సాక్షి, హైదరాబాద్: మహాకూటమిలోని భాగస్వామ్య పక్షాల తీరు ఆయా పార్టీల శ్రేణులను నైరాశ్యంలోకి నెటేస్తోంది. ఓ వైపు టీఆర్‌ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతుంటే.. అధికార పార్టీని గద్దె దించుతామంటూ సవాల్ విసురుతున్న కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐల అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. దీంతో కూటమిలోని ఏ పార్టీకి ఎక్కడెక్కడ సీట్లు వస్తాయో.. ఎవరి పేరుతో ప్రచారం చేయాలో అర్థంకాక.. ఆ పార్టీల కార్యకర్తలు నిరాశలో కూరుకుపోతున్నారు.
దీనికి తోడు పలు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులం తామేనంటూ.. రెండు, మూడు పార్టీల నేతలు ప్రచారం చేసుకుంటుండటం కూడా కార్యకర్తల్లో, ప్రజల్లో గందరగోళానికి దారితీస్తోంది. ఎల్బీనగర్‌లో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి (కాంగ్రెస్), సామ రంగారెడ్డి (టీడీపీ)లు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ తమకంటే తమకే వస్తుందనే ధీమాతో వారిద్దరూ ప్రజల్లోకి వెళ్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని 20, 30 నియోజకవర్గాల్లో నెలకొంది.
సెప్టెంబర్ 6.. నవంబర్ 6
సంచలనం కోసమా.. వ్యూహాత్మకంగానా? అనే విషయాన్ని పక్కనపెడితే.. 105 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించి 53 రోజులు గడిచాయి. ఈ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ నాయకులు, శ్రేణులు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన తర్వాత అసంతృప్తులను ఒక్కొక్కరుగా బుజ్జగిస్తూ.. నాలుగేళ్లలో ఏం చేశామనే విషయాన్నే శ్రేణులు ప్రచారంలో ప్రజలకు వివరిస్తున్నారు. కానీ.. టీఆర్‌ఎస్‌ను గద్దెదించే లక్ష్యంతో ఒక్కటైన మహాకూటమి పార్టీలు నెలల తరబడి చర్చలు జరుపుతున్నా ఇంతవరకూ.. ఓ నిర్ణయానికి మాత్రం రాలేకపోయారు.
ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ‘వాళ్లు సీట్లు పంచుకునేలోపు.. మేం స్వీట్లు పంచుకుంటాం’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాగా, కూటమిలోని నాలుగు పార్టీల కేడర్‌లో తీవ్రమైన గందరగోళం నెలకొంది. ఏ పార్టీకి సీటు ఇస్తారు? ఇస్తే తమ నాయకుడికే వస్తుందా? లేక మరెవరికైనా ఇస్తారా? అని తెలియక కార్యకర్తలకు పాలుపోవడం లేదు. ‘మా నాయకుల వ్యూహం ఏంటో అర్థం కావడం లేదు. కేసీఆర్ ప్రకటించగానే అభ్యర్థులను ప్రకటించాలని మా కేడర్ అడగలేదు. కానీ, ఎన్నికలు తరుముకొస్తున్నా ఇంకా అభ్యర్థుల ఖరారు, సీట్ల సర్దుబాటులో మా పార్టీ నేతలు తాత్సారం చేస్తున్నారు.
ఎన్నికలకు ఇంకో 40 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. వీలైనంత త్వరగా కూటమి సీట్ల విషయం కొలిక్కి వస్తేనే మంచిది. లేదంటే మాపుట్టి మునగటం ఖాయం’అని నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎంపీపీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, నిన్నటివరకు నవంబర్ 1న కాంగ్రెస్ తొలిజాబితా వస్తుందని ప్రచారం జరిగగా.. ఇప్పుడు అది నవంబర్ 6కు మారిందన్న ప్రచారం కార్యకర్తల్లో మరింత నిరాశను రేపింది.
ముందు కొన్నయినా ప్రకటించండి!
కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు కొలిక్కి రానప్పటికీ కాంగ్రెస్ పార్టీ కోసం ధ్రువీకరణ అయిన స్థానాల్లో అభ్యర్థులను అయినా ప్రకటించుకునేందుకు వెసులుబాటుంది. దాదాపు 40 స్థానాల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై అన్ని స్థాయిల్లోనూ స్పష్టత ఉంది. ఆయా స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలు కూడా అడగడం లేదు. ఈ నేపథ్యంలో కనీసం వారి పేర్లయినా ప్రకటించి ఉంటే.. శ్రేణుల్లో ఈ స్థాయిలో నైరాశ్యం ఉండేది కాదు. ఈ అంశాన్ని పార్టీ అధిష్టానం కూడా పట్టించుకోవడం లేదని క్షేత్రస్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది.
స్క్రీనింగ్ కమిటీ హైదరాబాద్‌లోనే మకాం వేసి చర్చల మీద చర్చలు జరుపుతోంది. నాలుగురోజులుగా ఇక్కడే మకాం వేసి పార్టీ ముఖ్యులతో చర్చలు జరుపుతున్న భక్తచరణ్‌దాస్ బృందం.. సోమవారం నాటి భేటీలోనూ.. టికెట్ల కేటాయింపు విషయంలో ఉండాల్సిన నిబంధనలపైనే చర్చించడం కాంగ్రెస్‌లో నెలకొన్న గందరగోళానికి అద్దం పడుతోంది. మరోవైపు, నియోజకవర్గాల్లో ఎవరికి ఓటేయాలో చెప్పలేక ప్రచార కార్యక్రమాలు కూడా వాయిదా పడుతున్నాయి. ఈ నెల 20 రాహుల్ పర్యటనపై చర్చించేందుకు ఆగిన ప్రచారం 10 రోజులైనా తిరిగి ప్రారంభం కాలేదు.
జానారెడ్డి అసంతృప్తి
కూటమి సీట్ల సర్దుబాటు, టికెట్ల ఎంపికలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ.. కాంగ్రెస్ నేత జానారెడ్డితోపాటు ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కూటమి సీట్ల సర్దుబాటు బాధ్యతను జానారెడ్డి కమిటీకి అప్పగించాలని అనుకున్నప్పటికీ.. దీనికి అనుగుణంగా ఏమీ జరగడం లేదు. దీనికి తోడు రాజకీయాలకు కొత్తయిన.. టీజేఎస్ చీఫ్ కోదండరాంకు ఈ బాధ్యతలు అప్పగించడం జానారెడ్డి గ్రూప్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కొందరు కాంగ్రెస్ నేతలు కూడా అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. పొత్తులు, టికెట్ల కేటాయింపులో పీసీసీ చీఫ్‌తోపాటు సీఎల్పీ అధ్యక్షుడికి సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. ఇదే కాంగ్రెస్‌లో దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. కానీ జానారెడ్డికి ఈ గౌరవం దక్కడం లేదని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment