employability
-
కార్మికశాఖ ఒప్పందం.. 5 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
యువతకు ఉచిత శిక్షణ..3,474 మందికి ఉద్యోగాలు
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐఐటీ), ఏంజెల్‌వన్ సంయుక్త భాగస్వామ్యంలో 3,474 మంది యువతకు ఉపాధి కల్పించినట్లు ప్రకటన విడుదల చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీఓ), బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి రంగాల్లో నైపుణ్యాలు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ప్రతిభ చూపిన వారికి ఆయా రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.భారత్‌లో టెక్నాలజీపరంగా ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ యువతలో అందుకు తగిన నైపుణ్యాలు మెరుగవడం లేదు. దాంతో సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలు సాధించడం పెద్ద సవాలుగా మారుతుంది. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన ‘ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024’ ప్రకారం..యువతకు కొలువులు దక్కకపోవడానికి ప్రధానం కారణం సరైన విద్య, నైపుణ్యాలు లేకపోవడమేనని తేలింది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఎన్ఐఐటీ, ఏంజెల్‌వన్ బ్రోకింగ్ సంస్థ సంయుక్తంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది.ఇదీ చదవండి: వేడి టీ పడి ఒళ్లంతా గాయాలు.. రూ.12.5 కోట్ల దావాఈ కార్యక్రమంలో పాల్గొన్న 18-28 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఉచితంగా ఆన్లైన్ కోర్సులను నేర్పిస్తున్నారు. లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఎల్ఎంఎస్) ద్వారా శిక్షణా మాడ్యూళ్లను అందిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం పురుషులతో పోలిస్తే 58% మంది మహిళలే అధికంగా తమ వివరాలు నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మొత్తం అభ్యర్థుల్లో 71% మంది (3,474 మంది లబ్ధిదారులు) క్వెస్ కార్ప్, సీ-టెక్, ఫిన్‌డ్రైవ్ సర్వీసెస్, హెచ్డీబీ ఫైనాన్షియల్, డీబీఎస్ మింటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల్లో ఉద్యోగం పొందినట్లు ఎన్ఐఐటీ, ఏంజెల్ వన్ ప్రకటన విడుదల చేశాయి. మహారాష్ట్ర, గుజరాత్, దిల్లీ, కర్ణాటక వంటి వివిధ రాష్ట్రాల్లోని యువత ఈ కార్యక్రమంలో భాగమయ్యారని తెలిపాయి. 3,750 మందికి నైపుణ్యాలు అందించి వారికి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా ఈ కార్యక్రమం రూపొందించినట్లు పేర్కొన్నాయి. -
విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ‘గెట్ సెట్ గో’
సాక్షి,హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఉద్యోగార్హత సాధించేలా నైపుణ్యాలను మెరుగుపర్చేందుకు నేషనల్ హెచ్ఆర్డీ నెట్వర్క్ (ఎన్హెచ్ఆర్డీ) హైదరాబాద్ ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. శ్రీని ఉడుముల నాయకత్వంలో చాప్టర్ మేనేజ్మెంట్లో తాజా ధోరణులపై ఫ్యాకల్టీకి అవగాహన కల్పించడం, పరిశ్రమలతో సమన్వయం కలిగించడం ద్వారా విద్యాసంస్థలను బలోపేతం చేయడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. రెజ్యూమ్ తీర్చిదిద్దడం, ఇంటర్న్‌షిప్‌కు అందుబాటులో ఉండటం, ఇంటర్వ్యూలకు సిద్ధమయ్యే విద్యార్థులకు తగిన సహాయం అవసరమయ్యే నేపథ్యంలో ‘గెట్ సెట్‌గో-మెంటార్@క్యాంపస్’ ద్వారా పరిష్కరించే ప్రయత్నాన్ని ఎన్హెచ్ఆర్డీ చేస్తోంది. సుప్రసిద్ధ సంస్థలలో నాయకత్వ బాధ్యతలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న దాదాపు 100 ప్రాక్టీసింగ్ నిపుణులు.. ఎంపిక చేసిన ప్రీమియర్ బీ– స్కూల్ విద్యార్థులతో నేరుగా గానీ, వర్చువల్గానీ సంభాషిస్తూ మార్గనిర్దేశనం చేయనున్నారు. బీ–స్కూల్స్‌లో లెర్నింగ్ సర్కిల్స్ లేదా క్లబ్స్ ఏర్పాటు చేయడంతో పాటు.. ఈ క్లబ్స్‌ను విద్యార్థులే నిర్వహించేలా తీర్చిదిద్దాలని ఎన్హెచ్ఆర్డీ భావిస్తోంది. ఈ సందర్భంగా ఎన్హెచ్ఆర్డీ హైదరాబాద్ క్యాంపస్ కనెక్ట్ అండ్ అకడమిక్ బోర్డు ఛైర్ సూరంపూడి శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య బలమైన బంధాన్ని ‘‘గెట్-సెట్-గో’ ఏర్పరచగలదని నమ్ముతున్నామని తెలిపారు. అత్యంత క్లిష్టమైన, జీవితాన్ని మార్చే నైపుణ్యాలను విద్యార్థులు సాధించేందుకు , సమకాలీన అంశాలపై పరిశోధనలను చేసేలా ఫ్యాకల్టీని ఉత్సాహపర్చడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. యుక్త వయస్సులో ఉన్నప్పుడే వారిని ఒడిసిపట్టుకోవాలనేది తమ విధానం అని, రేపటి పరిశ్రమ నిపుణులుగా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దడం కర్తవ్యంగా భావిస్తున్నామని ఆయన తెలిపారు. -
ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్..
ముంబై : ఆర్థిక మందగమనంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో తాజా సర్వే ఉద్యోగార్ధులకు భారీ ఊరట ఇచ్చింది. విద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తున్న వారిలో దాదాపు 50 శాతం అభ్యర్ధులకు ఉద్యోగాలు అందివస్తున్నాయని ఈ సర్వే వెల్లడించింది. 2014లో జాబ్ మార్కెట్లోకి అడుగుపెట్టే గ్రాడ్యుయేట్లలో కేవలం 33 శాతం మందికే ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉందని ఈ సర్వే పేర్కొంది. 2019లో ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన వారిలో 50 శాతం మంది ఉద్యోగాలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండగా, ఐదేళ్ల కిందట కేవలం 33 శాతం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు చేపట్టే నైపుణ్యాలను కలిగి ఉన్నారని వీబాక్స్, పీపుల్ స్ర్టాంగ్, సీఐఐ సంయుక్తంగా చేపట్టిన ఇండియా స్కిల్స్ నివేదిక వెల్లడించింది. ఉద్యోగాలకు అనువైన నైపుణ్యాలు అందుబాటులో ఉండే ధోరణి గణనీయంగా మెరుగైందని వీబాక్స్ వ్యవస్ధాపక సీఈవో నిర్మల్ సింగ్ పేర్కొన్నారు. ఎంబీఏ అభ్యర్ధులతో పాటు బీఫార్మసీ, పాలిటెక్నిక్, బీకాం, బీఏ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగాలను అందిపుచ్చుకునే సత్తా 15 శాతం పైగా మెరుగైందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బీటెక్ సహా ఎంసీఏ, సాంకేతిక, కంప్యూటర్ సంబంధిత గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ నైపుణ్యాల్లో క్షీణత నెలకొనడం కొంత ఆందోళనకరమని అన్నారు. అధిక ఉద్యోగిత నగరాల్లో ముంబై అగ్రస్ధానంలో నిలవగా తర్వాతి స్ధానంలో హైదరాబాద్ ఉండటం గమనార్హం. ఇక టాప్ టెన్ ఎంప్లాయిబిలిటీ నగరాల్లో వీటి తర్వాత బెంగళూర్, న్యూఢిల్లీ, పుణే, లక్నో, చెన్నైలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు కూడిన మహిళల్లో హైదరాబాద్, ఘజియాబాద్, విశాఖపట్నంలు తొలి మూడుస్దానాల్లో నిలిచాయి. -
95 శాతం ఇంజనీర్లకు కోడ్ రాయడం కూడా రాదు!
