శుక్రవారం సిరిసిల్లలో నిర్వహించిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్‌ను సత్కరిస్తున్న నేతన్నలు
సాక్షి, సిరిసిల్ల: ‘‘నిన్న ఢిల్లీలో రాహుల్‌గాంధీ దగ్గరికి పోయి చంద్రబాబునాయుడు వీణ ఇచ్చిండు. ఆ ఫొటో చూస్తే నాకైతే ఏమనాల్నో అర్థం కాలె. మీ అందరికీ ఎట్ల అనిపిచ్చినా.. పాపం స్వర్గంలో ఉన్న ఎన్టీ రామారావుకు ఎట్ల అన్పిచ్చిందో అని నాకు బాధ అయ్యింది. ఆయనకు బతికినప్పుడే గాక సచ్చినంక మళ్లొకసారి వెన్నుపోటు పొడిసిండు. కాంగ్రెసు, టీడీపీ కలుసుడా.. అసలు ఇంతకంటే నీచం ఉంటదా..’’అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం నేత కార్మికులు నిర్వహించిన కృతజ్ఞత సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, టీడీపీలపై తీవ్రస్థాయిలో ఆయ న విరుచుకుపడ్డారు. అప్పుడెప్పుడో బ్రహ్మంగారు జెప్పినట్లు అయితాందిప్పుడు. కాంగ్రెసు, తెలుగుదేశం కలుసుడంటే పాము, ముంగీస కలిసినట్లే.. పాము, ముంగీస భుజం మీద చేతులేసుకొని తిరిగినట్లే.. మీరు ఆలోచన చేయమని కోరుతున్నా’అని పేర్కొన్నారు. ముసలి నక్క కాంగ్రెసు.. గుంటనక్క చంద్రబాబు నాయుడు మళ్లీ ఒక్కటై వస్తుండ్రు.. వారికి బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు
రైతు నోట్లో మట్టి పడదా?
రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టొద్దని కేంద్రానికి 30 ఉత్తరాలు రాసిన చంద్రబాబు ఇయ్యాల కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నడు. రేపటి రోజున తప్పిదారి వీళ్లు అధికారంలోకి వస్తే బాబు ప్రాజెక్టులు కట్టనిస్తడా? రాష్ట్ర రైతుల నోట్లో మట్టి పడదా? అని ప్రశ్నించారు. డిసెంబర్7న జరిగే ఎన్నిక తనను ఎమ్మెల్యే, కేసీఆర్‌ను సీఎం చేసేందుకే జరుగుతున్న ఎన్నిక కాదన్నారు. ఈ ఎన్నిక రాష్ట్రంలోని రైతన్నలు, నేతన్నలు, గీతన్నలు తమ తలరాతను తామే రాసుకునే ఎన్నిక కాబోతున్నదని చెప్పారు. పొరపాటున వీళ్లకు అధికారం ఇస్తే మన మరణశాసనం మనమే రాసి వాళ్ల చేతికి ఇచ్చినట్లు అయితందన్నారు.
కేసీఆర్‌ను ఎందుకు గద్దె దించాలె?
వారు ఒకటే చెబుతున్నరు కేసీఆర్‌ను దించాలట.. ఎందుకు దించాలే? కల్యాణలక్ష్మితో ఆడబిడ్డల బతుకులు బాగు చేసినందుకా అని ప్రశ్నించారు. నేతన్నల బతుకులు బాగు చేసినందుకా.. రైతుబంధు రూపంలో రైతన్నలకు 8 వేలు ఇస్తున్నందుకు దించాలా? బడిపిల్లలకు సన్నబియ్యం పెడుతున్నందుకా.. ఆసుపత్రుల్లో ప్రసూతికి కేసీఆర్ కిట్ ఇచ్చినందుకా..24 గంటల కరెంటు, సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా కడుతున్నందుకా, తెలంగాణను కోటి ఎకరాలను చేస్తున్నందుకా.. ఆలోచించాలని మీ అందర్నీ కోరుతున్నా అని చెప్పారు.
నేతన్నలకూ బీమా: రైతుబీమా తరహాలో నేతన్నలందరికీ బీమా సౌకర్యం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ‘స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో నిపుణులుగా తీర్చిదిద్దుతామంటూ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు.. నైపుణ్యం అద్దాలి సరే.. మరి ఉన్నవారి సంగతేంటి?’అని ప్రశ్నిం చారు. నినాదాలతో కాదు విధానాలతో పరిస్థితులు మారుతాయని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక జౌళిరంగం బడ్జెట్ రూ.70 కోట్ల నుంచి 1,270 కోట్లకు పెంచిందన్నారు. ‘సీఎం కేసీఆర్ దుబ్బాకలో నేతన్న ఇంట్లో ఉండి చదువుకున్నడు.. చేనేత, బీడీ కార్మికుల కష్టం కళ్లారా చూసిండు.. అందుకే ఎవరు చెప్పకున్నా ఇవ్వాల్సింది ఇచ్చిండు’అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు సిరిసిల్ల చీరను మురిపెంగా కట్టుకుని గర్వపడే స్థాయికి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను చేర్చామని వెల్లడించారు. చేనేత కార్మికులను కళాకారులు అనడమే న్యాయమన్నారు. అన్ని వర్గాలకు మేలు చేస్తున్న కేసీఆర్‌ను కాపాడుకోవా లని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీ వినోద్‌కుమార్, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment