ముంబై : ఆర్థిక మందగమనంతో ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయనే ఆందోళన నేపథ్యంలో తాజా సర్వే ఉద్యోగార్ధులకు భారీ ఊరట ఇచ్చింది. విద్యాలయాల నుంచి గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తున్న వారిలో దాదాపు 50 శాతం అభ్యర్ధులకు ఉద్యోగాలు అందివస్తున్నాయని ఈ సర్వే వెల్లడించింది. 2014లో జాబ్ మార్కెట్‌లోకి అడుగుపెట్టే గ్రాడ్యుయేట్లలో కేవలం 33 శాతం మందికే ఉద్యోగాలు దక్కే పరిస్థితి ఉందని ఈ సర్వే పేర్కొంది. 2019లో ప్రొఫెషనల్ డిగ్రీ కలిగిన వారిలో 50 శాతం మంది ఉద్యోగాలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండగా, ఐదేళ్ల కిందట కేవలం 33 శాతం ప్రొఫెషనల్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఉద్యోగాలు చేపట్టే నైపుణ్యాలను కలిగి ఉన్నారని వీబాక్స్, పీపుల్ స్ర్టాంగ్, సీఐఐ సంయుక్తంగా చేపట్టిన ఇండియా స్కిల్స్ నివేదిక వెల్లడించింది.
ఉద్యోగాలకు అనువైన నైపుణ్యాలు అందుబాటులో ఉండే ధోరణి గణనీయంగా మెరుగైందని వీబాక్స్ వ్యవస్ధాపక సీఈవో నిర్మల్ సింగ్ పేర్కొన్నారు. ఎంబీఏ అభ్యర్ధులతో పాటు బీఫార్మసీ, పాలిటెక్నిక్, బీకాం, బీఏ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగాలను అందిపుచ్చుకునే సత్తా 15 శాతం పైగా మెరుగైందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే బీటెక్ సహా ఎంసీఏ, సాంకేతిక, కంప్యూటర్ సంబంధిత గ్రాడ్యుయేట్లలో ఉద్యోగ నైపుణ్యాల్లో క్షీణత నెలకొనడం కొంత ఆందోళనకరమని అన్నారు. అధిక ఉద్యోగిత నగరాల్లో ముంబై అగ్రస్ధానంలో నిలవగా తర్వాతి స్ధానంలో హైదరాబాద్ ఉండటం గమనార్హం. ఇక టాప్ టెన్ ఎంప్లాయిబిలిటీ నగరాల్లో వీటి తర్వాత బెంగళూర్, న్యూఢిల్లీ, పుణే, లక్నో, చెన్నైలు ఉన్నాయి. ఇక ఉద్యోగాలను అందిపుచ్చుకునే నైపుణ్యాలు కూడిన మహిళల్లో హైదరాబాద్, ఘజియాబాద్, విశాఖపట్నంలు తొలి మూడుస్దానాల్లో నిలిచాయి.
Comments
Please login to add a commentAdd a comment