ఇంజనీరింగ్ పూర్తి చేశాం.. నాలుగేళ్లు అవుతోంది గానీ ఇంకా ఉద్యోగం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఓ కంపెనీలో చిన్న ఉద్యోగంలో చేరిపోతున్నాం.. ఇలా చెప్పేవాళ్లు మనకు చాలామందే కనిపిస్తున్నారు. అయితే అందుకు కారణం ఏంటో తెలుసా? ఇంజనీరింగ్ చదివి బయటకు వస్తున్నవాళ్లలో 95% మంది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాలకు అస్సలు పనికిరారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. యాస్పైరింగ్ మైండ్స్ అనే ఒక సంస్థ యువతీ యువకుల్లో ఉద్యోగార్హత నైపుణ్యాలు ఎంతవరకు ఉన్నాయని అంచనా వేస్తుంది. ఈ సంస్థ చేసిన సర్వే ప్రకారం, కేవలం 4.77% మంది మాత్రమే ఒక ప్రోగ్రాంకు సరైన లాజిక్ రాయగలుగుతున్నారని తెలిసింది. ప్రోగ్రామింగ్ ఉద్యోగాలు వేటికైనా ఇది కనీసం ఉండాల్సిన అర్హత. సరైన లాజిక్‌తో ప్రోగ్రాం రాయలేకపోతే అసలు వాళ్లు ఆ ఉద్యోగాలకు ఏమాత్రం పనికిరారని అర్థం. మొత్తం 500 కాలేజీలకు చెందిన ఐటీ సంబంధిత బ్రాంచీలలో చదివే 36వేల మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నైపుణ్యాలకు సంబంధించిన ఆటోమేటా అనే ఒక టెస్ట్ పెట్టారు. వాళ్లలో మూడింట రెండొంతుల మంది అసలు కనీసం ఇచ్చిన సమస్యకు సరిపోయే కోడ్ కూడా రాయలేకపోయారు. కేవలం 1.4% మంది మాత్రమే దానికి సరిగ్గా సరిపోయి, పనిచేసే కోడ్ రాశారని తెలిసింది. మన దేశంలో విద్యార్థులకు తగిన ప్రోగ్రామింగ్ నైపుణ్యాలు లేకపోవడం ఐటీ, డేటా సైన్స్ పరిస్థితిని దారుణంగా దెబ్బ తీస్తోందని యాస్పైరింగ్ మైండ్స్ సీటీఓ, సహ వ్యవస్థాపకుడు వరుణ్ అగర్వాల్ చెప్పారు. ప్రపంచమంతా ప్రోగ్రామింగ్‌లో ఎక్కడికో దూసుకెళ్తుంటే మన పరిస్థితి మాత్రం ఇలా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం కళాశాలల్లో ప్రోగ్రామింగ్ గురించి సరిగా చెప్పకపోవడమేనని, వేర్వేరు రకాల సమస్యలకు సరిపోయే ప్రోగ్రాంలు రాయించడం అలవాటు చేయట్లేదని అన్నారు. ప్రోగ్రామింగ్‌కు కావల్సిన మంచి అధ్యాపకులు కూడా ఉండట్లేదని, మంచి నైపుణ్యం ఉన్న ప్రోగ్రామర్లకు ఐటీ రంగంలో మంచి ఉద్యోగాలు రావడంతో వాళ్లు అటు వెళ్లిపోతున్నారని.. కాలేజీలలో చెప్పేవారికి కూడా ప్రోగ్రాంలు రాయడం, వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపించడం సరిగా తెలియట్లేదని చెప్పారు. సర్వే చేసిన వారిలో టాప్ 100 కాలేజీల నుంచి వచ్చినవాళ్లలో 69% మంది కనీసం కాస్త కోడ్ రాస్తున్నారని, మిగిలిన కాలేజీలలో అయితే కేవలం 31% మంది మాత్రమే సరిపడ కోడ్ రాస్తున్నారని ఆయన వివరించారు.