ముంబై : శాంసంగ్ ఇండియా భారీగా ఉద్యోగ నియామకం చేపడుతోంది. దేశంలో అతిపెద్ద ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి 2500 మంది గ్రాడ్యుయేట్లను వచ్చే మూడేళ్లలో నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ఈ నియామకం తన అతిపెద్ద రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో ఒకటిగా కంపెనీ అభివర్ణించింది. కొత్తగా తీసుకునే నియామకాలు ఎక్కువగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, బయోమెట్రిక్స్ వంటి వాటిలో ఉండనున్నట్టు శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ దిపేశ్ షా తెలిపారు. ఈ ఏడాది బెంగళూరు, నోయిడా, ఢిల్లీలోని కంపెనీ ఆర్ అండ్ డీ సెంటర్లకు ఆఫ్ క్యాంపస్ ద్వారా 1000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను తీసుకోనున్నట్టు పేర్కొన్నారు. ఎన్‌ఐటీల్లో, బిట్స్ పిలానీ, మనిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ వంటి వాటిల్లో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో నైపుణ్యమున్న విద్యార్థులను ఇప్పటికే ఈ కంపెనీ ఎంపిక చేసుకుంది. శాంసంగ్ ఎక్కువగా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ల్లో ఎక్కువగా పెట్టుబడులు పెడుతోంది. ఈ సెగ్మెంట్‌లో 2016లో 13 బిలియన్ డాలర్లను పెట్టుబడులుగా పెట్టింది.
గతేడాది కంటే ఈ ఏడాది 25 శాతం జంప్ కూడా చేసింది. గతేడాది ఐఐటీల్లో అతిపెద్ద రిక్రూటర్ శాంసంగ్ కంపెనీనే. తమకు అతిపెద్ద మొత్తంలో నైపుణ్యం అవసరమని, కంప్యూటర్ సైన్సు, ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, మేథమ్యాటిక్స్, కంప్యూటింగ్, అప్లయిడ్ మెకానిక్స్ వంటి స్ట్రీమ్స్‌లో తాము నియామకాలు చేపట్టనున్నట్టు శాంసంగ్ ఇండియా తెలిపింది. దక్షిణ కొరియా వెలుపల కంపెనీ అతిపెద్ద ఆర్ అండ్ డీ సెంటర్ బెంగళూరులోనే ఉంది. స్మార్ట్ డివైజ్లు, సెమీ కండక్టర్లు, ప్రింటర్లు, మోడమ్స్, ఇంటర్నెట్ ప్రొటోకాల్స్, నెట్‌వర్క్స్ వాటికి ఇక్కడ రీసెర్చ్ చేపడతారు. ఢిల్లీలో హైఎండ్ టెలివిజన్లు, ఇతర కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ప్రొడక్ట్‌లు, ఆపరేటింగ్ సిస్టమ్ టిజెన్‌లకు సంబంధించి రీసెర్చ్ చేపడతారు. నోయిడాలో బయోమెట్రిక్స్, మొబైల్ సాఫ్ట్ వేర్ డెవలప్‌మెంట్, మల్టిమీడియా, డేటా సెక్యురిటీ వంటి వాటిపై రీసెర్చ్ చేస్తారు. ఈ మూడు సెంటర్లలో కలిపి మొత్తంగా 8000 మంది ఉద్యోగులు పనిచేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment