందే వరకూ సహకారం అందించారు.   

పీఐఎల్‌కు ప్రణబ్‌ బాసట
జనహితవ్యాజ్యంలో అగ్రగామిగా జస్టిస్‌ భగవతిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ అభివర్ణించారు. లోకాయుక్త్‌లను సాధికారికం చేయడంలోనూ, పేదలకు న్యాయ సహాయం అందించడంలోనూ జస్టిస్‌ భగవతి చేసిన సేవలు విలువైనవంటూ ప్రశంసించారు. జస్టిస్‌ భగవతి రాసిన ‘మై ట్రిస్ట్‌ విత్‌ జస్టిస్‌‘ని 2012 డిసెంబర్‌ 13న నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కబీర్‌ రాష్ట్రపతి భవన్‌లో ఆవిష్కరించిన సందర్భంగా ప్రణబ్‌ జనహితవ్యాజ్యం పేదప్రజలకూ, అణగా రిన వర్గాలకూ, న్యాయస్థానాల గడప ఎక్కలేని అమాయకులకూ వరప్రసాద మనే రీతిలో మాట్లాడారు. సుపరిపాలనకు సైతం ఇది దోహదం చేస్తుంది. అనేక జనహితవ్యాజ్యాలలో సర్వోన్నత న్యాయస్థానం గొప్ప తీర్పులు ఇచ్చిన ఫలితంగానే సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎంతో కొంత న్యాయం జరుగుతోంది. చట్టసభలూ, పాలనావ్యవస్థల కంటే ఎక్కువగా న్యాయవ్యవస్థ పైన జనసామాన్యానికి ఇప్పటికీ  విశ్వాసం మిగిలి ఉండటానికి కారణం రాజ్యాం గాన్ని అన్వయించడంలో, ప్రాథమిక హక్కులను అమలు చేయడంలో సామాజిక కోణాన్ని న్యాయమూర్తులు దష్టిలో పెట్టుకోవడమే.

పీఐఎల్‌ వంటి సంస్కర ణను ప్రవేశపెట్టడమే. జస్టిస్‌ భగవతి, ఓ చిన్నప్పరెడ్డి, వైవి చంద్రచూడ్, వీఆర్‌ కష్ణయ్యర్, డీఏ దేశాయ్, జీవన్‌రెడ్డి వంటి దిగ్గజాలు అధోజగత్తులో అలమ టిస్తున్నవారికి న్యాయసహాయం అందించే పరమ లక్ష్యంతో అహరహం కృషి చేసిన కారణంగానే న్యాయవ్యవస్థలో ఇప్పటికీ కొన్ని మానవీయ విలువలు మిగిలి ఉన్నాయి. పీఐఎల్‌ను పరిశీలించకుండానే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి తిరస్కరించడం దిగువ కోర్టులకు ఆదర్శంగా నిలుస్తుంది. నోరులేనివారి తరఫున జనహితవ్యాజ్యం దాఖలైతే దానిని పరిశీలించడానికి సైతం హైకోర్టుల న్యాయమూర్తులు నిరాకరిస్తారు. ఇది పేదవారికి అన్యాయం, అపకారం చేసి నట్టే. సుప్రీంకోర్టు చాలా సంవత్సరాలుగా ఎంతో శ్రమించి సాధించిన సంస్క రణను నీరుగార్చడమే.

