మీడియా, డబ్బు చుట్టూ బాబు రాజకీయాలు | KTR Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Dec 2 2018 2:47 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

KTR Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘‘ప్రాంతాలు వీడిపోయినా తెలుగు వారంతా ఒక్కటేనని భావించాం. ఎవరికి వారుగా అభివృద్ధి చెందాలని ఆశించాం. కొత్తగా నిర్మించే అమరావతి శంకుస్థాపన రోజు రూ.100 కోట్లు ఇవ్వాలని కేసీఆర్‌ అనుకున్నారు. కానీ ప్రధాని మోదీయే తట్టెడు మట్టి... బిందెడు నీళ్లు ఇచ్చేసరికి కేసీఆర్‌ మాట్లాడలేకపోయారు. మనం ఇంత మంచిగా ఆలోచిస్తే... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను నిర్వీర్యం చేయాలని చూశారు. ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారు’’అని మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌ భరత్‌నగర్‌లోని నూర్‌ ఫంక్షన్‌హాల్‌లో సీమాంధ్ర కాపు, బలిజ సోదరులు ‘మన హైదరాబాద్‌’పేరుతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేటీఆర్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆయన అంతు చూస్తామన్నారు. అవసరమైతే ఆంధ్రా రాజకీయాల్లోనూ వేలు పెట్టేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఒకసారి బాబును అమరావతి దాకా తరిమికొడితే మళ్లీ వచ్చారని, సరైన సమయంలో కేసీఆర్‌ తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
 
బాబు ఎన్ని వేశాలేసినా ప్రజలు నమ్మరు.. 
‘ఇటీవల మహాకుటమి పేరుతో పేపర్లలో ప్రకటనలు చూస్తున్నాం. దీనికి డబ్బు ఖర్చు పెడుతున్నారో అందరికీ తెలుసు. రాహుల్‌ సీట్లు పంచొచ్చు.. చంద్రబాబు కోట్లు పంచొచ్చు.. ఓట్లు వేసేది మాత్రం మనం. అందుకే ఓటు ద్వారా కూటమికి తగిన బుద్ధి చెప్పాలి. రాహుల్‌ ఎన్ని డ్రామాలు ఆడినా.. బాబు ఎన్ని వేషాలు వేసినా.. ప్రజలు నమ్మరు. అన్ని వర్గాలను ఆదరించి వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌ను కాపాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్‌తో మేము ఏన్నడూ తగాదాలు కోరుకోలేదు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలుపెట్టాడు. అవసరమొచ్చినప్పుడు ఆంధ్రా రాజకీయాల్లో మేం కూడా వేలు పెడుతాం. ఫెడరల్‌ ఫ్రంట్‌లో భాగంగా ఏపీలో మా పట్టు చూపెట్టి.. చంద్రబాబుకు సరైన బుద్ధి చెబుతాం. మీడియా, డబ్బు చుట్టూ బాబు రాజకీయాలు తిరుగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికల్లో ఆయన ఎన్ని కోట్లు పంచారో దేశమంతా తెలుసు. ఈ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు టీడీపీని తరిమికొడతారనే నమ్మకం ఉంది. ఒక్క కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, కోదండరాం ఏకమయ్యారు. కానీ సింహం సింగిల్‌గా వస్తుంది.. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలి’అని పిలుపునిచ్చారు.

శనివారం హైదరాబాద్‌లో సీమాంధ్ర కాపు, బలిజ సోదరులు నిర్వహించిన ‘మన హైదరాబాద్‌’ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు
 
బాబు ఎక్కువ ఊచించుకుంటున్నారు.. 
‘చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. పొట్టోడి నెత్తిన పొడుగోడు కొడితే.. పోడుగోడి నెత్తిన పోచమ్మ కొట్టిందన్న సామెత చందంగా సమయం వచ్చినప్పుడు బాబుకు ఎలా బుద్ధి చెప్పాలో కేసీఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. నాలుగు బిల్డింగ్‌లు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే.. అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్‌కు ఎంతుండాలి. ఏ సభలో పాల్గొన్నా.. తమ్ముళ్లూ నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికింది నువ్వు కాదా?. మన వాళ్లు బ్రీఫ్‌డ్‌ మీ అన్నది ఎవరు.. అది మీ వాయిస్‌ కాదని ఎందుకు చెప్పలేకపోతున్నారు. నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో మేం జరిపించాం. కేసీఆర్‌ స్వయంగా హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అన్నీ తానై ఆ కుటుంబాన్ని ఓదార్చింది. కూకట్‌పల్లిలో సుహాసినికి ఎందుకు సీటిచ్చారు?. నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా.. మాట్లాడితే 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అంటుంటారు. సెల్ఫ్‌ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉందని’అని విమర్శించారు.
 
పొత్తు లేకుండా బాబు గెలవలేడు... 
‘పొత్తులు లేకుండా తాను ఎన్నటికి గెలవలేనని చంద్రబాబుకు తెలుసు. కులాల పేరిట చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే లోకేశ్‌ను మంత్రిని చేసినట్లు సుహాసినిని కూడా చేయవచ్చు కదా?. ఏపీతో ఏనాడు మేం తగదాలు కోరుకోలేదు. అమరావతి నిర్మాణానికి తెలంగాణ సాయంగా రూ.100 కోట్లు ఇద్దామనుకున్నాం. కానీ ప్రధాని మోదీయే నీళ్లు, మట్టి ఇవ్వడంతో కేసీఆర్‌ మౌనంగా ఉండిపోయారు. ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్, చంద్రబాబు ఫిడెల్‌ వాయించుకోవడమే. ఈసారి గెలిస్తే మెట్రోను పెంచుకొని ట్రాఫిక్‌ ఇబ్బందులు పూర్తిగా తీర్చుకుందాం. అలాగే ఎలక్ట్రిక్‌ వాహనాలు తీసుకువచ్చి కాలుష్యం లేకుండా చూస్తాం. కాపు, బలిజ సోదరుల డిమాండ్‌లను నెరవేరుస్తాం’అని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణదేవరాయ యూత్‌ అసోషియేషన్‌ నాయకులు మిర్యాల రాఘవరావు, అడుసుమల్లి వెంకటేశ్వరావు, అరవ రామకృష్ణ, ఎం.వెంకటేశ్వరావు, అమీర్‌పేట్‌ కార్పొరేటర్‌ శేషుకుమారి, పసుపులేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement