95 శాతం ఇంజనీర్లకు కోడ్ రాయడం కూడా రాదు!
ఇంజనీరింగ్ పూర్తి చేశాం.. నాలుగేళ్లు అవుతోంది గానీ ఇంకా ఉద్యోగం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోతున్నాం.. ఇలా చెప్పేవాళ్లు మనకు చాలామందే కనిపిస్తున్నారు. అయితే అందుకు కారణం ఏంటో తెలుసా? ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నవాళ్లలో 95% మంది సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఉద్యోగాలకు అస్సలు పనికిరారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ యువతీ యువకుల్లో ఉద్యోగార్హత నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయని అంచనా వేస్తుంది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, కేవలం 4.77% మంది మాత్రమే ఒక ప్రోగ్రాంకు సరైన లాజిక్ రాయగలుగుతున్నారని తెలిసింది. ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు వేటికైనా ఇది కనీసం ఉండాల్సిన అర్హత. సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాయలేకపోతే అసలు వాళ్లు ఆ ఉద్యోగాలకు ఏమాత్రం పనికిరారని అర్థం. మొత్తం 500 కాలేజీలకు చెందిన ఐటీ సంబంధిత బ్రాంచీలలో చదివే 36వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన ఆటోమేటా అనే ఒక టెస్ట్ పెట్టారు. వాళ్లలో మూడింట రెండొంతుల మంది అసలు కనీసం ఇచ్చిన సమస్యకు సరిపోయే కోడ్ కూడా రాయలేకపోయారు. కేవలం 1.4% మంది మాత్రమే దానికి సరిగ్గా సరిపోయి, పనిచేసే కోడ్ రాశారని తెలిసింది.
మన దేశంలో విద్యార్థులకు తగిన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేకపోవడం ఐటీ, డేటా సైన్స్ పరిస్థితిని దారుణంగా దెబ్బ తీస్తోందని యాస్పైరింగ్ మైండ్స్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచమంతా ప్రోగ్రామింగ్‌లో ఎక్కడికో దూసుకెళ్తుంటే మన పరిస్థితి మాత్రం ఇలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం కళాశాలల్లో ప్రోగ్రామింగ్ గురించి సరిగా చెప్పకపోవడమేనని, వేర్వేరు రకాల సమస్యలకు సరిపోయే ప్రోగ్రాంలు రాయించడం అలవాటు చేయట్లేదని అన్నారు. ప్రోగ్రామింగ్‌కు కావల్సిన మంచి అధ్యాపకులు కూడా ఉండట్లేదని, మంచి నైపుణ్యం ఉన్న ప్రోగ్రామర్లకు ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు రావడంతో వాళ్లు అటు వెళ్లిపోతున్నారని.. కాలేజీలలో చెప్పేవారికి కూడా ప్రోగ్రాంలు రాయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపించడం సరిగా తెలియట్లేదని చెప్పారు. సర్వే చేసిన వారిలో టాప్ 100 కాలేజీల నుంచి వచ్చినవాళ్లలో 69% మంది కనీసం కాస్త కోడ్ రాస్తున్నారని, మిగిలిన కాలేజీలలో అయితే కేవలం 31% మంది మాత్రమే సరిపడ కోడ్ రాస్తున్నారని ఆయన వివరించారు.