వరిష్ఠ సంపాదకుడు
ఏబీకే ప్రసాద్‌ ఆరు దశాబ్దాలుగా కొన్ని విలువలకు కట్టుబడి అసిధారావ్రతం చేస్తున్న వరిష్ఠ  సంపాదకుడని ప్రధాన న్యాయమూర్తికి తెలియకపోవచ్చు. ఏబీకే తెలుగు పాత్రికేయుడు కావడం, ప్రధాన న్యాయమూర్తికి తెలుగు రాష్ట్రాలతో, తెలుగు జర్నలిజంతో పరిచయం లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. సమాజ శ్రేయస్సే పరమావధిగా ఏబీకే సాగిస్తున్న అక్షరయానం గురించి స్పష్టంగా తెలిసిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతి రైతుల తరఫున ఆయన కోర్టుకు వెళ్ళడాన్ని ఉన్మాదంగా అభివర్ణిం చడం కేవలం అహంకారం. ఉన్మాదం ఎవరిదో ప్రజలే నిర్ణయిస్తారు. అర్ణవ్‌ గోస్వామి, బర్ఖాదత్‌  వంటి ఇంగ్లీషు టీవీ జర్నలిస్టులు పీఐఎల్‌ వేసి ఉంటే జస్టిస్‌ ఠాకుర్‌ నిర్ణయం ఎట్లా ఉండేదో.  రైతుల పక్షాన దాఖలైన ఐపీఎల్‌ను ఒక్క క్షణం పరిశీలించినా కేసు ప్రాధాన్యం ప్రధాన న్యాయమూర్తికి తెలిసి ఉండేది.

నష్టపోయిన రైతులు పిటిషన్‌ వేసినప్పుడు చూద్దాం అంటూ జస్టిస్‌ ఠాకుర్‌ అన్నారు. సుప్రీంకోర్టులో ఒక రోజు ప్రభావవంతంగా వాదించేందుకు అయిదు లక్షల రూపాయల దాకా పారితోషికం చెల్లించుకోవాలంటే ఎవరు భరించగలరు? జన హితవ్యాజ్యం ద్వారా ఫీజు లేకుండా వాదించే సామాజిక స్పహ కలిగిన అడ్వ కేట్ల సహకారంతో రైతుల సమస్యలనే  కాకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడ్డ గోలుగా తీసుకుంటున్న అనేక నిర్ణయాలను ప్రశ్నించే ఉద్దేశంతో వేసిన పీఐఎల్‌ను ప్రధాన న్యాయమూర్తి పరిశీలించి ఉంటే ప్రజలకు కొండంత మేలు జరిగేది. జనహితవ్యాజ్యం లక్ష్యం నెరవేరేది.   

ఈ విషయంలో ఠాకుర్‌ ఒక్కరే కాదు. మాజీ ప్రధాన న్యాయమూర్తి కపా డియా సైతం బూటకపు ఐపీఎల్‌ను నిరోధించేందుకు జరిమానా విధించాలని ప్రతిపాదించారు. పీఐఎల్‌ విలువ జస్టిస్‌ కపాడియాకు బాగా తెలుసు. పీఐఎల్‌æ కారణంగానే 2008 నాటి స్పెక్ట్రమ్‌ కేటాయింపులలో (2–జీ)కుంభకోణం వెలుగులోకి వచ్చింది. జస్టిస్‌ కపాడియానే కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కార్యాచరణను నియంత్రించారు. అమరావతి రైతుల తరఫున పీఐఎల్‌ వేసిన ఏబీకేకు లోకస్‌ స్టాండై (అర్హత) లేదని నిర్ణయించిన ప్రధాన న్యాయమూర్తి ఠాకుర్‌ బీజేపీ నాయకుడు అశ్వినీ కుమార్‌ ఉపాధ్యాయ వేసిన పీఐఎల్‌ను ఆసరా చేసుకొని 2016 మే 12న కేంద్ర ప్రభుత్వానికి ఒక నోటీసు జారీ చేశారు. లా కమిషన్‌ సిఫార్సు చేసినట్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను రెట్టింపు చేయవలసిందిగా న్యాయ మంత్రిత్వ శాఖకూ, ఆర్థిక మంత్రిత్వ శాఖకూ నోటీసు పంపించారు. ఇది నిశ్చయంగా ప్రజాప్రయోజనం దృష్టిలో పెట్టుకొని చేసినదే. అందుకే ప్రజలకు మేలుచేసే పీఐఎల్‌ను తిరస్కరించడం సమంజసం కాదు.

పేదలకు న్యాయసహాయం
సమాజంలో పేదలకూ, నోరు లేనివారికీ న్యాయం అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతోనే సుప్రీంకోర్టు పీఐఎల్‌ను వ్యూహాత్మకంగా ఆవిష్కరించింది. ఆత్య యిక పరిస్థితిలో దెబ్బతిన్న న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను పునరుద్ధరించే క్రమంలో కొందరు సామాజిక స్పహ కలిగిన న్యాయమూర్తులు న్యాయవ్యవస్థను పేద లకు చేరువ చేసేందుకు నడుం బిగించారు. పేదలకు న్యాయసహాయం చేసేం దుకు సోషల్‌ యాక్షన్‌ లిటిగేషన్‌ (సామాజిక వ్యాజ్యం)ను ఒక సాధనంగా వినియోగించుకోవాలంటూ జస్టిస్‌ కష్ణయ్యర్, జస్టిస్‌ భగవతి 1977లోనే ఒక నివేదిక ప్రచురించారు. ఆ తర్వాత తమకు వచ్చిన లేఖలనే పిటిషన్లుగా సూమోటోగా స్వీకరించి సామాన్యుల సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ పాత్రికేయుడు కులదీప్‌ నయ్యర్‌ టాడా ఖైదీల కష్టాలను వర్ణిస్తూ ఒక న్యాయమూర్తికి రాసిన లేఖను పీఐఎల్‌గా స్వీకరించారు. ఈ సమ యంలోనే న్యాయవ్యవస్థ ప్రభుత్వ చర్యలను సమీక్షించడం ద్వారా చురుకైన పాత్ర పోషించడం ప్రారంభించింది. రాజ్యాంగంలోని 21వ అధికరణ స్వభా వంలో వచ్చిన మార్పు గుర్తించగలిగితే జనహితవ్యాజ్యం రూపకల్పన క్రమం అర్థం అవుతుంది.

ఏ వ్యక్తి జీవితానికీ, వ్యక్తిగత స్వేచ్ఛకూ (చట్టం పరిమితులకు లోబడి) భంగం కలగకూడదని ఈ అధికరణ నిర్దేశిస్తుంది. అంటే, చట్టం అను మతించినంత వరకూ వ్యక్తిగత స్వేచ్ఛపై  పరిమితులు విధించవచ్చునని అప్పటి వరకూ న్యాయవ్యవస్థ విశ్వసించేది.  ప్రభుత్వం చట్టం తెచ్చినా, ఆర్డినెన్స్‌ జారీ చేసినా ముందస్తు అరెస్టు, నిర్బంధం రాజ్యాంగ సమ్మతమేనని ఏకే గోపాలన్‌ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ అన్వయాన్ని మేనకాగాంధీ కేసు మార్చివేసింది. రాజ్యాంగం 14, 19, 21 అధికరణలలో స్పష్టం చేసిన విధంగా 21వ అధికరణ హామీ ఇచ్చిన వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించే విషయంలో హేతు బద్ధంగా, ధర్మబద్ధంగా, సమంజసంగా వ్యవహరించవలసి ఉంటుందంటూ న్యాయస్థానాలు భాష్యం చెప్పడం ప్రారంభించాయి. 14వ అధికరణ చట్టం ఎదుట అందరూ సమానమే అన్న హామీ ఇచ్చింది. భావప్రకటనకూ, శాంతి యుత సమావేశాల నిర్వహణకూ, ఉద్యమాలు నిర్వహించడానికీ, బతుకుతెరువు కోసం పని చేయడానికీ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక స్వేచ్ఛలన్నీ 19వ అధికరణలో ఉన్నాయి. సర్వోన్నత న్యాయస్థానం క్రమంగా ఈ హక్కుల మధ్య అంతస్సూత్రాన్ని ఆవిష్కరించింది.

ప్రభుత్వ చర్యల వల్ల ఈ హక్కులలో దేనికి భంగం వాటిల్లినా ప్రభుత్వం  నిగ్రహం పాటించవలసి ఉంటుంది. చట్టం నిర్ణయించిన పద్ధతి (procedure established by law) అని భారత రాజ్యాంగ నిర్మాతలు అంటే దానిని అమెరికా రాజ్యాంగంలో ఉన్న సరైన పద్ధతి (డ్యూప్రా సెస్‌) అనే మాటను తీసుకొని నికరమైన పద్ధతి (substantiative due process) అనే మాటను న్యాయస్థానాలు 21వ అధికరణలో చేర్చాయి. ఆత్య యిక  పరిస్థితిలో దేశం అనుభవాలను దష్టిలో పెట్టుకొని న్యాయవ్యవస్థ ఈ జాగ్రత్తలు అవసరమని భావించి ఉండవచ్చు. మేనకాగాంధీ కేసులో తీర్పు దరిమిలా జీవించే హక్కు, వ్వక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను ఉదారంగా అన్వయించడం మొదలు పెట్టారు. ఇవన్నీ కూడా పీఐఎల్‌ అనే సాధనం ద్వారానే జరిగాయని గుర్తించాలి.

రాజ్యాంగం మూడవ భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులకూ, నాలుగో భాగంలో సమకూర్చిన ఆదేశిక సూత్రాలకూ మధ్య సమన్వయం సాధిస్తూ రాజ్యాంగాన్ని ప్రజలకు అనుకూ లంగా అన్వయించే ప్రయత్నం జరిగింది. ‘రాజ్యాంగం మూడు, నాలుగో భాగా లలోని అంశాలు పరస్పర పూరకాలే కానీ పరస్పరం సంబంధం లేని అంశాలు కావు’ అంటూ  ఉన్నికష్ణన్, జేపీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కేసులో జస్టిస్‌ జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘ఆదేశిక సూత్రాలను అమలు పరచడానికి ఉపకరించే సాధనాలే ప్రాథమిక హక్కులు’ అంటూ ప్రబోధించారు. పైగా సామాజిక విప్లవం సాధించడానికీ, సంకేమ రాజ్యం స్థాపించడానికీ ఆదేశిక సూత్రాలనూ, ప్రాథమిక హక్కులనూ జమిలిగా సద్వినియోగం చేసుకోవాలంటూ కేశవానంద భారతి కేసులో న్యాయమూర్తులు ఉద్ఘాటించారు. 21వ అధికరణ పరిధిని సుప్రీం కోర్టు క్రమంగా విస్తరించింది. తిండికీ, బట్టకీ, గూడుకూ లోపం లేకుండా ఆరో గ్యంగా, గౌరవప్రదంగా జీవించే పరిస్థితులు కల్పిస్తేనే ఆ హక్కు అమలు జరుగు తున్నట్టు అర్థమంటూ జస్టిస్‌ భగవతి స్పష్టం చేశారు.

పీఐఎల్‌ వల్ల ప్రయోజనాలు
వోల్గా టెల్లిస్‌ అనే జర్నలిస్టు  బాంబే మునిసిపల్‌ కార్పొరేషన్‌పైన  వేసిన పీఐఎల్‌ ఆధారంగానే రోడ్డు పక్కన పేవ్‌మెంట్ల మీద నివసించేవారిని భారీ నిర్మాణాల కోసం బడా కాంట్రాక్టర్లు బలవంతంగా మరో చోటికి తరలించే ప్రయత్నం ఆగిపోయింది. వోల్గా ‘లోకస్‌ స్టాండై’ని నాటి న్యాయస్థానం ప్రశ్నించలేదు. బిహార్‌ జైళ్ళలో సంవత్సరాల తరబడి మగ్గుతున్న అండర్‌ ట్రయిల్‌ ఖైదీల దుస్థితిని ‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ప్రచురించిన వరుస కథనాలు న్యాయస్థానం దష్టికి తీసుకువెళ్ళాయి. ‘వేగంగా విచారించే హక్కు’ అండర్‌ ట్రయిల్స్‌కి ఆ విధంగానే సంక్రమించింది. మరో జర్నలిస్టు షీలా బర్సే ముంబయ్‌ మహా నగరంలోని జైళ్ళలో అష్టకష్టాలు పడుతున్న మహిళా ఖైదీల ఘోషను న్యాయ స్థానానికి పీఐఎల్‌ ద్వారా వినిపించారు. షీలా ‘లోకస్‌ స్టాండై’ని న్యాయస్థానం ప్రశ్నించలేదు. ఆమె కషి ఫలితంగానే మహిళా ఖైదీలను ప్రత్యేక గదులలో ఉంచాలనీ, వారికి కాపలాగా మహిళా గార్డులే ఉండాలనీ సుప్రీంకోర్టు ఆదేశిం చింది.  రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి సత్వరం వైద్యం చేసి తీరా లంటూ సుప్రీంకోర్టు ఆసుపత్రులనూ, ప్రభుత్వాలనూ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడానికి దారి తీసింది కూడా జనహితవ్యాజ్యమే.

సుప్రీంకోర్టు చొరవ ఫలితంగా పీఐఎల్‌ వేసే వ్యక్తుల లేదా సంస్థల అర్హత (లోకస్‌ స్టాండై)ని ప్రశ్నించడం తగ్గించారు. ఢిల్లీలో ఆసియా క్రీడోత్సవం (ఏసియన్‌ గేమ్స్‌)కోసం కట్టడాలను నిర్మించడానికి సంబంధించిన కార్యకలాపాలలో బాల కార్మికులను వినియోగించడాన్ని ప్రశ్నిస్తూ పీపుల్స్‌ యూనియన్‌ ఆఫ్‌ డెమాక్రాటిక్‌ రైట్స్‌ భారత ప్రభుత్వంపైన వేసిన పీఐఎల్‌ ఫలితంగా బాలకార్మికులను వినియోగిం చడం శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు.

పర్యావరణవేత్త ఎంసీ మెహతా వేసిన అనేక పీఐఎల్‌ల ధర్మమా అని గంగానది కాలుష్య నివారణకూ, తాజ్‌ మహల్‌ పరిసర ప్రాంతాలలో కాలుష్య కారకాల తొలగింపునకూ, ఢిల్లీ మునిసి పల్‌ కార్పొరేషన్‌ పరిధి నుంచి కాలుష్య కారక పరిశ్రమలను దూరంగా తరలించడానికీ దారి తీశాయి. విశాఖపట్టణం కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ పర్యావరణవేత్త, మాజీ ఐఏఎస్‌ అధికారి ఈఏఎస్‌ శర్మ ప్రభుత్వ సంస్థల ఆగడాలను ప్రశ్నిస్తూ  న్యాయస్థానాలలో పీఐఎల్‌ ద్వారా నిర్విరామంగా పోరాడు తున్నారు. పర్యావరణంతో ఒక ఐఏఎస్‌ అధికారికి ఏమి సంబంధం అని ఆయనను ఇంతవరకూ ఏ న్యాయస్థానం కూడా ప్రశ్నించలేదు. ఉన్నత పదవులలో ఉన్న అధికారులపైనా , రాజకీయ నాయకులపైనా రోజుకు కనీసం రెండు లేఖాస్త్రాలు సంధిస్తారు ఆయన.

విద్యాసంస్థలలో విద్యార్థులకు రోజూ భోజనం ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన మధ్యాహ్న భోజన పథకం సవ్యంగా అమలు జరగడం లేదని పీఐఎల్‌ వస్తే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సక్రమంగా పథకం అమలు కావడానికి అవసరమైన ఆదేశాలను సంబంధిత అధికారులకు సుప్రీం కోర్టు జారీ చేసింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత విద్యార్థులకు స్వాలర్‌ షిప్పులు చెల్లించే విషయంలో 1956 కంటే ముందు తెలంగాణ ప్రాంతంలో స్థిరపడినవారి పిల్లలకే చెల్లిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంటే 1956 నుంచి 2013 వరకూ తెలంగాణలో స్థిరపడినవారి పిల్లలు స్కాలర్‌షిప్‌లకు అర్హులు కారు. ఈ జీవోను సవాలు చేస్తూ ఒక పీఐఎల్‌ దాఖలైతే హైకోర్టు విచారించింది. పిటిషనర్‌ తరఫున ప్రముఖ న్యాయవాది సత్యప్రసాద్‌ వాదించారు. తెలంగాణ ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకోవలసి వచ్చింది.  

ప్రజల చేతిలో పాశుపతాస్త్రం
జనహితవ్యాజ్యం వల్ల సమాజానికి సమకూరిన ప్రయోజనాలు ఏమిటో, వాటి ప్రాముఖ్యం ఏమిటో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తెలియదని భావించ లేము. అదే సమయంలో అసందర్భపు పీఐఎల్‌లు న్యాయాధికారుల సమ యాన్ని వధా చేస్తున్న సంగతీ నిజమే. ఉదాహరణకు మొన్న మార్చి 11న ఠాకుర్‌ నాలుగు పీఐఎల్‌లు తిరస్కరించారు. వాటిలో ఒకటి ఇండియా పేరును భారత్‌గా మార్చవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. మరొ కటి 32 సంవత్సరాల కిందట జరిగిన సిక్కుల ఊచకోతకు సంబంధించింది. మూడోది ప్రవాస భారతీయుడు దినేశ్‌ ఠాకుర్‌ వేసింది. ఔషధ పరిశ్రమలను క్రమబద్ధం చేయాలంటూ ఆయన విన్నవించారు. ‘మీరు ప్రచారం కోసం ఇక్కడి వచ్చి హడావుడి చేస్తున్నారు’ అంటూ ఆయనను ప్రధాన న్యాయమూర్తి మంద లించారు. నాలుగో ‘పిల్‌’ కూడా ఇటువంటిదే. సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంటరెస్ట్‌ లిటిగేషన్‌ (పీపీఐఎల్‌) వేసిన పీఐఎల్‌ పరిశీలిస్తూ ‘మీకు ఇదే పనా? (Are you a professional litigant?) అని సూటిగా అడిగారు.

ఇది ప్రముఖ న్యాయ వాది ప్రశాంత్‌ భూషణ్‌ నాయకత్వంలో పని చేస్తున్న సంస్థ. స్పెక్ట్రమ్‌ కేటా యింపుల (2–జీ) కుంభకోణం వెలుగు చూడటానికి ఈ సంస్థ పీఐఎల్‌ ద్వారా చేసిన పోరాటమే కారణం. ఈ సంస్థ ఖాతాలో అనేక విజయాలు నమోదై ఉన్నాయి. అనవసరపు పీఐఎల్‌ల పట్ల జస్టిస్‌ ఠాకుర్‌ ఆగ్రహాన్ని అర్థం చేసు కోవచ్చు. అపరిష్కతంగా మిగిలిపోతున్న కేసుల భారం పెరిగిపోతున్నదనీ, మరింత మంది న్యాయాధికారులను నియమించాలనీ ఆయన ప్రభుత్వానికి పదే పదే చెబుతున్నారు. ఒక సందర్భంలో ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలో ఈ సమ స్యను ప్రస్తావించి కంటతడి పెట్టుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని న్యాయమూర్తుల నియామకం గురించి ప్రస్తావించకపోవడం పట్ల బహి రంగంగానే ఆక్షేపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. న్యాయమూర్తుల సంఖ్య పెంచవలసిందే. న్యాయమూర్తుల నియామకాన్ని వేగవంతం చేయవల సిందే.

పేదప్రజల చేతిలో ఉన్న పాశుపతాస్త్రం పీఐఎల్‌. మొత్తం కేసులలో పీఐఎల్‌ కేసులు ఒక్క శాతానికి మించి ఉండవని హిమాచల్‌ విశ్వవిద్యాలయం పరిశోధకుడు మన్మత్‌సింగ్‌ అధ్యయనంలో తేలింది. అన్ని పీఐఎల్‌ కేసులనూ ఒకే గాట కట్టకుండా పలుకున్న కేసులను గుర్తించి వాటిని విచారణకు స్వీకరించే వడపోత వ్యవస్థను నిర్మించుకోవలసిన అవసరం ఉన్నది. అంతేకానీ 1980ల నుంచి సుప్రీంకోర్టుకు వన్నె తెచ్చిన ఎందరో మహానుభావులు, ప్రాతఃస్మరణీ యులు పేదప్రజల హక్కులకు రక్షణ కల్పించే మహత్తరమైన ఆశయంతో రూపొందించిన జనహితవ్యాజ్యాన్ని నీరుగార్చే ప్రయత్నం హానికరం.
- కె.రామచంద్రమూర్తి
సాక్షి, ఎడిటోరియల్‌ డైరెక్టర్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement